చంద్రబాబు చేసిన తప్పే కేసీఆర్ చేశారా? ఈటలతో అంత ప్రమాదమా? హిస్టరీ రిపీట్స్!
posted on Nov 5, 2021 @ 7:03PM
ఒక్క మంత్రి పదవి పడేస్తే పోయేది. రాష్ట్రం విడిపోయే వరకూ వచ్చింది. తెలుగునేల రెండుగా చీలేలా చేసింది. పార్టీల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగేలా చేసింది. ఇంతటి చిచ్చుకి కారణం.. ఆనాడు కేసీఆర్‌కు అప్పటి సీఎం చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడమే అంటారు. 1999లో చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. టీడీపీ ఎమ్మెల్యే కె.చంద్రశేఖర్‌రావుకు డిప్యూటీ స్పీకర్ పోస్టు కట్టబెట్టారు. అయితే, ఆయన ఆ పదవితో సంతృప్తి చెందక.. తనకు మంత్రి పదవి కావాల్సిందేనంటూ పట్టుబట్టారు.
అప్పటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా కేసీఆర్‌ను మినిస్టర్ చేయడం చంద్రబాబుకు కుదరలేదని చెబుతారు. దీంతో.. టీడీపీని వీడి.. టీఆర్ఎస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చారు. ఏడేళ్లుగా తెలంగాణను ఏలుతున్నారు. కట్ చేస్తే.. సేమ్ టు సేమ్ కాకపోయినా.. కాస్త అటూఇటూగా ఈటల రాజేందర్ ఎపిసోడ్‌లోనూ అలానే జరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు. అప్పుడు చంద్రబాబు కేసీఆర్ విషయంలో చేసినట్టే.. ఇప్పుడు కేసీఆర్ ఈటల రాజేందర్ అంశంలో అదే తీరుగా వ్యవహరించారని ఆ రెండు ఘటనలను కంపేర్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ చంద్రబాబును ఢీకొట్టి.. ఆయన పార్టీని చీల్చినట్టుగానే.. ఇప్పుడిక ఈటల సైతం గులాబీ బాస్‌ను ఎదిరించి.. టీఆర్ఎస్‌ను ముక్కలు చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. ఆ విశ్లేషణ ఆసక్తికరంగా జరుగుతోంది.
సెకండ్ టైమ్ అధికారంలోకి వచ్చాక ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కొన్నాళ్లు పక్కనపెట్టేశారు కేసీఆర్. తాము గులాబీ జెండాకు బానిసలం కాదు.. ఓనర్లమంటూ రాజేందర్ రెబెల్ వాయిస్ వినిపించగానే దెబ్బకు దిగొచ్చారు దొర. మొదటి దఫా కీలకమైన ఆర్థిక శాఖ కట్టబెట్టగా.. రెండో టర్మ్‌లో కాస్త ప్రాధాన్యత తగ్గించి ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఆరోగ్యం శాఖలో పెద్దగా ఏం పనుండదులే.. ఈటలను పక్కన పెట్టేసినట్టే అనుకుంటుండగా.. కరోనా మహమ్మారి ముంచుకురావడంతో.. ఆ శాఖ మంంత్రి ఈటల రాజేందర్ కీలక మంత్రిగా మారారు. నిత్యం సమీక్షలు, పర్యవేక్షణలతో ఫుల్ యాక్టివ్‌గా కనిపించారు. ఈటల ఎదుగుదలను ఓర్వలేని కేసీఆర్.. ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేసి.. కేబినెట్ నుంచి వేటు వేసి.. పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని అంటారు. 2001లో కేసీఆర్ టీడీపీని వీడిన అంశాన్ని.. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత 2021లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన పరిణామాన్ని జాగ్రత్తగా కంపేర్ చేస్తున్నారు.
అప్పుడు కేసీఆర్ లానే.. ఇప్పుడు ఈటల.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన నేతగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆనాడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గెలిచినట్టుగానే.. తాజాగా హుజురాబాద్ ఉప పోరులో ఘన విజయం సాధించి రాజేందర్ సమరశంఖం పూరించారు. గెలిచిన వెంటనే ఇక కాస్కో కేసీఆర్ అంటూ సవాల్ చేశారు. తనను ఓడించేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన హరీశ్‌రావు ఇలాఖాలో అడుగుపెట్టి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధిపేటలో దళిత గర్జన సభ పెడతాం.. దానికి తానే నాయకత్వం వహిస్తానంటూ.. మామా-అల్లుళ్లపై డబుల్ బ్యారెల్ గన్ ఎక్కుపెట్టారు.
ఈటల రాజేందర్ పెద్ద టార్గెట్‌నే ఎంచుకున్నట్టున్నారు. ఇకపై ఊరూరా తిరిగి.. ఉద్యమకారులందరినీ ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమకారులను, నిరుద్యోగులను, రైతులను, దళితులను, బీసీలను.. ఇలా అన్నివర్గాలను క్రూడీకరించి ప్రగతిభవన్‌పై దండయాత్రకు రెడీ అవుతున్నారు. అచ్చం.. అప్పట్లో కేసీఆర్ చేసినట్టే.. ఇప్పుడు ఈటల రాజేందర్.. సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి ఉప్పెనలా మరో తెలంగాణ ఉద్యమం ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ఈ విషయం పసిగట్టిన కేసీఆర్‌లో అంతర్మథనం స్టార్ట్ అయిందని అంటున్నారు. పాపం ఈటల.. ఏం కోరుకున్నారని? కాస్తంత విలువ.. కుసుంత మర్యాద. అపాయింట్‌మెంట్ లేకుండా కేసీఆర్‌ను కలిసే అవకాశం.. ప్రగతిభవన్‌లోకి అందరికీ ప్రవేశం. ఇంత చిన్న చిన్న ఆకాంక్షలనే.. కూకటివేళ్లతో పెకిలించేయాలని చూశారు. ఈటల రాజేందర్‌కు సరైన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఆయన స్థాయిని తగ్గించాలని చూశారు. అందుకే తిరగబడిన ఉద్యమకారుడు.. కేసీఆర్‌కు హుజురాబాద్‌లో కర్రుకాల్చి వాత పెట్టాడు. భవిష్యత్‌లో కేసీఆర్ పార్టీ అంతు చూసేందుకు కదం పదం కలుపుతున్నారు. అందుకే అంటారు హిస్టరీ రిపీట్స్ అని. ఆనాడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ చేసిన కుట్రల పాపమే.. ఇప్పుడు ఈటల రూపంలో ఆయనకు శాపంలా పరిణమించాయని అంటున్నారు.