జోరు వర్షంలోనే జనసేనాని శ్రమదానం.. పవన్ పర్యటనతో పోలీసులకు చుక్కలు
posted on Oct 2, 2021 @ 4:20PM
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన పోలీసులకు సవాల్ గా నిలిచింది. తెగ టెన్షన్ పుట్టించింది. రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లడంలో ఆ ప్రాంతంలో పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. ఎయిర్ పోర్టు నుంచి శ్రమదానం చేయాలనుకున్న ప్రాంతానికి పవన్ వెంట వెళ్లడానికి కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. బాలాజీపేట సెంటర్ సమీపంలో, హుకుంపేట-బాలాజీపేట రోడ్డు వద్ద పోలీసులు మోహరించారు. జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్న విషయాన్ని గుర్తించిన పవన్ కల్యాణ్ తన కారుపైకి ఎక్కి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేకలు వేశారు. అనంతరం బాలాజీపేటకు చేరుకుని శ్రమదానంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఆ సమయంలో సభ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అయినప్పటీకీ పవన్ వెనక్కి తగ్గకుండానే వర్షంలో నిలబడే పోలీసుల తీరును తప్పుబడుతూ నిరసనకు దిగారు. తనతో వచ్చే ర్యాలీ వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి అనుమతి ఇచ్చేవరకూ ఇక్కడ్నుంచి ‘కదిలేది లేదు’ అని పవన్ అక్కడే నిలబడ్డారు.
పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. ‘సీఎం.. సీఎం.. సీఎం.. ’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపి..‘ ఒక్క నిమిషం ఆగండి.. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవకండి. నేను చాలా అలసిపోయా. ఎందుకు అలసిపోయానో కూడా మీకు వివరంగా చెబుతా. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి.. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవకండి.. మీ నోటి నుంచి ఆ మాటే వినిపించకూడదు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను సీఎం అవ్వాలని మీరు మనసులో దాచుకోండి.. అంతేకానీ ఇలా బయటికి చెప్పకండి..’ అంటూ సభకు తరలివచ్చిన కార్యకర్తలకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుంటే వేలమందితో సభ ఎలా? అని ప్రశ్నించారు. కొవిడ్ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే ఆంక్షలు విధించామని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నవంబర్ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.