ఇప్పుడు జీవోలు.. ఉపఎన్నిక తర్వాతే నిధులు? ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ దళిత బంధు ప్లాన్...
posted on Aug 24, 2021 @ 1:21PM
తెలంగాణలో ఇప్పుడు దళిత బంధు పథకమే హాట్ టాపిక్. దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోంది కేసీఆర్ సర్కార్. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించడం ద్వారా ఆ కుటుంబం దశ మారుతుందని చెబుతోంది. దళితులందరిని లక్షాదికారులను చేయడమే తమ లక్ష్యమంటున్నారు సీఎం కేసీఆర్. విపక్షాలు మాత్రం దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఓట్ల కోసమే.. ఆ నియోజకవర్గంలో పైలెటు ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణి లాగానే.. దళిత బంధు స్కీం కూడా ముందుకు సాగదని చెబుతున్నాయి ప్రతిపక్షాలు.
దళిత బంధుపై విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా... దూకుడుగానే వెళుతోంది కేసీఆర్ సర్కార్. తొలి విడతగా గతంలో 5 వందల కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వగా... సోమావరం మరో ఐదు వందల కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు దళిత బంధు కోసం ప్రభుత్వ వెయ్యి కోట్లు రీలీజ్ చేసినట్లైంది. వెయ్యి కోట్లతో హుజురాబాద్ నియోజకవర్గంలోని వెయ్యి దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని కేసీఆర్ చెప్పారు. 15 మందికి చెక్కులు కూడా ఇచ్చారు. మిగితా వారికి విడతల వారీగా రెండు నెలల్లోనే అందిరికిఅందిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే కేసీఆర్ అసలు డ్రామా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
దళిత బంధు కోసం నిధులు విడుదల చేసినట్లు జీవోలు ఇస్తున్నారు కాని.. బ్యాంకులకు నిధులు రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని మరింత ఆలస్యం చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అందుకే నిధులు ఇస్తున్నట్లు జీవో ఇస్తూ ... డబ్బులను మాత్రం బ్యాంకులకు అందివ్వడం లేదని అంటున్నారు. దళిత బంధు అర్హుల ఎంపిక పేరుతో రెండు, మూడు నెలలు కాలాయపణ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దళిత బంధు అర్హుల ఎంపికలో స్థానిక అధికారులతో పాటు బ్యాంకర్లను భాగస్వామ్యం చేశారట. బ్యాంకర్లు దళిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి పరిశీలించాలట. 10 లక్షలతో ఏ వ్యాపారం చేస్తారు.. ఎలా ముందుకు వెళతారు అన్న విషయాలు ఆరా తీయాలని సర్కార్ సూచించిదట. బ్యాంకర్లు వాళ్ల పరిస్థితిపై పూర్తి నివేదిక ఇచ్చాకే డబ్బులకు సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుందట. ఇదంతా జరగటానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. అంతవరకు తమకు దళిత బంధు పథకం వచ్చిందని మురిసిపోవడమో తప్ప.. లబ్దిదారుల చేతికి చిల్లిగవ్వ కూడా వచ్చే పరిస్థితి లేదట.
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ ఇలా కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో... దళిత బంధు కాలాయపణ కోసం సర్వేలు పేరుతో డ్రామాలు చేస్తున్నారని అంటున్నారు. దళిత బంధు పథకం వచ్చిందని చెబుతూ వాళ్లను బుట్టలో వేసుకుంటున్నారట. మీరు ఏం చేస్తారు.. డబ్బులను ఎలా ఉపయోగించుకుంటారు వంటి విషయాలతోనే రెండు, మూడు నెలలు గడిపేస్తారట. ఈ లోపే హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్నారట. ఉప ఎన్నికకు ముందే దళిత కుటుంబాలకు పథకం వచ్చినట్లు లెటర్ వస్తుందని కాని డబ్బుకు అకౌంట్ లోకి రావు. ఎన్నికల తర్వాతే ఆ ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపు ఉప ఎన్నికలో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితం వస్తే సర్కార్ ఆలోచన మారవచ్చని అంటున్నారు. దళిత కుటుంబాలు కూడా తమకు దళిత బంధు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలలని కోరకుంటాయి. అందుకే వాళ్లంతా గంపగుత్తగా తమకు ఓటేస్తారని గులాబీ బాస్ వ్యూహమట. ఇలా 50 వేల దళిత ఓట్లను కొల్లగొట్టేందుకు దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కేసీఆర్ సర్కార్ పై వస్తున్న విమర్శలకు బలం చేకూరేలానే చర్యలు జరుగుతున్నాయి. కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న 15 కుటుంబాలకు కూడా ఇంకా డబ్బులు అందలేదు. స్మార్ట్ కార్డులు చూసి మురిచిపోవడం తప్ప వాళ్లకు ఏమి అందలేదట. ముఖ్యమంత్రి ప్రకటించిన లబ్దిదారుల పరిస్థితే ఇలా ఉంటే.. మిగితా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పుడు విపక్షాలు కూడా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళుతున్నాయి. దళితుల అభ్యున్నతిపై కేసీఆర్ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. వెంటనే లబ్దిదారులకు నిధులు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. పథకం వచ్చింది కాని నిధుల కోసం కొంత కాలం ఆగాలాంటూ మభ్య పెట్టడం ఏంటని దళిత సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఓట్ల కోణంలో కాకుండా దళిత సంక్షేమం కోసం ఆలోచించాలని కోరుతున్నాయి.