న్యూజిలాండ్ ఘన విజయం.. భారత్‌కు సెమీస్ గండం..
posted on Nov 5, 2021 @ 8:26PM
భయపడినట్టే అవుతోంది. టీమిండియాకు సెమీస్ ముప్పు పొంచిఉంది. నమీబియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడం.. ఇండియాకు గండంగా మారింది. టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ వరుసగా మూడో గెలుపు కైవసం చేసుకుంది. గ్రూప్-2లో సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. పాకిస్థాన్ (8 పాయింట్లు) ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. న్యూజిలాండ్ (6 పాయింట్లు), అఫ్గానిస్థాన్ (4 పాయింట్లు) సెమీస్ రేసులో మనకంటే ముందున్నాయి.
న్యూజిలాండ్ నవంబర్ 8న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే డైరెక్ట్‌గా సెమీస్‌కు వెళ్లినట్టే. అప్పుడిక భారత్, అఫ్గాన్ ఇంటికెళ్లక తప్పదు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయి.. అఫ్గాన్ విజయం సాధిస్తే.. నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. ఇండియా, కివీస్‌లో ఎవరికి రన్‌రేట్ ఎక్కువగా ఉంటే.. ఆ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
ఇండియా తను ఆడబోయే తదుపరి రెండు మ్యాచుల్లో గెలిచినా.. నేరుగా సెమీస్‌కు వెళ్తుందని చెప్పలేం. నవంబర్ 5 స్కాట్లాండ్‌పై, నవంబర్ 8న నమీబియాపై టీమిండియా విక్టరీ కొట్టినా.. న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ మ్యాచ్ ఫలితమే భారత జట్టు సెమీస్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది.
ఇక, షార్జా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది.