రాజకీయ మేథావి మోదీ!.. పెట్రోల్ ధరలు తగ్గించింది అందుకేనా?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేతుల్లో ఉండే వజ్రాయుధం ‘ఓటు’ హక్కు. ప్రజలు ఆ అస్త్రాన్ని సక్రమంగా సంధిస్తే,ఇక తిరుగుండదు. ఎదురులేదు తిరుగులేదు అనుకున్న మోడీ అయినా ఇంకెవరు అయినా, గింగరాలు తిరుగుతూ దిగిరావల్సిందే. ఇంచుమించుగా గత ఐదారు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పైపైకి పరుగులు తీస్తూనే ఉన్నాయి. సెంచరీ కొట్టాయి. అక్కడితోనూ ఆగలేదు. అయినా, ప్రభుత్వం వెనుతిరగలేదు. ఇంకా స్కోర్ పెంచుకుంటూనే పోయింది. ప్రతిపక్షాలు విమర్శల గుప్పించినా, రోడ్డెక్కి ఆందోళనలు చేసినా, బందులు చేసినా చేసినా, జనం గగ్గోలు పెట్టినా,‘తగ్గేదే లేదు’ అన్నట్లు ప్రభుత్వం ముందుకు దూసుకు పోయింది.
కానీ, ఓటు తూటా పేలే సరికి దిగివచ్చింది. ఎప్పుడైతే, 13 రాష్ట్రల్లోని 30 అసెంబ్లీ మూడు లోక్ సభ నియోజక వర్గాలకు అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో, అప్పుడు కమల దళానికి ఇక దిగిరాక తప్పదనే, జ్ఞానోదయం అయింది. మోడీ ప్రభుత్వం మెట్టు దిగి వచ్చింది .ఒక్క సారిగా,పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఉప ఎన్నికల్లోనే ఇంతలా షాక్ ఇచ్చిన జనం రేపటి ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకెంతగా కొర్రుకాల్చి వాత పెడతారో అనే భయంతో కావచ్చును, దీపావళి కానుక అంటూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు కాసింత ఊరట కలిగించింది. ముందు ముందు ఇంకొంత తగ్గించ వచ్చని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇంకా తగ్గించవచ్చని అంటున్నారు.
అదలా ఉంటే కేంద్రంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వాలు,ముఖ్యంగా బీజేపీ/ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు వరసపెట్టి ఒకటొకటిగా దిగివస్తున్నాయి. ఉతర ప్రదేశ్, సహా చాలా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, మధ్య ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు వ్యాట్‌లో కోత విధించాయి.అయితే, ఇంతవరకు వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల మోతతతో ఉప ఎన్నికలలో ప్రయోజనం పొందిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అదే విధంగా తెరాస, వైసీపీ వంటి ప్రాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం స్పందించ లేదు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికలలో వంట గ్యాస్’తో పాటుగా పెట్రోల్,డీజిల్ ధరలను ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్న తెరాస ప్రభుత్వం వ్యాట్ తగ్గించక పోవడం గమనార్హం.
కాగా, కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించిన వెంటనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై రూ. 7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17 మేర తగ్గుతోంది.అలాగే, అస్సాం పౌరుగు రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ సైతం పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా మరో బీజేపే పాలిత రాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అదే బాటలో గోవా సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తమ రాష్ట్రంలోనూ రూ.7చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.12, డీజిల్ ధర రూ.17 మేర తగ్గనుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.ఎన్డీయే కూటమికి చెందిన జేడీయూ నేతృత్వంలోని బిహార్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొంది.ఉత్తరాఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డీజిల్‌పై ఎలాంటి ఊరటా ఇవ్వలేదు. మరో వంక పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రూ.12 మేర తగ్గనుంది.గుజరాత్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున తగ్గించింది.పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను హరియాణా ప్రభుత్వం తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో రెండూ రూ.12మేర తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్’ను నలుగు శాతం తగ్గించింది. అయితే, అన్ని రాష్ట్రాల కంటే కేరళ వామపక్ష కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.10 రూపాయలు తగ్గించింది. ఇక ధనిక రాష్ట్రం అని ఒకరు సంక్షేమ ప్రభువులం అంటూ ఇంకొకరు జబ్బలు చరచుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన రెడ్డి మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.