ఓటమి భయంతో అసెంబ్లీ రద్దు చేస్తారా? కేసీఆర్ సిగ్నల్ ఇచ్చేశారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర తెరాస నాయకుల స్వరంలో మార్పు కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు సహా అందరి మాటలలోలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి ప్రస్తావన వస్తోంది. రెండు రోజుల క్రితం, మంత్రి కేటీఆర్, హుజూరాబాద్’లో తెరాస ఓడిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ప్రభుత్వం కూలి పోదు .. గెలిచినా ఏమీ కాదు కేంద్రంలో అధికారంలోకి రాలేము, అంటూ పార్టీ ఓటమికి కూడా సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.
ఆర్థిక మంత్రి హరీష్ రావు, వీణవంక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉప ఎన్నికలలో గెలిస్తే, ఏమి చేస్తారో చెప్పాలని, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, ఏడున్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏమీ చేయలేని ఈటల, గెలిచి ఎమ్మెల్యేగా ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.అదే నిజం అయితే, అందుకు సమాధానం చెప్పవలసింది ఈటల కాదు,కేసీఆర్ లేదా హరీష్ రావు సమాధానం చెప్పవలసి ఉంటుంది.ఈటల మంత్రిగా పనిచేసింది,ఏ బీజేపీ ప్రభుత్వంలోనో, ఏ కాంగ్రెస్ ప్రభుతంలోనో కాదు, తెరాస ప్రభుత్వంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. అంటే, తెరాస ప్రభుత్వంలో మంత్రులు కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితి ఉందని హరీష్ రావు అంగీకరించడమే అవుతుందని తెరాస కార్యకర్తలే అంటున్నారు.
తెరాస నాయకత్వం మాటలలో వచ్చిన మార్పు, తడబాటుకు హుజూరాబాద్’లో ఓటమి తప్పదనే సంకేతాలే కారణమా అంటే, అవుననే అంటున్నారు. అంతే కాదు, హుజూరాబాద్’లో ఓడిపోయినా తర్వాత ఎన్నికలకు వెళ్ళడం కంటే, ముందుగానే అసెంబ్లీ రద్దుచేసి ముందస్తుకు పోవడం ఉత్తమమనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈనేపధ్యంలోనే, మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ రేపే శాసన సభను రద్దు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న (గురువారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్, హుజూరాబాద్’లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ధోకా లేదంటూనే, ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదనటంలోని అంతరార్ధం, అధికార పార్టీలోని ఓటమి భయానికి సంకేతమని, డోలాయమన పరిస్థితీని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, ముఖ్యమంత్రి వెన్నులో వణుకు మొదలైంది. రేవంత్ రెడ్డి రోజురోజుకు దూకుడు పెంచుతూ జనంలోకి దూసుకు పోతున్నారు. చివరకు ముఖ్యమంత్రి దత్తత గ్రామం చింతల పల్లిలో దీక్ష చేపట్టి నేరుగా కేసీఆర్’కే సవాలు విసిరారు. అంతే కాదు, ముఖ్యమంత్రి నియోజక వర్గం గజ్వేల్ పైనా ఆయన గురిపెట్టారు. ఈ నేపధ్యంలో, రోజులు గడిచే కొద్దీ రాజకీయ పరిస్థితి మరింత విషమిస్తుందని, అందుకే ముఖ్యమంత్రి మరోమారు, హుజూరాబాద్’ ఉప ఎన్నికకు ముందే అసెంబ్లీ రద్దు చేసే ఆలోచన చేస్తున్నారని తెరాస వర్గాల్లోనూ గత కొన్ని రోజులుగా వినవస్తోంది. ఇప్పడు బీఎస్పీ నేత మాజీ ఐపీస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో, అనుమానాలకు మరింత బలం చేకూరిందని అంటున్నారు. అయితే, ఇంకా రెండు సంవత్సాల సమయం ఉండగా ముఖ్యమంత్రి తొందరపాటు నిర్ణయం తీసుకుంటారా,అనే అనుమనాలు కూడా వ్యక్తకవుతున్నాయి. ఏదైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీ కి అగ్ని పరీక్షగా మారింది.