కోహ్లీ సేనకు షాక్... ఆప్ఘన్ పై గెలుపుతో సెమీస్ కు కివీస్..

భారత అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. కోహ్లీసేన టీట్వంటీ వరల్డ్ కప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆప్ఘనీస్తాన్ గెలుపుపైనే భారత ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ పై న్యూజీలాంగ్ ఈజీగా విక్టరీ కొట్టింది. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే వరల్డ్ కప్ నుంచి కోహ్లీ సేన నిష్క్రమణ ఖాయమైంది. సోమవారం నమీబియాతో భారత్‌ పోరు నామమాత్రంగా మిగిలిపోయింది.  టీమ్‌ఇండియా ఆశలను చిదిమేస్తూ.. అఫ్గానిస్థాన్‌ మీద విజయంతో న్యూజిలాండ్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అన్ని విభాగాల్లో రాణించి అఫ్గానిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 124 పరుగులకే కట్టడి చేసిన కివీస్‌.. అనంతరం కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ (40), కాన్వే (36), మార్టిన్‌ గప్తిల్ (28), మిచెల్‌ (17) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో గ్రూప్‌-2లో రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్ తీశారు.    మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ అద్బుతంగా ఆడి 73 పరుగులు చేశాడు. అఫ్గాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మహమ్మద్‌ షహజాద్ (4), హజ్రతుల్లా జజాయ్‌ (2)తోపాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ గుర్బాజ్‌ (6) విఫలమయ్యారు. అనంతరం వచ్చిన నయీబ్‌ (15)తో కలిసి నజీబుల్లా ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.   ఈ ఇద్దరూ కుదురుకుంటున్న సమయంలో నయీబ్‌ను సోధి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ నబీ (14) దూకుడుగా ఆడలేకపోయినా నజీబుల్లాకు చక్కటి సహకారం అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోవడంతో అఫ్గాన్‌ మళ్లీ కష్టాల్లో పడింది. 115/4తో ఉన్న అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ బౌలర్లు దెబ్బతీశారు. నబీ, నజీబుల్లా, కరీమ్‌ (2)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చారు. దీంతో అఫ్గానిస్థాన్‌ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, సౌథీ 2.. మిల్నే, సోధి, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు.    

చిల్లరగా మాట్లాడితే నాలుక కోస్తాం... విపక్షాలకు కేసీఆర్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఉగ్రరూపం చూపించారు. విపక్షాలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించి, అందుకు అనువైన విత్తనాలు కూడా తెప్పించామని అన్నారు.యాసంగి ధాన్యంలో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని, యాసంగి ధాన్యం నాణ్యంగా ఉండడంలేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) చెబుతోందని తెలిపారు. యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనలేమని చెబుతోందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక అభ్యంతరాలు పెడుతోందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం కరాఖండిగా చెబుతోందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామని, వేరుశనగ, చిరుధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు."పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. మీరు వరి పంటనే వేయండి... ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తాం అంటూ రైతులకు చెబుతున్నాడు. ఎవరి మెడలు వంచుతాడు? ఆయనే మెడ వంచుకుంటాడా? లేక కేంద్రం మెడలు వంచుతాడా? ఈయన ఓ ఎంపీ. చాలారోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ క్షమిస్తున్నా. నా స్థాయికి తగిన మనిషి కాదు.. నాకంటే చిన్నవాడు. నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతున్నాయని పట్టించుకోలేదు. కానీ ఏడేళ్లుగా మేం రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా, రైతులను తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తుండడంతోనే స్పందించాల్సి వస్తోంది. ఈ పనికిమాలిన మాటలు నమ్మి వరి పంట వేస్తే చాలా కష్టం. వరి కొనబోమని కేంద్రం తెగేసి చెబుతోంది. రైతులను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఇవాళ రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు నష్టపోరాదనే వరి వద్దని మంత్రి చెప్పారు" అని కేసీఆర్ వివరించారు.యాసంగిలో వరి వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారన్నారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వద్దన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలు, చాలా కకావికలమైన వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్‌ జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్‌కు రావడం.. దారుణ పరిస్థితులుండేవన్నారు. రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ప్రజలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాన్ని అధికార రూపంలో కట్టబెట్టారన్నారు. స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మకమైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి.. పల్లెలు చల్లగా ఉండేటట్లు చేయాలి.. వృత్తి పనులందరికీ పనులు దొరకాలని అనే స్పష్టమైన పాలసీని తీసుకున్నామన్నారు. ఆ దిశలో బలమైన అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు. అందులో మొట్టమొదట మొదలు పెట్టింది.. అడుగంటి పోయిన భూగర్భ జలాలను పెంచేందుకు.. మిషన్‌ కాకతీయ పేరిట చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.

పెంచిన సన్నాసే తగ్గించాలి.. మేం వ్యాట్ తగ్గించం! బీజేపీపై కేసీఆర్ నిప్పులు..

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం కేసీఆర్. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని అన్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిందని, అప్పటినుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదని తెలిపారు. ఓసారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని వివరించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్ధాలు చెప్పిందని కేసీఆర్ ఆరోపించారు.  రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని కేసీఆర్ వివరించారు. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని, ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ మినిస్టర్ ఏకంగా పత్రికా ప్రకటన ఇచ్చారని వెల్లడించారు. "నాడు పెట్రోల్ ధర రూ.77 ఉంటే దాన్ని రూ.114 చేశారు. డీజిల్ ధర రూ.68 ఉంటే రూ.107 చేశారు. ఈ పెరుగుదల మొత్తం కేంద్రమే తీసుకుంటోంది. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ భారం మోపుతున్నారు. దానికితోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కంటితుడుపు చర్య కింద ఎక్సైజ్ సుంకం ఓ పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే ఓ ఘనకార్యం అన్నట్టు చెప్పుకుంటున్నారు. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత అని కేసీఆర్ మండిపడ్డారు.  ఇంత మోసం చేసి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెబుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేయాలి? మీరా? మేమా? ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నాం... చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 2014 నాటి ధర రూ.77కే ఇవాళ కూడా ఇవ్వొచ్చు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.

వరికి ఉరి.. తెరాస మెడకు చుట్టుకుంటుందా?

తెలంగాణలో అధికార తెరాసకు ఎదురుగాలి వీస్తోందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. విద్యార్ధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు ఉపాధ్యాయులు,ఇలా అన్ని వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రోజు రోజుకు ఎక్కువవుతోంది. కానీ, అందరి కంటే ఎక్కువగా రైతాంగంలో సర్కార్ పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వరి పంట విషయంలో పూటకో మాట మారుస్తున్న ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లేక్కుతున్నారు. చివరి గింజ వరకు కొంటామని మాటిచ్చి, ఇప్పుడు నెపాన్ని కేంద్ర ప్రభుత్వం, FCI మీద నెట్టి రాష్ట్ర ప్రభుత్వం, చేతులు దులిపేసుకోవడాన్ని రైతులు జీర్ణించుకోలేక  పోతున్నారు.  ఓ వంక కడుపు కాలిన రైతులు ఆగ్రహంతో రగిలిపోతుంటే, ఆర్థిక మంత్రి హరీష్ రావు, మంత్రి నిరంజన రెడ్డి బాధ్యతారహితంగా చేస్తున్న ప్రకటనలు అగ్గికి ఆజ్యం తోడైనట్లు చేస్తున్నాయని, రైతులు, రాజకీయ పార్టీలు ఆగ్రహం చేస్తున్నారు.ఈనేపధ్యంలోనే, ధాన్యం సేకరణకు సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుక  కాంగ్రెస్ బృందాలు జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. ధాన్యం  కొనాలంటూ  జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు.  సర్కార్  తీరుకు నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు  చేస్తున్నారు. వర్షాలకు  వడ్లు  తడిసిపోతున్నాయని  ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక... మిల్లులు దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ప్రారంభమైన ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వ ఆఫీసుల ముందు ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి  మండల వ్యవసాయ అధికారి ఆఫీస్ ముందు టోకెన్ల కోసం బారులు తీరారు రైతులు.తెల్లవారుజామున 4 గంటలకే చలిలో ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. కొందరు నిలబడలేక పొలం పాస్ బుక్కులు , ఆధార్ కార్డులు క్యూలైన్లో  పెడుతున్నారు. 4 రోజుల నుంచి  టోకెన్లు కోసం పడిగాపులు కాస్తున్నారు.  గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు లేక... మిల్లర్లు వడ్లు కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు రైతులు. అలాగే 15 రోజుల  కిందట  కేంద్రాలకు ధాన్యం  తీసుకొచ్చినా  కొనడం లేదని  ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు,  మిల్లర్లు  పట్టించుకోవడం లేదని .... హనుమకొండ  - సిద్దిపేట రహదారిపై దర్గాపల్లి గ్రామ  రైతులు  ఆందోళనకు దిగారు.దీంతో భారీగా వాహనాలు  నిలిచి పోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట్  మండలంలో  వరి  కొనుగోలు   చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు  ధర్నా చేశారు.  కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో  కామారెడ్డి-  సిరిసిల్ల ప్రధాన రహదారిపై అన్నదాతలు బైటాయించారు. పాత  నిబంధనల ప్రకారం   వడ్లు కొనుగోలు  చేయాలన్నారు.కొత్త రూల్స్ పెట్టి   వ్యవసాయాధికారులు  ధాన్యాన్ని  కొనడంలేదేని  రైతులు ఆగ్రహం  వ్యక్తం చేశారు.  ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడ ఉన్నా, ఇంతవకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎవరూ కూడా, కేంద్రం కొంటేనే  రాష్ట్ర ప్రభుత్వం కొంటుందనే మాట చెప్పలేదని, ఇప్పుడు కేంద్ర మీద నెపం నెట్టడం ఎంతవరకు సబబని రైతులు నిలదీస్తున్నారు. కేంద్రం ప్రస్తావన లేకుండా, చివరి గింజ  వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని కూడా రైతులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వరికి ఊరి తెరాస మెడకు చుట్టుకుంది. ఇదొక్కటే కాకుండా ఇతర సమస్యలు కూడా కమ్ముకొస్తున్న నేపధ్యంలో తెరాస ప్రభుత్వం ఏడేళ్ళలో తొలిసారిగా తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తోందని అంటున్నారు.  

బాబ్బాబు.. గెలవండి ప్లీజ్... ఆప్ఘన్లకు మద్దతుగా ఇండియన్స్  

టీట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కు ఆపద్భందువుగా మారింది ఆప్ఘనీస్తాన్. న్యూజీలాండ్ తో ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ గెలిస్తేనే టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు ఉంటాయి. అందుకే యావత్ భారత్ దేశం ఇప్పుడు ఆఫ్ఘన్ వెనుకే ఉంది. ప్రతి భారతీయుడూ ఆఫ్ఘనిస్థాన్ కు మద్దతుగా ఉంటున్నారు. మ్యాచ్ గెలవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆప్ఘనీస్తాన్ మ్యాచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ  జరగుతుంది. పెద్ద ఎత్తున  మీమ్స్ వైరల్ అవుతున్నాయి.  బాబ్బాబు.. గెలవండి ప్లీజ్ అంటూ ఆఫ్ఘన్ మ్యాచ్ పై ఇండియన్ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. టాలీవుడ్, సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. పలువురు క్రికెటర్లూ వీడియోలు పోస్ట్ చేసి మీమ్స్ సృష్టిస్తున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అప్పట్లో ఒకే ఒక్క అభిమాని ఉంటే.. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులున్నారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరికొందరు టామ్ అండ్ జెర్రీ ఫొటోలను షేర్ చేస్తున్నారు. నిజానికి ఆదివారం మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ గెలిచినా.. మన నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే మనం సెమీస్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం మన రన్ రేట్.. ఆఫ్ఘన్ కన్నా మెరుగ్గానే ఉన్నా ఆ జట్టు గెలిస్తే మనకన్నా మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి నమీబియాపై మనం భారీగా గెలవాల్సి ఉంటుంది. అయితే పసికూన నమీబియాపై మ్యాచ్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ పెంచుకోవడం కోహ్లీ సేనకు పెద్ద కష్టం కాదు. అందుకే న్యూజీలాండ్ పై ఆప్ఘనీస్తాన్ గెలవడమే ఇప్పుడు భారత్ అభిమానులకు అవసరం. 

