స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నగరా.. ఏపీలో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నిక
తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే.. స్థానిక సంస్థల కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఏపీలో 11, తెలంగాణ 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 16న నోటిఫికేషన్ రానుండగా , 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 14న కౌంటింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏపీకి సంబంధించి అనంతపురం జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో రెండు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో రెండు, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.
ఏపీకి సంబంధించి పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, యలమంచలి రాజేంద్ర ప్రసాద్, రెడ్డి సుబ్రమణ్యం ,అన్నం సతీష్ ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ద్వారంపూడి జగదీశ్వర్ రావు, బుద్దా నాగ జగదీశ్వర్ రావు, చలపతి రావు, గాలి సరస్వతి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానాలు భర్తీ కానున్నాయి. వీటిలో పయ్యావుల కేశవ్, సతీశ్ ప్రభాకర్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్థానాలు 2019 జూన్ నుంచే ఖాళీగా ఉన్నాయి. ఎంపీ గెలిచిన మాగుంట, ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ అప్పుడే రాజీనామా చేశారు. అయితే స్థానిక సంస్థల ఓటర్ లిస్టు లేకపోవడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా పడింది. తర్వాత కోవిడ్ కారణంగా అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. మిగితా ఎనిమిది మంది పదవీ కాలం గత ఆగస్టులోనే ముగిసింది.
తెలంగాణ నుంచి పురాణం సతీశ్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మినారాయణ, భాను ప్రసాద్ రావు, నారదాలు లక్ష్మణరావు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు పదవి కాలం జనవరి 4తో ముగియనుండి. ఈ స్థానాల భర్తీకి సీఈసీ షెడ్యూల్ ఇచ్చింది.