బాబు బస్సుయాత్ర, లోకేశ్ పాదయాత్ర, బాలయ్య సైకిల్‌యాత్ర.. జగన్‌పై ముప్పేట దాడి?
posted on Aug 24, 2021 @ 2:20PM
టీడీపీలో సర్వేల జోష్ మామూలుగా లేదు. తెలుగు తమ్ముళ్లలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం జగన్ గ్రాఫ్ ఢమాల్ అవడంతో టీడీపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇటు ఇండియా టుడే సర్వే.. అటు లోకల్ యాప్ పోల్‌తో.. జగన్‌పై ఉన్న ప్రజావ్యతిరేకత స్పష్టమైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏకంగా జగన్ ర్యాంక్ 11వ స్థానానికి పతనం అవడం.. కేవలం 6 శాతం మంది మాత్రమే జగన్ బెస్ట్ సీఎం అని అభిప్రాయపడటం వైసీపీని కలవరానికి గురి చేస్తే.. టీడీపీలో కదనోత్సాహం నెలకొంది. ఇదే మంచి సమయంగా భావిస్తున్న తెలుగుదళం.. జగన్‌పై దూకుడు మరింత పెంచేలా వ్యూహాలు రెడీ చేస్తోంది.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ మీటింగ్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దూకుడు మామూలుగా లేదు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు పొలిటికల్ లాంగ్వేజ్ కూడా అమాంతం మార్చేశారు లోకేశ్. ఫుల్ ఫిట్‌గా మారి.. షార్ప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. ఎక్కడ ఎవరికి ఏ కష్టమొచ్చినా.. రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు. జగన్‌రెడ్డి సర్కారు ఆగడాలను ట్వీట్లతో కుళ్లబొడుస్తున్నారు. అందుకే, వైసీపీ గ్రాఫ్ ఎంతలా పడిపోతోందో.. టీడీపీ ఇమేజ్ అంతలా పెరిగిపోతోంది. సర్వేల్లో ఆ విషయం స్పష్టం కావడంతో టీడీపీలో హుషారు మామూలుగా లేదు.
ఇదే జోరును కంటిన్యూ చేసేతా.. పార్టీ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ పాలనను జనంలో ఎండగట్టేలా ఎత్తుగడలు రచిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్నా.. ఈలోగా ఏ సీబీఐ కేసులోనే జగన్ బెయిల్ రద్దు అయి జైలుకు వెళితే.. ప్రభుత్వం కుప్పకూలిపోయి ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉండటంతో టీడీపీ శ్రేణులు అలర్ట్ అవుతున్నారు. సమయం లేదు తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు సమరోత్సాహంతో దూకుడు పెంచుతున్నారు. అందులో భాగంగా.. మరోసారి నేరుగా ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయకేతనం ఎగరవేశారు చంద్రబాబు. అయితే, ప్రస్తుతం ఆయన వయసు పాదయాత్రకు సహకరించలేకపోవచ్చు. అందుకే, బస్సుయాత్ర చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. తనతో పాటు తన రాజకీయ వారసుడినీ ప్రజలకు మరింత దగ్గర చేసేలా.. నారా లోకేశ్‌తో పాదయాత్ర చేయించాలని చూస్తున్నారట. అంతర్గతంగా జరుగుతున్న ఈ చర్చ బాలకృష్ణ దృష్టికి కూడా వచ్చిందట. నేనుసైతమంటూ బాలయ్య సైతం యాత్రకు సై అంటూ తొడగొట్టారని అంటున్నారు. బావ బస్సుయాత్ర.. అల్లుడు పాదయాత్ర చేస్తే.. తాను సైకిల్ యాత్ర చేయాలని భావిస్తున్నారట.
యాత్రలతో పాటు ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో పర్యటించాలనే దానిపైనా ఓ అవగాహనకు వచ్చారని అంటున్నారు. అమరావతి కేంద్రంగా.. తాడేపల్లి ప్యాలెస్ టార్గెట్‌గా.. ఆంధ్రా రీజియన్‌లో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తారట. విజయసాయిరెడ్డి ఏలుబడిలో ఉన్న ఉత్తరాంధ్రలో టీడీపీకి ఊపు తెచ్చేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి బస్సు యాత్ర నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక.. సీమ సింహంలా బాలకృష్ణ మీసాలు మెలేసి.. రాయలసీమను సైకిలెక్కి చుట్టేస్తారట. ఇలా ఆ ముగ్గురు.. మూడు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజలను సమీకృతం చేస్తూ.. టీడీపీని బలోపేతం చేస్తూ.. జగన్‌రెడ్డిపై ముప్పేట దాడికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. పరిస్థితులను చూస్తుంటే.. టీడీపీలో సర్వేలో జోష్ మామూలుగా లేదనిపిస్తోంది. ఇక, ముగ్గురు మొనగాళ్ల యాత్రలతో జగన్‌రెడ్డికి దబిడి దిబిడే...అంటున్నారు.