తెలంగాణకు కొత్త గవర్నర్? కేసీఆర్ కు ఇక చుక్కలేనా?
posted on Aug 24, 2021 @ 1:50PM
తెలంగాణ గవర్నర్ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ గవర్నర్ ను మార్చుతున్నారని ప్రచారం జరిగినా అది జరగలేదు. తాజాగా మాత్రం గవర్నర్ మార్పుతో పాటు కొత్తగా ఎవరూ వస్తారన్నది ప్రచారం సాగుతోంది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ.. సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అందులో భాగంగానే కొత్త గవర్నర్ ను నియమించబోతున్నారని చెబుతున్నారు. కొత్తగా వచ్చే గవర్నర్ తో కేసీఆర్ ఇబ్బందులు తప్పవనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో సాగుతోంది.
తెలంగాణకు ప్రస్తుతం తమిళి సై గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళి సై.. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పని చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో అమె పనితీరును గుర్తించిన కేంద్రం ఆమెకు తెలంగాణ గవర్నర్ గా అవకాశం ఇచ్చింది. తమిళ సై ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరి కి కూడా ఇన్ చార్జి గవర్నర్ గా కొనసాగుతున్నారు. కొన్ని రోజులుగా తమిళి సై హైదరాబాద్ కంటే పుదిచ్చేరిలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆమెకు అక్కడే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారని.. తెలంగాణకు కొత్త గవర్నర్ గా యడ్యూరప్పను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. 75 సంవత్సరాల దాటిన తరువాత అధికారంలో కొనసాగొద్దనే నిబంధనతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేంద్రం అప్పుడే మాటిచ్చింది. అనుకున్నట్లుగానే అయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందిన యడ్యూరప్ప 1970 లో విద్యార్థి దశ నుంచే పనిచేస్తున్నారు. అక్కడి నుంచి పార్టీలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి సీఎం స్థాయికి ఎదిగారు. కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మూడుసార్లు విపక్ష నేతగా కొనసాగారు. కొన్నాళ్ల కిందట బీజేపీ నుంచి బయటకు వెళ్లిన ఆయన సొంత పార్టీ పెట్టారు. అది సక్సెస్ కాకపోవడంతో తిరిగొ సొంత గూటికి చేరుకున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పనిచేసిన గవర్నర్లు నరసింహం తమిళ సై ఇద్దరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. ఇప్పుడు యడ్యూరప్ప కూడా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే. నాలుగు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తుండడంపై ఆసక్తి చర్చ సాగుతోంది. గత గవర్నర్లు నరసింహన్, తమిళి సైలతో సీఎం కేసీఆర్ మంచి సంబంధాలు కొనసాగించారు. కాని యడియూరప్పతో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. తమ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే యడియూరప్పను నియమించాలని డిసైడ్ అయిందని అంటున్నారు. యడియూరప్ప గవర్నర్ గా వస్తే సీఎం కేసీఆర్ కు కొన్ని ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది.
గతంలో పుదిచ్చేరి, పశ్చిన బెంగాల్ లో అధికారం కోసం ప్రయత్నాలు చేసిన బీజేపీ.. అక్కడ పవర్ ఫుల్ గవర్నర్లను నియమించింది. బెంగాల్ గవర్నర్ ... అక్కడి సీఎం మమతతో యుద్ధమే చేశారు. పుదిచ్చేరిలోనూ గవర్నర్ కిరణ్ బేడీకి అక్కడి కాంగ్రెస్ సీఎంతో నిత్యం గొడవలే జరుగుతూ ఉండేవి. ఇటీవలే పుదిచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి రాగా. బెంగాల్ లో గట్టి పోటీ ఇచ్చినా పవర్ లోకి రాలేకపోయింది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి రాజకీయ గేమ్ బీజేపీ ఆడనుందని తెలుస్తోంది. అందులో భాగంగానే గవర్నర్ గా యడియూరప్పను నియమించాలని డిసైడ్ అయిందని అంటున్నారు.