సీనియర్ల దూకుడు.. జూనియ‌ర్ల‌ దేకుడు! టీడీపీ వారసులెక్కడ? 

''నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండీ!'' అంటూ యువతకు పిలుపునిస్తాడు మహాకవి శ్రీశ్రీ. ''ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం'' అన్నారు స్వామి వివేకానందుడు. ప్ర‌స్తుతం టీడీపీ సైతం ఇలాంటి నినాద‌మే ఇస్తోంది. న‌వ‌త‌రం క‌ద‌లిరావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని అంటోంది. 153మంది ఎమ్మెల్యేల బ‌లంతో విర్ర‌వీగుతూ.. ఏపీలో అరాచ‌క పాల‌న న‌డిపిస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి. రాష్ట్ర రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేయ‌డం మొద‌లు.. ప‌నికిమాలిన మ‌ద్యం పాల‌సీ, రాలిపోతున్న న‌వ‌ర‌త్నాలు, అప్పుల‌తో దివాళా అంచున‌కు చేరిన ఆర్థిక దుస్థితి.. ఇలా సైన్‌రైజ్ స్టేట్‌ను స‌న్‌సెట్ స్టేట్‌గా మార్చేసి.. అభివృద్ధిని అట‌కెక్కించేసిన ఘ‌నుడు జ‌గ‌న్‌రెడ్డి. మ‌రి, ఇలాంటి చేత‌గాని ప్ర‌భుత్వంపై గ‌ట్టి పోరాటం చేయాల్సిన స‌మ‌యంలో.. చేవ క‌లిగిన ప‌సుపు సైన్యం ముందుకు రావాల్సిన త‌రుణంలో.. యువ నేత‌లంతా వెన‌కే ఉండ‌టం దారుణం. టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ డైన‌మిక్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై ఎంతో దూకుడుగా దాడి చేస్తున్నా.. ఆయ‌న‌కు అండ‌గా టీడీపీ యువ నాయ‌కులు క‌లిసి రాక‌పోవ‌డంపై సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు. వార‌సులంతా ఏమైపోయార‌నే చ‌ర్చ పార్టీలో జోరుగా జ‌రుగుతోంది.  టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెంనాయుడు మైకు ప‌ట్టుకున్నారంటే.. వైసీపీ ప్ర‌భుత్వం షేక్ అవ్వాల్సిందే. అందుకే, నోరున్న ఆ నేత‌ను ఈఎస్ఐ కేసుతో నోరు మూయించే ప్ర‌య‌త్నం చేసింది. అయినా, అచ్చెన్న అద‌ర‌లేదు..బెద‌ర‌లేదు..జోరు త‌గ్గించ‌లేదు. అచ్చెన్న‌కు స‌మానంగా అయ్య‌న్న సైతం అదే జోరు క‌న‌బ‌రుస్తున్నారు. అచ్చెన్న, అయ్య‌న్న‌ అనే కాదు.. అనేక మంది టీడీపీ నేత‌లు జ‌గ‌న్‌రెడ్డి అడ్డ‌గోలు పాల‌న‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. కుట్ర‌లు, కేసులు, అరెస్టులకు అస‌లే మాత్రం భ‌య‌ప‌డ‌టం లేదు. జైల్లో పెట్టిన‌.. గోడ‌కు కొట్టిన బంతిలా తిరిగొచ్చి వైసీపీ స‌ర్కారుతో యుద్ధ‌మే చేస్తున్నారు. రివ‌ర్స్ టెండ‌రింగ్‌, అక్ర‌మ మైనింగ్‌పై దేవినేని ఉమా చేసిన‌, చేస్తున్న పోరాటానికి ఫ‌లితం.. కేసులు, నోటీసులు.  ఇక ధూళిపాళ్ల న‌రేంద్రను జ‌గ‌న్ స‌ర్కారు ఎంత‌గా వేధించిందో రాష్ట్ర మంతా చూసింది. అటు.. కొల్లు ర‌వీంద్ర‌ను ఏకంగా మ‌ర్డ‌ర్ కేసులో ఇరికించ‌డం.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై కేసుల మీద కేసులు పెట్ట‌డం.. జేసీ బ్ర‌ద‌ర్స్ ఆర్థిక మూలాల‌ను దొబ్బ‌కొట్టి.. వ‌రుసబెట్టి కేసులు పెట్టి.. టీడీపీ సీనియ‌ర్ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది వైసీపీ ప్ర‌భుత్వం. రాజ్యం నుంచి ఎంత‌గా ప్రెజ‌ర్ పెరుగుతున్నా.. సీనియ‌ర్లు మాత్రం త‌గ్గేదే లే అంటూ స‌మ‌రం కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌ టీడీపీ వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తున్నారు. అయితే, సీనియ‌ర్లు ముందు వ‌రుస‌లో పోరాడుతున్నా.. మ‌ద్ద‌తుగా మ‌రింత దూకుడుగా రాజ‌కీయం చేయాల్సిన‌ యువ‌నేత‌లు మాత్రం ప‌త్తా లేకుండా పోవ‌డం టీడీపీకి మైన‌స్‌గా మారిందంటున్నారు.   మంత్రులు కొడాలి నానినో, అనిల్‌కుమారో నోరేసుకు ప‌డుతుంటే.. వారి స్థాయికి దిగ‌జారి అచ్చెన్న‌, అయ్య‌న్న లాంటి సీనియ‌ర్లు స‌మాధానం చెప్ప‌డం కాస్త ఇబ్బందిక‌ర‌మే. హుందాగా రాజ‌కీయం చేసే సీనియ‌ర్లు.. ఇలాంటి చిల్ల‌ర పాలిటిక్స్ చేయ‌డం కాస్త క‌ష్ట‌మే. అదే టీడీపీ త‌ర‌ఫున ఫైర్‌బ్రాండ్ లాంటి యువ‌నేత‌లు ముందుకొచ్చి.. వైసీపీ బూతుల‌కు గ‌ట్టి స‌మాధానం చెబుతూ ఉంటే.. అధికార పార్టీకి ధీటుగా ఉండేది. కానీ, నెత్తురు మండే, శక్తులు నిండే.. యువ‌నేత‌లు అడ్ర‌స్ లేకుండా పోయారు. కొంద‌రు మాత్రం యాక్టివ్‌గానే ఉన్నా.. చాలామంది సోదిలో లేకుండా పోయారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప‌రిటాల శ్రీరామ్‌, చింతకాయల విజయ్..లాంటి వాళ్లు మాత్ర‌మే ధీటుగా జ‌వాబిస్తూ స‌త్తా చూపిస్తున్నారు. కానీ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భాను ప్రకాష్, కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం, జేసీ ప‌వ‌న్‌, గ‌ల్లా జ‌య‌దేవ్‌ , భూమా అఖిలప్రియ లాంటి వాళ్లు యాక్టివ్‌గా లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు ఉన్నాయి.   టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న తండ్రుల‌ను చూసుకొని ఒక‌ప్పుడు బాగా హ‌డావుడి చేసిన యువ నాయ‌కులు.. ఇప్పుడు పార్టీకి అవ‌స‌రం అయిన‌ప్పుడు మాత్రం ముఖం చాటేయ‌డంపై అధిష్టానం ఆగ్ర‌హంగా ఉంద‌ని తెలుస్తోంది. మెజార్టీ యువనేతలు హైదరాబాద్ లోనే ఉంటూ.. వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌భుత్వంపై గ‌ట్టిగా పోరాడేందుకు ముందుకు రాక‌పోవ‌డంపై మండిప‌డుతున్నారు. ఏపీలో ప్ర‌జ‌ల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఎక్క‌డ, ఏ క‌ష్టం వ‌చ్చినా.. వెంట‌నే నేనున్నానంటూ ముందుకు వస్తూ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై దూకుడుగా దాడి చేస్తున్న నారా లోకేశ్‌ను స్పూర్తిగా తీసుకొని అయినా.. నెక్ట్స్ జ‌న‌రేష‌న్ త‌మ నాయ‌క‌త్వ ప‌టిమ‌ను చాటుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీకి అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ప‌ట్టించుకోకుండా.. రేపు అధికారంలోకి వ‌చ్చాక త‌గ‌దున‌మ్మా అంటూ ప‌ద‌వుల కోసం ముందుకొస్తే ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు. టీడీపీకి యువ నేత‌ల అవ‌స‌రం ఇప్పుడే ఉంది.

