వైసీపీకి జనసేన సపోర్ట్! బద్వేలుపై పవన్ కల్యాణ్ సంచలనం..
posted on Oct 2, 2021 @ 9:14PM
ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అధికార వైసీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో శ్రమదానం నిర్వహించిన పవన్.. తర్వాత జరిగిన సభలో వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే రాజమండ్రి నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చిన జనసేనాని.. అక్కడి సభలో మాత్రం సంచలన నిర్ణయం ప్రకటించారు. వైసీపీకి ఊరటనిచ్చే ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతోంది. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. బైపోల్ నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ దివంగత ఎమ్మెల్యే సతీమణిని తమ అభ్యర్థిగా ప్రకటించగా... గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ ను మళ్లీ బరిలోకి దింపుతోంది టీడీపీ. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. తిరుపతిలో బీజేపీ పోటీ చేసినందున.. బద్వేలులో జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని కూడా వార్తలు వచ్చాయి. కొన్ని రోజులుగా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటంతో.. బద్వేలు ఉప ఎన్నికను పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారనే ప్రచారం జరిగింది.
బద్వేలు ఎన్నికలో జనసేన బరిలోకి దిగుతుందని అంతా భావిస్తున్న సమయంలో బాంబ్ పేల్చారు పవన్ కల్యాణ్. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరికి షాకిచ్చారు జనసేన చీఫ్. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని పుట్టపర్తి సభలో ప్రకటించారు పవన్ కల్యాణ్.
పుట్టపర్తి సభలో బద్వేలు ఉప ఎన్నికపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జనసేన పోటీ చేయకపోవడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వ్యూహం ప్రకారమే పవన్ కల్యాణ్ అలా ప్రకటించారని అంటున్నారు. ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేన పోటీ చేయకూడదని నిర్ణయించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.