రాజకీయ నేర సంబంధాలకు ముగింపు లేదా? సుప్రీం సీరియస్ తో సీన్ మారేనా..
రాజకీయ నేర సంబందాల గురించి మన దేశంలో జరిగినంత చర్చ బహుశా మరే దేశంలోనూ జరిగి ఉండదేమో,కానీ, రాజకీయ నేర సంబందాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 78 మంది సభ్యులుంటే, అందులో 33 మీద, అంటే 42 శాతం మంది మత్రులపై క్రిమినల్ కేసులున్నాయని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. అందులో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అలాగే, దేశం మొత్తంలో 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై, క్రిమినల్ కేసులున్నాయి.
ఇవ్వన్నీ కూడా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫ్ఫిడవిట్ల పరిశీలించిన నిర్ధారించిన నిజాలు. ఇలా, చట్టసభల సభ్యుల నేర చరిత బరువు పెరిగిపోవడానికి ఇంకా కారణలు ఉంటే ఉండవచ్చును, కానీ, నేర విచారణలో , న్యాయ విచారణలో జరుగతున్న జాప్యం ఒక మూల కారణం. ఏడీఆర్నివేదిక ప్రకారం, ఎంపీలపై నమోదైన కేసుల సగటు పెండింగ్ వయసు ఏడేళ్ళు, ఎమ్మెల్యేల కేసుల పెండింగ్ వయసు ఆరేళ్ళు. ఇంకా ఆసక్తికర విషయం, తొమ్మిది మంది ఎంపీ, ఎమ్మెల్యేలలపై 25 సంవత్సరాలకు పైగా కేసులు పెండింగ్’లో ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అయితే, ఇంచుమున్చుగా దశాబ్ద కాలంగా ఆలా సాగుతూనే ఉన్నాయి. ఓడజనుకు పైగా చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయన్ని సీబీఐ 2012 మే 25 న తొలిసారి అరెస్ట్ చేసింది. ఓ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యేవరకు కనీసం వారానికో సారి, కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదో ఒక సాకున కోర్టు హాజరు నుంచి కూడా మినహాయింపు పొండుతున్నారు. ఇక బైలు రద్దు కోరుతూ సొంత పార్టీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు దాఖలు చేసిన, పిటీషన్విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వస్తుందని అంటున్నారు. అయితే, ఈ కుసు నడత తీరును గమనిస్తే అప్పటికైనా తుడు తీర్పు వస్తుందా అనే విషయంలో ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.
ఈ నేపధ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబదించిన సీబీఐ, ఈడీ కేసుల సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు.
అయితే న్యాయస్థానాలు, న్యాయ మూర్తులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అగ్రాహం ఆవేదన వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు.న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఎప్పుడో దశాబ్దం ముందు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దోషులుగా నిర్థారణ అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఉపాధ్యాయ్ తమ పిటీషన్ లో కోరారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసుల విచారణ వేగంగా జరగడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే. అయితే సమస్య ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో తెలియకుండా, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అసలు సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి ... ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చిక్కితేనే కాని, చిక్కు ముడి వీడదు ... అంత వరకు రాజకీయ నేర సంబంధాలు ముగింపులేని టీవీ సీరియల్ లాగా నడుస్తూనే ఉంటుంది.