బద్వేల్‌తో బీజేపీకి జనసేన రాం రాం.. టీడీపీకి పవన్‌కల్యాణ్ దగ్గరవుతున్నారా?
posted on Oct 3, 2021 @ 2:15PM
బీజేపీ-జనసేన మధ్య విభేదాలు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. బద్వేల్ ఉప ఎన్నికతో దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది. బద్వేల్ బై ఎలక్షన్‌లో పోటీ చేసేది లేదంటూ పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పేశారు. బీజేపీ మాత్రం తాము బరిలో నిలుస్తామని చెబుతోంది. ఇలా ఎవరికి వారే.. వేరు వేరు పొలిటికల్ స్టాండ్స్ తీసుకోవడం.. ఆ రెండు పార్టీలు బ్రేకప్ చెప్పబోతున్నాయనే వాదనకు మరింత బలం చేకూరుతోంది.
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనే బీజేపీ-జనసేనల మైత్రికి బీటలు వారాయి. తిరుపతిలో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేసినా.. ఒకే ఒక్కరోజు మాత్రమే పవన్‌కల్యాణ్ ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీ-జనసేనల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోయాయి. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదంలో జనసేన కలగజేసుకోలేదు. తాజాగా, పవన్‌కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య ఆన్‌లైన్ టికెట్ల గొడవ ఓ రేంజ్‌లో జరుగుతున్నా.. పరస్పరం బూతులు తిట్టకుంటున్నా.. కమలనాథులు పీకేకు మద్దతుగా నిలవడం లేదు. ఇలా కొంతకాలంగా ఎవరి రాజకీయం వారిదే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనధికారికంగా జనసేన-టీడీపీ పరస్పరం సహకరించుకుని పలుస్థానాలు గెలుచుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
బద్వేల్ బైపోల్‌తో బీజేపీ-జనసేనల విభేదాలు మరోసారి వెలుగుచూశాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా.. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌లు బరిలో నిలిచారు. మరి, బీజేపీ-జనసేన కలిసి అభ్యర్థిని బరిలోకి దింపుతాయా..? లేదా..? అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని తేల్చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వటంతో.. తాము పోటీ చేయబోమని జనసేన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
బీజేపీతో చర్చించకుండానే జనసేన ఈ నిర్ణయం తీసేసుకుందని అంటున్నారు. ఓవైపు బద్వేల్‌లో పోటీ చేసి.. బలం నిరూపించుకోవాలని బీజేపీ బలంగా భావిస్తోంది. ఇటీవల కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎపిసోడ్‌తో బీజేపీకి మైలేజ్ పెరిగిందని.. ఆ టెంపో కంటిన్యూ చేసేలా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉంది. అందులోనూ సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో మరింత ప్రాధాన్యంత పెరిగింది. ఇలాంటి కీలక తరుణంలో.. బీజేపీకి సపోర్ట్ చేయకుండా.. జనసేన హ్యాండ్సప్ అనడం ఆ పార్టీకి మింగుడుపడని అంశం. బీజేపీపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న పవన్‌కల్యాణ్.. కావాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కమలనాథులు అనుమానిస్తున్నారు. ముందుగా ఇరు పక్షాలు కలసి చర్చించుకోకుండా.. ఓ ఏకాభిప్రాయానికి రాకుండా.. సడెన్‌గా బహిరంగ వేదికపై ఇలాంటి నిర్ణయం ప్రకటించడం చూస్తుంటే.. బీజేపీని పీకే పెద్దగా పట్టించుకోవడం లేదనేది స్పష్టం అవుతోంది.
జనసేన తటస్థంగా ఉండటం ఎవరికి లాభం? అంటే,, నిస్సందేహంగా టీడీపీకే ప్రయోజనం అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ఓటు వేయరు. ఇక బీజేపీతో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటంతో.. ఆ పార్టీకి సపోర్ట్ చేయరు. ఇక మిగిలింది టీడీపీ మాత్రమే. క్రిందిస్థాయిలో ఇప్పటికే జనసేనికులు, తెలుగు తమ్ముళ్లు కులిసి మెలిసి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు బద్వేల్‌లో జనసేన న్యూట్రల్‌గా ఉంటే.. పవన్ అభిమానులంతా బీజేపీకి కాకుండా టీడీపీకే ఓటేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం పవన్‌కల్యాణ్‌కు తెలియంది కాదు. టీడీపీపై జనసేనకున్న సాఫ్ట్ కార్నర్‌తోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
బీజేపీతో చర్చించకుండా బద్వేల్ బరి నుంచి జనసేన తప్పుకోవడం.. ఆ పార్టీకి పవన్ కల్యాణ్ దూరమవుతున్నారనే అనుమానానికి మరింత బలం చేకూర్చుతోంది. టీడీపీపై జనసేన ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల టీడీపీని, కమ్మ వర్గాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ పవన్‌కల్యాణ్ మండిపడటం ఆసక్తికరంగా మారింది. ప్రచారమే నిజమైతే.. టీడీపీ-జనసేనల మైత్రి మరోసారి చూడొచ్చు. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే...