తాట తీసి నార తీస్తా.. వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
posted on Oct 2, 2021 @ 3:42PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, జనసేన మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. మరోసారి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు పని కట్టుకుని తనను దూషిస్తున్నారని... తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని చెప్పారు. తాట తీసి నారతీస్తానని హెచ్చరించారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని... పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని పవన్ తేల్చి చెప్పారు. రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని జనసేన అధినేత స్పష్టం చేశారు.
జోరు వర్షంలోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ మంత్రులు, తనపై విమర్శలు గుప్పించిన సినీ ప్రముఖులకు ఈ సభా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్‌లు ఇచ్చారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు, బూతులు తిట్టిన వారిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ‘నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..?. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చాను. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటున్నారా?. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు పవన్ కల్యాణ్. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చానని అన్నారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని అన్నారు. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి మంచిది కాదన్నారు. అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పారు.
ఓ వైపు వర్షం.. మరోవైపు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జనసేన తలపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. బహిరంగ సభ వేదిక దగ్గరకు వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. దీంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు.