తాలిబన్లను ఏకాకుల్ని చేసే కిటుకు ఇదే..ప్రపంచానికి పెద్ద గండమే?
posted on Aug 24, 2021 @ 4:14PM
తాలిబన్ల దురాగతాలతో ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. మహిళలతో మర్యాదగా వ్యవహరిస్తామన్న వారి వాగ్దానం అమలు ఎక్కడా కనిపించడం లేదు. జర్నలిస్టులను సైతం చంపేస్తున్నారు. తాజాగా అమెరికా-నాటో దళాల సైనికులకూ ప్రాణహాని ఉందన్న ఆందోళన పెరుగుతోంది. వారిదగ్గరున్న ఆధునిక వెపన్స్ లాక్కొని భారీ ఎత్తున పరేడ్ నిర్వహించడం ప్రపంచ దేశాల నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లోని జబుల్ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సంస్కృతి ఆఫ్ఘనిస్థాన్ అంతటా విస్తరిస్తుందని, ఆఫ్ఘనిస్థాన్ ను అహర్నిశలూ కాపాడిన విదేశీ దళాల్ని వెంటాడే ప్రక్రియ మొదలైందన్న ఆందోళన అన్ని దేశాల్లో విస్తరిస్తోంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా జిహాద్ అనే వైరస్ ప్రపంచమంతటా పాకిపోయిందని, దాన్నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ సరిహద్దు భేదాలు విస్మరించి ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకున్న ఏకైక మార్గం తాలిబన్లను ఏకాకుల్ని చేయడమేనంటున్నారు. తాలిబన్లు కేవలం గల్ఫ్, ఇస్లామిక్ దేశాల్లోనే గాక అమెరికా, కెనడా, అన్ని యూరోప్ దేశాల్లో బలంగా పాతుకొని పోయారు. అక్కడ శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని, వారిని ఆఫ్ఘనిస్థాన్లో పైలట్లుగా, సైనికులుగా రిక్రూట్ చేసుకుంటామని తాలిబన్ సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. టర్కీ, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల నుంచి తాము వెంటనే రిక్రూట్ మెంట్లు ప్రారంభిస్తామన్నారు. అయితే ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి పలు యూరోప్ దేశాలు ఇస్లామిక్ టెర్రరిస్టులను కట్టడి చేసేందుకు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. అయినా చాపకింద నీరులా, ఎవరి కంటికీ కనిపించకుండా అనేక రూపాల్లో ఇస్లామిక్ టెర్రరిజం విస్తరిస్తోంది. ఈ విషయమే ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తక్షణమే ఈ మహమ్మారికి బ్రేకులు వేయకపోతే కరోనా కంటే వేగంగా మానవాళికి నష్టం కలుగుతుందన్న ఆందోళన పెరుగుతోంది.
తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచం ముందు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు మరింత దీక్షగా పని చేయాల్సి ఉందని, నూతన మార్గాలు అన్వేషించాల్సి ఉందని కూడా అన్నారు. అలాగే అధునాతనమైన, సృజనాత్మకమైన ఆయుధాలను కూడా రూపొందించాలని, ఇందుకోసం ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడటం... సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
అయితే ఇలా ఏ దేశానికి ఆ దేశం విడివిడిగా ఆయుధాలు సమకూర్చుకోవడం, కొత్త తరహా ఆయుధాలను సేకరించుకోవడం తప్పేమీ కాదని.. కానీ అంతకన్నా కీలకమైన అంశం మరోటి ఉందని, ఆ దిశగా చర్యలు చేపడితే తాలిబన్ల దూకుడుకు శాశ్వతంగా కళ్లెం వేయొచ్చని పలువురు ఎకాలజిస్టులు, ఎకాలజీలో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న అన్ని దేశాలూ కూడబలుక్కొని తక్షణమే ఆ చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు.
