సోషల్ మీడియా పై  చట్టం కొరడా..?  ఎక్కడంటే..  

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి, ఇది అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఆమోదిస్తున్న వాస్తవం. అదే సమయంలో సోషల్  మీడియా మంచి చెడులను తూకం వేస్తే, స్కేల్ ఎటువైపు టిల్ట్ అవుతోంది,తూకం ఎటు మొగ్గు చూపుతుందో, చెప్పడం అయ్యే పని కాదు. ఈ నేపధ్యంలో, మన దేశంతో పాటుగా, ప్రపంచ దేశాలలో  సోషల్ మీడియా కట్టడి, నియంత్రణలకు సంబంధించి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. చట్టాలు చేయాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. స్వయం నియంత్రణ అవసరాలు, అవకాశాలకు సంబందించిన చర్చలు సాగుతున్నాయి. కోర్టులు, విచారణలు, వివాదాలు అనేకం జరుగుతూనే ఉన్నాయి.  సోషల్ మీడియా కట్టడికి సంబందించి యూకేకి చెందిన,’ది టైమ్స్’ పత్రిక  ప్రచురించిన తాజా కథనం సంచలనం సృష్టిస్తోంది. టైమ్స్ కథనం ప్రకారం, యూకే ప్రభుత్వం సోషల్ మీడియాకు సంకెళ్ళు వేసేందుకు ఒక కొత్తచట్టాన్ని తెస్తోంది. ఆన్లైన్ సేఫ్టీ బిల్లు రూపొందిస్తోంది. ఇటీవల యూకే, లిస్బోన్‘లో జరిగిన వెబ్ సమ్మిట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్’లో మీడియా వాచ్’డాగ్ సంస్థ అఫ్కామ్ అధినేత డామే మెలానీ దావేస్, సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కంపెనీలు, పుట్టుకతోనే  వినియోగ దారులకు హానికరమని అన్నారు. స్వయం నియంత్రణకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స అడ్డు తగులుతున్నాయని, ప్రమాదకర పోస్టులను ప్రోత్సహిస్తున్నాయని, అన్నారు.  ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా కంపెనీలు అనుసరిస్తున్న’రికమెండ్’ ప్రకటనల విధానం వంటి కొన్ని బిజినెస్ మోడల్స్, సమస్య సృష్టికి మూలమని పేర్కొన్నారు. అదలా ఉంటే, 2023 నుంచి అమలులోకి వచ్చే, కొత్త చట్టం  గీత దాటిన సంస్థలపై చర్యలు తీసుకునే హక్కును తమకు ఇస్తుందని  అఫ్కామ్ అధినేత డామే మెలానీ దావేస్ పేర్కొన్నారు. వినియోగ దారులను ఆన్లైన్ హాని నుంచి కాపాడలేని సంస్థలకు 18పౌండ్స్ లేదా కంపెనీ వార్షిక టర్నోవర్’లో పది శాతం ఫైన్ వేసే అధికారం ఉందని, ఆన్లైన్ సేఫ్టీ బిల్లులో ఈ అన్ని అంశాలను పొందుపరిచామని చెప్పారు. ఆన్లైన్ సేఫ్టీ బిల్లులో వస్త్రధారణ, రివెంజ్ పోర్న్, విద్వేష ప్రసంగాలు, ఉగ్రవాదం, తప్పుడు సమాచారం, కుంభకోణాలు, జాతివిద్వేషాలను రెచ్చగొట్టే అంశాలు అన్నీ వస్తాయని పేర్కొన్నారు.  అయితే ఈ బిల్లుకు సోషల్ ప్లాట్ ఫార్మ్స్ నుంచి గట్టి ప్రతి ఘటన వస్తుందని అన్నారు. చివరకు ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుందా? లేక మన దేశంలోలానే రాజకీయ దుమారానికి దరి తీస్తుందా అనేది చూడవలసి వుంది. 

దళిత బంధు ఆగినట్టేనా?హుజురాబాద్ ఓటమికి అదే కారణమా?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన విధంగా కాకపోయినా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేశాయి. అధికార పార్టీ ఓడి పోయింది. బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు నిజంగానే, మంత్రి కేటీఆర్ అన్నట్లుగా, ఈటల గెలుపు వలన ప్రభుత్వంలో పెను మార్పులు ఏమీ జరగలేదు. ప్రభుత్వాన్ని పడదోస్  ప్రళయం ఏదీ వచ్చి పడలేదు. వరసగా రెండవ సారి పరాజయంతో పాటుగా పరాభావాన్ని మూట కట్టుకున్న, మంత్రి హరీష్ రావు, తెరాస అభ్యర్ధి ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా అయినా చేయలేదు..  ముఖ్యమంత్రి ఆయనే, మంత్రులూ వారే .. సో.. అంతా సవ్యంగానే ఉంది.ప్రభుత్వం ఎప్పటిలానే ఇప్పుడూ ‘పనిచేస్తోంది, కానీ, అదేమిటో, అధికార పార్టీ కీలక నేతలు ఎవరూ  కనిపించడం లేదు, వినిపించడం లేదు. పోలింగ్ కు ముందు కనిపించిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. కోట్లు కుమ్మరించి మోస్ట్ కాస్ట్లీ ఎలక్షన్’గా చరిత్ర సృష్టించిన  హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి పై ఒక్క మాట అయినా మాట్లాడలేదు.  మంత్రి కేటీఆర్ మాట వినిపించడం లేదు. సరే, మంత్రి  హరీష్ రావు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో, ఏమో, కానీ, వారిమాట కూడా ‘కనిపించుట’ లేదు. ఎమ్మెల్సీ కవిత చాలా కాలంగా తెర మరుగై పోయారు కాబట్టి, ఆమె విషయాన్ని పక్కన పెట్టినా, తెరాస కీలక నేతలు రోజులు తరబడి కనిపించకుండా పోవడం ఏమిటి? ఇప్పుడు ఇదే విషయంలో పార్టీ  వరగాల్లో, పబ్లిక్’లో చర్చ జరుగుతోంది.  ముఖ్యమంతి కేసీఆర్ కు విషయంగా అయితే ఇది ఆయనకు ఉద్యమకాలం నుంచి అలవాటుగా వస్తున్నదే.. ఎదురుదెబ్బ తగిలిన సమయంలో ఆయన.. గాయాలకు ‘మందు’ పూతలు పూసుకునేందుకు కావచ్చు, కనిపించకుండా అయన రోజులు, వారాలే కాదు నెలల  తరబడి అంతర్థానమయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తెరాస కీలక నేతలు ఎవరూ కూడా  కోట్లు ఖర్చుచేసి కొనుక్కున్న, ‘ఓటమి’  విషయంలో మౌనం వహించడం ఏమిటి?ఇది దేనికి  సంకేతం? అనే చర్చ జరుగుతోంది. ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి అనుకోండి.  కానీ దళిత బంధు పథకం అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడాన్ని, తప్పు పట్టిన ముఖ్యమంత్రి, అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2 ఓట్ల లెక్కింపు అయిపోతే,నవంబర్ 4 నుంచి హుజూరాబాద్’లో పథకం అమలు చేస్తామని, మీడియా ముందు చెప్పారు. అదో పెద్ద సమస్యే కాదని అన్నారు. ముఖ్యమంత్రి  చెప్పిన విధంగాగానే, అక్టోబర్ 30 పోలింగ్ జరిగింది. నవంబర్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చెప్పిన నవంబర్ 4 వచ్చింది, వెళ్ళింది. ఆతర్వాత నవంబర్ 5 వచ్చింది కానీ, ముఖ్యమంత్రి నుంచి గానీ, ప్రభుత్వం  నుంచి గానీ, దళిత బంధు అమలుకు సంబదించి.. ఎలాంటి ప్రకటన లేదు. ఉలుకూ  పలుకూ  లేదు.  మరోవంక హుజూరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని, గెలుపు ఊపులో ఉన్న బీజేపీ అధ్యక్షడు  బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలకు సిద్దమవుతున్నారు. మరో వంక తెరాస నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకు వెనకాముందు అవుతున్నారు .. అదెలా ఉన్నా.. ఇంతకీ, ముఖ్యమంత్రి, మంత్రులు, కేటీఆర్,హరీష్ రావు, ఎమ్మెల్సీ  కవిత ఎక్కడ? దళిత బందుకు పథకం కూడా .. ముఖ్యమంత్రి, మూడెకరాలు, అంబేద్కర్ విగ్రహం  జాబితాలో చేరిపోయినట్లేనా? ఈ మౌనానికి, ముఖ్య నేతలు మాయం కావదానికీ ఇదేనా అర్థం?

స్కాట్లాండ్ పై ఘన విజయం.. సెమీస్ రేసులో టీమ్ఇండియా! 

టీట్వంటీ వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది టీమ్ ఇండియా. కెప్టెన్ కోహ్లీ జన్మదినం రోజున అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడి  ఘన విజయం సాధించింది. సెమీస్ చేరేందుకు గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవాల్సి ఉండటంతో చెలరేగి ఆడారు భారత ఆటగాళ్లు. స్కాట్లాండ్ విధించిన 86 పరుగుల టార్గెట్ ను కేవలం 6.3 ఓవర్లలోనే చేధించారు.  ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి ఓవర్ నుంచే విజృంభించి ఆడారు. తొలి వికెట్ కు కేవలం ఐదు ఓవర్లలోనే 70 పరుగులు చేశారు. రోహిత్ శర్మ కేవలం 16 బంతుల్లోనే  32 పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ 18 బంతుల్లోనే  6 ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. సిక్సర్ త ో మ్యాచ్ ముగించాడు సూర్యకుమార్ యాదవ్.  దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన.. అదే జోష్ ను స్కాట్లాండ్ మ్యాచ్ లో కొనసాగించిందిపేసర్లు షమీ, బుమ్రాలు తొలి ఓవర్ నుంచే స్వింగ్ తో రాణించారు. దీంతో స్కాట్లాండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. వెంటవెంటనే అవుటయ్యారు. ఓపెనర్లను పేసర్లు అవుట్ చేయగా... రవీంద్ర జడేజా మిడిలార్డర్ పని పట్టారు. దీంతో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్. ఐదో వికెట్ కు మ్యాక్ లాడ్, లీస్క్ కొన్ని పరుగులు చేసినా మళ్లీ షమీ బ్రేక్ త్రూ ఇచ్చారు. తర్వాత రవీంద్ర జడేజా మరో వికెట్ తీశారు. 17 ఓవర్ లో చెలరేగిన షమీ వరుసగా రెండు వికెట్లు తీశాడు. మరొకరు రనౌట్ గా అవుటయ్యాడు. చివరికి స్కాట్లాండ్  85 పరుగులకే అలౌట్ అయింది.  షమీ మూడు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. 

చెలరేగిన భారత బౌలర్లు.. 85 పరుగులకే స్కాట్లాండ్ ఆలవుట్ 

టీట్వంటీ వరల్డ్ కప్ లో సెమీస్ చేరేందుకు కష్టాలు పడుతున్న టీమిండియా స్కాంట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్బుతంగా ఆడింది. గత మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన.. అదే జోష్ ను స్కాట్లాండ్ మ్యాచ్ లో కొనసాగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు షమీ, బుమ్రాలు తొలి ఓవర్ నుంచే స్వింగ్ తో రాణించారు. దీంతో స్కాట్లాండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. వెంటవెంటనే అవుటయ్యారు. ఓపెనర్లను పేసర్లు అవుట్ చేయగా... రవీంద్ర జడేజా మిడిలార్డర్ పని పట్టారు. దీంతో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్. ఐదో వికెట్ కు మ్యాక్ లాడ్, లీస్క్ కొన్ని పరుగులు చేసినా మళ్లీ షమీ బ్రేక్ త్రూ ఇచ్చారు. తర్వాత రవీంద్ర జడేజా మరో వికెట్ తీశారు. 17 ఓవర్ లో చెలరేగిన షమీ వరుసగా రెండు వికెట్లు తీశాడు. మరొకరు రనౌట్ గా అవుటయ్యాడు. చివరికి స్కాట్లాండ్  85 పరుగులకే అలౌట్ అయింది.  షమీ మూడు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.  ఈ మ్యాచ్ కోసం భారత్ రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, జడేజాలతో స్పిన్ కాంబినేషన్ ను రంగంలోకి దింపింది. శార్దూల్ ఠాకూర్ ను ఈ మ్యాచ్ కు పక్కనబెట్టారు. పేస్ విభాగంలో బుమ్రా, షమీ ఇద్దరికే చోటు కల్పించారు. మరో పేసర్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను ఉపయోగించుకుంది. 

న్యూజిలాండ్ ఘన విజయం.. భార‌త్‌కు సెమీస్ గండం..

భ‌య‌ప‌డిన‌ట్టే అవుతోంది. టీమిండియాకు సెమీస్ ముప్పు పొంచిఉంది. న‌మీబియాపై న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించడం.. ఇండియాకు గండంగా మారింది. టీ20 వ‌ర‌ల్డ్ కప్‌లో కివీస్‌ వరుసగా మూడో గెలుపు కైవ‌సం చేసుకుంది. గ్రూప్‌-2లో సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. పాకిస్థాన్‌ (8 పాయింట్లు) ఇప్పటికే సెమీస్‌కు చేర‌గా.. న్యూజిలాండ్‌ (6 పాయింట్లు), అఫ్గానిస్థాన్‌ (4 పాయింట్లు) సెమీస్ రేసులో మ‌న‌కంటే ముందున్నాయి.  న్యూజిలాండ్ న‌వంబ‌ర్ 8న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే డైరెక్ట్‌గా సెమీస్‌కు వెళ్లిన‌ట్టే. అప్పుడిక‌ భారత్‌, అఫ్గాన్‌ ఇంటికెళ్ల‌క తప్పదు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయి.. అఫ్గాన్ విజయం సాధిస్తే.. నెట్‌ రన్‌రేట్‌ కీలకం కానుంది. ఇండియా, కివీస్‌లో ఎవ‌రికి ర‌న్‌రేట్ ఎక్కువ‌గా ఉంటే.. ఆ జ‌ట్లు సెమీస్‌కు అర్హ‌త సాధిస్తుంది.  ఇండియా త‌ను ఆడ‌బోయే త‌దుప‌రి రెండు మ్యాచుల్లో గెలిచినా.. నేరుగా సెమీస్‌కు వెళ్తుంద‌ని చెప్ప‌లేం. నవంబర్ 5 స్కాట్లాండ్‌పై, నవంబర్ 8న నమీబియాపై టీమిండియా విక్ట‌రీ కొట్టినా.. న్యూజిలాండ్ వ‌ర్సెస్ అఫ్గ‌నిస్తాన్ మ్యాచ్ ఫ‌లిత‌మే భార‌త జ‌ట్టు సెమీస్ భ‌విష్య‌త్తును డిసైడ్ చేస్తుంది.  ఇక‌, షార్జా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది.   

చంద్ర‌బాబు చేసిన త‌ప్పే కేసీఆర్ చేశారా? ఈట‌ల‌తో అంత ప్ర‌మాద‌మా? హిస్ట‌రీ రిపీట్స్‌!

ఒక్క మంత్రి ప‌ద‌వి ప‌డేస్తే పోయేది. రాష్ట్రం విడిపోయే వ‌ర‌కూ వ‌చ్చింది. తెలుగునేల రెండుగా చీలేలా చేసింది. పార్టీల మ‌ధ్య‌, ప్రాంతాల మ‌ధ్య వైష‌మ్యాలు పెరిగేలా చేసింది. ఇంత‌టి చిచ్చుకి కార‌ణం.. ఆనాడు కేసీఆర్‌కు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డ‌మే అంటారు. 1999లో చంద్ర‌బాబు నాయుడు రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. టీడీపీ ఎమ్మెల్యే కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుకు డిప్యూటీ స్పీక‌ర్‌ పోస్టు క‌ట్ట‌బెట్టారు. అయితే, ఆయ‌న ఆ ప‌ద‌వితో సంతృప్తి చెంద‌క‌.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల్సిందేనంటూ ప‌ట్టుబ‌ట్టారు.   అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో భాగంగా కేసీఆర్‌ను మినిస్ట‌ర్ చేయ‌డం చంద్ర‌బాబుకు కుద‌ర‌లేద‌ని చెబుతారు. దీంతో.. టీడీపీని వీడి.. టీఆర్ఎస్ పేరుతో వేరు కుంప‌టి పెట్టుకున్నారు కేసీఆర్‌. తెలంగాణ ఉద్య‌మంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను రెండుగా చీల్చారు. ఏడేళ్లుగా తెలంగాణ‌ను ఏలుతున్నారు. క‌ట్ చేస్తే.. సేమ్ టు సేమ్ కాక‌పోయినా.. కాస్త అటూఇటూగా ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌లోనూ అలానే జ‌రుగుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అప్పుడు చంద్ర‌బాబు కేసీఆర్ విషయంలో చేసిన‌ట్టే.. ఇప్పుడు కేసీఆర్ ఈట‌ల రాజేంద‌ర్ అంశంలో అదే తీరుగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆ రెండు ఘ‌ట‌న‌ల‌ను కంపేర్ చేస్తున్నారు. గ‌తంలో కేసీఆర్ చంద్ర‌బాబును ఢీకొట్టి.. ఆయ‌న పార్టీని చీల్చిన‌ట్టుగానే.. ఇప్పుడిక ఈట‌ల సైతం గులాబీ బాస్‌ను ఎదిరించి.. టీఆర్ఎస్‌ను ముక్క‌లు చేస్తారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఆ విశ్లేష‌ణ ఆస‌క్తిక‌రంగా జ‌రుగుతోంది.  సెకండ్ టైమ్ అధికారంలోకి వ‌చ్చాక ఈట‌ల రాజేంద‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా కొన్నాళ్లు ప‌క్క‌న‌పెట్టేశారు కేసీఆర్‌. తాము గులాబీ జెండాకు బానిస‌లం కాదు.. ఓన‌ర్ల‌మంటూ రాజేంద‌ర్ రెబెల్ వాయిస్ వినిపించ‌గానే దెబ్బ‌కు దిగొచ్చారు దొర‌. మొద‌టి ద‌ఫా కీల‌క‌మైన‌ ఆర్థిక శాఖ క‌ట్ట‌బెట్ట‌గా.. రెండో ట‌ర్మ్‌లో కాస్త ప్రాధాన్య‌త త‌గ్గించి ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఆరోగ్యం శాఖ‌లో పెద్ద‌గా ఏం ప‌నుండ‌దులే.. ఈట‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే అనుకుంటుండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి ముంచుకురావ‌డంతో.. ఆ శాఖ మంంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క మంత్రిగా మారారు. నిత్యం స‌మీక్ష‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌ల‌తో ఫుల్ యాక్టివ్‌గా క‌నిపించారు. ఈట‌ల ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేని కేసీఆర్‌.. ఆయ‌నపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేసి.. కేబినెట్ నుంచి వేటు వేసి.. పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని అంటారు. 2001లో కేసీఆర్ టీడీపీని వీడిన అంశాన్ని.. స‌రిగ్గా 20 ఏళ్ల త‌ర్వాత‌ 2021లో ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన ప‌రిణామాన్ని జాగ్ర‌త్త‌గా కంపేర్ చేస్తున్నారు.  అప్పుడు కేసీఆర్ లానే.. ఇప్పుడు ఈట‌ల.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన నేత‌గా మారే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆనాడు ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ పార్టీ గెలిచిన‌ట్టుగానే.. తాజాగా హుజురాబాద్ ఉప పోరులో ఘ‌న విజ‌యం సాధించి రాజేంద‌ర్ స‌మ‌ర‌శంఖం పూరించారు. గెలిచిన వెంట‌నే ఇక కాస్కో కేసీఆర్ అంటూ స‌వాల్ చేశారు. త‌న‌ను ఓడించేందుకు అనేక కుట్ర‌లు, కుతంత్రాల‌కు పాల్ప‌డిన హ‌రీశ్‌రావు ఇలాఖాలో అడుగుపెట్టి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధిపేట‌లో ద‌ళిత గ‌ర్జ‌న స‌భ పెడ‌తాం.. దానికి తానే నాయ‌క‌త్వం వ‌హిస్తానంటూ.. మామా-అల్లుళ్ల‌పై డ‌బుల్ బ్యారెల్ గ‌న్ ఎక్కుపెట్టారు.  ఈట‌ల రాజేంద‌ర్ పెద్ద టార్గెట్‌నే ఎంచుకున్న‌ట్టున్నారు. ఇక‌పై ఊరూరా తిరిగి.. ఉద్య‌మకారులంద‌రినీ ఏకం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మ‌కారుల‌ను, నిరుద్యోగుల‌ను, రైతుల‌ను, ద‌ళితుల‌ను, బీసీల‌ను.. ఇలా అన్నివ‌ర్గాల‌ను క్రూడీక‌రించి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండయాత్ర‌కు రెడీ అవుతున్నారు. అచ్చం.. అప్ప‌ట్లో కేసీఆర్ చేసిన‌ట్టే.. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్.. సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి ఉప్పెన‌లా మ‌రో తెలంగాణ ఉద్య‌మం ఉధృతం చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.  ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన కేసీఆర్‌లో అంత‌ర్మ‌థ‌నం స్టార్ట్ అయింద‌ని అంటున్నారు. పాపం ఈట‌ల.. ఏం కోరుకున్నార‌ని?  కాస్తంత విలువ‌.. కుసుంత మ‌ర్యాద‌. అపాయింట్‌మెంట్ లేకుండా కేసీఆర్‌ను క‌లిసే అవ‌కాశం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి అంద‌రికీ ప్ర‌వేశం. ఇంత చిన్న చిన్న ఆకాంక్ష‌ల‌నే.. కూక‌టివేళ్ల‌తో పెకిలించేయాల‌ని చూశారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు స‌రైన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. ఆయ‌న స్థాయిని త‌గ్గించాల‌ని చూశారు. అందుకే తిర‌గ‌బ‌డిన ఉద్య‌మ‌కారుడు.. కేసీఆర్‌కు హుజురాబాద్‌లో క‌ర్రుకాల్చి వాత పెట్టాడు. భ‌విష్య‌త్‌లో కేసీఆర్ పార్టీ అంతు చూసేందుకు క‌దం ప‌దం క‌లుపుతున్నారు. అందుకే అంటారు హిస్ట‌రీ రిపీట్స్ అని. ఆనాడు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా కేసీఆర్‌ చేసిన కుట్ర‌ల పాప‌మే.. ఇప్పుడు ఈట‌ల రూపంలో ఆయ‌న‌కు శాపంలా ప‌రిణ‌మించాయని అంటున్నారు.