వైసీపీ ర్యాలీలకు లేని రచ్చ అమరావతి రైతులకెందుకు! 

అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు స్పష్టించడం దుమారం రేపుతోంది. కొవిడ్ పేరుతో ఆంక్షలు విధించడంపై రైతులు, విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతలు జోరుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలకు అడ్డురాని కొవిడ్ రూల్స్.. అమరావతి రైతులకే వర్తిస్తాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులపై తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  జగన్  ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. రాజధాని కోసం మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అడ్డు చెప్పడాన్ని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు రచ్చ చేసేందుకు అడ్డురాని నిబంధనలు కేవలం అమరావతి రైతుల పాదయాత్రకే అడ్డొచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డంకిగా మారాయా? అని లోకేష్ ట్వీట్ చేశారు.  నడిరోడ్డుపై అధికార పార్టీ నేతలు రచ్చ చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదని నారా లోకేష్ నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు నోటీసులివ్వడమే పోలీసుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణచేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదన్నారు. యాత్రను అడ్డుకోవాలని చూస్తే.. మరింత ఉద్ధృతం అవుతుందని లోకేశ్ హెచ్చరించారు.

బీజేపీపై జగన్ సర్కార్ యుద్ధమా.. వ్యాట్ తగ్గించకుండా కుప్పిగంతులా?

పెట్రోల్, డీజిల్ ధరల చుట్టే ప్రస్తుతం దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. కేంద్ర సర్కార్ ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై ఐదు , లీటర్ డీజిల్ పై 10 రూపాయులు తగ్గింది. కేంద్రం తన పరిధిలోని పన్ను తగ్గించడమే కాదు.. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని సూచించింది. మోడీ సర్కార్ సూచనతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు చమురుపై వ్యాట్ తగ్గించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో 12 రూపాయల వరకు లీటర్ పెట్రోల్ పై ధర తగ్గింది. కాని తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించడం లేదు. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లలో ఏపీలో టాప్ 2లో ఉంది. అయినా ఏ మాత్రం వ్యాట్ తగ్గించడం లేదు జగన్ రెడ్డి సర్కార్.  పెట్రోల్, డీజిల్ పై ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ వ్యాట్ తగ్గించాలని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాట్ తగ్గించాల్సిన జగన్ ప్రభుత్వం.. కేంద్ర సర్కార్ పై యుద్ధం ప్రకటించడం దుమారం రేపుతోంది.  కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం టార్గెట్ గా  ఆదివారం ప‌త్రిక‌ల్లో పెద్ద సైజు యాడ్స్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సీఎం జ‌గ‌న్ ఫోటో వేసి మ‌రీ 'పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచింది ఎంత‌?. త‌గ్గించింది ఎంత‌?. లీటరు ధ‌ర 100 రూపాయ‌లు దాటించి ఐదో, ప‌దో త‌గ్గించాం అంటూ పెంచిన వారే రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న చేస్తామంటే ఇంత‌కంటే ఘోరం ఉంటుందా' అని ప్ర‌శ్నించింది. ఒక‌రేమో ఇబ్బడిముబ్బ‌డిగా పెంచి, అర‌కొర‌గా త‌గ్గించి ధ‌ర్నాలు అంటూ ఇప్పుడు రాజ‌కీయం చేస్తున్నారు. మ‌రొక‌రు త‌మ హ‌యాంలో ఎంత పెంచారు అన్న‌ది మ‌ర‌చి రాజ‌కీయం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాల‌న్న స‌దుద్దేశంతోనే, విన‌య‌పూర్వ‌కంగా అస‌లు నిజాలు మీ ముందు ఉంచుతున్నాం అంటూ యాడ్ లో పేర్కొన్నారు.  అంతే కాదు కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్, డీజిల్ పై 3,35,000 కోట్ల‌రూపాయ‌ల ప‌న్నులు వ‌సూలు చేసిన‌ప్ప‌టికీ అందులో రాష్ట్రాల‌కు పంచింది కేవ‌లం 19,475 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే. అంటే కేవ‌లం 5.80 శాతం. వాస్త‌వంగా కేంద్రం వ‌సూలు చేసే ప‌న్నుల్లో రాష్ట్రాల‌కు 41 శాతం వాటా పంచ‌వ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికి పెట్రో ఆదాయాన్ని డివిజ‌బుల్ పూల్ లోకి రాకుండా సెస్ లు, స‌ర్ ఛార్జీల‌రూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసి ఆ మేర‌కు రాష్ట్రాల‌కు ఇవ్వ‌వ‌ల‌సిన వాటా త‌గ్గించిన విష‌యం వాస్త‌వం కాదా? అని యాడ్ లో ప్రశ్నించింది జగన్ రెడ్డి ప్రభుత్వం.  పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. బిజెపి, టీడీపీ చేసే రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు కూడా ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధనం ఖ‌ర్చు పెట్టి ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో జాకెట్ యాడ్స్ ఇవ్వ‌టం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఇప్పటికే ఏపీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు యాడ్స్ తో స‌మాధానం చెప్పటం ఏమిటినే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్షాల విమ‌ర్శ‌ల్లో అవాస్త‌వాలు ఉంటే..పార్టీప‌రంగా..ప్ర‌భుత్వ‌ప‌రంగా వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌క‌ు  చెప్ప‌టంలో ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌రు. కానీ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు ప్ర‌జ‌ల సొమ్ముతో పేజీల‌కు పేజీలు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టంపై అధికారులు కూడా అవాక్కవుతున్నారు.  నిజంగానే ఏపీ స‌ర్కారు చెప్పిన‌ట్లు కేంద్రం ఇలా మోసం చేస్తే ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రానికి ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాయలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్ర‌మాల‌ను స‌రిదిద్దాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేయ‌టం కానీ..ప్ర‌భుత్వప‌రంగా, పార్టీప‌రంగా ఎక్క‌డైనా చేశారా? అని నిలదీస్తున్నారు. చ‌ట్టబ‌ద్దంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా రాక‌పోతే దీనిపై వైసీపీ చేసిన పోరాటం ఏమిటి? అని అడుగుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్న‌ట్లు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన హామీలు ఇవ్వ‌క‌పోతే బిజెపి స‌ర్కారు మ‌రో అన్యాయం చేస్తే వైసీపీ ఎందుకు మౌనంగా భ‌రిస్తున్న‌ట్లు? అన్నది తేలాల్సి ఉంది. అయినా పక్క రాష్ట్రాలు కేంద్రం బాటలోనే పన్నులు తగ్గించి వాహనదారులకు ఊరట కల్పిస్తే.. అలా చేయకుండా ఇలా యాడ్స్ తో ఎదురుదాడి ప్రారంభించడం ఏంటనే చర్చ  రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. ఇలాంటి చర్యలతో జనాల్లో మరింత చులకన కావడం ఖాయమని అంటున్నారు.  

