స్కాట్లాండ్ పై ఘన విజయం.. సెమీస్ రేసులో టీమ్ఇండియా!
posted on Nov 5, 2021 @ 9:42PM
టీట్వంటీ వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది టీమ్ ఇండియా. కెప్టెన్ కోహ్లీ జన్మదినం రోజున అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడి ఘన విజయం సాధించింది. సెమీస్ చేరేందుకు గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవాల్సి ఉండటంతో చెలరేగి ఆడారు భారత ఆటగాళ్లు. స్కాట్లాండ్ విధించిన 86 పరుగుల టార్గెట్ ను కేవలం 6.3 ఓవర్లలోనే చేధించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి ఓవర్ నుంచే విజృంభించి ఆడారు. తొలి వికెట్ కు కేవలం ఐదు ఓవర్లలోనే 70 పరుగులు చేశారు. రోహిత్ శర్మ కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ 18 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. సిక్సర్ త ో మ్యాచ్ ముగించాడు సూర్యకుమార్ యాదవ్.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన.. అదే జోష్ ను స్కాట్లాండ్ మ్యాచ్ లో కొనసాగించిందిపేసర్లు షమీ, బుమ్రాలు తొలి ఓవర్ నుంచే స్వింగ్ తో రాణించారు. దీంతో స్కాట్లాండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. వెంటవెంటనే అవుటయ్యారు. ఓపెనర్లను పేసర్లు అవుట్ చేయగా... రవీంద్ర జడేజా మిడిలార్డర్ పని పట్టారు. దీంతో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్. ఐదో వికెట్ కు మ్యాక్ లాడ్, లీస్క్ కొన్ని పరుగులు చేసినా మళ్లీ షమీ బ్రేక్ త్రూ ఇచ్చారు. తర్వాత రవీంద్ర జడేజా మరో వికెట్ తీశారు. 17 ఓవర్ లో చెలరేగిన షమీ వరుసగా రెండు వికెట్లు తీశాడు. మరొకరు రనౌట్ గా అవుటయ్యాడు. చివరికి స్కాట్లాండ్ 85 పరుగులకే అలౌట్ అయింది. షమీ మూడు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.