దళిత బంధు ఆగినట్టేనా?హుజురాబాద్ ఓటమికి అదే కారణమా?
posted on Nov 6, 2021 @ 10:23AM
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన విధంగా కాకపోయినా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేశాయి. అధికార పార్టీ ఓడి పోయింది. బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు నిజంగానే, మంత్రి కేటీఆర్ అన్నట్లుగా, ఈటల గెలుపు వలన ప్రభుత్వంలో పెను మార్పులు ఏమీ జరగలేదు. ప్రభుత్వాన్ని పడదోస్ ప్రళయం ఏదీ వచ్చి పడలేదు. వరసగా రెండవ సారి పరాజయంతో పాటుగా పరాభావాన్ని మూట కట్టుకున్న, మంత్రి హరీష్ రావు, తెరాస అభ్యర్ధి ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా అయినా చేయలేదు..
ముఖ్యమంత్రి ఆయనే, మంత్రులూ వారే .. సో.. అంతా సవ్యంగానే ఉంది.ప్రభుత్వం ఎప్పటిలానే ఇప్పుడూ ‘పనిచేస్తోంది, కానీ, అదేమిటో, అధికార పార్టీ కీలక నేతలు ఎవరూ కనిపించడం లేదు, వినిపించడం లేదు. పోలింగ్ కు ముందు కనిపించిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. కోట్లు కుమ్మరించి మోస్ట్ కాస్ట్లీ ఎలక్షన్’గా చరిత్ర సృష్టించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి పై ఒక్క మాట అయినా మాట్లాడలేదు. మంత్రి కేటీఆర్ మాట వినిపించడం లేదు. సరే, మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో, ఏమో, కానీ, వారిమాట కూడా ‘కనిపించుట’ లేదు. ఎమ్మెల్సీ కవిత చాలా కాలంగా తెర మరుగై పోయారు కాబట్టి, ఆమె విషయాన్ని పక్కన పెట్టినా, తెరాస కీలక నేతలు రోజులు తరబడి కనిపించకుండా పోవడం ఏమిటి? ఇప్పుడు ఇదే విషయంలో పార్టీ వరగాల్లో, పబ్లిక్’లో చర్చ జరుగుతోంది.
ముఖ్యమంతి కేసీఆర్ కు విషయంగా అయితే ఇది ఆయనకు ఉద్యమకాలం నుంచి అలవాటుగా వస్తున్నదే.. ఎదురుదెబ్బ తగిలిన సమయంలో ఆయన.. గాయాలకు ‘మందు’ పూతలు పూసుకునేందుకు కావచ్చు, కనిపించకుండా అయన రోజులు, వారాలే కాదు నెలల తరబడి అంతర్థానమయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తెరాస కీలక నేతలు ఎవరూ కూడా కోట్లు ఖర్చుచేసి కొనుక్కున్న, ‘ఓటమి’ విషయంలో మౌనం వహించడం ఏమిటి?ఇది దేనికి సంకేతం? అనే చర్చ జరుగుతోంది. ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి అనుకోండి.
కానీ దళిత బంధు పథకం అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడాన్ని, తప్పు పట్టిన ముఖ్యమంత్రి, అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2 ఓట్ల లెక్కింపు అయిపోతే,నవంబర్ 4 నుంచి హుజూరాబాద్’లో పథకం అమలు చేస్తామని, మీడియా ముందు చెప్పారు. అదో పెద్ద సమస్యే కాదని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగాగానే, అక్టోబర్ 30 పోలింగ్ జరిగింది. నవంబర్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చెప్పిన నవంబర్ 4 వచ్చింది, వెళ్ళింది. ఆతర్వాత నవంబర్ 5 వచ్చింది కానీ, ముఖ్యమంత్రి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ, దళిత బంధు అమలుకు సంబదించి.. ఎలాంటి ప్రకటన లేదు. ఉలుకూ పలుకూ లేదు.
మరోవంక హుజూరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని, గెలుపు ఊపులో ఉన్న బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలకు సిద్దమవుతున్నారు. మరో వంక తెరాస నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకు వెనకాముందు అవుతున్నారు .. అదెలా ఉన్నా.. ఇంతకీ, ముఖ్యమంత్రి, మంత్రులు, కేటీఆర్,హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఎక్కడ? దళిత బందుకు పథకం కూడా .. ముఖ్యమంత్రి, మూడెకరాలు, అంబేద్కర్ విగ్రహం జాబితాలో చేరిపోయినట్లేనా? ఈ మౌనానికి, ముఖ్య నేతలు మాయం కావదానికీ ఇదేనా అర్థం?