కుప్పంపై చంద్రాగ్ర‌హం.. ద‌ళిత‌బంధుపై ధూంధాం.. జై భీమ్‌లో ర‌ఘురామ‌.. టాప్‌న్యూస్@7pm

1. ఏపీ ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని తెలిపారు. 30 మంది వైసీపీ గుండాల దాడిలో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడ్డారని, వెంకటేశ్‌ నామినేషన్‌ పత్రాలు చించివేసి.. ఫోన్‌ లాక్కొన్నారని, దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు చంద్రబాబు జతచేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. 2. విద్యుత్‌ ఒప్పందాలు గంటల్లోనే జరిగిపోతున్నాయని, ఆగ‌మేఘాల మీద ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటోందంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మ‌న్‌ ప‌య్యావుల కేశ‌వ్ విమ‌ర్శించారు. 9వేల మెగావాట్లకు గ్రిడ్‌ సెక్యూరిటీ ఉందని ఎలా చెబుతున్నారు? రూ.2.49కి ఇంకా ఎంత అదనంగా చెల్లిస్తున్నారో చెప్పాలని ప్ర‌శ్నించారు. దేశంలో విద్యుత్‌ ధరలు తగ్గే పరిస్థితి వస్తుంటే ఏపీలో భిన్నంగా ఉందని మండిప‌డ్డారు ప‌య్యావుల‌.  3. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలంటూ న‌వంబ‌ర్‌ 9న ఆందోళనలకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4 తర్వాత దళితబంధును ఎవరు ఆపలేరన్న‌ సీఎం కేసీఆర్.. తన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 9న దళితబంధు ఆందోళనలు, 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్‌తో ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్నారు క‌మ‌ల‌నాథులు.  4. దళితబంధును ఆపిందే బీజేపీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. బండి సంజయ్ ఏ అర్హతతో దళితబంధుపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉపఎన్నిక ఫలితంపై ఆత్మ పరిశీలన చేసుకుంటామన్నారు. బీజేపీలో ఈటల కొనసాగడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఉపఎన్నిక ఫలితాలు తమ పాలనకు రిఫరెండం కాదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌.  5. పెట్రోల్‌, డీజిల్‌పై ఏపీ ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కనీసం అలాంటి ఆలోచనైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. వ్యాట్ సహా అదనపు పన్ను, సెస్సులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని త‌ప్పుబ‌ట్టారు.  6. ఎంపీ ర‌ఘురామ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "జై భీమ్‌ సినిమా చూశాను. ఆ సినిమాలో గిరిజన యువకుడిని హింసిస్తూ ఉన్న పరిస్థితి.. నాకు జరిగిన ఘటన.. ఒకేలా ఉన్నట్లు అనిపించింది. పరిస్థితులు పెద్దగా మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. గిరిజనుడ్ని కొట్టారు.. గిరిజనుడికి దిక్కేంటని లాయర్‌ వచ్చారు. నేను ఎంపీ, ఇప్పుడు నాకే దిక్కులేదు’’ అని రఘురామ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  7. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మజీ మంత్రి హరి రామ జోగయ్య లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపు కులాలకు ప్రత్యేకించారని, దీన్ని పక్కనపెట్టే విధంగా మరో జీవోను వైసీపీ సర్కార్ ఇవ్వడం విచారకరమన్నారు. కాపుల పట్ల చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని కోరారు. ఈ డబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని హ‌రి రామ జోగ‌య్య‌ డిమాండ్ చేశారు.  8. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెనుబూతం డ్రగ్స్ అని, హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టులో అక్రమంగా దిగుమతి అవుతున్న.. క్రూడ్ ఆయిల్ దొంగ వ్యాపారం చేస్తున్నదెవరని ప్రశ్నించారు. గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి.. గిరిజన యువకులపై కేసులు పెట్టడం పోలీస్ శాఖకు అవమానమన్నారు. వివేకా హత్యకేసు వివరాలను సీబీఐ బయటపెట్టాలన్నారు హర్షకుమార్.  9. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్‌ తెలిపారు. డ్ర‌గ్స్ ర‌వాణాకు విజయవాడ అడ్రెస్‌ను రెండుసార్లు ఉపయోగించారని, రాకెట్ అంతా ఢిల్లీ కేంద్రంగా జరిగిందన్నారు. బెజ‌వాడ‌లో యాక్టివ్‌గా ఉన్న 18 మంది రౌడీ షీటర్లను బహిష్కరించామని, కొత్తగా 116 మందిపై రౌడీ షీట్స్ తెరిచామని సీపీ తెలిపారు.  10. అనంతపురంలో మాజీ విద్యార్థి సంఘం నేత తిరుపాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పది రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆయన పాడుబడ్డ బావిలో శవమై తేలి కనిపించాడు. కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉండడంతో హత్యగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

న్యూజిలాండ్ మంచి స్కోర్‌.. టీమిండియా సెమీస్ ఛాన్సెస్ ఫ‌స‌క్‌?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఇండియ‌న్స్‌కు ఉత్కంఠ‌గా మారింది. మ‌నం గెలుస్తామా లేదా అనేది ఎంత ఆస‌క్తిక‌ర‌మో.. న్యూజిలాండ్ ఓడుతుందా లేదా? అనేది అంత‌కంటే ఎక్కువ ఇంపార్టెంట్ విష‌యంగా మారింది. ఎందుకంటే.. భార‌త్ సెమీస్‌లో అడుగుపెట్టాలంటే.. కివీస్ ఓ మ్యాచ్‌లో త‌ప్ప‌క ఓడాల్సి ఉంటుంది. లేదంటే.. మ‌న‌కు ఛాన్సెస్ త‌గ్గిపోతాయి. అందుకే, న్యూజిలాండ్ వ‌ర్సెస్ న‌మీబియా మ్యాచ్‌పై టెన్ష‌న్ నెల‌కొంది.  వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌ను భారీ స్కోరు సాధించకుండా నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. అయితే ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో చేతులెత్తేయ‌డంతో కివీస్ మెరుగైన‌ స్కోరు చేసింది. సెమీస్‌కి వెళ్లాలంటే.. న్యూజిలాండ్‌ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ హ్యాండ్స్-అప్ అన‌డం టీమిండియా ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా టార్గెట్‌ 164 ర‌న్స్‌.  అఫ్గాన్‌ మీద భారీ ఇన్నింగ్స్‌ ఆడిన న్యూజిలాండ్‌ ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్ (18) ఈసారి తుస్సుమ‌న్నాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (28) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయంలో ఔటయ్యాడు. డారిల్ మిచెల్‌ (19) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. డేవన్‌ కాన్వే (17) విఫలమయ్యాడు. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (39), నీషమ్‌ (35) వేగంగా ఆడటంతో 163 స్కోరునైనా న్యూజిలాండ్‌ సాధించగలిగింది. నమీబియా బౌలర్లలో బెమార్డ్‌, వైజ్‌, ఎరాస్మస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాల‌ని ఇండియ‌న్ ఫ్యాన్స్ గ‌ట్టిగా కోరుకుంటున్నారు. 

"జై భీమ్" మూవీతో పోల్చుకున్న ర‌ఘురామ‌.. ఆ సీన్ ఏంటంటే..

