కేంద్రమంత్రి అరెస్ట్.. బీజేపీకి శివసేన దిమ్మతిరిగే షాక్...
posted on Aug 24, 2021 @ 3:39PM
మరాఠా టైగర్‌తో పెట్టుకుంటే అంతే. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా అని.. పులి ముందు తోక జాడిస్తే ఊరుకుంటుందా? వెంటాడి..వేటాడేస్తది. మహారాష్ట్రలో ఇప్పుడు అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అయ్యాననే జోరులో నారాయణ రాణే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై నోరు పారేసుకున్నారు. నోటికి పని చెప్పడం.. దాడులు చేయడం.. జన్మహక్కుగా భావించే శివసేన అధినాయకుడినే చెంప పగలగొడతాననడంతో రచ్చ మొదలైంది. శివసైనికులు కమలనాథులపై రెచ్చిపోయారు. వెంటనే పోలీసులు యాక్షన్‌లోకి దిగిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయం ముందే గ్రహించి.. ముందస్తు బెయిల్ కోసం కేంద్రమంత్రి కోర్టును ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోయింది. నారాయణ రాణే అరెస్టులో మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ శివసేన వివాదం.. జగడంగా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాత్రంత్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాత్రంత్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రిపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తానేం తప్పూ చేయలేదంటూ తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు నారాయణ రాణే.
సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ కేంద్రమంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ నాసిక్ పోలీస్ కమిషనర్ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం నాసిక్ పోలీసుల బృందం రత్నగిరి వెళ్లింది. కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకొని.. అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ, శివసేనల గొడవ ఎక్కడికి దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ముంబయిలో భాజపా, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు వీధుల్లో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ముంబయిలోని రాణే నివాసం ముందు శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆయన నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.
కేంద్రమంత్రి నారాయణ రాణే అరెస్టుపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయాలపై శివసైనికులు దాడి చేస్తే సహించబోమన్నారు. హింసపై తమకు నమ్మకం లేదని చెప్పారు. దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు దేవేంద్ర ఫడ్నవీస్.