వైఎస్సార్ కు జగన్ కు పోలికే లేదా? కేవీపీ నోట షాకింగ్ నిజాలు..
posted on Aug 23, 2021 @ 9:56PM
కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో సలహాదారుడిగా ఆయన వెంట నడిచారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తీసుకున్న అన్ని నిర్ణయాల్లోనూ కేవీపీ పాత్ర ఉందని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు కేవీపీ. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు ప్రభుత్వం, ఇటు పాలనలో నెంబర్ టు స్థానం కేవీపీదే. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అయితే కొద్ది రోజులకే జగన్ కు ఆయన దూరమయ్యారు. జగన్ కొత్త పార్టీ పెట్టుకుంటే.. కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.
కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంటున్నప్పటికి.. జగన్ గురించి ఆయనకు పూర్తిగా తెలుసుని అంటారు. వైఎస్సార్ ఆత్మ బంధువుగా చిన్నప్పటి నుంచి జగన్ ను దగ్గరగా చూశారు కేవీపీ. అందుకే జగన్ వ్యవహార శైలీ, ఆయన నైజం గురించి కేవీపీకి తెలిసినంతగా మరొవరికి తెలియదంటారు. అలాంటి కేవీపీ.. ఏపీ సీఎం జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు కేవీపీ. కాని ఇటీవల ఆయన ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వైఎస్సార్ తో తన అనుబంధాన్ని పంచుకున్న కేవీపీ.. ఏపీ సీఎం జగన్ వైఖరిపైనా తనకు తెలిసిన విషయాలు బయటపెట్టారు. జగన్ తీరు ఎలా ఉంటుంది, వైఎస్సార్ ఎలా ఉండేవారు, వైఎస్ తో పోల్చితే జగన్ పరిస్థితి ఏంటన్న అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేవీపీ.
ఏపీ సీఎం జగన్ ఎవరి మాట వినరనే అర్ధం వచ్చేలా మాట్లాడారు కేవీపీ. మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాల్ని తీసుకోవాల్సిన సమయంలో సీనియర్ మంత్రులు.. సలహాదారులతో సమస్యలపై చర్చించి వైఎస్ నిర్ణయం తీసుకునేవారన్నారు. రోశయ్య లాంటి సీనియర్ల సలహాల్ని వైఎస్ తీసుకునే వారన్న విషయాన్ని కేవీపీ గుర్తు చేశారు. దీంతో వైఎస్ మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే.. జగన్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పరోక్షంగా కేవీపీ చెప్పినట్లైంది. సమస్యల పరిష్కారానికి ముందు చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎవరి మాట వినరన్న ఆరోపణ.. ఎవరి సలహాలు స్వీకరించే విమర్శలపైనా స్పందించేందుకు కేవీపీ ఇష్టపడలేదు.
2024లో జరిగే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి వస్తారా? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పని కేవీపీ.. జగన్ కున్న బలం గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ - టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు జరిగితే రెండు మినహా అన్ని స్థానాలు జగన్ గెలిచారని చెప్పారు. కడపలో ఆయనకున్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రామచంద్రాపురం.. నర్సాపురం మినహా అన్నింటా జగన్ పార్టీ గెలిచిందని చెప్పారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపితే.. జగన్ తన అభ్యర్థిగా మేకపాటిని దింపి అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.. ఆ ఎన్నికల్లో టీడీపీ డిపాజిటివ్ కోల్పోయిందని కేవీపీ తెలిపారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల కాలం ఉన్నందున.. ఎవరు గెలుస్తారో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. మంత్రులందరిని తీసి వేసి.. అంతా కొత్త వారితో కాబినెట్ ను సిద్ధం చేసుకుంటారన్న ప్రశ్నకు బదులిచ్చిన కేవీపీ.. గతంలోనే జగన్ ఈ విషయాన్ని చెప్పారని.. మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగిస్తానని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.
వైఎస్ హయాంలో చోటు చేసుకున్న అంశాలతో పాటు.. సీఎం జగన్ తో తనకున్న రిలేషన్ గురించి కేవీపీ సమాధానం ఇచ్చారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో తనకు నేరుగా సంబంధాలు లేవన్నారు. జగన్ తాను ఒకే పార్టీలో ఉన్నంత వరకు కష్టనష్టాల్ని.. సమస్యల్ని షేర్ చేసుకునే వాళ్లమని.. పార్టీ నుంచి వేరు పడినతర్వాత తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు అలానే ఉన్నా.. అప్పటిలా సమస్యల్ని పంచుకునే విధానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటునన విమర్శల్నే గతంలోనూ వైఎస్ ఎదుర్కొనేవారని.. జగన్ వయసు ఉన్నప్పుడు వైఎస్ కు ఇలాంటి సమస్యే ఎదురయ్యేదన్నారు. పాదయాత్ర తరువాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా.. మిత్రుల ద్వారా.. సన్నిహితుల ద్వారా తెలిసిన విషయాల మీదనే తాను స్పందిస్తున్నానని చెప్పారు కేవీపీ.