కుప్పంపై చంద్రాగ్రహం.. దళితబంధుపై ధూంధాం.. జై భీమ్‌లో రఘురామ.. టాప్‌న్యూస్@7pm
posted on Nov 5, 2021 @ 6:53PM
1. ఏపీ ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని తెలిపారు. 30 మంది వైసీపీ గుండాల దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారని, వెంకటేశ్ నామినేషన్ పత్రాలు చించివేసి.. ఫోన్ లాక్కొన్నారని, దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు చంద్రబాబు జతచేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
2. విద్యుత్ ఒప్పందాలు గంటల్లోనే జరిగిపోతున్నాయని, ఆగమేఘాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. 9వేల మెగావాట్లకు గ్రిడ్ సెక్యూరిటీ ఉందని ఎలా చెబుతున్నారు? రూ.2.49కి ఇంకా ఎంత అదనంగా చెల్లిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో విద్యుత్ ధరలు తగ్గే పరిస్థితి వస్తుంటే ఏపీలో భిన్నంగా ఉందని మండిపడ్డారు పయ్యావుల.
3. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలంటూ నవంబర్ 9న ఆందోళనలకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4 తర్వాత దళితబంధును ఎవరు ఆపలేరన్న సీఎం కేసీఆర్.. తన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 9న దళితబంధు ఆందోళనలు, 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్‌తో ఉద్యమ కార్యచరణకు సిద్ధమవుతున్నారు కమలనాథులు.
4. దళితబంధును ఆపిందే బీజేపీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బండి సంజయ్ ఏ అర్హతతో దళితబంధుపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉపఎన్నిక ఫలితంపై ఆత్మ పరిశీలన చేసుకుంటామన్నారు. బీజేపీలో ఈటల కొనసాగడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఉపఎన్నిక ఫలితాలు తమ పాలనకు రిఫరెండం కాదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.
5. పెట్రోల్, డీజిల్‌పై ఏపీ ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కనీసం అలాంటి ఆలోచనైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. వ్యాట్ సహా అదనపు పన్ను, సెస్సులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని తప్పుబట్టారు.
6. ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "జై భీమ్ సినిమా చూశాను. ఆ సినిమాలో గిరిజన యువకుడిని హింసిస్తూ ఉన్న పరిస్థితి.. నాకు జరిగిన ఘటన.. ఒకేలా ఉన్నట్లు అనిపించింది. పరిస్థితులు పెద్దగా మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. గిరిజనుడ్ని కొట్టారు.. గిరిజనుడికి దిక్కేంటని లాయర్ వచ్చారు. నేను ఎంపీ, ఇప్పుడు నాకే దిక్కులేదు’’ అని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.
7. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మజీ మంత్రి హరి రామ జోగయ్య లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపు కులాలకు ప్రత్యేకించారని, దీన్ని పక్కనపెట్టే విధంగా మరో జీవోను వైసీపీ సర్కార్ ఇవ్వడం విచారకరమన్నారు. కాపుల పట్ల చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని కోరారు. ఈ డబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని హరి రామ జోగయ్య డిమాండ్ చేశారు.
8. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెనుబూతం డ్రగ్స్ అని, హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టులో అక్రమంగా దిగుమతి అవుతున్న.. క్రూడ్ ఆయిల్ దొంగ వ్యాపారం చేస్తున్నదెవరని ప్రశ్నించారు. గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి.. గిరిజన యువకులపై కేసులు పెట్టడం పోలీస్ శాఖకు అవమానమన్నారు. వివేకా హత్యకేసు వివరాలను సీబీఐ బయటపెట్టాలన్నారు హర్షకుమార్.
9. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ రవాణాకు విజయవాడ అడ్రెస్‌ను రెండుసార్లు ఉపయోగించారని, రాకెట్ అంతా ఢిల్లీ కేంద్రంగా జరిగిందన్నారు. బెజవాడలో యాక్టివ్‌గా ఉన్న 18 మంది రౌడీ షీటర్లను బహిష్కరించామని, కొత్తగా 116 మందిపై రౌడీ షీట్స్ తెరిచామని సీపీ తెలిపారు.
10. అనంతపురంలో మాజీ విద్యార్థి సంఘం నేత తిరుపాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పది రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆయన పాడుబడ్డ బావిలో శవమై తేలి కనిపించాడు. కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉండడంతో హత్యగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.