ఆల్గేతో ఆయిల్ ఉత్పత్తి చేస్తే తాలిబన్లు భూస్థాపితమే.. అదెలాగంటే!సముద్రంలో తయారయ్యే నాచును ఆల్గే అంటారు. ఈ ఆల్గేతో ఎన్నో రకాల లాభాలున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. అమెరికాలోని టెక్సాస్ ప్రయోగశాలల్లో దీన్నుంచి విజయవంతంగా బయో ఫ్యూయెల్ ను ఉత్పత్తి చేసి ఔరా అనిపించుకున్నారు. ఆల్గే క్రూడాయిల్ నుంచి అన్ని రకాల పెట్రో ఉత్పత్తులూ తీయవచ్చని రుజువైంది. డీజిల్, పెట్రోల్, విమానాల్లో ఉపయోగించే పెట్రోల్, కిరోసిన్.. ఇలా అన్ని రకాల ఫ్యూయెల్స్ తయారు చేయవచ్చు. అయితే ప్రపంచ దేశాలన్నీ చమురు కోసం గల్ఫ్ దేశాల మీదే ఎందుకు ఆధారపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా చమురు చుట్టూనే తిరుగుతున్న విషయం ప్రపంచ ప్రజలందరికీ తెలిసిందే. అగ్రరాజ్యాలన్నీ పోటీ పడుతూ గల్ఫ్ దేశాలతో కొన్ని లోపాయికారీగా, మరికొన్ని డైరెక్టుగా చెట్టపట్టాలేసుకొని ప్రయాణిస్తున్నాయి. అయితే తాలిబన్ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆయా అగ్రదేశాలు అదే చమురు కోసం ఇప్పటికే ప్రయోగపూర్వకంగా రుజువైన ఆల్గే చమురు మీద దృష్టి సారించాలని, తక్షణమే ఆల్గే చమురు ఉత్పత్తుల యూనిట్లను సముద్ర తీరంలో ఉన్న అన్ని దేశాలూ ఏకకాలంలో ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్గే ఫ్యూయల్ ఇలా తయారవుతుంది
ఈ నాచు కేవలం సముద్రంలోనే తయారవుతుంది కాబట్టి తీరదేశాలకు అతిగొప్ప అడ్వాంటేజీ అవుతుంది. తీరం నుంచి దాదాపు 20 కి.మీ. వరకు ఉండే అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నివాస ప్రాంతాలకు సముద్ర జలాలను పైప్ లైన్స్ ద్వారా సరఫరా చేయాలి. ఆ నీటిని ఇళ్ల మీద, డాబాల మీద లేదా ప్రత్యేకంగా కట్టిన ట్యాంకుల మీదికి కనెక్ట్ చేయాలి. పైన ట్రాన్స్ పరెంట్ టబ్స్ ను ఏర్పాటు చేసి, ఆ టబ్బుల్లోకి సీ వాటర్ పంపాలి. అందులో ఆల్గే సీడ్ ను వేయాలని... ఆ సీడ్ త్వరితంగా, నాణ్యంగా పెరగడానికి, స్వచ్ఛమైన బయో ఫ్యూయల్ రావడానికి దేశీయ ఆవు-పేడల మిశ్రమాన్ని కలపాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నాలుగైదు వారాల్లోనే ఆల్గే అద్భుతంగా ఎదుగుతుంది. ఆ తరువాత దాన్ని నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిపోయి గలగలలాడుతున్న నాచును మిషన్స్ ద్వారా ప్రెస్సర్స్ లోకి పంపిస్తే దాన్నుంచి నాణ్యమైన క్రూడాయిల్ ఉత్పత్తి అవుతుంది. ఆ క్రూడాయిల్ నుంచే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమానాల్లో వాడే పెట్రోల్, వాహనాల ఇంజిన్లలో వాడే ఆయిల్.. ఇలా అనేక రకాల ఉత్పత్తులు, ఉపఉత్పత్తులను తీసుకోవచ్చు. ప్రభుత్వమే పూనుకొని ప్రతి ఇంటి మీద కూడా దీన్ని పెంచేలా ప్రోత్సహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదో అతిపెద్ద కుటీర పరిశ్రమగా ఏర్పడుతుందని వారు సూచిస్తున్నారు. కొత్త స్టార్టప్స్ కి ఇంతకన్నా గొప్ప అవకాశమే ఉండదని కూడా వారంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఫ్యూయల్ తో పాటు పిప్పి (ఆల్గే కేక్స్) ని అనేక రకాల ఆహారపదార్థాలుగా వాడుతున్నారంటున్నారు. జపాన్ లో ఇప్పటికే ఆల్గేతో వినూత్నరీతిలో ఫుడ్ ప్రోడక్ట్స్ తయారుచేసి లాభాలు గడిస్తున్నారు. పలు ఇతర దేశాల్లో కూడా ఆల్గే ఫుడ్ కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు గల్ఫ్ దేశాలను వెనుకనుండి శాసిస్తున్న బడా చమురు వ్యాపారులకు తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని, ఫలితంగా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించే శక్తులు నిర్వీర్యమైపోతాయని అంటున్నారు. దానివల్ల తాలిబన్లకు భారీఎత్తున వెళ్లే విరాళాలకు బ్రేక్ పడుతుందని, శిక్షణ శిబిరాలు, ఆయుధ సరఫరా ఆగిపోతాయని అంటున్నారు.
