ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే విజయం! ఏపీ లేటెస్ట్ సర్వేలో సంచలనం..
posted on Oct 3, 2021 @ 3:46PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుందని ఇటీవల వెల్లడైన కొన్ని సంస్థల సర్వేల్లో తేలింది. ఇండియా టుడే లాంటి జాతీయ ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేలోనూ ఏపీ సీఎం జగన్ ర్యాంక్ దారుణంగా పడిపోయింది. ఏపీ జనాలు కూడా ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అధ్వాన్న రోడ్లు, పతనమైన ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు క్షీణించడం, మహిళలపై పెరిగిపోతున్న దాడులు, ఉద్యోగాల భర్తీ లేకపోవడం వంటి అంశాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. కొన్ని రోజులుగా సీఎం జగన్, వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందనే చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే సాగుతుందని తెలుస్తోంది.
తాజాగా ఎన్నికల సర్వేల్లో ఖచ్చితమైన అంచనాలు ఇస్తుందనే పేరున్న ఆత్మ సాక్షి సంస్థ నిర్వహించిన సర్వేలోనూ సంచలన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో విద్యనభ్యసించిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. ఏపీలో జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. అంటే.. జగన్ తన ఐదేళ్ల పదవీకాలంలో ఇప్పటికే సగం మేర పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ఆత్మసాక్ష్మి సంస్థ సర్వే జరిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగేతే ఏపీలో టీడీపీదే విజయమని ఆ సర్వేలో తేలింది. ఆత్మ సాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతానికి వైసీపీ కంటే టీడీపీకి మూడు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుంది. పోలైన మొత్తం ఓట్లలో దాదాపుగా 50 శాతం ఓట్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి 39 శాతం మేర ఓట్లు వచ్చాయి. అంటే. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లలో 11 శాతం తేడా ఉంది. అయితే జగన్ రెండున్నరేళ్ల పాలన ముగుస్తున్న సమయానికి ఆత్మ సాక్షి సంస్థ సర్వే ప్రకారం వైసీపీ నుంచి 4.5 శాతం ఓటర్లు దూరయ్యారు. వీరంతా విపక్ష టీడీపీ వైపు మళ్లారు. దీంతో ఇప్పుడు టీడీపీకి దక్కే ఓట్ల శాతం 43.5 శాతానికి పెరిగింది. వైసీపీ ఓట్ల శాతం 45.5 శాతానికి పడిపోయింది. అంటే.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమే. అయితే ఆత్మ సాక్షి సర్వేలో 4.75 శాతం మంది ఓటర్లు ఎవరి పక్షం వహించలేదు. అంటే ఈ 4.75 శాతం మంది ఓటర్లు ఎవరి వైపు అయినా మళ్లవచ్చు.
జగన్ పాలనపై జనాల్లో భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న ఈ 4.75 శాతం ఓటర్లు టీడీపీ వైపునకు తిరిగే ఛాన్సే ఎక్కువ అంటున్నారు. అదే జరిగితే.. టీడీపీకి పడే ఓట్ల శాతం 48.25 శాతానికి చేరుతుంది. వైసీపీ ఓట్ల శాతం మాత్రం 45.5 శాతం దగ్గరే ఉండనుంది, ఈ లెక్కన వైసీపీ కంటే కూడా దాదాపు 3 శాతం మేర ఓట్లను అధికంగా సాధించనున్న టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుంది. జగన్ పాలనపై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఎన్నికల సమయానికి ఓట్ల మార్జిన్ భారీగా పెరుగుతుందని, టీడీపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆత్మ సాక్షి సర్వేను విశ్లేషించిన తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 46 మంది ఓడిపోవడం ఖాయమని తేలింది. వీరిలో 11 మంది మంత్రులు కూడా ఉన్నారు. వైసీపీ ఎంపీలుగా గెలిచిన 23 మందిలో 7 మంది ఏం చేసినా కూడా తిరిగి గెలవరట. ఓటమి అంచుల్లో పయనిస్తున్న మంత్రులు ఏకంగా 11 మంది ఉంటే.. వారిలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. హోం మంత్రిగా కొనసాగుతున్న మేకతోటి సుచరిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి శంకరనారాయణ, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఓడిపోతారని ఆత్మ సాక్షి సంస్థ సర్వేలో తేలింది.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఓటమి దిశగా సాగుతున్న ఎంపీల్లో బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం), మార్గాని భరత్ రామ్(రాజమహేంద్రవరం), రఘురామకృష్ణరాజు(నరసాపురం), నందిగం సురేశ్(బాపట్ల), గోరంట్ల మాధవ్(హిందూపురం), చింతా అనురాధ(అమలాపురం), సంజీవ్ కుమార్(కర్నూలు) ఉన్నారు. వైసీపీ పాలన రెండున్నర ఏండ్లు పూర్తైన సమయంలో నిర్వహించిన ఆత్మసాక్షి సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీ నేతలను, సీఎం జగన్ రెడ్డిని కలవరానికి గురి చేస్తున్నాయని తెలుస్తోంది