సోషల్ మీడియా పై చట్టం కొరడా..? ఎక్కడంటే..
posted on Nov 6, 2021 @ 10:48AM
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి, ఇది అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఆమోదిస్తున్న వాస్తవం. అదే సమయంలో సోషల్ మీడియా మంచి చెడులను తూకం వేస్తే, స్కేల్ ఎటువైపు టిల్ట్ అవుతోంది,తూకం ఎటు మొగ్గు చూపుతుందో, చెప్పడం అయ్యే పని కాదు. ఈ నేపధ్యంలో, మన దేశంతో పాటుగా, ప్రపంచ దేశాలలో సోషల్ మీడియా కట్టడి,
నియంత్రణలకు సంబంధించి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. చట్టాలు చేయాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. స్వయం నియంత్రణ అవసరాలు, అవకాశాలకు సంబందించిన చర్చలు సాగుతున్నాయి. కోర్టులు, విచారణలు, వివాదాలు అనేకం జరుగుతూనే ఉన్నాయి.
సోషల్ మీడియా కట్టడికి సంబందించి యూకేకి చెందిన,’ది టైమ్స్’ పత్రిక ప్రచురించిన తాజా కథనం సంచలనం సృష్టిస్తోంది. టైమ్స్ కథనం ప్రకారం, యూకే ప్రభుత్వం సోషల్ మీడియాకు సంకెళ్ళు వేసేందుకు ఒక కొత్తచట్టాన్ని తెస్తోంది. ఆన్లైన్ సేఫ్టీ బిల్లు రూపొందిస్తోంది. ఇటీవల యూకే, లిస్బోన్‘లో జరిగిన వెబ్ సమ్మిట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్’లో మీడియా వాచ్’డాగ్ సంస్థ అఫ్కామ్ అధినేత డామే మెలానీ దావేస్, సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కంపెనీలు, పుట్టుకతోనే వినియోగ దారులకు హానికరమని అన్నారు. స్వయం నియంత్రణకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స అడ్డు తగులుతున్నాయని, ప్రమాదకర పోస్టులను ప్రోత్సహిస్తున్నాయని, అన్నారు.
ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా కంపెనీలు అనుసరిస్తున్న’రికమెండ్’ ప్రకటనల విధానం వంటి కొన్ని బిజినెస్ మోడల్స్, సమస్య సృష్టికి మూలమని పేర్కొన్నారు. అదలా ఉంటే, 2023 నుంచి అమలులోకి వచ్చే, కొత్త చట్టం గీత దాటిన సంస్థలపై చర్యలు తీసుకునే హక్కును తమకు ఇస్తుందని అఫ్కామ్ అధినేత డామే మెలానీ దావేస్ పేర్కొన్నారు. వినియోగ దారులను ఆన్లైన్ హాని నుంచి కాపాడలేని సంస్థలకు 18పౌండ్స్ లేదా కంపెనీ వార్షిక టర్నోవర్’లో పది శాతం ఫైన్ వేసే అధికారం ఉందని, ఆన్లైన్ సేఫ్టీ బిల్లులో ఈ అన్ని అంశాలను పొందుపరిచామని చెప్పారు. ఆన్లైన్ సేఫ్టీ బిల్లులో వస్త్రధారణ, రివెంజ్ పోర్న్, విద్వేష ప్రసంగాలు, ఉగ్రవాదం, తప్పుడు సమాచారం, కుంభకోణాలు, జాతివిద్వేషాలను రెచ్చగొట్టే అంశాలు అన్నీ వస్తాయని పేర్కొన్నారు.
అయితే ఈ బిల్లుకు సోషల్ ప్లాట్ ఫార్మ్స్ నుంచి గట్టి ప్రతి ఘటన వస్తుందని అన్నారు. చివరకు ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుందా? లేక మన దేశంలోలానే రాజకీయ దుమారానికి దరి తీస్తుందా అనేది చూడవలసి వుంది.