చెలరేగిన భారత బౌలర్లు.. 85 పరుగులకే స్కాట్లాండ్ ఆలవుట్
posted on Nov 5, 2021 @ 8:52PM
టీట్వంటీ వరల్డ్ కప్ లో సెమీస్ చేరేందుకు కష్టాలు పడుతున్న టీమిండియా స్కాంట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్బుతంగా ఆడింది. గత మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన.. అదే జోష్ ను స్కాట్లాండ్ మ్యాచ్ లో కొనసాగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు షమీ, బుమ్రాలు తొలి ఓవర్ నుంచే స్వింగ్ తో రాణించారు. దీంతో స్కాట్లాండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. వెంటవెంటనే అవుటయ్యారు. ఓపెనర్లను పేసర్లు అవుట్ చేయగా... రవీంద్ర జడేజా మిడిలార్డర్ పని పట్టారు. దీంతో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్.
ఐదో వికెట్ కు మ్యాక్ లాడ్, లీస్క్ కొన్ని పరుగులు చేసినా మళ్లీ షమీ బ్రేక్ త్రూ ఇచ్చారు. తర్వాత రవీంద్ర జడేజా మరో వికెట్ తీశారు. 17 ఓవర్ లో చెలరేగిన షమీ వరుసగా రెండు వికెట్లు తీశాడు. మరొకరు రనౌట్ గా అవుటయ్యాడు. చివరికి స్కాట్లాండ్ 85 పరుగులకే అలౌట్ అయింది. షమీ మూడు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ కోసం భారత్ రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, జడేజాలతో స్పిన్ కాంబినేషన్ ను రంగంలోకి దింపింది. శార్దూల్ ఠాకూర్ ను ఈ మ్యాచ్ కు పక్కనబెట్టారు. పేస్ విభాగంలో బుమ్రా, షమీ ఇద్దరికే చోటు కల్పించారు. మరో పేసర్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను ఉపయోగించుకుంది.