 కాంగ్రెస్ ఓట్లను రేవంత్ అమ్మేసుకున్నాడా?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన వారం రోజులు దాటినా రాజకీయ కాక మాత్రం చల్లారడం లేదు. ఉపఎన్నికపై నాయకులు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. విజయం ఇచ్చిన జోష్ లో ఉన్న కమలనాధులు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ను మరింతగా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి కౌంటరిచ్చారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. బీజేపీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు మోత్కుపల్లి నర్సింహులు.దళితబంధు అమలైతే దళితులంతా కేసీఆర్‌ వెంట ఉంటారని భయపడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్‌ దళిత బంధు ఉండాలనుకుంటున్నాడా లేదా వద్దనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా దళితబంధు లాంటి పథకం ఉందా అని ప్రశ్నించారు. ఒక దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. 70 ఏండ్లలో దళితులకు ఏనాడూ న్యాయం జరగలేదన్నారు. అంబేద్కర్‌ ఆలోచనలు అమలుచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ అని తేల్చిచెప్పారు.బండి సంజయ్‌కి సిగ్గులేదని, తమ కులం వెంట పడుతున్నాడని మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను టచ్‌ చేస్తే మాడిపోతారన్నారు.  కేంద్రం అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేస్తున్నదని, బడుగుబలహీన వర్గాలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజూ పెంచితే ప్రజలు ఎట్ల బతుకుతారని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బీజేపీకి దమ్ముంటే దేశమంతా దళితబంధు అమలుచేయాలని సవాల్‌ విసిరారు. బీజేపీకి వ్యతిరేకంగా ఊరూరా నిరసనలు తెలుపుతామన్నారు. బండి సంజయ్‌ అరిచేదేదో ఢిల్లీకి వెళ్లి అరవాలని మోత్కుపల్లి సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌ అపవిత్ర కలయిక వల్ల హుజురాబాద్ లో  ఈటల గెలిచారని నర్సింహులు విమర్శించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మూడు వేల ఓట్లే వచ్చినా రేవంత్‌ రెడ్డి సిగ్గులేకుండా పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ఓట్లను రేవంత్ రెడ్డి గుండుగుత్తగా ఈటలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. దొంగలకు సద్దికట్టే ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు. నీతిమంతులెవరూ బీజేపీలో ఉండలేరని చెప్పారు. పేదలు, దళితులంతా సీఎం కేసీఆర్‌ వెంటే ఉంటారని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.

సర్కారు దవాఖానలో కలెక్టర్‌ భార్య ప్రసవం.. హరీష్ రావు ప్రశంసలు

వైద్యశాఖ మంత్రిగా హరీష్ రావుకు తొలి రోజే మంచి కబురు అందింది. జిల్లా కలెక్టర్ భార్య సర్కార్ దవాఖానాలో ప్రసవించింది. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది.  ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా కలెక్టర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాంగా ముందుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్‌ దంపతులేనని మంత్రి ప్రశంసించారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కూడా కలెక్టర్‌ దంపతులకు గ్రీటింగ్స్‌ తెలిపారు.

విలీనం రాజ్యాంగ విరుద్ధం..గురువులకు జగన్ సార్ పంగనామం? 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏది చేసినా, అది వివాదమే అవుతుంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వివాదాలకు పురుడు పోస్తుందన్న అనుమానాలు కూడా లేక పోలేదు. ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఏ ఒక్కటీ కూడా  కోర్టు గడప తొక్కకుండా బయటపడిన దాఖలాలు లేవేమో ...   ఇక ప్రస్తుత విషయానికే వస్తే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది జీవో 46 విడుదల చేసింది. ఇదులో భాగంగా ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తనికి మొత్తాన్ని,నేరుగా ప్రభుత్వంలోకి తీసుకుంది. అయితే, ఇలా, గంపగుత్త నియామకాలు కాలు జరపడం రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్‌ 16(1) ప్రకారం ఈ నియామకాలు చెల్లవు. సుప్రీం కోర్టు ఆదేశాలకు కూడా ఈ నిర్ణయం విరుద్ధమని  రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  రాజ్యాంగంలోని  ఆర్టికల్‌ 16(1) ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, గౌరవ వేతనం... తదితర పోస్టులు భర్తీ చేయవలసి ఉంటుంది. అంతే కాని, రాత్రి దేవుడు కలలో కనుపించి చెప్పారని, తెల్లారి  ఒకే ఒక్క కలం పోటుతో అనుకున్నది చేస్తామంటే, చట్టం ఒప్పుకోదు.ఈ విధంగా భర్తీ చేసిన పోస్టులకు, ఉద్యోగులకు అవసరమైన నియమ నిబంధనలు, సర్వీసు కండీషన్లను ఆర్టికల్‌ 309 ప్రకారం రూపొందిస్తారు. ఆర్టికల్‌ 309 అనేది ఆర్టికల్‌ 16 క్లాజ్‌(1)కి లోబడి ఉంటుంది. కానీ ఈ ఒక్క ఆర్టికల్‌ను మాత్రమే ఉపయోగించుకొని ఉద్యోగులను ఇష్టానుసారం ప్రభుత్వంలోకి తీసుకోవడం చెల్లదని రాజ్యాంగ నిపుణులు స్పష్తం చేస్తున్నారు. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అలవాటులో పొరపాటుగా అదే తప్పు చేసింది. అయితే ప్రభుత్వం తెలియక తప్పు చేసిందని అనుకుంటే, అది మనం తప్పు చేసినట్లు అవుతుంది. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం, జీవోలో కొన్ని కీలక అంశాలను దాచేసింది.  అలా దాచేసిన అంశాలను అందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌లో ప్రస్తావించారు. ఆర్టికల్‌ 309ను ఉపయోగించి ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అసవరమైన నియమ నిబంధనలు రూపొందించాలని ఏపీపీఎస్సీని ఆదేశించినట్టుగా నోట్‌ ఫైల్‌లో ఉందని తెలుస్తోంది. (ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే, పారదర్శక పాలన అందిస్తున్నాదే పనిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం కీలక జీవోలను, దేచేస్తోందని అంటున్నారు) అయితే ఆర్టికల్‌ 16 క్లాజ్‌(1) ప్రకారం ప్రభుత్వ సర్వీసుల్లోకి రిక్రూట్‌ కాని ప్రైవేట్‌ ఉద్యోగులకు ఆర్టికల్‌ 309 ప్రకారం సర్వీసు కండీషన్లు, ఇతర నియమ నిబంధనలు రూపొందించడం రాజ్యాంగ విరుద్ధం.  ఇలా దొడ్డిదారిన గంప గుత్తగా  ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకోవడం అంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడమే అవుతుందని, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నీ తెలిసే ఆడుతున్న ఈ నాటకంలో, చివరకు నష్టపోయేది మాత్రం ఉపాధ్యులే అని రాజ్యంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై, నిరుద్యోగులు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఉపాధ్యాయులు వీదిన పడడం ఖాయమంటున్నారు.  ప్రభుత్వంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను నేరుగా రెగ్యులరైజ్‌ చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16 క్లాజ్‌ (1)కి కేవలం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అందులో  మొదటిది, లోకల్‌/ నాన్‌లోకల్‌ అర్హత, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌, మతపరమైన వ్యవస్థలకు చెందిన కార్యాలయాల్లో ఆ మతానికి చెందిన ఉద్యోగులే పని చేయాలన్న రిజర్వేషన్‌. ఇప్పుడు ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకోవడం ఈ మూడు మినహాయింపుల పరిధిలోకి రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవంక ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు కూడా  చాలా స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన తీర్పును ఇచ్చింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వంలో ఏ స్థాయిలో నియామకం చేపట్టాలన్నా,  ఆర్టికల్‌ 19 క్లాజ్‌ (1) ప్రకారం నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అర్హులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఏదో ఒకటి నిర్వహించాలా? రెండూ అవసరమా అనే విషయాన్ని ఆర్టికల్‌ 309 ద్వారానే నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ప్రత్యేకించి కొంతమంది ఉద్యోగులనే ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకున్నా... నోటిఫికేషన్‌ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, అవసరమనుకుంటే సరైన కారణం చూపి ఆ కొందరికి గరిష్ఠంగా 5శాతం వరకూ వెయిటేజీ కల్పింవచ్చని, వయోపరిమితి సడలింపులూ ఇవ్వొచ్చని పేర్కొంది. కాబట్టి, ఈ నేపధ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం దురాలోచనతో తీసుకున్న ఉపాధ్యాయుల విలీన నిర్ణయం, బూమ్రాంగ్ అవడం ఖాయం.  ఎవరైనా నిరుద్యోగులలో ఇంకొకరో కోర్టును ఆశ్రయిస్తేనే, అప్పుడు మాత్రమే చట్టం, సత్యం బయటకు వస్తాయి, లేదంటే ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏమి జరుగిందో అదే జరుగుతుంది. అదలా ఉంటే, ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనల విషయంలో న్యాయస్థానాలు సుమోటోగా చర్యలు తీసుకోవడం అవసరమని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల పాలిట ఇలాంటి నిర్ణయాలు తీరని అన్యాయం చేస్తాయని అంటున్నారు.

