ఈటల రాజేందర్ పై దాడికి టీఆర్ఎస్ కుట్ర? హుజురాబాద్ లో కలకలం..
posted on Oct 3, 2021 @ 4:17PM
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అదే సమయంలో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు లీడర్లు. కొన్ని రోజులుగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఉప ఎన్నిక ప్రచారంలో దాడులు జరగవచ్చనే వాదన రావడం కలకలం రేపుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్‌పై దాడి జరుగబోతోందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇదే చెబుతున్నారు. అయితే ఓట్లర్లలో సానుభూతి కోసం ఈటల తనపై తానే దాడి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించి సంచలనానికి తెరతీశారు ఎమ్మెల్యే బాల్కసుమన్. కోడి కత్తి దాడి తరహాలోనే రాజకీయంగా లాభపడటానికి ఈటలనే.. తనపై తాను ఈ దాడి చేయించుకోబోతున్నారంటూ ప్రచారం అవుతుండటం హుజురాబాద్ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది.
తనపై జరుగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ మండిపడుతున్నారు. కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 13, 14 తేదీలలో తన మీదన తానే దాడి చేయించుకుంటున్నా.. అంటూ మంత్రులు అంటున్నారని.. దీని వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. తన మీద దాడికి అధికార పార్టీ నేతలు ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు
హుజురాబాద్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని అన్నారు. తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. తాను గన్ మెన్‌లపై ఆధారపడి ఉండలేదని, తనలాంటి వాళ్లను కాపాడుకునే కర్తవ్యం తెలంగాణ ప్రజలకు ఉందని ఈటల అన్నారు. ఉద్యమాలు చేసినప్పుడు.. ఇప్పుడూ అలాగే ఉన్నామని స్పష్టం చేశారు.
నీచమైన కార్యక్రమాలకు టీఆర్ఎస్ నేతలు పాల్పడడుతున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ధర్మంగా కొట్లాడాలన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు.