టాప్ న్యూస్ @ 1PM
posted on Oct 3, 2021 @ 1:25PM
రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు
---------
వైఎస్ జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 25 వేల కోట్ల అప్పులు తేవడానికి విశాఖలోని విలువైన ప్రభుత్వ భూములను రాత్రిపూట తనఖా పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై విష్ణుకుమార్ మాట్లాడుతూ.. ‘జగన్ సర్కార్.. టెంపరరీ ప్రభుత్వం’ అని వ్యాఖ్యానించారు.
---------
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు.వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలనే వ్యాఖ్యలను సమర్ధిస్తున్నామన్నారు. దానికి పవన్ సారథ్యం వహించడం స్వాగతిస్తున్నామన్నారు.
-----------
నెల్లూరు రూరల్ పరిధిలో గల నక్కా గోపాల్ నగర్‌లో పేదల గుడిసెలు తగలబడ్డాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు గుడిసెలకు నిప్పటించినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంత కాలంగా స్థానికంగా నివాసముంటున్న దళితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇలా గుడిసెలు తగలబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
-----
ఎంజే నాయుడు హాస్పటల్స్ ఆధ్వర్యంలో దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్ విజయవాడ బెంజిసర్కిల్ నుంచి స్టేడియం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగర సిపి శ్రీనివాసులు వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక నూతన విధానాలను అమలు చేస్తుందన్నారు.
--------
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటలపై ప్రభుత్వం వేటు వేయడంతో ఆయన రాజీనామా చేశారు.
----
స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కొత్త చీరలు కొనిచ్చి అవ్వ-అయ్యా, అత్తా-మామ, భర్త కూడా అవుతుండని కామెంట్ చేశారు. లింగాల ఘనాపూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
--------
తెలుగు అకాడమీకి సంబంధించిన రూ. 43 కోట్ల నిధులు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదట 43 కోట్ల నిధులే అనుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్లను ముఠా కొట్టేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రూ.54 కోట్లతో పాటు ఇతరుల డిపాజిట్లు కూడా మస్తాన్‌వలీ ముఠా కాజేసింది
-----------
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ ఏడాది మొదట్లోనే బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఢిల్లీలో 'బందీ'గా ఉంచారంటూ వ్యాఖ్యానించారు. నెలల క్రితమే బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆయన న్యూఢిల్లీలో నిర్బంధంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ చీఫ్ కావాలనుకుని కలలు కంటున్న కొందరు వ్యక్తులు పార్టీలో ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు.
------
సమంత తన ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చేసింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ట్విట్టర్‌లో తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకోగా, కొన్ని నెలల క్రితం అక్కినేని పేరును తొలగించింది. తన పేరును 'ఎస్' గా పెట్టుకుంది. తన పేరులో మొదటి అక్షరాన్ని మాత్రమే ఆమె ఉంచింది. చైతూతో విడిపోతున్నానని ఆమె అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత మళ్లీ 'ఎస్' అక్షరాన్ని తొలగించి 'సమంత'గా మార్చేసుకుంది.
---
ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు