KBCలో 5 కోట్లు గెలిచి.. అంతా పోగొట్టి.. దళితబంధుకు హెచ్చరికనా?
posted on Aug 24, 2021 @ 12:14PM
దళితబంధు. ఒకేసారి 10 లక్షలు. ఆ డబ్బుతో కావాల్సిన వ్యాపారం చేసుకోవచ్చు. ప్రభుత్వ సాయంతో వారి తలరాతలు మారిపోనున్నాయి. ఇక వారి జీవితాల్లో ఇక పేదరికమన్నదే ఉండదు. సీఎం కేసీఆర్ కాంక్షిస్తున్న స్వప్నం ఇది. ఈ లక్ష్యం కోసమే దళితబంధు ప్రవేశపెడుతున్నట్టు ఆర్భాటంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆయన మాటలు తెలిసినవే కదా. అలానే ఉంటాయి. అరచేతిలో స్వర్గం చూపిస్తారంటారు. దళితబంధుపై మేధావి వర్గాలు మొదటినుంచీ పెదవి విరుస్తున్నాయి. అంతెందుకు, దళితుడైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం దళితబంధు వేస్ట్ అంటున్నారు. ఆ సొమ్ముతో మరిన్ని గురుకులాలు ఏర్పాటు చేస్తే.. నిజంగా దళితుల తలరాత మారుతుందంటున్నారు. 10 లక్షలతో పేదరికం పోతుందా? 10 లక్షలతో వ్యాపారం చేస్తే.. జీవితాలు బాగుపడినట్టేనా? ఆ అభివృద్ధిని నిలబెట్టుకుంటారా? లాభాలు పోగేయగలరా? మరో గొర్రెల పంపిణీ పథకంలా మార్చేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు.
10 లక్షలతో జీవితాలు మారిపోవచ్చు. అయితే, చాలా జాగ్రత్తగా, పద్దతిగా ముందుకుపోతే మాత్రమే అది సాధ్యం. అంతేగానీ, డబ్బులొచ్చాయి కదాని.. ఇష్టారాజ్యంగా చేస్తే అధోగతి తప్పదు. ప్రభుత్వం గొల్ల-కురుమలకు గొర్రెలు ఇవ్వగానే.. వెంటనే వాటిని అమ్మేసుకొని.. ఆ డబ్బులను ఖర్చు చేసేసుకుంటున్నట్టు.. దళితబంధునూ దుబారా చేసేస్తే.. ఎలాంటి ప్రయోజనం చేకూరదు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియచెప్పడానికి తాజాగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ గెలిచి ఓడిన అదృష్టవంతుడి జీవిత గాథ.. అందరికీ ఓ హెచ్చరిక...
అతను అప్పటిదాకా ఓ మధ్య తరగతి యువకుడు. అంతలోనే ఓవర్‌నైట్ 5 కోట్లు వచ్చి పడ్డాయి. రాత్రికి రాత్రే స్టార్‌డమ్ కూడా వచ్చేసింది. ఇంటర్వ్యూలు, కొత్త పరిచయాలు, సెలబ్రెటీ స్టేటస్.. మామూలుగా మారిపోలేదు అతని జీవితం. ఒక్కసారే 5 కోట్లు అంటే మాటలా? ఆ డబ్బుతో ఎంత ఎత్తుకు ఎదిగిపోవచ్చు. అతని కుటుంబం, జీవితం ఎంతగా మారిపోవచ్చు. కానీ, అలా జరగలేదు. అతడు దారి తప్పాడు. పొగడ్తలు, ప్రశంసలతో మోసపోయాడు. భార్యకు దూరమయ్యాడు. మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. మద్యం, సిగరెట్లకు బానిసయ్యాడు. డబ్బంతా పోగొట్టుకుని దివాళా తీశాడు. చివరకు మళ్లీ మనిషిగా మారి తన లక్ష్యమేంటో గుర్తెరిగి జీవనాన్ని సాగిస్తున్నాడు. అతనే కౌన్‌బనేగా కరోడ్ పతీ ఐదో సీజన్ విజేత సుశీల్ కుమార్.
ఏకంగా ఐదు కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న విజేత. తన జీవితంలో అత్యంత దుర్భరంగా గడిపిన ఉదంతాన్ని తెలుపుతూ ఏడాది క్రితం తన ఫేస్‌బుక్ ఖాతాలో అతడు ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. అతడి స్టోరీ మళ్లీ ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఏముందో అతడి మాటల్లోనే....