అనంతలో లోకేశ్‌.. ఈట‌ల ఆగ‌యా.. ష‌ర్మిల 72 గంట‌ల దీక్ష‌.. టాప్‌న్యూస్ @1pm

1. అనంత‌పురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ద‌గ్గ‌ర‌ విద్యార్థుల ఆందోళనతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. విద్యార్థులు కాలేజ్‌ గేట్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మ‌రోవైపు నారా లోకేష్‌కు అనంత‌ జిల్లా సరిహద్దుల్లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  2. కుప్పంలో రాత్రి జరిగిన సంఘటన బ్లాక్ డే అని టీడీపీ విమ‌ర్శించింది. అర్ధరాత్రి దాటాక బలవంతంగా పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టు చేసి బయటకు గెంటి వేయడం దారుణమని మండిపడింది. పులివెందల రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్‌మోహన్ రెడ్డి అమలు చేయడం, భ‌య‌బ్రాంతులకు గురి చేయడం ప్రజలు సహించరన్నారు.  3. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈటలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈట‌ల వెంట‌ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. అంత‌కుముందు రాజేంద‌ర్‌.. గన్ పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.  4. ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి పురుడు పోసుకున్నారు. ఈ విషయం తెలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కలెక్టర్ దంపతులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరువగైన సేవలు అందిస్తున్నాయని ట్విట్టర్‌లో మంత్రి హరీష్ తెలిపారు.  5. మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీ కొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి అవంతి ఇంటి ముందు నిరసనకు దిగారు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టినట్లు చూసామని మృతుని బంధువులు అంటున్నారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  6. ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర‌ ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆందోళనపై మంత్రి తలసాని సమాధానం దాటవేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు మాత్రం ఇందిరా పార్కు ద‌గ్గ‌ర‌ ధర్నాకు ప‌ర్మిష‌న్ ఎలా ఇస్తుంద‌ని ప్ర‌శ్నించ‌గా మంత్రి సమాధానం ఇవ్వలేక‌పోయారు.  7. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసై పోతారని హెచ్చ‌రించారు. బీజేపీ నేతలు దళిత బంధు కోసం డప్పులు కొట్టడం దురదృష్టకరమన్నారు. బండి సంజయ్ దళిత బంధు వద్దని డప్పు కొడుతున్నట్లుగా ఉందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని మోత్కుప‌ల్లి ప్రశ్నించారు.  8. రైతుల కోసం 72 గంట‌ల దీక్ష‌కు కూర్చుంటాన‌ని ప్ర‌క‌టించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌. కేసీఆర్‌కు చిత్త‌శుద్ధి ఉంటి యాసంగి పంట‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంపై నెపం మోపి త‌ప్పించుకోవాల‌ని చూస్తే వ‌ద‌ల‌బోమ‌ని హెచ్చ‌రించారు ష‌ర్మిల‌.  9. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పదవ రోజు కొన‌సాగుతోంది. ప‌ర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మ‌హా పాద‌యాత్రకు సంఘీభావం తెలిపేందుకు సమీప గ్రామాల మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు.  10. మ‌లాలా యూస‌ఫ్ జాయ్‌. పాకిస్తాన్‌లో బాలిక‌ల విద్యా కోసం నిన‌దించిన గొంతుక‌. తాలిబ‌న్ల తూటాల‌కు బెద‌ర‌ని బాలిక‌. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత‌. తాజాగా, మ‌లాలా వివాహ బంధంలో అడుగుపెట్టారు. పాక్ క్రికెట్ కోచ్‌ అస్స‌ర్‌తో నిఖా చేసుకున్నారు. బ్రిటన్‌, బర్మింగ్‌హమ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో షాదీ జరిగింది. 24 ఏళ్ల మలాలా త‌న పెళ్లి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. భ‌ర్త అస్సర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.   

మ‌లాలా నిఖా.. బ్రిట‌న్‌లో సింపుల్‌గా షాదీ..