భారత్ సెమీస్ చేరేనా! కివీస్- ఆఫ్గన్ మ్యాచ్ పైనే ఆశలు..

టీట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆడటం లేదు. భారత్ సెమీఫైనల్ అవకాశాలను డిసైట్ చేసే గేమ్ జరగబోతోంది. న్యూజీలాండ్, ఆప్ఘనీస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఇప్పుడు భారత్ అభిమానులకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో కివీస్ ఓడిపోతేనే కోహ్లీసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే కివీస్ పై ఆప్ఘనీస్తాన్ ఓడిపోవాలని భారత అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.  ఆదివారం జరిగే మ్యాచ్‌ లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలిచి.. న్యూజిలాండ్‌ ఓడితే.. ఆ రెండు జట్ల ఖాతాలో 6 పాయింట్లు చొప్పున ఉంటా యి. దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు నమీబియాను చిత్తుగా ఓడిస్తే భారత్‌ ఖాతా లోనూ 6 పాయింట్లు జమ అవుతాయి. దీంతో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన ఓ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ అనంతరం మరుసటి రోజు భారతజట్టు పసికూన నమీబియాతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్‌కు భారత్‌కు అవకాశం దక్కనుంది. ఒకవేళ అదే జరిగితే ఆఫ్ఘన్‌, న్యూజిలాండ్‌లను భారత్‌ అధిగమించి రెండో స్థానానికి ఎగబాకి సెమీస్‌కు చేరే అవకాశముంది. దీంతో టీమిండియా అభిమానులంతా నేటి మ్యాచ్‌పై దృష్టి పెట్టారు. ఆప్ఘనీస్తాన్ గెలవాలంటూ పూజలు చేస్తున్నారు.    న్యూజిలాండ్‌ ఓడితే ఎదుర్కోనున్న తీవ్ర పరిణామాలను గురించి పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తన యు-ట్యూబ్‌ చానల్‌లో వివరించాడు. ''ఆప్ఘన్‌తో పోరులో కివీస్‌ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్‌ అభిమానులు ఊరుకోరన్నాడు. ఒకవేళ అలా జరిగితే మాత్రం టీమిండియా సెమీస్‌కు వెళ్లాలని న్యూజిలాండ్‌ కావాలనే ఓడిపోయిదంటూ పాక్‌ క్రీడాభిమానులు ట్రోల్స్‌ చేయడం ఖాయమని, అలా జరగకూడదంటే ఆఫ్ఘన్‌పై కివీస్‌ విజయం సాధిస్తే సరిపోతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

పంట పొలాలు పాడు చేస్తారా? టీఆర్ఎస్ విజయోత్సవ వేడుకపై రచ్చ..

వినాయకుడి పెళ్లికి అన్నీ విఘ్నాలే అన్నట్లు టీఆర్ఎస్ విజయోత్సవ సభకు అడుగదుగునా విఘ్నాలే ఎదురవుతున్నాయి. నవంబర్ 15 సభ 29కి వాయిదా పడింది. ఆప్పుడైనా సభ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతుంటే, మరో వంక సభా ప్రాంగణం విషయంలో రైతులతో తలెత్తిన వివాదం, రాజకీయ రంగులు పులుముకుంటోంది. తెరాస, బీజేపీ మధ్య వివాదంగా మారుతోంది.  తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పార్టీ అక్టోబర్ 25న ఘనంగా ప్లీనరీ నిర్వహించుకుంది. ప్లీనరీకి కొనసాగింపుగా నవంబర్ 15న వరంగల్ లో విజయోత్సవ సభ నిర్వహించాలని, ఆ విధంగా భవిష్యత్ ప్రణాళికను ముందుకు తీసుకు పోవాలని తెరాస నాయకత్వం నిర్ణయించింది. అయితే ఈలోగా హుజూరాబాద్, ఉప ఎన్నికల్లో, కారు టైర్లు నాలుగూ ఒకేసారి  పంక్చర్ కావడంతో,  కారు బోల్తాకోట్టింది. సో ... న‌వంబ‌ర్ 29న దీక్షా దివ‌స్ నాడు 10 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భను నిర్వహించాలని పెద్దలు  నిర్ణ‌యించారు. అందుకోసం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో పంట పొలాలను ఎంపిక చేశారు. అయితే ఆ స‌భా ప్రాంగ‌ణానికీ రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుండటం క‌ల‌క‌లం రేపుతోంది. స‌భా ప్రాంగణం విషయంలో తలెత్తిన వివాదం అధికార పార్టీకి లోప్పిగా మారింది. విజయ గర్జన సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి త‌దిత‌రులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం వెళ్లన సమయంలో రైతులకు నేతలకు మధ్య వివాదం రాజుకుంది. గ్రామ శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్న ప్రజాప్రతినిధుల ద‌గ్గ‌ర‌కు.. బీజేపీ నేతృత్వంలో స్థానిక రైతులు నిర‌స‌న తెల‌ప‌డానికి వ‌చ్చారు. పంట పండే తమ పొలాలను సభ కోసం ఇచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులు,  అధికారుల ఓవర్యాక్షన్ సమస్యను జటిలం చేసింది. భూమి మీ జాగీరా…మీ పై కేసులు పెడతాం ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ సిఐ శ్రీధర్ రావు మహిళల పట్ల దురుసుగా మాట్లాడారు. అయినా సభ నిర్వహణకు స్థలం ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు.  అయితే తాజాగా తెరాస నాయకులు, అబ్బే అదేమ లేదని అంటున్నారు. అక్కడే పది లక్షల మందితో సభ జరుగుతుందని అంటున్నారు. పంట నష్టానికి రైతులకు పైసలు ఇస్తామని చెప్పిన తర్వాత రైతులు శాంతించారని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘తెలుగు వన్’కు తెలిపారు. బీజేపీ నాయకులు అనవసరంగా వివాదం సృషింటి సభను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నాయకులు అటున్నారు. నిజానికి, నవంబర్ 29న  అయినా సభ జరుగుతుందా లేక ఇంకొక శుభముహూర్తానికి వాయిదా పడుతుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అదే రోజున ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఆ కారణంగా సభ మరోమారు వాయిదా పడుతుందా అనే అనుమానాలున్నాయి. అయితే, ఆరుకు ఆరు సీట్లు అధికార పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉన్న దృష్ట్యా... ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డుకాకపోవచ్చని అంటున్నారు. అసలు పోలింగే ఉండక పోవచ్చని అంటున్నారు. అయితే, హుజూరాబాద్ దెబ్బకు  కుదేలైన అధికార పార్టీ అబునున్న విధంగా పది లక్షల మందితో విజయోత్సవ సభ నిర్వహించగలదా  అన్న అనపమానాలు అయితే పార్టీలో వినవస్తున్నాయి.