‘2015-2016.. ఇదే నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో తెలియని అయోమయం. ఎవరినైనా సలహా అడుగుదమాన్నా నాకు తోడుగా ఎవరూ లేని సమయం. చివరకు నా భార్యతో సహా అంతా నాకు దూరమైన రోజులు అవి. నేను దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయానికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం. నాదో సెన్సేషన్. రాత్రికి రాత్రే సెలబ్రెటీని అయ్యాను. మీడియా ప్రతినిధులంతా నా ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. చుట్టు పక్కల పెళ్లిళ్లు జరిగినా నన్ను పిలిచేవాళ్లు. ఎవరో తెలియని వాళ్లు కూడా నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకునేవాళ్లు. ఇంటికి రమ్మని ఆహ్వానించేవాళ్లు. నన్ను పిలిచి మరీ సన్మానం చేసేవాళ్లు. కారణం.. నేను ఆ ఏడాది కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ 5 లో ఏకంగా ఐదు కోట్ల రూపాయలను గెలుచుకోవడమే. వాస్తవానికి ఆ షోలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లడమే చాలా కష్టం. కానీ నాకున్న తెలివితేటలతో ఏకంగా ఐదు కోట్ల రూపాయలను గెలుచుకోగలిగాను. అంతే, అప్పటివరకు నాకు ఎవరో తెలియని వాళ్లు కూడా నాకు దగ్గరయ్యారు. నెలలో కనీసం 15 రోజుల పాటు మీటింగులు, సన్మానాలు, పెళ్లిళ్ల వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికే నాకు సరిపోయేది. అంతకుముందు ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ, ట్యూషన్ చెప్తూ ఇంటి పట్టునే ఉండే నేను.. KBC విన్నర్‌ను అయ్యాక మాత్రం ఇంటి పట్టున ఉండటానికే సమయం దొరికేది కాదు. కనీసం వారానికి ఇద్దరు ముగ్గురయినా మా ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు. వాళ్ల కష్టాలను ఏకరువు పెట్టుకునే వాళ్లు. ఇల్లు గడవడం లేదనో, ఇంట్లో వాళ్లకు అనారోగ్యమనో కారణాలు చెప్పేవాళ్లు. నాకు జాలేసేది. నాకు తోచిన సాయం చేసేవాడిని. అలా నెలకు 50వేల రూపాయల వరకు దానధర్మాలకే పోయేవి. ఓ వైపు ఆదాయం లేదు. మరో వైపు వచ్చిన నగదు బహుమతిని దానధర్మాలకు తగలేస్తున్నావంటూ నా భార్య నన్ను నిందించేది. ‘నిజంగా అవసరం ఉన్న వాళ్లకు ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్లంతా కల్లబొల్లి కబుర్లు చెప్పి అబద్ధాలతో మోసపుచ్చి మీ దగ్గర డబ్బును లాగేస్తున్నారు. అసలు వాళ్లు చెప్పేవి ఏమీ నిజాలు కావు. అనవసరంగా అలాంటి వాళ్లకు డబ్బను తగలేయకండి’ అని నా భార్య పోరుపెట్టేది. నన్ను నా భార్య సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆ సమయంలో నేను తెగ బాధపడేవాడిని. కానీ క్రమక్రమంగా నా భార్య చెప్పిందే నిజమని నాకు తెలిసొచ్చింది. నా సాయం పొందిన చాలా మంది అబద్ధాలు చెప్పిన వాళ్లేనన్న నిజం నాకు తెలిసింది. అయినప్పటికీ ఎవరైనా ఏడుస్తూ నా ముందు చేయి చాస్తే మాత్రం నేను తట్టుకోలేకపోయేవాడిని. నిజమో అబద్ధమో.. వెయ్యో, రెండు వేలో ఇస్తే పోయేదేముంది అని ఇచ్చేసేవాడిని. ఇలా ప్రతి నెలా కనీసం రూ.50వేలు ఇలా దానధర్మాలకే ఖర్చయ్యేవి’ అని చెప్పాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయట. ఆయనకు భవిష్యత్తుపై బెంగ లేదని, మంచి చెడు విచక్షణ లేదని భార్య అంటుండేదట. ఇలా వాళ్లిద్దరి మధ్య గొడవలు పెద్దవి అవసాగాయి. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి కొన్ని కార్లను కొని ఢిల్లీలో క్యాబ్ సర్వీసుల్లాంటివి స్టార్ట్ చేశాడు.
