కవిత, సీతక్క పోరులో గెలుపెవరిది? రేవంత్ ఎంట్రీతో మారిన సీన్..
posted on Aug 24, 2021 @ 10:12AM
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడేండ్లుగా తమకు ఎదురే లేకుండా ముందుకు సాగుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి.. ప్రస్తుతం గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి కనిపించగా.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత సీన్ మారిపోయింది. వరుస కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి జనాల్లోకి వెళుతుండటంతో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతోంది. కాంగ్రెస్ దూకుడుతో గులాబీ పార్టీలో టెన్షన్ నెలకొంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహం రచించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణిపైనా ఫోకస్ చేశారు. త్వరలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండటంతో.. అక్కడ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. సింగరేణిలో ప్రస్తుతం టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హవా సాగుతోంది. నాలుగేండ్ల క్రితం జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్ బంపర్ విక్టరీ కొట్టింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. దీంతో ఆమె ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో గెలిపించారు. ఈసారి కూడా సింగరేణి ఎన్నికలపై కవిత ఫోకస్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఏ విధంగా వెళ్ళాలి. ఎలా చేయాలి. ప్రతిపక్ష నేతలకు ఎలా సమాధానాలు చెప్పాలి అనే దానిపై వ్యూహం రచిస్తున్నట్లు సింగరేణిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కవిత సారథ్యంలోని టీజీబీకేఎస్ కు షాకిచ్చేలా రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ రూపొందించారని తెలుస్తోంది. కవిత పోటీగా ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్సీ సీతక్కను బరిలోకి దింపుతున్నారట రేవంత్ రెడ్డి. సీతక్క కూడా ఇప్పటికే సింగరేణి ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. సింగరేణి ఎన్నికలపై రేవంత్ రెడ్డి సీతక్కతో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా కార్మిక సంఘం నాయకులతో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.
సింగరేణి వ్యాప్తంగా 12 సెగ్మెంట్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రభుత్వం బూస్టింగ్ గా భావిస్తుంది. అందుకే సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓటమి పాలు అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం సింగరేణి వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పడుతుందనే ఆలోచనలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఈ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా సింగరేణి ఎన్నికలను సవాల్ గా తీసుకుందని తెలుస్తోంది.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవి కాలం ముగిసి ఎప్పుడో నిర్వహించాల్సిన కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే రావాల్సిన సింగరేణి ఎన్నికల నగరా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. హుజరాబాద్ లో ఉప ఎన్నిక ముగిసిన వెంటనే నవంబర్ మొదటివారంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నుంచి సీతక్క రంగంలోకి దిగితే సింగరేణి ఎన్నికలు రాజకీయ వేడి రాజేసే అవకాశాలున్నాయి. సింగరేణి కార్మికుల్లో సీతక్క మంచి గుర్తింపు ఉంది. గతంలో టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ అధ్యక్షురాలిగా పని చేశారు సీతక్క. దీంతో ఆమె కార్మికుల సమస్యలపై మంచి అవగాహన ఉంది. కరోనా సమయంలో సీతక్క చేసిన పనులకు జనాల నుంచి ఆమె నీరాజనాలు దక్కాయి.
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల రంగంలోకి సీతక్క దిగితే.. అధికార పార్టీకి కష్టమేననే చర్చ బొగ్గు గనుల్లో సాగుతోంది. ఎమ్మెల్సీ కవితకు ఈసారి గెలుపు అంతా ఈజీ కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.