TOP NEWS @ 7pm
posted on Oct 2, 2021 @ 6:53PM
1. నాగచైతన్య–సమంతలు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘ఇక నుంచి మేం భార్యభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు జరిపి ఎంతో ఆలోచించిం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై వేర్వేరుగా సొంత మార్గాల్లో ప్రయాణించాలని అనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహ బంధం కొనసాగినందుకు మేం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మా స్నేహబంధమే వివాహబంధానికి కీలకం అనే చెప్పాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అభిమానుల సపోర్ట్ కావాలి. మా ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని చైతన్య, సమంత తమ పోస్ట్‌లో తెలిపారు.
2. తనను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని.. ఇక నుంచి ఊరుకునేది లేదని.. తొక్కి పట్టి నార తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేనాని పవన్‌కల్యాణ్. తాను యాక్షన్, కట్ అంటే వెళ్లిపోయే వాడిని కాదని.. తన సహనాన్ని ఇక పరీక్షించొద్దని పవన్ హెచ్చరించారు. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
3. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుంటే వేల మందితో సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని.. నవంబర్ నుంచి రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
4. అవినీతిపరుల చేతులకు అధికారమిచ్చి గాంధీజీ కోరుకున్న సమాజాన్ని నిర్మించగలమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మత్తు, మాదకద్రవ్యాలు లేని విధంగా దేశం రూపుదిద్దుకోవాలన్నారు. మహాత్ముని కలలు నెరవేరాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలని నారా లోకేష్ అన్నారు.
5. బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 18 ఏళ్లు నిండి, ఆహార భద్రత కార్డ్ ఉన్న ప్రతి ఒక్క అడబిడ్డకూ బతుకమ్మ చీర ఇస్తామని తెలిపారు. మొత్తం 7,28,154 మంది అర్హులుగా గుర్తించి.. ఆ మేరకు చీరలను రెడీ చేస్తోంది తెలంగాణ సర్కారు.
6. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని.. అలాంటి తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా? అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి? శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జంగ్ సైరన్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రేవంత్‌రెడ్డి.
7. సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంపైనే మొదటి సంతకం పెడుతామని ప్రకటించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేరని బండి సంజయ్ స్పష్టం చేశారు.
8. తెలుగు అకాడమీ కుంభకోణంపై రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. నకిలీ లెటర్ హెడ్‌లతో పాటు నకిలీ సంతకాలతో నిధులను మళ్లించినట్టు గుర్తించారు. ఎఫ్‌డీల వెనుక తెలుగు అకాడమీ డైరెక్టర్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తేల్చారు. అకాడమీ ఖాతా నుంచి నిధులు.. ఏపీ మార్కెట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌కు బదలాయించారు.
9. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్ల వారీగా నేరగాళ్ల జాబితా సిద్ధం చేస్తూ.. రౌడీల అడ్రస్‌లు, లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
10. టీఆర్ఎస్ అరాచకపాలనకు చరమగీతం పాడాలని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పిలుపు ఇచ్చారు. తెలంగాణలో నిరుదోగ్య సమస్య పెరిగిందని.. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు స్మృతీ ఇరానీ.