కంటతడి పెట్టిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
posted on Aug 24, 2021 @ 4:23PM
తెలంగాణ పీసీసీ చీఫ్ ,ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి కంట తడి పెట్టారు. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు సవాల్ విసిరే రేవంత్ రెడ్డి కంట తడి పెట్టడం ఏంటనీ అనుకుంటున్నారా.. కాని ఇది నిజం. నిరుపేదల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేసిన మోసం తెలిసి ఆయన కంట తడి పెట్టుకున్నారట. కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చ్ జిల్లా మూడు చింతలపల్లిలో దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. దీక్షా స్థలి వేదికపైనే కన్నీళ్లు కార్చారు.
గతంలో సీఎం కేసీఆర్ చిన్న ముల్కనూర్ ను దత్తత తీసుకున్నారు. అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పి, ఇండ్లన్నీ కూల్చివేశాడు. అయితే ఇప్పటివరకు అక్కడ ఇండ్లు కట్టలేదు. దీంతో చిన్న ముల్కనూరును సందర్శించారు రేవంత్ రెడ్డి. అక్కడ తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ కన్నీరు కార్చారు. సీఎం కేసీఆర్ అదేశాలతో ఇండ్లు కూల్చివేయడంతో చిన్న ముల్కనూరులో ఆడపిల్లలు స్నానం చేసేందుకు కూడా సౌకర్యం లేని పరిస్థితి కల్పించాడన్నారు. తాను చిన్న ముల్కనూర్‌కు వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ హామీతో ఇంటిని కూల్చివేసిన కుటుంబం బాధ నన్ను కలిచి వేసిందని రేవంత్‌రెడ్డి వివరించారు. ఆ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని బతుకుతుందని, ముగ్గురు ఆడపిల్లలు స్నానాలు చేసేందుకు బాత్రూంలు లేక గుడిసె పక్కన నాలుగు తడకలు వేసుకుని స్నానాలు చేస్తుంటే పక్కపొంటి ఇండ్ల మగ పొరగాళ్లు చూస్తూ ఎగతాళి చేశారని, ఈ విషయం తనకు చెప్పుతుంటే కండ్లలో నీళ్లు తిరిగాయని రేవంత్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వీటన్నింటికీ బాధ్యుడు కేసీఆర్ అని, కేసీఆర్‌ను వంగపెట్టి చెప్పుతో కొట్టాలని ఆగ్రహంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి.
గజ్వేల్‌పై కాంగ్రెస్‌జెండా ఎగురవేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నా ఇక్కడ కాంగ్రెస్‌నేతలు స్థానిక సంస్థల్లో గెలిచారని గుర్తు చేశారు. సీఎం దత్తత గ్రామాల్లో ఒక్క సమస్య కూడా తీర్చలేదని విమర్శించాకర మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవాపూర్ గ్రామాలను సీఎం దత్తత తీసుకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిచారంటే ఎంత మేరకు అభివృద్ధి చేశారో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లేందుకు రోడ్డు వేసుకునేందుకే ఈ మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు పింఛన్లు ఇచ్చారంటూ చెప్పుతున్నారని, కానీ ఈ గ్రామాల్లో ఎంత మందికి పింఛన్లు ఇచ్చారో తెలుపాలని సవాల్‌విసిరారు. ఈ రెండు రోజులు ఇక్కడే ఉంటానని, ఎంత మందికి పథకాలు అందుతున్నాయో ఇంటింటికీ వెళ్లి చూద్దామన్నారు.
మూడు చింతలపల్లిలో "దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష " పేరుతో రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఇది జరగనుంది. దీక్షా శిబిరంలో రేవంత్ రెడ్డి కి ఇరువైపులా దళిత, గిరిజన నాయకులు కూర్చున్నారు. పీసీసీ నేతలంతా హాజరయ్యారు. దళిత బస్తీలో రాత్రి బస చేయనున్నారు రేవంత రెడ్డి. బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలతో కలిసి దళిత వాడలలో పర్యటించనున్నారు. దళిత వాడలోని కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైనా అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. సీఎం దత్తత గ్రామానికే కెసిఆర్ ఏమీ చేయలేదు , అలాంటిది రాష్ట్రానికి ఏం చేస్తారనే చర్చ పెట్టనున్నారు.