కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యార్థి నేత వెంకట్.. హుజురాబాద్ పై రేవంత్ మాస్టర్ ప్లాన్!
posted on Oct 2, 2021 @ 6:53PM
తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరు వెంకట్ పేరు ఖరారైంది. హుజురాబాద్ అభ్యర్థిగా వెంకట్ పేరును అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. సోమవారం వెంకట్ నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజురాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గెల్లు, ఈటలలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడింది.
హుజురాబాద్ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి సైలెంటుగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ టికెట్ రేసులో పలువురు పేర్లు వినిపించాయి. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ప్రకటన ఆగిపోయిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం హుజురాబాద్ లో తాను పోటీ చేయడం లేదని కొండా సురేఖ ప్రకటించింది. ఆమె పెట్టిన కండీషన్లకు పీసీసీ అంగీకరించకపోవడంతోనే పోటీ పై కొండా సురేఖ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.
కొండా సురేఖ వెనక్కి తగ్గడంతో అభ్యర్థిపై సమీక్ష చేసిన పీసీసీ పెద్దలు.. ఇటీవల కాలంలో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా ఉంటున్న ఎన్ఎస్ యూఐ చీఫ్ బలమూరి వెంకట్ వైపు మొగ్గుచూపారని సమాచారం. పీసీసీ సీఫారస్ చేసిన పేరునే ఏఐసీసీ ఖరారు చేసింది. బల్మూరి వెంకట్ కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత స్పీడ్ పెంచారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పోలీసులకు చుక్కలు చూపించారు వెంకట్. వెంకట్ కు రేవంత్ రెడ్డి అండదండలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీ విద్యార్థి నేతను బరిలోకి దింపినందున... కాంగ్రెస్ కూడా అదే ప్రయత్వం చేసినట్లు కనిపిస్తోంది.