50వేలు కాదు 67,820 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు ఇక పండగే..
posted on Aug 24, 2021 @ 11:12AM
నీళ్లు, నిధులు, నియామకాలు. వీటి కోసమే తెలంగాణ సాధించుకుంది. కానీ, ఏడేళ్లు అవుతున్నా వీటిలో ఏ ఒక్క స్వప్నం నెరవేరలేదు. కాళేశ్వరం కొన్ని జిల్లాలకే పరిమితం. నిధులు కల్వకుంట్ల కుటుంబానికే అనే ఆరోపణ. ఇక నియామకాల జాడేలేదు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కొన్ని పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినా.. ఏళ్లుగా అనేక ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు అలానే ఉన్నాయి. ఉన్నత విద్యావంతులంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్లు రాక.. ఆ బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగాల ఊసెత్తని కేసీఆర్ సర్కారు.. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా సడెన్‌గా ఖాళీల దుమ్ము దులుపుతున్నారు. జాబ్ నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే 52వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవలే తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. తాజాగా, ఆ సంఖ్య 67వేలు దాటడంతో నిరుద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది.
తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు 67 వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి.
గత మంత్రిమండలి భేటీలో ముసాయిదా నివేదిక ఇచ్చాయి. ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం అప్పట్లో సూచించడంతో.. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67,820 ఖాళీలు తేలాయి. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తే. అయితే, వివిధ శాఖల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని.. వాటన్నిటినీ భర్తి చేయాలనేది ప్రతిపక్షాల డిమాండ్.