మోడీ ప్రభుత్వానికి మరో తలనొప్పి.. కుల గణన సాధ్యమేనా?
posted on Aug 23, 2021 @ 6:58PM
దేశంలో రాజకీయం వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలు జరుగుతాయో అన్నంతగా రాజకీయ కార్యకలపాలు ఊపందు కుంటున్నాయి. ఇదిలా ఉండగానే మరో సున్నిత అంశం తెర మీదకు వచ్చింది. జనగణన కులాలవారీగా జరగాలని, ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసిన బీహార్ రాజకీయ గణం.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని కోరింది. ముఖ్యమత్రి, జేడీయు నేత నితీష్ కుమార్ సారధ్యంలో ప్రధానిని కలిసిన పది పార్టీల ప్రతినిధి బృందంలో, ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ప్రధానితో భేటీ అయినవారిలో ముఖేశ్ సహాని, జితన్ రామ్ మాంజీలు కూడా ఉన్నారు. ఒక విధంగా ఈ ఒక్క విషయంలో ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏకమయ్యాయి.
ప్రధానిని కలిసిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, అదే విధంగా ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్’ మీడియాతో మాట్లాడారు.అయితే, ఆ ఇద్దరి స్వరంలో మాత్రం స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. నితీష్ కుమార్, మిత్ర ధర్మాన్నిపాటిస్తూ కావచ్చును, ప్రధానికి చెప్పవలసింది చెప్పాం, ఆయన కూడా చక్కగా విన్నారు.. ఇప్పుడు బంతి మోడీ కోర్టులో వుంది, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చాద్దాం, అంటూ చేతులెత్తి దండం పెట్టారు. ఒక విధంగా చూస్తే, ఆయన బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి, చేతులు కడుక్కున్నారు.ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్’ మాత్రం ఎలాంటి మొహమాటాలు లేకుండా, ఒక్క బీహార్’లో కాదు దేశం అంతటా కుల గణన జరగవలసిందే అని, గట్టిగా డిమాండ్ చేశారు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి, తమ నిర్ణయం ప్రకటిస్తామంటూ ఒక హెచ్చరిక లాంటిది చేశారు.
బీహార్‌లో బీజేపీ మినహా అన్ని పార్టీలు కులాలవారీ జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే. ఈ డిమాండ్ విషయంలో, బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, బీహార్ బీజేపీ నాయకులు చాలావరకు కుల గణనను సమర్ధిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుల గణన డిమాండ్’ను తాను ఎప్పుడూ వ్యతిరేకించ లేదని, కర్ర విరగకుండా పాము చావకుండా మాటలను మెలికలు తిప్పి సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నా. బీహార్ ఉప ముఖ్యమంత్రి రేణుదేవి సహా పలువురు బీజేపీ నేతలు కులగణనకు మద్దతు పలుకుతున్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అవుననీ, కాదని అనకుండా నెట్టుకొస్తోంది. అయితే, ఇప్పుడు ఈ డిమాండ్‌పై నితీష్, తేజస్వి ఏకాభిప్రాయంతో ఉండటంతో పాటుగా బీజీపీ రాష్ట్ర నాయకులూ కూడా అటే మొగ్గుచుపుతున్న నేపధ్యంలో, కేంద్రం కూడా ఇక దాగుడుమూతలు కట్టేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.
అలాగే ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సున్నిత సమస్య విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్న మాట కూడా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే ఇదొక తేనే తుట్టెను కదిలించడమే అవుతుందని, కొందరు అంటుంటే, ఓబీసీ జాబితాను రూపొందించుకునే రాష్ట్రాల హక్కును పునరుద్దరిస్థూ 127 రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, కుల గణన విషయంలోనూ సానుకూలంగా స్పందించ వచ్చని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. కుల గణన వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది, అదే సమయంలో కులాల మధ్య ఇప్పటికే రగులుతున్న చిచ్చు మరింతగా భగ్గు మంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కుల గణన అటు రాజకీయంగానూ, ఇటు సామాజికంగానూ రెండు వైపులా పదునున్న కత్తి... మోడీ ఎటు నుంచి నరుకొస్తారో ... ఈసున్నిత సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.