మ‌లాలా యూస‌ఫ్ జాయ్‌. పాకిస్తాన్‌లో బాలిక‌ల విద్యా కోసం నిన‌దించిన గొంతుక‌. తాలిబ‌న్ల తూటాల‌కు బెద‌ర‌ని బాలిక‌. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత‌. తాజాగా, మ‌లాలా వివాహ బంధంలో అడుగుపెట్టారు. అస్స‌ర్‌తో నిఖా చేసుకున్నారు. బ్రిటన్‌, బర్మింగ్‌హమ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో షాదీ జరిగింది. 24 ఏళ్ల మలాలా త‌న పెళ్లి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. భ‌ర్త అస్సర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.  ‘‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు అందించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం’’ అని మలాలా ట్వీట్‌ చేశారు.  పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులు జ‌రిపారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్‌ గాయాల కారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అప్ప‌టి నుంచీ బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు మ‌లాలా.  మలాలాపై దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ మొదటిసారి విద్యా హక్కు బిల్లును రూపొందించింది. మలాలా తనపై జరిగిన దాడి, దాని అనంతర పరిణామాల గురించి ‘ఐ యామ్ మలాలా’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. పదహారేళ్ల వయసులోనే విద్యలో లింగ సమానత్వం ఆవశ్యకతపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్‌ పేరుతో బాలికల విద్య కోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఆమె సేవలను గుర్తించి 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతి వ‌రించింది. 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై మలాలా ఆందోళన వ్యక్తం చేశారు. 

'గంటా' మోగ‌దేంటి? రెంటికీ చెడ్డ రేవ‌డి..!

గంటా శ్రీనివాస‌రావు. పేరు ఎక్క‌డో విన్న‌ట్టుంది క‌దా? విశాఖ నార్త్ ఎమ్మెల్యే. మాజీ కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేనే. ఏ పార్టీ అని మాత్రం అడ‌గొద్దు. ఎందుకంటే ఆయ‌న ప్ర‌స్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆయ‌న‌కే తెలీదు. గెలిచింది మాత్రం సైకిల్ గుర్తుపై. టెక్నిక‌ల్‌గా ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు కానీ, టీడీపీతో మాత్రం లేరు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం పోరాడుతానంటూ పెద్ద పోటుగాడిలా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ముందు రాంగ్ ఫార్మాట్‌లో రిజైన్ చేస్తే.. విమ‌ర్శ‌లతో గంటాను కుళ్ల‌బొడిచారంతా. ఇక త‌ప్పేలా లేదంటూ.. స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అంతే. రాజీనామా చేసి నెల‌లు గ‌డుస్తున్నా.. ఆ రాజీనామా అడ్ర‌స్ లేకుండా పోయింది. స్పీక‌ర్ ఆమోదించ‌డం లేదు.. ఈయ‌న ఆయ‌న‌పై ఒత్తిడి పెంచ‌డం లేదు. అంతా అడ్జ‌స్ట్‌మెంట్‌లా అనిపిస్తోంది. స‌రే.. ఆ విష‌యం ప‌క్క‌న‌పెడ‌దాం. విశాఖ ఉక్కు కోసం నేను సైత‌మంటూ అప్ప‌ట్లో గంటా కాస్త హ‌డావుడి చేసేందుకు ట్రై చేసినా.. ఆయ‌నెవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాజీ..నామా మిన‌హా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా శ్రీనివాస‌రావు చేసిందేమీ లేదు. ఓ వైపు కార్మికులు విశాఖ ఉక్కు కోసం అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారు. వారికి గంటా నుంచి ఎలాంటి మ‌ద్ద‌తూ లేదు. ఇటు అధికార ప‌క్షం.. అటు ప్ర‌తిప‌క్షం.. పార్టీల‌న్నీ ప్రైవేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తున్నాయి. ఈయ‌న మాత్రం నీర‌సించిపోయిన‌ట్టున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేనాని విశాఖ‌లో సభ పెట్టి దుమ్మురేపారు. మ‌రి, స్థానిక నాయ‌కుడైన గంటా శ్రీనివాస‌రావు త‌న‌వంతుగా ఏం చేశారు? టీడీపీ శ్రేణులు స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును నిత్యం ఎండ‌గ‌డుతున్నాయి. క‌నీసం త‌న పార్టీ త‌ర‌ఫున పోరాటాల్లోనూ గంటా పార్టిసిపేట్ చేయ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డున్నారో.. ఏం చేస్తున్నారో.. ఎవ‌రికీ తెలీదు. అంటే.. విశాఖ ఉక్కు కోసం రాజీనామా.. డ్రామా అనేగా అర్థం? ప‌వ‌ర్, ప‌ర‌ప‌తి లేకుండా గంటా శ్రీనివాస‌రావు ఉండ‌లేర‌ని అంటారు. ఆయ‌న వ్యాపార సామ్రాజ్యానికి అధికార‌మే అండ‌. రాజ‌కీయాల్లో గోడ మీద పిల్లి ఎవ‌రంటే.. గంటానే ముందుగా గుర్తుకొస్తారని చెబుతారు. టీడీపీతో రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత‌ పీఆర్పీలో చేరి చిరంజీవి పంచ‌న చేరారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో క‌లిపేశాక‌.. గంటాకు మంత్రి ప‌ద‌వి వ‌రించింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చేసి మ‌ళ్లీ టీడీపీలో చేరారు. 2014లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్ర‌బాబు కేబినెట్‌లో ఓ వెలుగు వెలిగారు. 2019లో విశాఖ నార్త్ నుంచి గెలిచినా.. టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో పార్టీతో అంటీముట్ట‌న‌ట్టు మెదులుతున్నారు. గ‌త ట‌ర్మ్‌లో.. నారాయ‌ణ‌-గంటా శ్రీనివాస‌రావు.. వియ్యంకులు ఇద్ద‌రూ ప్ర‌భుత్వంలో ఫుల్ హ‌వా కొన‌సాగించి.. ప‌వ‌ర్ పోగానే.. వాళ్లిద్ద‌రూ అడ్ర‌స్ లేకుండా పోయారు. టీడీపీకి తామేమీ కాద‌న్న‌ట్టు.. ట‌చ్ మీ నాట్‌లా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంపై తెలుగు త‌మ్ముళ్లు గుర్రుమంటున్నారు.  టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వైసీపీలో చేరాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టాక్‌. కానీ, స్థానిక వైసీపీ నేత‌లు గంటాకు ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌ట‌. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా చంద్ర‌బాబును క‌ల‌వ‌లేదు ఆయ‌న‌. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలో చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష చేసినా.. గంటా వ‌చ్చి సంఘీభావం తెల‌ప‌లేదు. గెలిచిన‌ప్ప‌టి నుంచీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ పంచ‌న చేరేందుకు ఉబ‌లాట‌ప‌డుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశం తెర మీద‌కు రాగానే.. స్టీల్ ప్లాంట్‌ కోసం రాజీనామా చేస్తున్నానంటూ డ్రామా క్రియేట్ చేసి.. వైసీపీలో చేరిపోవాల‌ని భావించారు. కానీ, మంత్రి అవంతి శ్రీనివాస్‌.. గంటా శ్రీనివాస్‌ను గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్నారు. ఒక‌ప్ప‌టి గురుశిష్యులు ఇప్పుడు బ‌ద్ద శ‌త్రువులు. విశాఖ‌లో గంటా గంట మోగ‌కుండా.. సిటీలో, పార్టీలో ఆయ‌న‌కు స్పేస్ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో.. ఇటు టీడీపీలో లేకుండా.. అటు వైసీపీలో చేర‌లేకుండా.. గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయ భ‌విష్య‌త్తు రెంటికీ చెడ్డ రేవ‌డిగా మారిందంటున్నారు.

ఏపీ పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ నివేదిక? వైసీపీ వర్గాల్లో కాక..

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగే స‌ద‌స్సుకు హాజ‌రయ్యేందుకు గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. సమావేశంలో భాగంగా రాష్ట్రపతితో ఆయన సమావేశమవుతారు. అయితే ప్రెసిడెంట్ సదస్సు కోసమే ఏపీ గవర్నర్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఏపీ పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ హరిచందన్ నివేదిక ఇస్తారనే చర్చ జరుగుతోంది.  ఏపీ రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వారం వారం అప్పులు చేస్తేనే కాని పాలన సాగే అవకాశాలు కన్పించడం లేదు.  ఏపీలో పెరిగిపోతున్న అప్పుల విష‌యం మీద  జాతీయ మీడియాలో విప‌రీతంగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు చాలా సార్లు ఫిర్యాదు చేశాయి. రూల్స్ కు విరుద్ధంగా తీసుకువస్తున్న అప్పులను కట్టడి చేయాలని కోరాయి. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ తగ్గంపుపైనా రాజకీయ రచ్చ సాగుతోంది. ఇక ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు జిల్లా పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. చంద్ర‌బాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి మ‌రీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి మ‌రీ జ‌గ‌న్ మీద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశాంతి పెరుగుతోంద‌ని కాబ‌ట్టి ఆర్టికల్ 356ను పెట్టి ఏపీలో వెంట‌నే రాష్ట్రపతి పాలన విధించాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు.  ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చంద్రబాబు రాష్ట్ర‌ప‌తిని కలిసి చేసిన ఫిర్యాదు మీద కూడా గ‌వ‌ర్న‌ర్ తో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు చేసిన దాడుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. పెరిగిపోతున్న అప్పుల మీద అటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ప‌లు సార్లు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉంది. గ‌తంలో అప్పులు తెచ్చుకోవ‌డం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం గవర్నర్ పేరును చేర్చ‌డంపై గ‌వ‌ర్న‌ర్ చ‌ర్చించే ఛాన్స్ ఉంది. మొత్తంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఎంపీ గల్లా జయదేవ్ ఎక్కడ? ప్రజా సమస్యలు వదిలేశారా.. పాలిటిక్స్ కు దూరమయ్యారా?

ఏపీ రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అమరావతి రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. అమరావతి నుంచి తిరుపతి వరకు సాగుతున్న యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. తొలి రోజు వందల్లో మొదలైన రైతుల పాదయాత్ర ఇప్పుడు వేల్లలోకి చేరింది. రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. హైకోర్టు న్యాయవాదులు సైతం రైతుల పాదయాత్రలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కాని స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ మాత్రం కానరావడం లేదు. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్ ను గడగడలాడించిన గల్లా.. ఇప్పడు ఎక్కడున్నారో ఎవరికి తెలియడం లేదు. అమరావతి రైతుల పాదయాత్రలో ఆయన ఎందుకు పాల్గొనడం లేదన్నది చర్చగా మారింది.  ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో గల్లా జయదేవ్‌ ఒకరు. వైసీపీ హవాలోనూ వరుసగా రెండోసారి గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విభజన హామీలపై లోక్‌సభలో ప్రధాని మోదీని మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అని సంభోదించి పాపులారిటీ సంపాదించారు జయదేవ్‌. టీడీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కొంతకాలం దూకుడుగా వెళ్లిన ఆయన… ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గుంటూరులో అడ్రస్‌ లేరు.. టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. జయదేవే కాదు.. ఆయన తల్లి గల్లా అరుణకుమారి సైతం ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో వారికేమైంది? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అనేది చర్చగా మారింది.  ఇటీవల బోసడీకే అంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయి. దాడులకు నిరసంగా చంద్రబాబు లో 36 గంటలపాటు దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచ్చారు. కానీ ఎక్కడా గల్లా జయదేవ్‌  కనిపించలేదు. దాడులను ఖండిస్తూ ప్రకటన లేదు. చంద్రబాబు దీక్షకు రాలేదు. చంద్రబాబుతోపాటు ఢిల్లీ వెళ్లిన బృందంలోనూ జయదేవ్‌ లేరు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన బెజవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం మనసు మార్చుకుని చంద్రబాబు దీక్షకు వచ్చారు.. మాట్లాడారు. పార్టీ అధినేతతో కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారుతారునకున్న ఎంపీ కేశినేని నాని యాక్టివ్ అయ్యారు.. మరి మరో ఎంపీ గల్లా జయదేవ్ ఎందుకు కనిపించడం లేదు, టీడీపీ కార్యక్రమాల్లోనూ ఎందుకు పాల్గొనడం లేదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.  అమరరాజా సంస్థ గల్లా కుటుంబానిదే. తండ్రి రామచంద్రనాయుడు నుంచి పూర్తిస్థాయిలో వ్యాపార బాధ్యతలు స్వీకరించి అమరరాజా సీఎండీ అయ్యారు జయదేవ్‌. ఇటీవలే అమరరాజా సంస్థను సమస్యలు చుట్టుముట్టాయి. కాలుష్యాన్ని వెదజల్లుతోందని ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో పొల్యూషన్‌ బోర్డు అధికారులు వరసగా నోటీసులు జారీ చేశారు. కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని నీరు కలుషితం అవుతోందని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆరోపణ. ఈ వివాదం సంస్థ క్లోజర్‌ నోటీసులు ఇచ్చే వరకు వెళ్లింది. దీంతో హైకోర్టు తలుపు తట్టింది అమరరాజా సంస్థ. అక్కడ ఊరట లభించింది. ఆ వివాదం అలా ఉండగానే సొంతూరు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో గల్లా కుటుంబంపై భూఆక్రమణ కేసులు నమోదయ్యాయి.  తన వ్యాపార సంస్థలపై వరుసగా జరుగుతున్న  పరిణామాలు గల్లా కుటుంబాన్ని కలిచి వేసినట్టుగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని గల్లా ఫ్యామిలీ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. అందుకే యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరమైనట్టు ప్రచారం జరుగుతోంది. జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో జయదేవ్‌ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కారణం ఏదైనా తల్లి అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం.. జయదేవ్‌ సైలెంట్‌ కావడంతో వారి రాజకీయ భవిష్యత్‌ వ్యూహం ఏంటన్నది ప్రశ్నగా మారింది. మరికొంతమంది మాత్రం ఆయన బీజేపీ గూటికి చేరుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి గల్లా జయదేవ్ వ్యవహారం టీడీపీకి ఇబ్బందిగా పరిణమించింది. 

హరీష్ కు కేసీఆర్ చెక్ పెడుతున్నారా? అచ్చిరాని ఆరోగ్యశాఖ అందుకేనా? 