‘కంపెనీ పనులపై నెలలో కొన్నిరోజులు ఢిల్లీ వచ్చేవాడిని, అక్కడే జేఎన్‌యూ విధ్యార్థులు పరిచయమయ్యారు. వారితో మాట్లాడిన తర్వాత నేను బావిలో కప్పను అనిపించింది. అలా వాళ్లతో కూర్చున్న ప్రతిసారీ సిగరెట్, మందు తప్పనిసరి. అలా అలవాటైన ఈ వ్యసనాలకు బానిసైపోయా. గదిలో కూర్చొని ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ గడిపేసేవాడిని. ఇది చూసిన ఒకరోజు నా భార్య అరిచేసింది. ఒకే సినిమా చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుందని, గదిలో కూర్చోవద్దని తిట్టింది. దీంతో చాలా రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయా. ఆ తర్వాత ఒకసారి ఒక ఇంగ్లీషు జర్నలిస్టు ఫోన్ చేశాడు. ఏదో పిచ్చి ప్రశ్న అడగడంతో కోపం వచ్చేసింది. ఆ కోపంలో నా డబ్బులన్నీ అయిపోయాయని, రెండు ఆవులు పెంచుకుంటున్నానని చెప్పా. వాటి పాలతోనే బతుకుతున్నానని చెప్పా. ఆ తర్వాత ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. అప్పటి వరకూ నన్నో సెలబ్రిటీలా చూసిన వాళ్లందరూ ఎవాయిడ్ చేయడం ప్రారంభించారు. పార్టీలకు పిలవడం మానేశారు. ఆ సమయంలోనే భార్య కూడా గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విడాకుల కోరుతూ నోటీసు పంపింది. దీంతో బంధం నిలబెట్టుకోవాలంటే నేను ఏమైనా సాధించగలనని నిరూపించుకోవాలని అనిపించింది. డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి, ఒక మిత్రుడితో మాట్లాడా. అతను ఒక టీవీ కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు. కానీ కొన్నిరోజులకు అది కూడా బోర్ కొట్టేసింది. వేరే మిత్రుడి గదిలో ఉండి ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ గడిపేశా. ఢిల్లీ బుక్ ఫెయిర్ నుంచి సూట్‌కేసు నిండా పుస్తకాలు తీసుకొచ్చి వాటితో కాలక్షేపం చేయడం ప్రారంభించా’ అని చెప్పాడు.
ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగొచ్చి, రోజు మొత్తం సిగరెట్లు తాగుతూ కాలక్షేపం చేసేవాడట. ఆ తర్వాత తన పరిస్థితి ఇంతలా దిగజారిందని తెలుసుకొని మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడే టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయి, ఉద్యోగం సంపాదించాడు. అనంతరం పర్యావరణం కోసం సేవ చేయడం ప్రారంభించాడు. ఇలా ప్రకృతి ప్రేమలో పడి వ్యసనాలకు దూరమై, కొంత ప్రశాంతంగా గడుపుతున్నానని అతను చెప్పాడు. జీవితాంతం ఇలా పర్యావరణ సేవలో గడిపేస్తే చాలని అంటున్నాడు సుశీల్ కుమార్. తాను చివరిసారిగా మద్య తాగింది 2016 మార్చిలో అని, సిగరెట్ అలవాటు కూడా మానిపోయిందని చెప్పాడు. జీవితంలో అవసరాలకు తగినంత మాత్రమే సంపాదించాలని, ఆ తర్వాత ఏమైనా మిగిలితే పర్యావరణ సేవకు పెట్టుకుంటే చాలని అంటున్నాడు.
2011లో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 5లో సుశీల్ కుమార్ ఏకంగా 5 కోట్లు గెలిచి.. ఐదేళ్లు గడిచే సరికి.. అంతా పోగొట్టి.. జీవితంలో విఫలమైన అతని స్టోరీ.. దళితబంధు అమలు సందర్భంగా ఓ మంచి హెచ్చరికగా ఉపయోగపడుతుంది. లబ్దిదారులు డబ్బు వృధా చేయకుండా.. జాగ్రత్తగా పెంపు చేసుకోవాల్సిన అవసరాన్ని సుశీల్‌కుమార్ జీవిత గాథ గుర్తు చేస్తోంది.