ప్రజా ప్రభుత్వమా... తాలిబన్ రాజ్యమా?.. రేవంత్ రెడ్డి అరెస్టుతో హై టెన్షన్..
posted on Oct 2, 2021 @ 6:40PM
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జంగ్ సైరన్ నిరసన కార్యక్రమం హైదరాబాద్ లో టెన్షన్ పుట్టించింది. ఎల్బీ నగర్ లో జంగ్ సైరన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేవంత్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తనను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా..? అని మండిపడ్డారు. అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి. శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాను వెళ్లడానికి ఎస్కార్ట్ ఇవ్వాలని, ఇంటి దగ్గర రోడ్డుపై బైఠాయించి రేవంత్ నిరసన తెలిపారు.
అటు ఎల్బీ నగర్ చౌరస్తాకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. శ్రీకాంతా చారీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ సహా ఇతర పీసీసీ నేతలు పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు.