'జై భీం' సూపర్ హిట్‌కు కారణం ఇతనే.. జస్టిస్ చంద్రు విశేషాలు ఇవే...
posted on Nov 5, 2021 @ 4:40PM
‘‘జై భీమ్’’. సూపర్‌హిట్ కొడుతున్న సినిమా. థియేటర్లలో రిలీజ్ కాకున్నా.. అమెజాన్ ప్రైమ్‌లో దుమ్మురేపుతోంది. IMDB రేటింగ్ 9కి పైనే ఉంది. ఇటీవల దాదాపు అన్ని సైట్లు మంచి రేటింగ్ ఇచ్చాయి. తెలుగువన్.కామ్ సైతం జై భీమ్‌కు 4 రేటింగ్ ఇచ్చి పట్టం కట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమా చూసిన వారంతా భలే ఉందంటున్నారు. థియేటర్లలో వచ్చుంటే బాగుండని మాట్లాడుకుంటున్నారు. మంచి సినిమా కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు జై భీమ్ రూపంలో చక్కని చిత్రం ముందుకొచ్చింది. లీడ్ క్యారెక్టర్ హీరో సూర్య జస్టిస్ చంద్రు రోల్‌లో మెప్పించారు. ఇంతకీ జస్టిస్ చంద్రు ఎవరు? ఆయన రియల్ లైఫ్ స్టోరీ ఏంటి?
జస్టిస్ చంద్రు అనే లాయర్, జడ్జి జీవిత గాథను జై భీమ్‌గా తెరకెక్కించారు. 1990 కాలంలో తమిళనాడులో అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాడారు. మానవ హక్కుల కేసుల్లో ఫీజు తీసుకోకుండా వాదించేవారు. కుల వివక్ష, వెనకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. లాయర్‌గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో ‘లిజన్ టు మై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు. దాని ఆధారంగానే జై భీమ్ సినిమా రూపొందింది.
మద్రాస్ హైకోర్టుకు 2006, జులై 31న అదనపు న్యాయమూర్తిగా.. 2009, నవంబర్ 9న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ చంద్రు హైకోర్టు జడ్జీగా ఇచ్చిన తీర్పులు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించాయి. చంద్రు తన కెరీర్‌లో 96వేల తీర్పులు వెలువరించారు. ఓ కేసులో ఆయన ఇచ్చిన తీర్పుతో.. మధ్యాహ్న భోజన పథకంలో 25వేల మంది నిరుపేద మహిళలకు ఉపాధి లభించింది. ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయనిచ్చిన తీర్పుల్లో కీలకమైనవి.
జడ్జిగా సో కాల్డ్ ప్రోటోకాల్స్ కొన్నిటిని మార్చేశారు జస్టిస్ చంద్రు. హోదాగా భావించే ఎర్రబుగ్గ కారును వద్దనుకున్నారు. తన కారుపై ఉండే ఎర్రబుగ్గను తనంతట తాను తీసేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నిరాకరిస్తూ.. సెక్యూరిటీని సరెండర్ చేశారు. కోర్టుల్లో తన ముందు వాదనలు వినిపిస్తున్నప్పుడు ‘‘ మై లార్డ్ ’’ అని పిలవాల్సిన అవసరం లేదన్నారు. 2013లో హైకోర్టు జడ్జిగా రిటైర్డ్ కాగానే ప్రభుత్వం తనకు కేటాయించిన కారును కోర్టు ఆవరణలోనే వదిలేసి డ్రైవర్‌కు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు. ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని లోకల్ ట్రైన్ ఎక్కి తన ఇంటికి వెళ్లిపోయారు.
సంప్రదాయం ప్రకారం ఎవరైనా హైకోర్టు న్యాయమూర్తి రిటైర్ అయితే ఘనంగా సెండాఫ్ పార్టీ ఇచ్చి వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ చంద్రు మాత్రం ఆ సెండాఫ్ పార్టీనీ తిరస్కరించి.. అందుకు అయ్యే ఖర్చును ఏదైనా మంచి పని కోసం ఉపయోగించమని చెప్పారు. ఇలా అనేక అంశాల్లో.. తనదైన చెదరని ముద్ర వేశారు జస్టిస్ చంద్రు. ఆయన ఘనకీర్తిలో ఓ చిన్న అంశమే.. ప్రస్తుత జై భీమ్. అందుకే ఈ సినిమా సూపర్‌హిట్.