గెల్లుకు వెంకట్ తో చెల్లు.. రేవంత్ దెబ్బకు టీఆర్ఎస్ లో వణుకు!
posted on Oct 2, 2021 @ 8:50PM
తేలిపోయింది. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో స్పష్టమైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం-ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు బాలమూరి వెంకట్‌ను హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. అంతగా బలంలేని చోట.. బలమైన నాయకులైన పొన్నం, కొండాలను బరిలో దింపకుండా వ్యూహాత్మకంగా వెంకట్‌ను రంగంలోకి దింపారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. యువకుడు, విద్యార్థి సంఘం నాయకుడైన బాలమూరి వెంకట్‌ను హుజురాబాద్‌లో ప్రయోగించడం వెనుక రేవంత్ వ్యూహం అదుర్స్ అంటున్నారు.
ఎంత కాదన్నా.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదనేది విశ్లేషకుల మాట. పార్టీకి సైతం ఆ స్థానంపై అంతగా ఆసక్తి లేదు. ప్రధాన ప్రతిపక్షం కాబట్టి.. పోటీ చేయాల్సిందే కాబట్టి.. బరిలో దిగుతోందనే విషయం అందరికీ తెలిసిందే. హుజురాబాద్‌లో ప్రధాన పోరు.. టీఆర్ఎస్, బీజేపీల మధ్యే. ఈటల రాజేందర్ గెలిస్తే.. కేసీఆర్‌కు దిమ్మ తిరిగే షాక్ తప్పదు. హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రకటించారు కూడా. టెక్నికల్‌గా ఆయన బీజేపీలో ఉన్నా.. ఈ ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కానే కాదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ మాత్రమే. కారు గుర్తుపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నా.. ఆయన్ను చూసి కాకుండా.. అధికార పార్టీపై రెఫరెండంగానే హుజురాబాద్ ఉప ఎన్నికను చూడాల్సి ఉంటుంది. కేసీఆర్‌ను ఆమోదిస్తే టీఆర్ఎస్‌కు ఓటేస్తారు.. లేదంటే ఈటలను గెలిపిస్తారు.. ఇది వారిద్దరి మధ్య జరిగే ఫైట్ మాత్రమే. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలో దూరి.. కొండా సురేఖలాంటి లీడర్‌ను నిలబెట్టి.. కేసీఆర్ వ్యతిరేక ఓటును చీల్చే తప్పిదానికి పోకుండా.. వ్యూహాత్మకంగా కాస్త తగ్గి నెగ్గే వ్యూహం రచించారు రేవంత్‌రెడ్డి.
బాలమూరి వెంకట్ అభ్యర్థిత్వం విషయంలోనూ పక్కాగా స్కెచ్ వేశారు పీసీసీ చీఫ్. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండటంతో.. ఆయనకు సరిసమాన స్థాయి ఉన్న ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బాలమూరి వెంకట్‌ను పోటీలో నిలిపారు రేవంత్‌రెడ్డి. సో.. ఏ యువతనైతే అట్రాక్ట్ చేద్దామని అధికార పార్టీ భావించిందో.. అదే యూత్ టార్గెట్‌గా బాలమూరిని ముందుంచింది కాంగ్రెస్. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఓట్లన్నీ.. ఆ ఇద్దరు విద్యార్థి సంఘం నాయకుల మధ్య చీలిపోతాయనేది హస్తం పార్టీ అంచనా. బాలమూరి వెంకట్‌తో టీఆర్ఎస్ ఓట్లకు భారీ గండి పెట్టాలనేది కాంగ్రెస్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇలా, కారుకు పడాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చి.. ఆ మేరకు ఈటల రాజేందర్‌కు ప్రయోజనం జరిగేలా.. పరోక్ష వ్యూహం రచించారని తెలుస్తోంది.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు దాదాపు అసాధ్యం అని తెలుసు కాబట్టే.. తాము ఓడినా.. కేసీఆర్ గెలవకుండా చేసేందుకే.. గెల్లు గెలుపును బాలమూరితో చెల్లు చేసేలా.. విద్యార్థి సంఘం నాయకుడిని హుజురాబాద్ బరిలో నిలిపారని అంటున్నారు. వారెవా.. రేవంత్‌రెడ్డి వ్యూహమంటూ విశ్లేషకులు కొనియాడుతున్నారు.