ఆల్గే చమురుతో అదనపు లాభాలు
ఆల్గే నాచు పంట కోసం దేశీయ ఆవుపేడ, మూత్రం వాడాల్సి ఉంటుంది కాబట్టి.. గోరక్షణకు సహకరిస్తుంది. వాటి నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులతో ప్రజారోగ్యం పరిఢవిల్లుతుంది. ఆవుల కోసం గడ్డి కావాలి కాబట్టి అందుకోసం వరి పంట వేయాల్సి వస్తుంది. దీంతో ఈ పంట కూడా ఆటోమేటిగ్గా వృద్ధి చెందుతుంది. ఆవు నుంచి వచ్చే ఇంకా ఇతర ఉత్పత్తులన్నీ మరింత సులువుగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని అసలు సిసలైన బయో ఫ్యూయల్ తయారవుతుంది. దీనిద్వారా రోజుకు కొన్ని వేల కోట్ల టన్నుల వ్యర్థ పదార్థాలు, కర్బన ఉద్గారాలు పర్యావరణంలోకి కట్టుదిట్టంగా చెక్ పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం కోసం ప్రతియేటా కేటాయించే నిధుల్లో కోత పడి ఆర్థిక వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రజలకు ఎకో సెస్ బాధ తప్పుతుంది.
మరి ఇప్పటిదాకా ఇండియా ఏం చేసింది?
ఒక వినూత్నమైన ప్రయోగం గానీ, ప్రోడక్ట్ గానీ వస్తుందంటే అందరికన్నా ముందు బ్రేకులు పడేది ఇండియాలోనేననే నానుడి అందిరికీ తెలిసిందే. ఇండియాలోని చాలా మంది ఎకాలజిస్టులకు, శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసినా.. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి బ్యూరోక్రాట్లే అడ్డుకుంటున్నారని, ఇంతకుముందుకంటే ఇప్పుడు కాస్త పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చినా కూడా... వటవృక్షంలా వేళ్లూనుకున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు, లంచగొండితనం వంటి కారణాల వల్ల ఈ విషయం ఢిల్లీ బాసుల దృష్టికి వెళ్లడం లేదని భారతీయ ఎకాలజిస్టులు వాపోతున్నారు. గత సెప్టెంబర్ లో భారత ప్రధాని నరేంద్రమోడీ హోస్టన్ లో పర్యటించినప్పుడు ఎన్నారై వ్యాపారవేత్తలను కలిశారు. అయితే ఆ సందర్భంగా ఆల్గే బయో ఫ్యూయల్ పై చర్చించాల్సి ఉండగా.. అప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ కచ్చితంగా అక్కడే ఈ విషయం చర్చకు వచ్చినట్టయితే దాని ఫలితం మరోలా ఉండి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏమైనా ప్రపంచమంతా ఇప్పుడు ఉమ్మడిగా ప్రమాదంలో చిక్కుకున్న తరుణంలోనైనా సముద్ర తీర దేశాలన్నీ ఒక్కటిగా ఆలోచించి ప్రపంచ శత్రువును తుదముట్టిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
( టి.రమేశ్ బాబు, సీనియర్ జర్నలిస్టు)