జల జీవన్ మిషన్ ప్రారంభం.. ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం
posted on Oct 2, 2021 @ 6:40PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం జనాదరణ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రధాని జనాదరణ గ్రాఫ్ పడిపోతోంది. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం. నిజమే, కావచ్చు ప్రధాని గ్రాఫ్ ఎంత పడిపోయినా, ఇంకా ఆయనదే పైచేయిగా వుంది. రాహుల్ గాంధీ సహా ఇతర జాతీయ నేతలు ఎవరూ ప్రజాదరణలో ప్రధాని మోడీకి దగ్గరలో కూడా లేరు. ఒక విధంగా ప్రస్తుతం ప్రధాని ప్రజాదరణ, ‘ ఏచెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్లుగా ఉంది. అయితే ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకోవడం కుదరదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఉహించడం కూడా కొంచెం చాలా కష్టం. అందుకే, రాజకీయాల్లో వారం రోజులు కూడా ఎక్కువ సమయమే అంటారు.
అందుకే కావచ్చు ఓ వంక కేంద్ర ప్రభుత్వం మరో వంక బీజేపీ పడిపోయిన ప్రధాని మోడీ ప్రజాదరణ గ్రాఫ్ ను పైకి పాకించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మోడీ ఇమేజిని పెంచేందుకు, బీజేపీ సోషల్ మీడియా కొవిడ్ వాక్సినేషన్ సక్సెస్ స్టోరీని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పెట్రోల్, డీజిల ధరల రోజువారీ వడ్డన, గ్యాస్ బండ మోతను భరించలేక ప్రజలు, ముఖ్యంగా మహిళలలో పెరుగుతున్న అసంతృప్తిపై నీళ్ళు చల్లేందుకు, ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభమై, ఇప్పటికీ నత్తనడకన నడుస్తున్న,‘జల్ జీవన్ మిషన్’ను మరోమారు తెరమీదకు తీసుకోచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జలజీవన్ మిషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు అమలు విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ‘జల్ జీవన్ మిషన్ యాప్’ను ప్రారంభించారు. దీంతోపాటు ‘రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎవరైనా, ఏ సంస్థయినా.. గ్రామీణ ఇళ్లలో, బడుల్లో ఇతరత్రా చోట్ల నీటి కనెక్షన్లు అందించేందుకు సాయం అందించొచ్చు. నిజానికి, మోడీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన స్వచ్చ భారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాగానే, జలజీవన్ మిషన్ వలన ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రణత ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగింది. ముఖ్యంగా మహిళల్లో ప్రజాదరణ పెరిగేందుకు ఈ పథకం ఉపయోగిస్తుందని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒక విధంగా మోడీ మహిళల సాధికారిత పేరిట ప్రవేశ పెట్టిన పధకాలు నిశ్శబ్ద ఓటు బ్యాంకును సృష్టించింది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయా గ్రామ పంచాయతీల పెద్దలు, నీటి సమితుల ప్రతినిధులతోనూ మాట్లాడారు. తమ ఇళ్లకు నీళ్లు అందుతున్నాయని, మహిళలు తమ ఖాళీ సమయాన్ని పిల్లల చదువులకు, ఉపాధి పనులకు కేటాయిస్తున్నారని వారు ప్రధానికి వివరించారు, ఒక విధంగా ఈ కార్యక్రమం ఇదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకరంగా సాగింది. ప్రధాని మోడీ, తమదైన శైలిలో మాటల మంత్ర జలాన్ని చల్లారు. జల జేవన్ మిషన్’తో మహిళలు దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలు తప్పుతున్నాయని అన్నారు.ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తుండటంతో వారి సమయం ఆదా అవుతోందని, తద్వారా వారు సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. ఇలా జల జీవన్ మిషన్ యాప్’ను ప్రారంభించడంతో పాటుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్ జీవన్ మిషన్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ నల్లా నీటి సదుపాయం కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మిషన్ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో నీటి సమితులు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీ(వీడబ్ల్యూఎస్‌సీ)లు ఏర్పాటు చేసింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత.
ఈ మిషన్ ప్రారంభం నాటికి దేశంలో 3.23 కోట్ల(17 శాతం) గ్రామీణ ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 8.26 కోట్ల(43 శాతం)కు చేరడం విశేషం. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు గుప్పించారు. 3 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 70ఏళ్లు పడితే .. తమ ప్రభుత్వ హయాంలో కేవలం గత రెండేళ్లలోనే 5కోట్లకు పైగా నల్లా కనెక్షన్లు ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు. అంటే.. మళ్ళీ మాకే ఓటేయండని ... జనాలకు చెప్పకుండానే చెప్పారు. అడక్కుండానే అడిగారు.