క‌రెంట్ ఇష్యూల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందించే ఎంపీ ర‌ఘురామ.. తాజాగా పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించి ఏపీ సీఎం జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. "పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇంధనం రేట్లు, స్కూల్‌ ఫీజులు, ఇంటి పన్నులు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో సీఎం జగన్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు అమలవుతున్నాయి. గతంలో ఆయన చెప్పినట్టు.. యానాం, కర్ణాటక, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఏపీ కంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ప్రజల కోసం ధరలు తగ్గించాలని కోరారు.. ఇప్పుడు అమలు చేసేందుకు వెనకాడుతున్నారు. ఏపీలో పెట్రో రేట్లు తగ్గించి దేశ వ్యాప్తంగా జగన్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటున్నా". అన్నారు ర‌ఘురామ‌.   "జై భీమ్‌ సినిమా చూశాను. 1995లో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆ సినిమాలో గిరిజన యువకుడిని హింసిస్తూ ఉన్న పరిస్థితి.. నాకు జరిగిన ఘటన.. ఒకేలా ఉన్నట్లు అనిపించింది. పరిస్థితులు పెద్దగా మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. గిరిజనుడ్ని కొట్టారు.. గిరిజనుడికి దిక్కేంటని లాయర్‌ వచ్చారు. నేను ఎంపీ, ఇప్పుడు నాకే దిక్కులేదు’’ అని రఘురామ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు ఎందుకు అమలు చేయటం లేదు? అని ప్ర‌శ్నించారు ర‌ఘురామ‌. ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపుల విషయంపై ప్రధానికి లేఖ రాశాన‌ని చెప్పారు.  ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇలా జరుగుతోందని.. మద్యం షాపుల నుంచి వచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి?.. ఆ డబ్బు ఎవరికో ఇస్తున్నారు. మద్యం షాపుల నుంచి నగదు రూపేణా వసూలు చేస్తున్న దానిలో ప్రభుత్వానికి ఎంత జమ చేస్తున్నారు? తక్షణం నగదు వసూలు ఆపి డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని ఎంపీ ర‌ఘురామ‌ డిమాండ్ చేశారు.

'జై భీం' సూప‌ర్‌ హిట్‌కు కార‌ణం ఇత‌నే.. జ‌స్టిస్ చంద్రు విశేషాలు ఇవే...

‘‘జై భీమ్’’. సూప‌ర్‌హిట్ కొడుతున్న సినిమా. థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకున్నా.. అమెజాన్ ప్రైమ్‌లో దుమ్మురేపుతోంది. IMDB రేటింగ్ 9కి పైనే ఉంది. ఇటీవ‌ల దాదాపు అన్ని సైట్లు మంచి రేటింగ్ ఇచ్చాయి. తెలుగువ‌న్‌.కామ్ సైతం జై భీమ్‌కు 4 రేటింగ్ ఇచ్చి ప‌ట్టం క‌ట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమా చూసిన వారంతా భ‌లే ఉందంటున్నారు. థియేట‌ర్ల‌లో వ‌చ్చుంటే బాగుండ‌ని మాట్లాడుకుంటున్నారు. మంచి సినిమా కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు జై భీమ్ రూపంలో చ‌క్క‌ని చిత్రం ముందుకొచ్చింది. లీడ్ క్యారెక్ట‌ర్‌ హీరో సూర్య జ‌స్టిస్ చంద్రు రోల్‌లో మెప్పించారు. ఇంత‌కీ జ‌స్టిస్ చంద్రు ఎవ‌రు? ఆయ‌న రియ‌ల్ లైఫ్ స్టోరీ ఏంటి?   జస్టిస్ చంద్రు అనే లాయ‌ర్‌, జ‌డ్జి జీవిత గాథను జై భీమ్‌గా తెర‌కెక్కించారు. 1990 కాలంలో తమిళనాడులో  అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాడారు. మానవ హక్కుల కేసుల్లో ఫీజు తీసుకోకుండా వాదించేవారు. కుల వివక్ష, వెనకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. లాయర్‌గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో ‘లిజన్ టు మై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు. దాని ఆధారంగానే జై భీమ్ సినిమా రూపొందింది.   మద్రాస్ హైకోర్టుకు 2006, జులై 31న అదనపు న్యాయమూర్తిగా.. 2009, నవంబర్ 9న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జ‌స్టిస్ చంద్రు హైకోర్టు జడ్జీగా ఇచ్చిన తీర్పులు ఎంతో మంది జీవితాలపై ప్ర‌భావం చూపించాయి. చంద్రు తన కెరీర్‌లో 96వేల తీర్పులు వెలువరించారు. ఓ కేసులో ఆయన ఇచ్చిన తీర్పుతో.. మధ్యాహ్న భోజన పథకంలో 25వేల మంది నిరు‌పేద మహిళలకు ఉపాధి లభించింది. ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయ‌నిచ్చిన తీర్పుల్లో కీలకమైనవి.  జ‌డ్జిగా సో కాల్డ్ ప్రోటోకాల్స్ కొన్నిటిని మార్చేశారు జ‌స్టిస్ చంద్రు. హోదాగా భావించే ఎర్ర‌బుగ్గ కారును వ‌ద్ద‌నుకున్నారు. త‌న కారుపై ఉండే ఎర్ర‌బుగ్గ‌ను త‌నంత‌ట తాను తీసేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నిరాక‌రిస్తూ.. సెక్యూరిటీని సరెండర్ చేశారు. కోర్టుల్లో తన ముందు వాదనలు వినిపిస్తున్నప్పుడు ‘‘ మై లార్డ్ ’’ అని పిలవాల్సిన అవసరం లేదన్నారు. 2013లో హైకోర్టు జ‌డ్జిగా రిటైర్డ్ కాగానే ప్రభుత్వం తనకు కేటాయించిన కారును కోర్టు ఆవరణలోనే వదిలేసి డ్రైవర్‌కు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు. ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని లోకల్ ట్రైన్ ఎక్కి తన ఇంటికి వెళ్లిపోయారు.  సంప్ర‌దాయం ప్ర‌కారం ఎవరైనా హైకోర్టు న్యాయమూర్తి రిటైర్ అయితే ఘ‌నంగా సెండాఫ్ పార్టీ ఇచ్చి వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ చంద్రు మాత్రం ఆ సెండాఫ్ పార్టీనీ తిరస్కరించి.. అందుకు అయ్యే ఖర్చును ఏదైనా మంచి పని కోసం ఉపయోగించమ‌ని చెప్పారు. ఇలా అనేక అంశాల్లో.. త‌న‌దైన చెద‌ర‌ని ముద్ర వేశారు జ‌స్టిస్ చంద్రు. ఆయ‌న ఘ‌న‌కీర్తిలో ఓ చిన్న అంశ‌మే.. ప్ర‌స్తుత జై భీమ్. అందుకే ఈ సినిమా సూప‌ర్‌హిట్‌. 

హాస్పిట‌ల్‌లో న‌క్కిన‌ ఉగ్ర‌వాదులు.. క‌శ్మీర్‌లో హోరాహోరీ ఫైరింగ్‌..

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి రెచ్చిపోయారు. భార‌త జ‌వాన్ల‌ను టార్గెట్‌గా చేసుకొని దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. శ్రీన‌గ‌ర్‌లో స్కిమ్స్ కాలేజ్ ద‌గ్గ‌ర ఉన్న భ‌ద్ర‌తాద‌ళాల‌పై టెర్ర‌రిస్టులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు.  ఆర్మీ సోల్జ‌ర్స్ తేరుకునేలోపే.. ముష్క‌రులు స్కిమ్స్ హాస్పిట‌ల్‌లోకి చొర‌బ‌డ్డారు. ఆసుప‌త్రిలో న‌క్కిన ఉగ్ర‌మూక‌ను ప‌ట్టుకునేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు పెద్ద ఎత్తున మోహ‌రించాయి. ప్ర‌స్తుతం సైనికులు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్నాయి. హాస్పిట‌ల్‌లో దాక్కున్న టెర్ర‌రిస్టులు.. వైద్యులు, సిబ్బంది, రోగుల‌కు ఎలాంటి ప్ర‌మాదం త‌ల‌పెడ‌తారోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అతి జాగ్ర‌త్త‌గా ఆప‌రేష‌న్ చేప‌డుతున్నారు.   