అమరావతి రైతుల పాదయాత్రపై కుట్రలా? పోలీసుల ఆంక్షలతో పర్చూరులో ఉద్రిక్తత.. 

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పినట్లే జరుగుతోంది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు స్పష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని రైతుల మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆంక్షలు విధించారు. పర్చూరులో కొల్లా వెంకట నారాయణ కళ్యాణ మండపం దగ్గర పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, చీరాల డీఎస్పీ శ్రీకాంత్, చీరాల రూరల్ సీఐ రోశయ్య తదితరులు వచ్చారు. పాదయాత్రలో అనుసరించాల్సిన 20 నియమాలను సీఐ రోశయ్య చదివి వినిపించారు. కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. మీడియా హాల్టింగ్ ప్రదేశాల్లో మాత్రమే కార్యక్రమాన్ని కవర్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే హైకోర్టుకు నివేదిస్తామని, పాదయాత్రను నిలిపివేస్తామని పోలీసులు చెప్పారు.  నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు మరోసారి హెచ్చరించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే యాత్ర సాగుతోందని ఐకాస నాయకులు ఆయనకు తెలిపారు. ఎవరైనా వచ్చి సంఘీభావం తెలిపితే తమకు సంబంధం లేదని నిర్వాహకులు వివరించారు.  అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి ‘మహాపాదయాత్ర’ ఏడో రోజు  కొనసాగుతోంది. ఆదివారం పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. కార్తిక సోమవారం సందర్భంగా సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. యథావిధిగా మంగళవారం నుంచి మళ్లీ సాగనుంది. 45 రోజుల పాటు సాగనున్న యాత్ర తిరుమలలో ముగియనుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సీనియర్లపై కేసీఆర్ పెద్దపీట

ఎమ్మెల్సీ సీట్ల కోసం టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ ఉంది. శాసనమండలి ఖాళీల భర్తీపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. ఏడు పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,  అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, రవీందర్ రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన పాడి కౌశిక్ రెడ్డి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు చెందిన ఎంసీ కోటిరెడ్డి, ఎల్ రమణను ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి పంపాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఖరారు చేశారు సీఎం కేసీఆర్. నిజానికి గవర్నర్ కోటాలో ఖాళీ అయిన స్థానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తున్నట్లు గత జూలైలో కేసీఆర్ ప్రకటించారు. కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును గవర్నర్ తమిళిసై పెండింగులో పెట్టారు. కౌశిక్ రెడ్డిపై కేసులు పెండింగులో ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతోనే గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని తెలుస్తోంది.  గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీకి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కేసీఆర్ మరో ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసి.. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంపిక చేశారని తెలుస్తోంది.  ఏడు ఎమ్మెల్సీ సీట్ల భర్తీలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకే ప్రాధాన్యత దక్కడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డికి ఛాన్స్ దక్కింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పార్టీ టికెట్ ఆశించారు కోటిరెడ్డి. అయితే దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుు నోముల భగత్ కు టికెట్ ఇచ్చిన కేసీఆర్.. ఎంసీ కోటిరెడ్డిని మండలికి పంపిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి హామీ మేరకు ఈసారి కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, మదుసూధనాచారీ, రవీందర్ రావుకు అవకాశం దక్కింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కౌశిక్ రెడ్డితో పాటు ఇటీవలే టీడీపీ నుంచి కారెక్కిన ఎల్ రమణకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. 

కేసీఆర్‌-కేవీపీ మిలాఖ‌త్‌!.. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్‌!

