కేసీఆరే అందరికి భర్త అయ్యాడట.. నోరు జారిన ఎమ్మెల్యే రాజయ్య! వైరల్ వీడియో..
posted on Oct 3, 2021 @ 1:13PM
వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే టి.రాజయ్య మాట జారారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. జనగామ జిల్లా లింగాలఘణపురంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.
ఎమ్మెల్యే రాజయ్య ఏమన్నారంటే.. ‘బాలింత మహిళలు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చే సూట్‌కేసు పిక్కుటంగా ఉంటది. దాని జిప్ తియ్యంగానే బాలింత చీరలు బయటపడుతాయి. మెత్తటి పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్‌లు, తుడుచుకునేందుకు తువ్వాలలు ఉంటాయి. ఎనుకట ముక్కిపోయిన బట్టలు తీసుకుని ముసలోళ్లో, అవ్వగారొళ్లో, నాయనమ్మ బాపమ్మలు పట్టుకొని వచ్చేవారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని నేను ఎందుకు అంటున్నానంటే కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు.. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అయితున్నాడు.. అమ్మా, అయ్యా కేసీఆరే అయితుండు.. భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు’ అని రాజయ్య చెప్పారు.
కేసీఆరే అందరికి భర్త అయ్యాడంటూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే మట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జారిన ఆ మాట చర్చకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్లు వివాదాస్పమయ్యాయి.