తెలంగాణ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేశారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. మంత్రివర్గ శాఖలో మార్పులపై ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఇకపై ఆర్థికశాఖతో పాటు వైద్య శాఖను చూడబోతున్నారు హరీష్ రావు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది. హరీష్ రావుకు ఆరోగ్య శాఖ అప్పగించడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. హరీష్ రావును కేసీఆర్ టార్గెట్ చేశారని, అందుకే అచ్చిరాని ఆరోగ్య శాఖను కేటాయించారని కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ఆరోగ్య శాఖ గండంగా మారిందని, ఆ శాఖ నిర్వహించిన వారు తర్వాత తమ పదవిని కోల్పోయారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి హెల్త్ మినిస్టర్ గా తాటికొండ రాజయ్య పని చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ వైద్యశాఖను చూశారు. అయితే కొన్ని రోజుకే అవమానకరమైన రీతిలో ఆయన తన పదవిని కోల్పోయారు. రాజయ్య తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డికి వైద్యశాఖ కట్టబెట్టారు.  అయితే 2018లో లక్ష్మారెడ్డి గెలిచినా ఆయన కేబినెట్ బెర్త్ దక్కలేదు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకా చాలా రోజుల వరకు వైద్యశాఖ ఖాళీగా ఉంది. తర్వాత ఈటల రాజేందర్ కు వైద్యశాఖను కేటాయించారు కేసీఆర్. అయితే రెండేండ్లు మాత్రం రాజేందర్ వైద్యశాఖను నిర్వహించారు. గత జూలైలో భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి వైద్యశాఖ ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు వైద్యశాఖను నిర్వహించిన వారంతా తిరిగి పదవి దక్కించుకోలేకపోయారు. దీంతో తెలంగాణలో వైద్యశాఖ ఐరెన్ లెగ్ శాఖ మారిందనే చర్చ ఉంది.  2014 నుంచి జరిగిన పరిణామాల ఆధారంగానే హరీష్ రావు విషయంలో చాలా మంది ఇలా కామెంట్లు చేస్తున్నారు. హరీష్ రావుకు కావాలనే అచ్చిరాని ఆరోగ్యశాఖను ఇచ్చారంటున్నారు. వైద్యశాఖను తీసుకుంటే.. ఇక వచ్చే ఎన్నికల తర్వాత హరీష్ రావు పదవి కోల్పోవడం ఖాయమని కొందరు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ తర్వాత కేసీఆర్ టార్గెట్ హరీష్ రావేననే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. తాజా పరిణామంతో హరీష్ రావు రాజకీయ జీవితాన్ని ఖతం చేసేందుకే వైద్యశాఖను కేసీఆర్ కేటాయించారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.  

బిగ్ బ్రేకింగ్ : హరీష్ రావుకు ఈటల రాజేందర్ శాఖ!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు మరో కీలక శాఖ అప్పగించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖను హరీష్ రావుకు అప్పగిస్తూ గవర్నర్ కు ఫైలు పంపారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించనున్నారు హరీష్ రావు.  జూన్ లో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. దళితుల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో ఈటలను తొలగించారు. తర్వాత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. ఇటీవలే జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు హరీష్ రావు. ఇప్పుడు ఈటల నిర్వహించిన శాఖనే హరీష్ రావుకు ముఖ్యమంత్రి అప్పగించడం ఆసక్తిగా మారింది. 

కుప్పంలో రచ్చ.. మంత్రికి సెగ.. గులాబీ గర్జన వాయిదా.. టాప్ న్యూస్@7PM

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే గవర్నర్ల సదస్సుకు బిశ్వభూషణ్ హాజరుకానున్నారు.  బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని గవర్నర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు గవర్నర్ రానున్నారు. ----------- వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కుప్పంలో కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నామినేషన్లు వేయకుండా దారికాచి అడ్డుకున్నారని, ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.  ---- భువనేశ్వర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్  సమావేశమయ్యారు. ప్రధానంగా మూడు అంశాలపై నవీన్ పట్నాయక్ తో చర్చించారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాలే అజెండాగా ఈ సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి ఉభయ రాష్ట్రాల సీఎస్ లతో జాయింట్ కమిటీ వేయాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. ఈ మేరకు సీఎం జగన్, నవీన్ పట్నాయక్ సంయుక్త ప్రకటన చేశారు. ---- మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్‌మీట్‌ను విజయవాడలో విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. అనంతపురంలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేసారు. విద్యార్థులపై దాడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాయి. విద్యార్థి సంఘాలకు వివరణ ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నం చేసారు.   --------- రాష్ట్రంలో అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలని, రెండు సామాజిక వర్గాలకు పరిమితం కాకూడదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువులు రెట్లు మండిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కారుచౌకగా హెరాయిన్ వంటి మత్తు పదార్ధాలు దొరుకుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు --------- ఈ నెల 29న వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ  మరోసారి వాయిదా పడింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో సభ వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 15నే వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని భావించారు. అయితే దీక్షా దివస్ నేపథ్యంలో ఈ నెల 29కి వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇది కూడా వాయిదా పడింది. ------ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దళితబంధు ఇవ్వకుంటే ప్రగతి భవన్‌లో చావు డప్పు తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన బీజేపీ డప్పు మోత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నిక స్ఫూర్తితో దళితుల కోసం జరిగే ప్రతి పోరాటంలో పాల్గొంటానని ఈటల హామీ ఇచ్చారు ----------- హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చుపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉభయ పార్టీలు పెట్టిన ఖర్చు కంటే... హుజురాబాద్‌లో పెట్టిన డబ్బులు ఎక్కువని విమర్శించారు. దళితబంధు తరహాలో ఎక్కడా ఇంత డబ్బు వృథా అవ్వలేదన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో పెట్టాల్సిన డబ్బును.. ఇలా ఇవ్వడం అనైతికమన్నారు. --------- రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అత్తరును విడుదల చేశారు. 2022లో ఈ సెంటు అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పారు. 22 సహజసిద్ధ సుగంధాలతో తయారు చేసిన దీనికి ‘సమాజ్‌వాదీ అత్తరు’ అని పేరు పెట్టారు. దీనిని ఎరుపు, ఆకుపచ్చ రంగులు కలిసిన గాజు సీసాలలో ఉంచి, పైన సైకిలు గుర్తును ముద్రించారు. దీని కవరుపై అఖిలేశ్ బొమ్మ కూడా ఉంది. ------- జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు కోహ్లీ చెప్పాడు. కెప్టెన్‌గా గత ఆరేడేళ్లుగా విపరీతమైన భారం, పని ఒత్తిడి అనుభవించానని చెప్పాడు. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో బాగా రాణించలేదని తెలుసని పేర్కొన్న కోహ్లీ.. తమ ఆటగాళ్లు మాత్రం అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించాడు. తొలి రెండు ఓవర్లలో బాగా ఆడిన జట్టే పైచేయి సాధిస్తుందని, తొలి రెండు మ్యాచుల్లో అలా ఆడకపోవడమే తమ కొంప ముంచిందని అన్నాడు. 

చిక్కుల్లో హీరో అల్లు అర్జున్.. టీఎస్ ఆర్టీసీ లీగల్ నోటీస్

మెగా హీరో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు లీగల్ నోటీస్ రావడం కలకలం రేపుతోంది. టియస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇంతకీ వివాదం ఏటంటే... రాపిడో సంస్థ కోసం యాడ్ లో నటించారు హీరో అల్లు అర్జున్. అందులో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని చెప్పారు. దీనిపైనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం చెప్పారు. యూట్యూబ్ లో  ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సుల గురించి  అల్లు అర్జున్ ప్రజలకు అలా చెప్పడం సరికాదని అన్నారు.‌ ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని సజ్జనార్ అన్నారు.  టిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం ,  ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరని సజ్జనార్ స్పష్టం చేశారు. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలి. టిఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని, అందుకే నటునికి,  ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నామని చెప్పారు.