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైస్‌ ఛైర్మన్ పదవికి ఎంఎ ఖాన్ రాజీనామా. మంచి ప‌ద‌వే.. అయినా ఆయ‌న ఎందుకు రాజీనామా చేయాల్సి వ‌చ్చింది? ఎంఎ ఖాన్ అనే కాదు.. ఆదిలాబాద్‌కు చెందిన బ‌ల‌మైన నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగ‌ర్‌రావు సైతం కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నారు. హ‌స్తానికి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని టాక్‌. పైపైన చూస్తే.. ఈ రెండు ఘ‌ట‌న‌లు ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని విష‌యాలు. కానీ, వీరిద్ద‌రూ రేవంత్‌రెడ్డి నాయ‌కత్వానికి స‌వాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదున్న ఈ స‌మ‌యంలో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాలు.. గెలిస్తే రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. వీళ్లిద్ద‌రూ ఇలాంటి ధిక్కార ధోర‌ణి ఎందుకు ప్ర‌ద‌ర్శించిన‌ట్టు? అనే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. కోమ‌టిరెడ్డి ఏదో అన్నారంటే అది వేరే విష‌యం. కానీ, ఎంఎ ఖాన్‌, ప్రేమ్‌సాగ‌ర్‌రావులాంటి వాళ్లు కూడా ఇలా చేస్తుండ‌టం మామూలు అంశం కానేకాదు. వీరి వెనుక‌.. తాజా ప‌రిణామాల వెనుక‌.. కీల‌క రాజ‌కీయ మంత్రాంగం న‌డుస్తోంద‌ని అంటున్నారు. అందుకు న‌గ‌ర శివారులోని ఓ ప్ర‌ముఖుడి ఫాంహౌజ్ కేంద్రంగా మారింద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ టీకాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది? వ‌రుస లుక‌లుక‌ల‌కు కార‌ణం ఏంటి? వారి వెనుక ఎవ‌రున్నారు?  ఔటర్ రింగ్ రోడ్డుకు 20–30 కి.మీ. దూరంలో.. మొయినాబాద్లో.. ఏపీకి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ కేంద్రంగానే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో కొత్త కుట్ర‌ల‌కు తెర లేచిందని చెబుతున్నారు. ఆ ఫామ్‌హౌజ్ కేంద్రంగా.. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కీల‌క నేత‌గా ఉన్న.. వైఎస్సార్ ఆత్మ‌గా పేరుగాంచిన‌.. సోనియాగాంధీకి స‌న్నిహితుడని ప్ర‌చారం ఉన్న‌.. కె.రామ‌చంద్ర‌రావు అలియాస్ కేవీపీ టీకాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్టార‌ని.. అందులో భాగంగానే.. కేవీపీ అత్యంత స‌న్నిహితులైన ఎంఎ ఖాన్‌, ప్రేమ్‌సాగ‌ర్‌రావులు పీసీసీ నాయ‌క‌త్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. వైఎస్సార్ హ‌యాంలో ఎంఎ ఖాన్‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇప్పించింది కేవీపీనే. వెల‌మ క‌మ్యూనిటీకి చెందిన‌ ప్రేమ్‌సాగ‌ర్‌రావు సైతం వైఎస్సార్‌-కేవీపీ మ‌నిషే. వీరిద్ద‌రే ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై ఇలా తిరుగుబాటు జెండా ఎగ‌రేయ‌డం కాక‌తాళీయం అస్సలు కాద‌ని.. ఇదంతా వారి వెనుకుండి కేవీపీ ఆడిస్తున్న పొలిటిక‌ల్ డ్రామా అని అనుమానిస్తున్నారు.  ఎంఎ ఖాన్‌, ప్రేమ్‌సాగ‌ర్‌రావుల‌నే కాదు.. జ‌గ్గారెడ్డి సైతం ప‌క్కా కేవీపీ మ‌నిషే అంటారు. ఇటీవ‌ల జ‌గ్గారెడ్డి స‌మైక్య రాష్ట్రం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా కేవీపీ స్కెచ్‌లో భాగ‌మేనంటున్నారు. ఆ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేస్తుంద‌నే చెప్పాలి. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికైనా.. స‌మైక్యాంధ్ర‌పై జ‌గ్గారెడ్డి కామెంట్ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకొని.. మ‌ళ్లీ సెంటిమెంట్ రాజేసి.. ఆ మేర‌కు పొలిటిక‌ల్ మైలేజ్ పొందే అవ‌కాశం లేక‌పోలేదు. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స‌మైక్యాంధ్ర వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టి.. కేసీఆర్‌ను కుమ్మేస్తుంటే.. పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి స‌మైక్యాంధ్ర నినాదం ఎత్తుకోవ‌డం.. కేవీపీ వ్యూహంలో భాగ‌మే అని అనుమానిస్తున్నారు.  ఇక పీసీసీ టీమ్‌లో రేవంత్‌రెడ్డికి స‌న్నిహితంగా ఉంటున్న బీసీ నేత మ‌ధుయాష్కీగౌడ్‌ను సైతం ఆయ‌న నుంచి దూరం చేసే కుట్ర‌లు చేస్తున్నార‌ని.. భ‌విష్య‌త్తులో పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇప్పిస్తామంటూ ఎర వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక అప్ప‌టి వైఎస్సార్-కేవీపీల ప్ర‌ధాన‌ అనుచ‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మొద‌టి నుంచీ బాహాటంగానే రేవంత్‌రెడ్డిని విమ‌ర్శిస్తున్నారు. వీరంద‌రికీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సైతం తెర‌వెనుక‌ త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్నార‌ని చెబుతున్నారు. ఇలా కేవీపీ డైరెక్ష‌న్‌లో చిన్న చేప‌ల‌న్నీ క‌లిసి.. కాంగ్రెస్ చెరువులో అల‌జ‌డి క్రియేట్ చేసి.. రేవంత్‌రెడ్డిని బాగా డిస్ట్ర‌ర్బ్ చేసి.. అధిష్టానం దృష్టిలో ప‌లుచ‌న చేయ‌డ‌మే వారి ఎత్తుగ‌డ అంటున్నారు. మ‌రి, ఎవ‌రి కోసం ఇదంతా? అంటే... ఇంకెవ‌రి కోసం కేసీఆర్ కోస‌మే అంటున్నారు.  ఒకప్పుడు వైఎస్సార్ ఆత్మ‌గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు కేసీఆర్‌కు ముఖ్యుడిగా మారార‌ని చెబుతున్నారు. కేవీపీ ఆపరేషన్ వెనుక కేసీఆర్ ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయని అంటున్నారు. హుజూరాబాద్ ఓట‌మి త‌ర్వాత టీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌ని అంతా భావిస్తున్నారు. కేసీఆర్‌కు ఎంత డ్యామేజ్ జ‌రిగితే.. కాంగ్రెస్‌-రేవంత్‌రెడ్డిల‌కి అంత అడ్వాంటేజ్‌. అలా జ‌ర‌గ‌కూడ‌దంటే.. కాంగ్రెస్‌ను క‌ట్ట‌డి చేయాలి. పార్టీ ఇమేజ్ సాధ్య‌మైనంత త‌గ్గించ గ‌లగాలి. కాంగ్రెస్‌ పార్టీ ఎంత బ‌ల‌హీన‌ప‌డితే.. కేసీఆర్ అంత బ‌ల‌ప‌డ‌తారు. రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్ట‌గ‌లిగితే.. హ‌స్తం పార్టీని హ‌స్తగ‌తం చేసుకోవ‌డం అంత సులభం అవుతుంది. అందుకే, కేవీపీ ద్వారా రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కేసీఆర్ ఆప‌రేష‌న్ కాంగ్రెస్‌కు తెర‌లేపార‌ని అంటున్నారు. మ‌రి, కేసీఆర్ కోసం కేవీపీ ఇదంతా ఎందుకు చేస్తున్నార‌నే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. "నువ్వు వెల‌మ.. నేను వెల‌మ‌.. మ‌నం మ‌నం వెల‌మ‌లం".. అని అనుకుంటున్నారు.