ట్రయల్‌రూంలో యువ‌తి డ్రెస్ ఛేంజ్‌.. వీడియో తీసిన యువ‌కులు.. మేనేజ‌ర్ అరెస్ట్‌

షాపింగ్ మాల్స్‌కి వెళ్లాలంటేనే భ‌య‌ప‌డాల్సి వ‌స్తోంది. రెస్టారెంట్స్ సైతం క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. రెస్ట్ రూమ్స్‌కి వెళ్లాల‌న్నా.. ట్ర‌య‌ల్ రూమ్‌లో బ‌ట్ట‌లు మార్చుకోవాల‌న్నా.. ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. హైద‌రాబాద్‌లో ఆవారాగాళ్లు ఎక్కువ‌వుతున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ రెస్టారెంట్ రెస్ట్ రూమ్‌లో సెల్‌ఫోన్‌తో సీక్రెట్‌గా వీడియో తీయ‌గా.. తాజాగా ఓ షాపింగ్ మాల్ ట్ర‌య‌ల్‌రూంలోనూ దాదాపు అదే సీన్‌. యువ‌తి డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుండ‌గా ఇద్ద‌రు పోకిరీలు వీడియో తీసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఖ‌రీదైన జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఈ రెండు ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం కాక‌తాళీయ‌మో.. లేక‌...? హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని హెచ్‌ అండ్‌ ఎం షాపింగ్‌మాల్‌ ట్రయల్‌రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. గమనించిన యువతి కేకలు వేయడంతో అక్కడున్నవారు యువకులను పట్టుకున్నారు. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గానే వారు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని.. అందులో నుంచి ఆ వీడియో డిలీట్ చేయించారు. ఫోన్‌లో ఇంకా ఇలాంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా అనే దిశ‌గా పోలీసులు త‌నిఖీ చేస్తున్నారు. ఇద్దరు యువకులతో పాటు స్టోర్‌ మేనేజర్‌ ఆమన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.    

సీఎం అభ్యర్ధిగా ఈటల?.. కేసీఆర్‌కు బీజేపీ రిట‌ర్న్ గిఫ్ట్!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ తంతే గారెల బుట్టలో పడ్డారా? ఇప్పుడు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆయన స్థాయి, హోదా అనూహ్యంగా పెరిగి పోయాయా? ఇంతవరకు కేసీఆర్’కు ప్రత్యర్ధి ఎవరు అనే సమాధానం లేని ప్రశ్నకు, ఇప్పుడు ఈటల సమాధానంగా నిలుస్తున్నారా? ఈటల తెలంగాణ హేమంత్ బిశ్వ శర్మ (అస్సాం ముఖ్యమంత్రి) కాబోతున్నారా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి, ఈటల మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఏమో కానీ, ఆయన ఎప్పుడూ కూడా, ఆ కోరికలను అంతగా బయట పెట్టుకోలేదు. ఎక్కడో ఏదో సందర్భంలో, గులాబీ జెండాకు మేమే (బీసీలు) ఓనర్లమని అన్నా, అది పూర్తి స్థాయి ధిక్కార స్వరం కాదు. తిరుగుబాటు సంకేతం కూడా కాదు. రాజకీయ ప్రసంగాలలో అలాంటి దూకుడు వ్యాఖ్యలు రావడం సహజం. అయినా, ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకనో ఈటలను అదే విధంగా హరీష్ రావును తమ కుటుంబ ఆధిపత్యానికి ముప్పుగా, ప్రమాదంగా భావించారు, భయ పడ్డారు. బహుశా ఆ భయంలోంచే ఆయన ఈటలపై వేటు వేశారు. హరీష్ రావు తమ వేలితోనే తమ కంటినే పొడుచుకునేలా చేశారు. ఈరోజు హరీష్ రావు పరిస్థితి ఏమిటో చెప్పనవసరం లేదు. అడకత్తెరలో పోక చెక్కలా నలిగి పోతున్నారు. ఓ వంక అవమాన భారం, మరో వంక రేపేమిటో.. తెలియని అయోమయం. ఎవరో ఆయన సన్నిహితులే అన్నట్లుగా, పగవాడికి కూడా రాకూడని కష్టాలే హరీష్ రావుకు వచ్చాయని అంటున్నారు. అయినా, అదే సమయంలో చేసుకున్న వారికి చేసుకున్నంత అనే మాట కూడా వినిపిస్తోంది.      హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం తర్వాత, బీజేపీలో ఈటల గ్రాఫ్’ పెరిగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు ప్రత్యాన్మాయ శక్తిగా బీజేపీని నిలపాలని, ఆశపడుతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం,ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించ్చేందుకు  సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అస్సాంలో, కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్  బిశ్వ శర్మకు ఏ విధంగా అయితే కీలక బాధ్యతలు అప్పగింఛి, ఈశాన్య రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చారో, అదే విధంగా, ఈటలకు  కీలక బాధ్యతలు అప్పగింఛి అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, ముందు ముందు ఈటలను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగానే కావచ్చును బీజేపీ, ప్రధాని మోడీ ప్రస్తావన అంతగా తీసుకురాని, ఈటల ఎన్నికల తర్వాత స్వరం మార్చారు. మోడీ, షా, నడ్డా పేర్లను పదే పదే ప్రస్తావిస్తున్నారు. పార్టీతో దూరాన్ని దగ్గర చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. మరో వంక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాత స్నేహాన్ని పక్కన పెట్టి, తనను ఎంతగా తూలనాడినా, ఈటల  ఎక్కాడా పెద్దగా గీత దాటలేదు. మాట తూలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కీలుబోమ్మగా మారి చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించక తప్పదనే హెచ్చరిక మాత్రమే చేశారు. కానీ, ఫలితాలు వెలువడిన తర్వాత ఎమ్మెల్యే హోదాలో కడుపులో దాచుకున్న కత్తులను బయటకు తీశారు. ముఖ్యంగా,తనను ఓడించేందుకు గట్టి కుట్రలు చేసిన హరీష్ రావు టార్గెట్’గా విమర్శలు గుప్పిస్తున్నారు,   హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్న దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు మద్దతుగా త్వరలోనే సిద్దిపేటలో దళితగర్జన సభ నిర్వహిస్తామని వివరించారు. దళిత గర్జన సభకు తానే నాయకత్వం వహిస్తానని వెల్లడించారు అంతే కాదు, హరీశ్‌రావు అధర్మం, అన్యాయం వైపు నిలబడ్డారని,  మద్యం, కుట్రలు, డబ్బు, దౌర్జన్యాలను నమ్ముకున్న హరీశ్‌రావు వాటికే బలవుతారని శాపం పెట్టారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ఈటల సిద్దమవుతున్నారు.ఈ నేపధ్యంలోనే బీజేపీ నాయకులు, ఈటలలో మరో హేమంత్ బిశ్వ శర్మను చూస్తున్నారు.

కుప్పంలో వైసీపీ అరాచ‌కం.. టీడీపీ నామినేష‌న్లు చించివేత‌.. తీవ్ర‌ ఉద్రిక్త‌త‌..

మంచి పాల‌న లేదు. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ అంత‌క‌న్నా లేదు. గెలుస్తామ‌నే న‌మ్మ‌కం అస‌లే మాత్రం లేదు. ఎలాగైనా గెల‌వాల‌నే ఆరాటం మాత్రం ఉంది. అందుకు అధికార‌పార్టీ ఎంచుకున్న ఏకైక మార్గం అరాచ‌కం. బెదిరింపుల‌తో ప్ర‌తిప‌క్షాన్ని భ‌య‌పెడుతోంది. స్థానిక ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేయ‌కుండా టీడీపీ అభ్య‌ర్థుల‌ను అడ్డుకుంటోంది. దీంతో.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్త‌త త‌లెత్తింది.  అస‌లే టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత ఇలాఖా. కుప్పంలో ప‌సుపు పార్టీకి తిరుగు లేదు. దీంతో, వైసీపీ శ్రేణులు టీడీపీ అభ్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను కొంద‌రు దుండ‌గులు లాక్కెళ్లారు.  నామినేషన్‌ దాఖలు చేసేందుకు శుక్ర‌వార‌మే ఆఖరి రోజు. దీంతో 14వ వార్డుకు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. అతడి నుంచి నామినేషన్‌ పత్రాలను పలువురు బ‌ల‌వంతంగా లాక్కున్నారు. ఈ పెనుగులాట‌లో వెంకటేశ్‌ చేతికి గాయమైంది. బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఆగ‌డాల‌పై అంతా మండిప‌డుతున్నారు.  