కుప్పంలో బుల్లెట్ దాడి.. వైసీపీ ఆగ‌డాల‌పై చంద్రబాబు సీరియ‌స్‌

ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టిస్తున్నారంటూ వైసీపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. గత స్థానిక సంస్థల ఎన్నికలను పోలీసుల సహకారంతో వైసీపీ ప్రహసనంగా మార్చి వేసిందన్నారు. ఈ సారి కూడా నామినేషన్లు, విత్ డ్రాలలో అక్రమాలు జరిగాయని మండిప‌డ్డారు.  ‘‘కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదు.. ఇక్కడ గతంలో గొడవలు జరిగిన సందర్భం లేదు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వెంకటేశ్‌ను బుల్లెట్‌తో ఢీకొట్టి అతని వద్ద ఉన్న పత్రాలు లాక్కెళ్లారు. పోలీసుల సాయంతో రెండో రోజు నామినేషన్‌ వేశారు. కానీ, తుది అభ్యర్థుల జాబితాలో వెంకటేశ్‌ పేరు తీసేశారు. అమర్నాథ్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఈడ్చుకెళ్లారు. తప్పు చేసింది కాక... మళ్ళీ టీడీపీ నేతలపై కేసులు పెడతారా.?. నాకు దండ వేశాడని పుంగనూరులో రమణా రెడ్డి అనే వ్యక్తి ప్రహరీ గోడను కూల్చి వేశారు. గోడ కూల్చిన వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే సాక్ష్యాధారాలతో దోషులుగా నిలబెడతాం’’ అని చంద్రబాబు హెచ్చ‌రించారు.   కుప్పంలో దళితులు, BC వర్గాలను ఎన్నికల్లో అడ్డుకున్నారని చంద్ర‌బాబు చెప్పారు. అభ్యర్థుల సంతకాలు లేకుండా విత్ డ్రా అయినట్టు ఎలా ప్రకటిస్తారని.. నామినేషన్‌లు విత్ డ్రా తరువాత కుప్పంలో ఫైనల్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని ప్ర‌శ్నించారు. ఇక‌, తాము నామినేషన్ వెనక్కి తీసుకోలేదని కుప్పం 14వ వార్డుకు నామినేషన్ వేసిన అభ్యర్థులు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ప్ర‌క‌టించారు.  టీడీపీ నేతలు తమను కిడ్నాప్‌ చేశారనేది అవాస్తవమని 14వ వార్డు అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన ఎం.ప్రకాశ్‌, అతని భార్య తిరుమగళ్‌ మీడియాకు వివరించారు. కుప్పం నుంచి మంగళగిరి వచ్చిన వారు చంద్రబాబును కలిశారు. కుప్పంలో తాము నామినేషన్లు విత్‌డ్రా చేసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘నామినేషన్‌ వేసిన తర్వాత మేం సొంత పనిపై ఊరెళ్లాం. మమ్మల్ని కిడ్నాప్‌ చేసినట్టు టీవీలో చూసి ఆశ్చర్యపోయాం. మమ్మల్ని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని వీడియో మెసేజ్‌ ద్వారా తెలిపాం. అకారణంగా మా నామినేషన్లు తిరస్కరించారు. మాకు న్యాయం చేయాలి. మా కుటుంబాన్ని వైసీపీ నేతలు బెదిరించారు. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తాం’’ అని 14 వార్డు అభ్యర్థులు తెలిపారు.    

పాక్‌లో హిందూ టెంపుల్ వివాదం.. ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇమ్రాన్ ప్ర‌భుత్వం

అస‌లే పాకిస్తాన్‌. మ‌త ఛాంద‌స దేశం. హిందువులంటే ఫుల్ ధ్వేషం. అలాంటి పాక్ గ‌డ్డ‌పై ఐదేళ్ల క్రితం తొలిసారిగా మందిరం నిర్మాణానికి స్థ‌లం కేటాయించింది అక్క‌డి ప్ర‌భుత్వం. భూమి అయితే ఇచ్చారు కానీ.. అందులో టెంపుల్ క‌ట్ట‌నీయ‌కుండా అనేక కొర్రీలు పెడుతూ వ‌చ్చారు. పాక్ పౌరులు హిందూ టెంపుల్‌కు అనుకూలంగా ఉద్య‌మించారు. విష‌యం ఇస్లామాబాద్ హైకోర్టు వ‌ర‌కూ వెళ్లింది. ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరిగింది. చివ‌రాఖ‌రికి మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. పాకిస్తాన్‌లో అస‌లేం జ‌రిగిందంటే... ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా మందిర నిర్మాణం కోసం 2016లో అర‌ ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇందులో మందిరంతో పాటు కమ్యూనిటీ సెంటర్, హిందూ స్మశాన వాటికను నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీడీఏ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. మందిర నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ) స్వాధీనం చేసుకుంది.  మందిర స్థ‌లం స్వాధీనంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. ఇస్లామాబాద్‌లో నిరసనలు వ్యక్త మయ్యాయి. నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో సీడీఏ దిగిరాక తప్పలేదు. మందిరానికి కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు నిర్మాణాలకు సముఖత వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. తాము ఎవరికీ వ్యతిరేకంగా వ్యవహరించలేదని, కొన్ని కారణాల దృష్ట్యా నిర్మాణాల్ని అడ్డుకున్నామని సీడీఏ చెప్పింది. విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలతో పాటు ప్రార్థనా మందిరాల నిర్మాణాలను కూడా నిలిపివేసినట్లు సీడీఏ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆల‌య నిర్మాణ స్థ‌ల వివాదం తొల‌గిపోయిన‌ట్టైంది.   

మ‌ళ్లీ ఉద్య‌మ నేత‌గా కేసీఆర్‌.. బీజేపీని త‌రిమి కొట్టేలా వ్యూహం!

రెండు ప్రెస్‌మీట్లు. రెండే రెండు ప్రెస్‌మీట్ల‌తో కేసీఆర్‌లో మ‌ళ్లీ మునుప‌టి ఉద్య‌మ నేత క‌నిపించార‌ని అంటున్నారు. తెలంగాణ ఉద్య‌మ స్పూర్తితో మ‌ళ్లీ ఉద్య‌మిద్దామ‌ని పిలుపు ఇస్తున్నారు. రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంభిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌రిమి కొడ‌తామంటున్నారు. పెట్రో ధ‌ర‌లు పెంపున‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాల‌తో దుమ్ము రేపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇవ‌న్నీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కేసీఆర్ అసలు రూపం చూపిస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్‌ను ఇలాగే చూడాలని రాష్ట్రంలోని అందరూ కోరుతున్నారని అన్నారు.  పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మన అభివృద్ధి కనిపిస్తోందని కానీ.. మన పక్కనున్న వారికి తెలియడం లేదని మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కళ్లుండి చూడలేని కబోదులు ఇక్కడి బీజేపీ నేతలని మండిప‌డ్డారు. ఢిల్లీ బీజేపీ నేతలు వరి వేయొద్దంటారు కానీ, ఇక్కడి సిల్లీ బీజేపీ నేతలు వరి వేయాలంటారని కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు.  ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్‌పైనా విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని  కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అనడానికి కాంగ్రెస్‌కు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీల లిస్ట్ ఇదే..! 

ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీలు మూడు కాగా... స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పదకొండు. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు మొదలు కాగా.. స్థానిక సంస్థల కోటాలోని 11 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పెద్దల సభకు కొత్తగా ఎంపిక అయ్యేది ఎవరు.. ఎవరికి అవకాశం దక్కనుంది అనే చర్చ సాగుతోంది.  అసెంబ్లీలో ఉన్న బలాబలాల ఆధారంగా ఎమ్మెల్యే కోటాలో మూడు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజార్టీ సాధించటంతో ఆ 11 స్థానాలు వైసీపీనే గెలవనుంది. దీంతో మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారు చేశారని అంటున్నారు, గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈ సారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలతో కొందరికి జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.   గుంటూరు జిల్లా చిలకూలురు పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఈసారి మండలి బెర్త్  ఖాయమని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న మర్రికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు జగన్. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం మర్రిని మంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా మర్రికి మాత్రం న్యాయం జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి మర్రికి ఖాయమని ప్రచారం జరగడం.. చివరకు ఆయనకు షాక్ తగలడం కామన్ గా మారింది. ఈసారి మాత్రం మర్రి రాజశేఖర్ కు సీటు ఖాయమైందని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి మరో సీటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఖాయమని తెలుస్తోంది. ఉమ్మారెడ్డి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.. ఆయనను ఎమ్మెల్సీగానే పంపే ఛాన్స్ కనిపిస్తోంది.  కృష్ణా జిల్లా నుంచి గన్నవరం నియోజకర్గ నేతలకే దక్కే అవకాశం ఉంది.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంశీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేశారు. వంశీ చేరిక తర్వాత నియోజకవర్గంలో రెండు వర్గాల ఆదిపత్య పోరు సాగుతోంది. దీంతో యార్గగడ్డను మండలికి పంపించి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండో స్థానం బీసీలకు దక్కనుందని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు ఎమ్మెల్సీ ఖాయమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.  ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు శాసనమండలి బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. ఆమంచి గత ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయారు. తర్వాత ఆమంచిపై గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చిన జగన్.. ఆమంచిని శాసనమండలికి పంపించి కరణంకు చీరాలలో ఇబ్బంది రాకుండా చూస్తున్నారని చెబుతున్నారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  విశాఖ నుంచి నామినేటెడ్ పదవి ఆశించిన వంశీకృష్ణ తో పాటుగా వరుదు కళ్యాణి కి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన..తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారు అవుతుందని చెబుతున్నారు.అనంత ఉదయ భాస్కర్ తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.  అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ పార్టీ ఇన్ ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డికి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థికి ఖరారయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న భరత్ కు మండలి సీటు కన్మామ్ అయిందంటున్నారు. కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారని అంటున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు, హరిప్రసాద్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.   

భారీ వ‌డ్డీతో మ‌రో వెయ్యి కోట్ల అప్పు.. జ‌గ‌న్‌రెడ్డి కొంప ముంచేలా ఉన్నాడే..!

ఏపీ అప్పుల రాష్ట్రం. దివాళ అంచున చేరిన రాష్ట్రం. ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖున జీతాలివ్వ‌డ‌మే క‌ష్టం. న‌వ‌ర‌త్నాల‌కు నిధులు లేక‌.. అమ్మ ఒడిని అట‌కెక్కించే ప్ర‌య‌త్నం. కార్పొరేష‌న్ల పేరున రుణాలు తీసుకొని.. ప‌క్క‌దారి ప‌ట్టించే స్కీం. ఏపీ అప్పులు చూసి.. కొత్త‌గా అప్పులిచ్చేందుకు జంకుతున్నాయి ప‌లు ఆర్థిక సంస్థ‌లు. దీంతో.. ఆర్బీఐ ద‌గ్గ‌ర సెక్యూరిటీ బాండ్లు వేలం వేస్తూ నెట్టుకొస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. ఆ బాండ్లు కూడా కొనేవారు క‌రువ‌వ‌డంతో.. భారీ వ‌డ్డీ ఆశ‌గా చూపించి.. తాజాగా మ‌రో వెయ్యి కోట్ల అప్పు చేసింది ప్ర‌భుత్వం.  ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది. ఆర్బీఐ ద‌గ్గ‌ర‌ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు పొందింది. వేలంలో 5 రాష్ట్రాలు పాల్గొనగా.. ఏపీ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి మరీ ఈ రుణాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల‌కు 500 కోట్లు, 18 ఏళ్ల‌కు మరో 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఏపీకి 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మళ్లీ అదనపు రుణ పరిమితి కోసం కేంద్రం వద్ద ఆర్ధిక శాఖ అధికారులు పడిగాపులు కాస్తున్నారు. అదనపు రుణపరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెడపై పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డిఫాల్టర్‌ కత్తి వేలాడుతోంది. అప్పు అయితే చేస్తోంది కానీ.. వాటిని తిరిగి తీర్చే మార్గ‌మే క‌నిపించ‌డం లేదు. 17 ఏళ్ల కాల‌ప‌రిమితి కావ‌డంతో.. ఇప్పుడు వ‌డ్డీ క‌డితే స‌రిపోతుంది. అస‌లు ఇప్ప‌టికిప్పుడు తీర్చాల్సిన ప‌నిలేదు. దీంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ తాను గెలిచేది లేదు.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేదీ లేదూ.. 17 ఏళ్ల త‌ర్వాత ఎవ‌రు ఉంటారో ఏమో అనుకుంటూ.. ఏపీ ప్ర‌జ‌ల నెత్తిన వేల కోట్ల అప్పు రుద్దేస్తున్నారు. తెచ్చిన డ‌బ్బుల‌న్నీ రాష్ట్ర‌ అభివృద్ధికి కాకుండా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ప‌ప్పు-బెల్లంలా పంచేస్తుండ‌టంతో రుణాల‌న్నీ నిష్ప‌యోజ‌నంగా మారుతున్నాయి. ఏపీ మ‌రింత దివాళ తీస్తోంది..అంటున్నారు.   

బిగ్ బ్రేకింగ్: టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా

అనుకున్నట్లే జరిగింది. రాజకీయ వర్గాలు అనుమానించినట్లే టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా పడింది. వరంగల్ శివారు దేవన్నపేటలో నవంబర 29న తలపెట్టిన విజయగర్జన సభకు వాయిదా వేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఉంది దీంతో ఎన్నికల కోడ్ కారణంగా విజయగర్జన సభకు వాయిదా వేశామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.   విజయగర్జన సభే కాదు బుధవారం జరగాల్సిన కేసీఆర్ వరంగల్ నగర పర్యటన కూడా రద్దైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం కేసీఆర్  పర్యటన రద్దైందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.బుధవారం సీఎం పర్యటన కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి టీఆర్ఎస్ విజయగర్జన సభ మొదట నవంబర్15నే జరపాలని నిర్ణయించారు. తర్వాత దీక్షా దివస్ రోజున జరపాలని నిర్ణయించి నవంబర్ 29కి మార్చారు. అయితే సభ కోసం స్థలం దొరకకపోవడంతోనే 15 నుంచి 29కి మార్చారనే చర్చ వచ్చింది. దేవనపేట సభకు స్థల సేకరణ కూడా అదికార పార్టీ నేతలకు తలనొప్పిగానే మారింది. టీఆర్ఎస్ సభ కోసం తమ భూములు ఇచ్చేది లేదని స్థానిక రైతులు తేల్చి చెప్పారు. సభ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన గులాబీ లీడర్లను అడ్డుకున్నారు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికి కూడా సభ కోసం స్థలాన్ని టీఆర్ఎస్ నేతలు సేకరించలేదని తెలుస్తోంది. ఇది కూడా విజయగర్జన సభ వాయిదా కారణం కావచ్చని భావిస్తున్నారు.