బ్రేకింగ్: యాసంగిలో వరి కొనేది లేదన్న ప్రభుత్వం

తెలంగాణలో వరి సాగు వివాదం మరింత ముదురుతోంది. వరిని సాగు చేయవద్దంటూ గతంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన ప్రకటనపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇదిలా ఉండగానే మరోసారి అలాంటే ప్రకటనే చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులు యాసంగిలో వరి వేయొద్దని సూచించారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్నవారు.. వరి పంట వేసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ రైస్‌ కొనమని స్పష్టం చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని తెలిపిందని పేర్కొన్నారు. వర్షాకాలం పంట కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందుల్లేవని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ.. చిత్తూరు జిల్లాలో వైసీపీ కుట్ర? 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతల ఒత్తిడితో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారనే విమర్శలు.. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయి. టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. నామినేషన్ల పర్వంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తగా.. తాజాగా  నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కలకడ, బంగారుపాళెం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురికావడం కలకలం రేపుతోంది.  బంగారు పాళ్యం, కలకడ మండలాలకు సంబంధించిన జెడ్పిటిసి ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శుక్రవారం నాడు దాఖలు చేసుకున్న నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని అందువల్ల వారి దరఖాస్తులను తిరస్కర్రిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఎం ఎస్ మురళి ప్రకటించారు. బంగారుపాళ్యం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిరిబాబు అఫిడవిట్ వీటిలో కాలం సంఖ్య5(9) మరియు సదరు అభ్యర్థి ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రంలో రుణం క్లియర్ కాలేదని ప్రత్యర్థి అభ్యంతరం తెలిపారని చెప్పారు. కలకడ మండలం టిడిపి అభ్యర్థిగా నామినేషన్  దాఖలు చేసిన సురేఖ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన  పుట్టిన తేదీ,కుల ధ్రువీకరణలోఇచ్చిన పుట్టినతేది , ఆధార్ కార్డు లో గల తేదీలు వేరు వేరుగా ఉన్నాయని,  వయస్సు నిర్ధారణ కు సంబంధించి ధ్రువీకరణ సమర్పించలేదని తెలిపారు. డిక్లరేషన్ ఫారంలో దరఖాస్తు కు సాక్షి సంతకం చేసిన వారి అడ్రస్ వ్రాయలేదన్నారు.  తమ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు జిల్లా కావడం వల్లే అధికార పార్టీ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే చిన్నిచిన్న కారణాలతో తిరస్కరించారని చెప్పారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే ఎన్నికల అధికారులు పక్షపాతంతో పని చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

నాగేంద్రన్‌కి ఉరి వ‌ద్దు.. సింగ‌పూర్‌లో ఉద్య‌మం..

అత‌ని పేరు నాగేంద్రన్ కె ధర్మలింగం. భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి. పుట్టింది మ‌లేసియాలో. ప్ర‌స్తుతం సింగ‌పూర్ జైల్లో ఉన్నాడు. ఆయ‌న‌కు త్వ‌ర‌లో ఉరి వేయ‌నున్నారు. అయితే, నాగేంద్ర‌న్‌కు ఉరి శిక్ష వ‌ద్దంటూ.. క్ష‌మాభిక్ష‌ ప్ర‌సాదించాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డుస్తోంది. మానవ హక్కుల సంఘాలు భారీ మొత్తంలో సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇప్పటివరకు 40వేల‌కు పైగా సంతకాలు సేకరించాయి. మ‌రి, ఆన్‌లైన్ పోరాటం ఫ‌లిస్తుందా?  నాగేంద్ర‌న్ కె ధ‌ర్మ‌లింగంకు ఉరి ర‌ద్దు అవుతుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఎవ‌రీ నాగేంద్ర‌న్‌? ధ‌ర్మ‌లింగం జైల్లో ఎందుకు మ‌గ్గుతున్నారు? ఉరి శిక్ష ప‌డేంత త‌ప్పు ఏం చేశారు? అత‌ని కోసం ఆన్‌లైన్ ఉద్య‌మం ఎందుకు హోరెత్తుతోంది? ఇవ‌న్నీ ఇంట్రెస్టింగ్ విష‌యాలే. భార‌త సంత‌తికి చెందిన‌ నాగేంద్రన్ కె ధర్మలింగం 2009లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ సింగపూర్​ పోలీసుల‌కు చిక్కాడు. ఆ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ న‌వంబ‌ర్ 10న నాగేంద్రన్‌కు ఉరి వేయ‌నున్నారు జైలు అధికారులు. దీంతో మానవ హక్కుల సంఘాలు నాగేంద్ర‌న్ ఉరిశిక్ష ర‌ద్దుకు ప్రయత్నిస్తున్నాయి. అత‌ను హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనే మాన‌సిక స‌మ‌స్య‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నాగేంద్ర‌న్‌ ప్రేయసిని హత్య చేస్తామని బెదిరించి.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత‌నితో బలవంతంగా డ్రగ్స్ అక్రమ రవాణా చేయించారని కూడా అంటున్నారు. అందుకే,  నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నాయి. న‌వంబ‌ర్ 10న ఉరి శిక్ష అమ‌లు చేయ‌నుండ‌గా.. ఈ లోపే క్ష‌మాభిక్ష కోసం ఆన్‌​లైన్ వేదికగా సంత‌కాల సేక‌ర‌ణ స్టార్ట్ చేశారు.  అయితే, 2010లో డ్ర‌గ్స్‌ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సింగ‌పూర్ అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే అతడు ఈ తప్పు చేసినట్టు.. హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్టు.. సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి నాగేంద్రన్ పెట్టుకున్న పిటీష‌న్‌ కూడా తిరస్కరణకు గురైందని హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. న‌వంబ‌ర్ 10న ఉరి శిక్ష అమ‌లును చూసేలా, నాగేంద్రన్ ఫ్యామిలీ మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఆన్‌లైన్ ఉద్యమం హోరెత్తుతుండ‌టంతో న‌వంబ‌ర్ 10న ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు. 

జగన్ పాలన ప్రజలకు భారం.. పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని బాబు డిమాండ్

చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించడంతో ఆదిశగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే 22 రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ శాతాన్ని కొంత తగ్గించుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ రేట్లలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. కేంద్రం తగ్గించినా వ్యాట్ తగ్గించకపోవడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై జనాలు ఫైరవుతున్నారు. విపక్షాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో పెట్రో ధరలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం అని అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే ఏపీలో ఎందుకు తగ్గించడంలేదంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపును తీవ్రంగా పరిగణించాల్సిందేనని, పెట్రో ధరల పెంపు ప్రభావం అనేక రంగాలపై ఉంటుందని చంద్రబాబు అన్నారు. ధరల పెంపు కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రజలపైనా తీవ్ర భారం పడుతోందని వివరించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని నాడు జగన్ చెప్పారని గుర్తు చేశారు. నాడు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆందోళన చేసిన జగన్.. ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. 

పెద్ద నేత వల్లే 3 వేల ఓట్లు.. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్లు 

తెలంగాణ కాంగ్రెస్ హుజురాబాద్ మంటలు చల్లారడం లేదు. పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకపోవడంపై కొందరు నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా కామెంట్లు చేస్తున్నారు. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయంపై స్పందించిన కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా సాధించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పెద్ద పెద్ద నాయకులున్నారని, నేను పెద్ద నాయకుడిని కాదని అందుకే హుజురాబాద్ ప్రచారానికి వెళ్లలేదని అన్నారు.బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 6 వేల ఓట్లు వస్తే హుజురాబాద్‌లో కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. తెలంగాణలో కంటే ప్రస్తుతం ఏపీలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నట్లుగా కోమటిరెడ్డి మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీలో కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే మా నాయకులన్నారు ఎంపీ కోమటిరెడ్డి. సోనియా గాంధీ మాకు దేవతలాంటిది.. కానీ, పార్టీలో ఉన్న కొందరు దెయ్యం అని అన్నారంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం సీఎల్పీకి వచ్చారు. పార్టీ సీనియర్ నేత  వీహెచ్‌తో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ప్రాణమైనా ఇచ్చే నాయకుడు వీహెచ్ అన్నారు.  ఆయన అంటే మొదటి నుంచి అభిమానం ఉందని చెప్పారు.   

పునీత్‌పై వీరాభిమానం.. ఆహారం మానేసి అభిమాని ప్రాణ‌త్యాగం..

పునీత్ రాజ్‌కుమార్‌. క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్‌. ఆయ‌న మ‌ర‌ణం కోట్ల‌ది ప్ర‌జ‌ల‌ను విషాదంలో ముంచెత్తింది. బ‌డాబ‌డా సెల‌బ్రిటీలే ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోనేలేదు. ఇక పునీత్ అభిమానులైతే త‌మ హీరో హ‌ఠాత్మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. పునీత్ ఇక‌లేరు అనే నిజం న‌మ్మ‌లేక‌పోతున్నారు. క‌ర్నాట‌క‌లో ఎటుచూసినా సంతాప ఛాయ‌లే క‌నిపిస్తున్నాయి. పునీత్ చేసిన సినిమాలు, ఆయ‌న జ్ఞాప‌కాలు, సేవ కార్య‌క్ర‌మాలను త‌లుచుకుంటూ విచారం వ్య‌క్తం చేస్తున్నారు.  శివ‌మూర్తి. పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. త‌న అభిమాన తార మ‌ర‌ణాన్ని అత‌ను జీర్ణించుకోలేక‌పోయాడు. అక్టోబ‌ర్ 29న పునీత్ చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచీ ఆహారం మానేశాడు. చామరాజనగర్‌ జిల్లా కొళ్లేగాల భీమానగర్‌కు చెందిన‌ 31 ఏళ్ల శివ‌మూర్తి ఫోటోగ్రాఫ‌ర్‌గా చేస్తున్నారు. ప‌లుమార్లు పునీత్ రాజ్‌కుమార్‌ను క‌లిశారు. ఆయ‌న‌తో ఫోటోలు దిగాడు. పునీత్ త‌ర‌హాలోనే డ్యాన్సులు చేసేవారు. పునీత్‌ను విప‌రీతంగా అభిమానించేవారు. అలాంటి పునీత్‌.. ఇక‌లేరు అని తెలీగానే శివ‌మూర్తి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాన‌సికంగా కృంగిపోయారు. ఆ రోజు నుంచీ అన్నం తిన‌డం కూడా మానేయ‌డంతో.. శ‌రీర‌కంగా కృషించిపోయారు.  కుటుంబ స‌భ్యులు, మిత్రులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆహారం తీసుకోమ‌ని ఎంత ఒత్తిడి చేసినా విన‌లేదు. దీంతో, శివ‌మూర్తి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తింది. తీవ్ర అస్వస్థతకు గురికావ‌డంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివమూర్తి చ‌నిపోయారు. త‌న ఆరాధ్య‌ న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ చెంత‌కు చేరారు.

ఎంపీ రఘురామ రాజు కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మధ్య కొంత కాలంగా యుద్దమే సాగుతోంది. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీ నేతల అరాచకాలను బయటికి తీస్తూ వాళ్ల కంట్లో నలుసులా తయారయ్యారు రఘురామ. దీంతో రఘురామను టార్గెట్ చేస్తోంది జగన్ పార్టీ. రఘురామ అరెస్టు వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామ. అటు వైసీపీ ఎంపీలు రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదుల మీర ఫిర్యాదులు చేస్తున్నారు.  ఢిల్లీలో రోజూ ప్రెస్ మీట్ పెడుతూ జగన్ రెడ్డి విధానాలను ఎండగడుతున్నారు ఎంపీ రఘురామ రాజు. ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం లేక వైసీపీ నేతలు సైలెంటుగా ఉంటున్నారు. తాజాగా శనివారం మీడియాతో మాట్డాడిన రఘురామ.. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంబంధించి కీలక విషయాలు చెప్పారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని ఎంపీ రఘురామ  కొనియాడారు. అయితే మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తగా ఉండాలని అమరావతి రైతులకు సూచించారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు రఘురామ. ఆ మంత్రి వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరి, తాటికొండ ప్రజలపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బద్వేలు ఉప ఎన్నిక గెలుపు నిజమైన గెలుపు కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ నిర్వహించారని ఆరోపించి సంచలం రేపారు. దీనిపై ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. ఏపీ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానన్నారు. సోలార్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.