గంగిరెద్దుకు గూగుల్ పే.. అవాక్కైన‌ కేంద్రమంత్రి.. భ‌లే ఐడియా గురూ..

టీ తాగితే గూగుల్ పే తో పేమెంట్‌. పానీపూరీ తింటే ఫోన్‌పే తో న‌గ‌దు చెల్లింపు. సూప‌ర్ మార్కెట్ కెళితే అమేజాన్ పే. ఆన్‌లైన్లో కొంటే కార్డ్‌ పే. ల‌క్ష రూపాయ‌ల స‌రుకైనా.. రూపాయ్ చాక్లెట్ అయినా.. ఏది కొన్నా డిజిట‌ల్ పేమెంట్ చేస్తున్నారు చాలామంది. ఆన్‌లైన్ పేమెంట్స్ ఇటీవ‌ల కాలంలో విప‌రీతంగా జ‌రుగుతున్నాయి. న‌గారాల్లో 80శాతం డిజిట‌ల్ చెల్లింపులు చేస్తుండ‌గా.. గ్రామాల్లోనూ గూగుల్ పే, ఫోన్ పేల వాడకం భారీగా జ‌రుగుతోంది. జేబులో డబ్బులు పెట్టుకోవ‌డం మానేసిన జ‌నాలు.. ఏది కావాల‌న్నా స్మార్ట్ ఫోన్‌తోనే పే చేస్తున్నారు. ఈ మార్పు కొంద‌రికి ఇబ్బందిగా మారింది. దీంతో వారుసైతం డిజిట‌ల్ దారి ప‌ట్టారు. అలాంటి ఓ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అదికాస్తా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను చేరింది. ఆ వీడియో చూసి ఆమె అవాక్క‌య్యారు. వెంట‌నే త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇంత‌కీ.. ఏంటా వీడియో? దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్‌ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను ఆమె తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో గంగిరెద్దు తలపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను అమర్చగా.. ఓ వ్యక్తి దాన్ని స్కాన్‌ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి భిక్ష పంపించాడు. ఈ వీడియోను నిర్మలా సీతారామన్‌ పోస్ట్ చేశారు. ‘‘గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో ఇది. ఇందులో వారు క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారు. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరింది’’ అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు ఎద్దులను అలంకరించి పండగల సమయాల్లో ఇంటింటికీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారని వివ‌రించారు నిర్మ‌లా సీతారామ‌న్‌.     

న‌మో మోదీ.. కేదార్‌నాథ్‌లో ఆదిగురు విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ..

ప్ర‌ధాని మోదీ ఏది చేసినా ప్ర‌త్యేక‌మే. దీపావ‌ళి నాడు బోర్డ‌ర్‌లో జ‌వాన్ల‌తో క‌లిసి పండ‌గ చేసుకున్నారు న‌రేంద్రుడు. ఆ మ‌ర్నాడు ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కేదార్‌నాథ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్ర‌ధాన‌ ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి 'ఆరతి' నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల ఎత్తైన ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.  2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆది శంకరాచార్యుల సమాధితో పాటు  ఎన్నో కట్టడాలు కొట్టుకుపోయాయి. వాటిని కేంద్రం పునర్నిర్మిస్తోంది. దీనిలో భాగంగా ఆది శంకరాచార్యుల సమాధికి మరమ్మతులు చేశారు. ఇక‌, 2019లో శంక‌రాచార్య‌ విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఆదిగురు విగ్రహం 2  ఫీట్ల పొడవు, బరువు 35,000 కిలోలు. మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్.. క్లోరైట్ స్కిస్ట్‌తో విగ్ర‌హం తయారు చేశారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా దీనిని రూపొందించారు.   ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం 130 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. కేథార్‌నాథ్ టెంపుల్ దగ్గర సరస్వతి రిటనింగ్ వాల్, ఘాట్స్, మంధాకిని రిటనింగ్ వాల్, తీర్థ్ పురోహిత్‌ల గృహ నిర్మాణాలు, గురుధ్ చట్టి బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

న‌మో మోదీ.. వైసీపీ దాదాగిరి.. టీమిండియా కీల‌క మ్యాచ్‌.. టాప్‌న్యూస్ @ 1pm

1. ప్రధాని మోదీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల ఎత్తైన ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి 'ఆరతి' నిర్వహించిన అనంతరం మోదీ శంక‌రాచార్య‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2. అనంతపురం జిల్లా పామిడి, మిడుతూరులో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పామిడిలో జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తున్న ఐదుగురిని మృత్యువు కబలించడం బాధాకరమన్నారు. మిడుతూరులో పాదాచారులు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందడం విచారకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  3. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల పైసా వ‌సూల్ బెదిరింపులు హ‌ద్దు మీరుతున్నాయి. ఆఖ‌రికి దీపావ‌ళి టపాసుల దుకాణాల నుంచీ మామూళ్లు వ‌సూళ్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే  ముఖ్య అనుచరుడు ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, 30 వ వార్డు కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ అనుచరులు ఒక్కో దుకాణానికి రూ.35 వేల చొప్పున బలవంతంగా వసూళ్లు చేశారు. డబ్బు వసూళ్లు చేస్తున్న నేతల వీడియోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  4. తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన మహిళను వైసీపీ నేత బెదిరించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కూనవరం మండలం కాచవరం పంచాయతీ ఒకటో వార్డుకు శిరీష అనే గిరిజన మహిళను నామినేషన్ వేశారు. శిరీష్ నామినేషన్ వేయడంపై వైసీపీ ఉప సర్పంచ్ చామంతుల వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరించ‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 5. ఐదోరోజు అమ‌రావ‌తి రైతుల మ‌హా పాదయాత్రకు ప్రత్తిపాడులో ఘన స్వాగతం లభించింది. స్థానికులు ఎద్దులతో స్వాగతం పలికారు. స్కూల్ స్టూడెంట్స్ పాద‌యాత్ర‌లో ఉత్సాహం నింపారు. టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం సైతం మ‌హా పాద‌యాత్ర‌లో భాగ‌స్వామ్య‌మ‌య్యారు.  6. టోల్ ఫీజు అడిగినందుకు సిబ్బందిని చిత‌క్కొట్టారు వైసీపీ రౌడీ మూక‌లు. విశాఖ జిల్లా న‌క్క‌ప‌ల్లి మండ‌లం కాగిత టోల్‌గేట్ ద‌గ్గ‌ర జ‌రిగిందీ ఘ‌ట‌న‌. పాయ‌క‌రావుపేట‌కు చెందిన కొంద‌రు వైసీపీ నాయ‌కులు కారులో టోల్ గేట్ ద‌గ్గ‌రికి రాగా.. అక్క‌డ విధుల్లో ఉన్న సిబ్బంది ఫీజు చెల్లించాల‌ని అడిగారు. తాము వైసీపీ నేత‌ల‌మ‌ని.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌మ‌ని.. త‌మ‌నే టోల్ రుసుం అడుగుతారా? అంటూ వారితో గొడ‌వ‌కు దిగారు. రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో టోల్‌గేట్‌ సిబ్బందిలో ఒక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి.  7. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివ‌ర్సిటీ మరో భారీ ఉద్యమానికి వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేసే విధంగా నిరుద్యోగ సైరన్‌కు విద్యార్థి సంఘాలు కసరత్తు మొదలుపెట్టాయి. అప్పుడు తెలంగాణ కోసం.. ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించడం కోసం ఉద్యమం చేపడుతున్నట్లు నిరుద్యోగ జేఏసీ చెబుతోంది. 20 విద్యార్థి సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఐక్యకార్యాచరణ ప్రకటించనున్నాయి. 8. క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ. 8 కోట్లకు ఐపీ పెట్టాడు. ఉయ్యాలవాడలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న పాలది శేఖర్‌రావు చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం, కూతురి పెళ్లి కోసం.. 8కోట్లు అప్పు చేశాడు. మొత్తంగా రూ. 8 కోట్లకు ఐపీ పెట్టడంతో.. బాధితులు పోలీసుల‌ను ఆశ్రయించారు.  9. గుత్తా సుమన్ కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తాను హైద్రాబాద్‌లో కెసినో ఆడించలేదని.. గోవా, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్‌లో ఆడిస్తున్నానని పోలీసుల ముందు గుత్తా సుమన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. బయట దేశాలకు వచ్చే వారిని మాత్రమే తీసుకెళ్లినా.. బర్త్‌డే పార్టీ కోసం ఫార్మ్ హౌస్ రెంట్‌కి తీసుకున్నారు. సుమన్ ఫోన్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల ఫోటోలుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. 10. టీ20 వరల్డ్‌కప్‌లో శుక్ర‌వారం కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ర‌న్ రేట్ పెంచుకునేలా కోహ్లీ టీమ్ భారీ విజ‌యం ద‌క్కించుకోవాల్సి ఉంది. మ‌రోవైపు న్యూజిలాండ్ ఓడితేనే భార‌త్‌కు సెమీస్ ఛాన్సెస్ ఉంటాయి.  

స్కాట్లాండ్‌తో టీమిండియా కీల‌క మ్యాచ్‌.. గెలిస్తే వర‌ల్డ్‌ క‌ప్ మ‌న‌దే..నా!

ఒక్క ఛాన్స్. ఒకే ఒక్క ఛాన్స్‌. టీమిండియా అంటే ఏంటో చూపిస్తామంటున్నారు. తామెందుకు నెంబ‌ర్ వ‌న్ ఆట‌గాళ్ల‌మో నిరూపిస్తామంటున్నారు. ముందు రెండు మ్యాచ్‌లు ఏదో అలా ఓడిపోయాం కానీ, కోహ్లీ టీమ్‌లో స‌త్తా ఏంటో చూపించి.. దుబాయ్‌లో దున్నేస్తామంటున్నారు. ఆ ఒక్క ఛాన్స్‌.. సెమీస్‌లో ఒకే ఒక్క ఛాన్స్‌.. సాధిస్తే చాలు.. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌న‌దే అంటున్నారు. అంత ధీమాగా ఉన్నారు ఆట‌గాళ్లు. అభిమానుల‌కూ మ‌నోళ్ల‌పై బోలెడంత న‌మ్మ‌కం. ఏదో రెండు మ్యాచ్‌లు ఓడిపోయార‌ని అలా ఫైర్ అయ్యారు కానీ.. ఫ్యాన్స్‌కు తెలుసు మ‌న‌ ప్లేయ‌ర్స్ ఎంత‌టి పోటుగాళ్లో. టీ20 వరల్డ్‌కప్‌లో శుక్ర‌వారం కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. స్కాట్లాండే కాబ‌ట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా గెలిచేస్తాం. కాక‌పోతే ర‌న్ రేట్‌ను మాగ్జిమ‌మ్ పెంచేసుకోవాలి.. అంటే భారీ విజ‌యం సాధించాలి. సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం కూడా ఉంది. ఇప్ప‌టికే అఫ్ఘ‌నిస్తాన్‌పై భారీ విక్ట‌రీతో మంచి ఫ్యామ్‌లోకి వ‌చ్చిన టీమిండియా.. అదే జోరును కంటిన్యూ చేస్తూ ప‌సికూన‌ స్కాట్లాండ్‌నూ చంక‌లోపెట్టేసుకుంటుంద‌ని అంటున్నారు. స్కాట్లాండ్ మ్యాచ్‌తో భారత్‌కు సెమీస్ ఛాన్సెస్ మ‌రింత మెరుగువుతాయి. కాక‌పోతే.. కండీష‌న్ అప్లై.  టీమిండియా స్కాట్లాండ్‌పై భారీ విజ‌యం సాధించ‌డం ఎంత ముఖ్య‌మో.. అటు న్యూజిలాండ్ ఓడిపోవ‌డ‌మూ అంతే ఇంపార్టెంట్‌. మ‌నం గెలిచి.. వాళ్లు ఓడితేనే.. సెమీస్ ఎంట్రీ ఈజీ అవుతుంది. లేదంటే.. ఆశ‌లు గ‌ల్లంతే. ఇప్ప‌టికే మంచి ఫ్యామ్‌లో ఉన్న న్యూజిలాండ్ అఫ్ఘ‌నిస్తాన్ చేతిలో ఓడిపోవ‌డం కుసింత క‌ష్ట‌మే. అయితే, ఇది ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌. ఇందులో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఎవ‌రి చేతిలో ఎవ‌రైనా ఓడిపోవ‌చ్చు. అలా భార‌త్‌కు క‌లిసొచ్చేలా న్యూజిలాండ్ ఓడితే.. టీమిండియా సెమీస్‌లో కుమ్మేయ‌డం ఖాయం.. ఫైన‌ల్ చేర‌డం ప‌క్కా అంటున్నారు. అదే జ‌రిగితే, షోయ‌బ్ అక్త‌ర్ అన్న‌ట్టు.. తుది పోరు ఇండియా-పాకిస్తాన్‌ల మ‌ధ్యే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అప్పుడిక‌.. దుబాయ్ వేదిక‌గా అస‌లు సిస‌లు దాయాదుల యుద్ధం చూడొచ్చు. పిక్చ‌ర్ అబీ బాకీ హై. 

వైసీపీ నేత‌ల రౌడీయిజం.. టోల్ సిబ్బందిపై దాడి.. ఒక‌రికి తీవ్రగాయాలు..

వైసీపీ కండువా వేసుకుంటే చాలు రౌడీల్లా రెచ్చిపోతున్నారు. గూండాల్లా దాడులు చేస్తున్నారు. చిల్ల‌ర మూకంతా పోగై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. స్వ‌యానా పార్టీ అధినేతే ప్రోత్స‌హిస్తున్న‌ట్టున్నారు.. వైసీపీ బ్యాచ్ అంతా అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా, టోల్ గేట్ సిబ్బందిపై రెచ్చిపోయి దాడికి దిగారు వైసీపీ నాయ‌కులు.  టోల్ ఫీజు అడిగిన పాపానికి సిబ్బందిని చిత‌క్కొట్టారు అధికార‌పార్టీ మూక‌లు. విశాఖ జిల్లా న‌క్క‌ప‌ల్లి మండ‌లం కాగిత టోల్‌గేట్ ద‌గ్గ‌ర జ‌రిగిందీ ఘ‌ట‌న‌. పాయ‌క‌రావుపేట‌కు చెందిన కొంద‌రు వైసీపీ నాయ‌కులు కారులో టోల్ గేట్ ద‌గ్గ‌రికి రాగా.. అక్క‌డ విధుల్లో ఉన్న సిబ్బంది ఫీజు చెల్లించాల‌ని అడిగారు. తాము వైసీపీ నేత‌ల‌మ‌ని.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌మ‌ని.. త‌మ‌నే టోల్ రుసుం అడుగుతారా? అంటూ వారితో గొడ‌వ‌కు దిగారు. మాటామాటా పెరిగ‌డంతో.. రెచ్చిపోయిన వైసీపీ వాళ్లు.. సిబ్బందిపై దాడి చేశారు.  వైసీపీ శ్రేణుల దాడిలో టోల్‌గేట్‌ సిబ్బందిలో ఒక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఆ గొడ‌వంతా సీసీకెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘ‌ట‌న‌పై ఇరువ‌ర్గాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి.