వరి నిషేదిత జాబితాలో ఉందా..! సిద్దిపేట కలెక్టర్ పై హైకోర్టు సీరియస్..

వరిని పడ్డించవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అగ్గి రాజేస్తున్నాయి. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణహైకోర్టు మండిపడింది. వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా మెజిస్ట్రేట్ గా ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారే.. చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. వరి విత్తనాలను అమ్మవద్దంటూ వారికి ఆదేశాలు జారీ చేశారు. అమ్మినట్టు తెలిస్తే సీజ్ చేస్తానని హెచ్చరించారు. వరి విక్రయించిన దుకాణాలను తెరవాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా తాను లెక్కచేయనని కలెక్టర్‌ అన్నారు. దీనిపై సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.  పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని వాదించారు. వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కామెంట్లు  కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్‌ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.  ‘జిల్లా మెజిస్ట్రేట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం క్రిమినల్‌ కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది. భవిష్యత్తులో కలెక్టర్‌కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కలెక్టర్‌పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

హుజురాబాద్ పై హాట్ హాట్ గా కాంగ్రెస్ మీటింగ్.. జానారెడ్డి సంచలనం

హుజురాబాద్ ఉప ఎన్నిక మంటలు కాంగ్రెస్ లో చల్లరాడం లేదు. డిపాజిట్ కూడా రాకపోవడంతో పీసీసీ నేతలపై కొందరు సీనియర్లు గుస్సా అవుతున్నారు. ఓపెన్ గానే తమ అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  ఎన్నికల ఫలితాలు, పార్టీ ప‌రిస్థితిపై చర్చించ‌డానికి  గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటీ సమావేశమైంది.  ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితిపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా బలహీనపడేటట్లు చేస్తున్నారని భట్టి విక్రమార్కపై రేణుక అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీఎల్పీ నేతనని.. పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్లు భట్టి విక్రమార్క సమాధానమిచ్చినా ఆమె సంతృప్తి చెందలేదు. సీఎల్పీ నేత అయితే సమస్యలు పరిష్కరించాలే కానీ సృష్టించ వద్దని రేణుక హితవు పలికారు.   అనంతరం మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతూ తనను మీడియా ముందు మాట్లాడవద్దని అంటున్నారని.. కొంతమంది నేతలు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారని అన్నారు. హుజూరాబాద్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా ఎస్సీని నిలబెడితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు.  ఊహించిన‌ట్లుగానే కాంగ్రెస్ స‌మావేశం చాలా వాడీవేడిగా కొనసాగింది. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని ల‌క్ష్యం చేసుకుని పార్టీ కీల‌క నేత‌లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే వారిద్ద‌రూ ఈ స‌మావేశానికి హాజ‌రు కాలేదు. ఈ స‌మావేశానికి హాజ‌రై, రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నిస్తాన‌ని నిన్న జ‌గ్గారెడ్డి తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న రాలేదు. సమావేశంలో పాల్గొన్న నేతలే హుజురాబాద్ ఫలితంపై సమీక్ష నిర్వహించారు.  ఇక ఈ స‌మావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. వెళ్తూ ఆ.న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిసారి సమావేశానికి తానిక రాన‌ని, త‌న‌ అవసరం ఉన్నప్పుడే వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఒక‌వేళ తాను ఈ సమావేశానికి హాజ‌రుకాక‌పోతే, తాను రాలేదని అంటారని, ఆ మాట ప‌డ‌కూడ‌ద‌నే వ‌చ్చి వెళ్తున్నాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు జానారెడ్డి. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే మరోవైపు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌ నుంచి వెళ్లిపోయారు.

మీ అయ్య జాగీరా?.. గులాబీ సభకు పొలాలు ఇవ్వం.. రైతుల గొడ‌వ‌..

తెలంగాణ‌లో సైలెంట్ విప్ల‌వం వ‌స్తోంది. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఏక‌మ‌వుతున్నారు. రైతులైతే ముఖ్య‌మంత్రిపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. వ‌రి వేస్తే ఉరేనంటూ కేసీఆర్ హెచ్చ‌రించ‌డాన్ని అన్న‌దాత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. అందుకే, కేసీఆర్ ప్రభుత్వానికే ఉరి వేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే హుజురాబాద్‌లో గులాబీ బాస్‌కు క‌ర్రుకాల్చి వాత‌పెట్టారు. పోయిన ప‌రువు నిల‌బెట్టుకోవ‌డానికి.. గులాబీ ప్ర‌భ ఇంకా త‌గ్గ‌లేద‌ని భ్ర‌మ పెట్ట‌డానికి.. వ‌రంగ‌ల్‌లో తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న పేరుతో స‌భ పెడుతున్నారు. మొద‌ట న‌వంబ‌ర్ 15న మీటింగ్ అనుకున్నా.. హుజురాబాద్ దెబ్బ‌కు ఆ స‌భ వెన‌క్కి మ‌ళ్లింది. న‌వంబ‌ర్ 29న దీక్షా దివ‌స్ నాడు.. 10 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఆ స‌భా ప్రాంగ‌ణానికీ రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుండటం క‌ల‌క‌లం రేపుతోంది.  హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ నిర్వహణకు స్థలం ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్‌ నేతలు, రైతుల మధ్య తోపులాట జరిగింది.  ‘విజయ గర్జన’ సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి త‌దిత‌రులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం వెళ్లారు. గ్రామ శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్న ప్రజాప్రతినిధుల ద‌గ్గ‌ర‌కు.. బీజేపీ నేతృత్వంలో స్థానిక రైతులు నిర‌స‌న తెల‌ప‌డానికి వ‌చ్చారు. పంట పండే తమ పొలాలను సభ కోసం ఇచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు.    అక్కడే ఉన్న స్థానిక టీఆర్ఎస్‌ నాయకులు.. రైతులు, బీజేపీ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జ‌రిగింది. కొంతమంది టీఆర్ఎస్‌ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులపై జరిగిన దాడిని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు ఆ పార్టీ నేత‌లు.   

మా తిండి ఖర్చు ఇంతే.. మంత్రిపై వాంఖ‌డే భార్య సెటైర్లు..

మ‌రాఠా రాజ‌కీయం రంజుగా సాగుతోంది. డ్ర‌గ్స్ కేసులో షారుక్‌ఖాన్ కొడుకు ఆర్య‌న్‌ఖాన్ అరెస్ట్ ఎపిసోడ్ పొలిటిక‌ల్‌గా కాక రేపుతోంది. ఎన్‌సీబీ వ‌ర్సెస్ మ‌హారాష్ట్ర స‌ర్కార్‌గా వివాదం మ‌లుపు తిరిగింది. త‌మ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నామ్ చేసి.. ముంబై ఇమేజ్‌ను డ్యామేజ్ చేయ‌డానికి కేంద్రం కుట్ర‌లు చేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. ఇక మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్.. ఎన్‌సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డేపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  పలువురిపై తప్పుడు కేసులు బనాయించి స‌మీర్ వాంఖ‌డే కోట్లకు పడగలెత్తాడని మంత్రి న‌వాబ్ మాలిక్‌ ఆరోపించారు. వాంఖ‌డే 70 వేల విలువైన చొక్కా, లక్ష విలువైన ట్రౌజర్, లక్షల విలువ చేసే చేతి గడియారాలు ధరిస్తున్నాడని కామెంట్ చేశారు. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను సమీర్ వాంఖ‌డే కొట్టిపారేశారు. ఆయనకు వాటి గురించి పెద్దగా తెలిసుండదని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.     తాజాగా, వాంఖ‌డే త‌ర‌ఫున ఆయ‌న‌ భార్య క్రాంతి రేడ్కర్ సైతం రంగంలోకి దిగారు. సమీర్‌కు సెటైరికల్‌గా కౌంట‌ర్లు వేశారు. తాము తిన్న లంచ్ ఖ‌రీదు ఇంతా అంటూ ఫోటోల‌తో స‌హా డీటైల్స్ వెల్ల‌డించారు. మళ్లీ రేపు ఎప్పుడైనా తాము తినే తిండి గురించి ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా ఆధారాలతో సహా ఈ ట్వీట్ చేస్తున్నానన్నారు వాంఖ‌డే భార్య రేడ్క‌ర్‌.  ‘మేం ఈ రోజు మధ్యాహ్న భోజనంలో దాల్‌ మఖ్నీ, జీరా రైస్ తీసుకున్నాం. జీరా రైస్ ఇంట్లో తయారు చేసిందే. దాల్ మఖ్నీ బయటనుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాని ధర రూ.190. మళ్లీ భవిష్యత్తులో ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యంకాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చు. అందుకే ఆధారాలతో సహా వెల్లడిస్తున్నాను’ అని ట్విటర్‌లో క్రాంతి రేడ్క‌ర్ పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 

కేసీఆర్ కు మరో గండం.. వేములవాడలో ఏం జరుగునో? 

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రాగానే తెలంగాణలోమరో ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ సాగుతోంది. ఈటల రాజేదంర్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న కమలనాధులు.. త్వరలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయమని, కేసీఆర్ షాక్ తప్పదని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో రాబోయే ఉప ఎన్నిక ఎక్కడన్న చర్చ జనాల్లో నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై కోర్టులో కేసు కొనసాగుతోంది. దీనిపై చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అక్కడ మళ్లీ ఉప ఎన్నిక ఖాయం. ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.  చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు విచారణ హైకోర్టులో జరుగుతోంది. పలు సార్లు వాదనలు జరిగాయి. కేంద్ర హోంశాఖ కూడా కౌంటర్ వేసింది. చెన్నమనేనికి వ్యతిరేకంగా కేంద్రం కౌంటర్ వేయడంతో.. ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోవండ ఖాయమని అంటున్నారు. కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి సైతం తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధం కావాలని అన్నట్టుగా వ్యాఖ్యానించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేదని కామెంట్ చేసింది.   హుజురాబాద్ ఫలితం తర్వాత చెన్నమనేని కేసును ప్రస్తావిస్తూ వేములవాడలో ఉప ఎన్నిక రాబోతుందని చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ కూడా తామే కచ్చితంగా గెలుస్తామని అన్నారు. సీనియర్ న్యాయవాదిగా ఉన్న రఘునందన్ రావు ఈ విషయం  చెప్పడంతో వేములవాడలో ఉప ఎన్నిక ఖాయమే అంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. అది కేటీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంటుంది. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు తెలంగాణలో నాలుగు సార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య మరణంతో దుబ్బాక, నాగార్జునసాగర్, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ.. తాజాగా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించి గులాబీ పార్టీని సవాల్ చేస్తోంది.  అయితే పార్టీకి షాక్ తగిలిన వెంటనే తనదైన శైలిలో వ్యూహాలు రచించి అంతా తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో.. తర్వాత జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఫోకస్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఓడించేలా ఎత్తుగడలు వేశారు. ఇప్పుడు హుజురాబాద్ లో ఓడిపోవడంతో... వేములవాడ ఉప ఎన్నికపై కేసీఆర్ సీరియస్ వర్క్ చేస్తారని అంటున్నారు. హుజురాబాద్ ఓటమితో గులాబీ పార్టీలో నిస్తేజం అలుముకుంది. పార్టీ లీడర్లు ఢీలా పడ్డారు. దీంతో కేడర్ లో జోష్ నింపే ప్లాన్స్ కేసీఆర్ చేస్తారని, అందుకు వేములవాడను ఉపయోగించుకుంటారని అంటున్నారు. ఎలాగూ చెన్నమనేనిపై కేసు ఉన్నందున.. తీర్పు వచ్చే వరకు ఆగకుండా అతనితో రాజీనామా చేయింది...ఉప ఎన్నిక వచ్చేలా గులాబీ బాసే  వ్యూహరచన చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా వేములవాడకు ఉప ఎన్నిక వస్తే మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కనున్నాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్ కు సవాల్ గా మారనున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమంటున్న కాంగ్రెస్ కు అత్యంత కీలకంగా మారబోతోంది. 

మా పార్టీలో చేరండి.. మోదీకి విదేశీ ప్రధాని రిక్వెస్ట్..

న‌రేంద్ర మోదీ. ఇది పేరు కాదు ప‌వ‌ర్‌. అత్యంత జ‌నాక‌ర్ష‌ణ ఉన్న నాయ‌కుడు-పాల‌కుడు. భార‌త్‌లో తిరుగులేని నేత‌. ఆయ‌న ఇమేజ్ కేవ‌లం ఇండియాకు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. దేశ‌విదేశాల్లోనూ మోదీకి మంచి క్రేజ్ ఉంది. మ‌న‌ ప్ర‌ధాని ఏ దేశంలో అడుగుపెట్టినా.. అక్క‌డి భార‌తీయులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అంత‌టి జ‌నాద‌ర‌ణ చూసి.. ఆయా దేశాల అధ్య‌క్షులు అవాక్క‌వుతుంటారు. ఎన్నారైల్లోనే కాదు.. ఫారెన‌ర్స్‌లోనూ మోదీకి బాగానే పాపులారిటీ ఉంది. ప్ర‌జ‌ల్లోనే కాదు.. ప‌లు దేశాధ్య‌క్షుల్లోనూ మోదీకి అభిమానులు ఉన్నారు. ఆ కోవ‌లో ఒక‌రే.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని నాఫ్తాలీ బెన్నెట్‌.  తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాని.. మ‌న మోదీకి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఆఫ‌ర్ అన‌డం కంటే.. రిక్వెస్ట్ చేశార‌న‌డం క‌రెక్ట్‌. ఇంత‌కీ ఆయ‌నేం అడిగారు.. ఈయ‌నేం చెప్పారంటే... భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో మంచి ప్రజాదరణ ఉందని చెప్పారు నాఫ్తాలీ బెన్నెట్‌. అందుకే, మోదీ తమ యామినా పార్టీలో చేరాలని ఇజ్రాయెల్‌ ప్రధాని ఆహ్వానించారు. మోదీ త‌మ పార్టీలో చేరితే.. ఆయ‌న ఇమేజ్ క‌లిసొచ్చి.. తాము ఈజీగా నెగ్గుతామ‌నేది ఆయ‌న భావ‌న‌. ఇజ్రాయెల్ అధినేత స‌ర‌దాగానే ఈ ప్ర‌పోజ‌ల్ తీసుకొచ్చినా.. ఆ అంశం మోదీకి ఉన్న పాపులారిటీకి, క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. ఇండియాలోనే కాదు.. ఏ దేశ‌మేగినా.. మోదీ ఇమేజ్ అదుర్స్‌..అంటున్నారు.   హైటెక్‌ పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై సహకారాన్ని విస్తరించుకోవడంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతున్నందువల్ల భారత్‌ రావాలని బెన్నెట్‌ను మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య మైత్రిని మోదీ బలోపేతం చేశారని ఇజ్రాయెల్‌ ప్రధాని కొనియాడారు.  ‘‘నేను ఒకప్పుడు హైటెక్‌ కంపెనీని నడిపేవాడిని. ఆ తర్వాత అమెరికాలోని ఒక భారతీయ కంపెనీలో దాన్ని విలీనం చేశా. అనంతరం ఇరు దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసి, అద్భుత ఆవిష్కరణలు చేశారు. మీ నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది’’ అంటూ రెండు దేశాల ఆవిష్కర్తల మధ్య అద్భుత సమన్వయం ఉందంటూ స్వీయ అనుభవాన్ని వివరించారు ఇజ్రాయెల్ ప్ర‌ధాని.   

ఈట‌ల వార్నింగ్‌.. గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ రిక్వెస్ట్‌.. టీడీపీపై కేసులు.. టాప్‌న్యూస్ @1pm

1. హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని హెచ్చ‌రించారు బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌. త‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించిన‌ టీఆర్ఎస్ నేత‌ల‌ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని చెప్పారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. తనను గెలిపించిన హుజురాబాద్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళిత బంధు వాళ్ల‌ దగ్గరకు ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు. 2. గవర్నర్ అప్రమత్తంగా ఉండకపోతే, ఆయనను.. ఆయన ఉండే ఇంటిని కూడా కూడా తాకట్టు పెట్టేస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సంతకం పెట్టే ముందు జాగ్రత్తగా చూడాలని గ‌వ‌ర్న‌ర్‌కు మనవి చేశారు. రుషికొండలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్‌కి సమయం లేదని విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు.  3. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు 48 మంది టీడీపీ కార్యకర్తలపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మంగ‌ళ‌వారం నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా... ర్యాలీలో పాల్గొన్న టీడీపీ ముఖ్య నేతలపై టెక్కలి పోలీసులు కేసు పెట్టారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, మోటార్ వాహన చట్టం కింద ప‌లు సెక్ష‌న్లు ఫైల్ చేశారు. 4. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమపై నమోదైన కేసులో సీఆర్పీసీలోని 41 ఎ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రిని దూషించారు అంటూ బోండా ఉమపై గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై బోండా ఉమ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీలోని 41 ఎ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. 5. హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌కు కేవలం 3వేల ఓట్లు రావడం పెద్ద షాక్ అన్నారు. కనీసం డిపాజిట్ కూడా రాలేదని, నాన్ లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి బలిపశువును చేశారని అన్నారు. కోమ‌టిరెడ్డి, జ‌గ్గారెడ్డి, పొన్నం.. ఇలా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. 6. వైఎస్ షర్మిల 15వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కుర్మెడు గ్రామం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. విరాట్ నగర్ కాలనీ, కూర్మపల్లి, సాయిరెడ్డి గూడెం, మోదుగుల మల్లెపల్లి, పి.కె.మల్లెపల్లి కిష్టారాయనపల్లి వరకూ పాదయాత్ర, మాట ముచ్చట కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు కిష్టారాయనపల్లిలో బస చేయనున్నారు ష‌ర్మిల‌. 7. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెంలో నగర పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు.. రోడ్ల‌పై గుంటల్లో నిలిచిన వర్షపు నీటిని బురదలో దాటేందుకు సర్కస్ ఫీట్లు చేశారు. రోడ్డు ప్రక్కన నడవలేక, బురద గుంటలు దాటలేక ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులు రోడ్ల దుస్థితికి అద్దం ప‌డుతున్నాయి. తాము నిత్యం పడుతున్న ఇబ్బందులేంటో ఇప్పుడు ఆ నేత‌ల‌కు తెలిసొచ్చిందంటూ స్థానికులు చర్చించుకున్నారు. 8. కడప జిల్లాలోని వేంపల్లెలో టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులు రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఇన్నోవా వాహనం, ఇంట్లోని వస్తువులను ధ్వంసమయ్యాయి. ఘటనపై బాధితుడు కృష్ణారెడ్డి వేంపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  9. అంతర్రాష్ట్ర సరిహద్దు ద‌గ్గ‌ర‌ తెలంగాణ రాష్ట్రం నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.62,280 విలువ చేసే 579 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సీసాలు అమ్మిన తెలంగాణాకు చెందిన మద్యం షాప్ యాజమనులపై కేసులు నమోదు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. 10. హైద‌రాబాద్‌ నార్సింగి పరిధిలో సినీ హీరో నాగ శౌర్య‌ ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన ముఠాలో 29మందికి బెయిల్‌ మంజూరైంది. వారిలో మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ భద్రయ్యతో పాటు ప‌లువురు రియల్టర్‌లు, వ్యాపారులు ఉన్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. 29మందికి బెయిల్‌ మంజూరు కాగా.. ప్రధాన నిందితుడు సుమన్‌కు బెయిల్‌ నిరాకరించింది కోర్టు. సుమ‌న్‌ను రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి ఇవ్వ‌గా.. అత‌న్ని లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.   

కేసీఆర్ కు ఇద్దరు మొనగాళ్ల దెబ్బ.. గులాబీ పార్టీకి ఇక గండాలేనా? 

ఉప ఎన్నికలు.. తెలంగాణ రాష్ట్ర సమితికి అచ్చొచ్చిన అంశం. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి ఉపఎన్నికలనే అస్త్త్రాలుగా మార్చుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికల ద్వారానే కారు పార్టీ జనంలోకి చోచ్చుకుని వెళ్లగలిగింది. వైఎస్సార్  టైమ్ లో కొన్ని ఓడిపోయినా.. బైపోల్స్ మాత్రం టీఆర్ఎస్ కు బూస్ట్ ఇస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర్రం వచ్చాక కూడా ఉప ఎన్నికల్లో సత్తా చాటింది గులాబీ పార్టీ. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరగగా.. ఆరింటిలో టీఆర్‌ఎస్‌ పార్టీయే జయకేతనం ఎగురవేసింది.  2014లో మెదక్ లోక్ సభ, 2015లో జరిగిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయం సాధించింది కారు పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో 2016లో పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. 2016లోనే నారాయణ్ ఖేడ్ కు జరిగిన ఉప ఎన్నికలోనూ కారు దూసుకుపోయింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతికి షాకిచ్చింది గులాబీ పార్టీ. నోముల నర్సింహయ్య మరణంతో 2021 లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం జానారెడ్డిని మట్టికరిపించి సత్తా చాటింది అధికార పార్టీ.  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. అవి దుబ్బాక, తాజాగా జరిగిన హుజురాబాద్. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు రఘునందన్ రావు. తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బంపర్ విక్టరీ కొట్టి కారుకు షాకిచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ ను ఎదురించి నిలిచిన ఇద్దరు మొనగాళ్లుగా రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నిలిచారు. కేసీఆర్ వ్యూహాలు, కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టడం వల్లే ఈ ఇద్దరు విజయం సాధించారని చెబుతున్నారు.  రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది కేసీఆర్ ఎత్తుగడులను ఊహించి తిప్పికొట్టడమే. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కాబట్టే అధికార పార్డీని ఓడించగలిగారు ఈ ఇద్దరు నేతలు. ఇందుకు వాళ్లు గతంలో కేసీఆర్ తో పనిచేసిన అనుభవమే సహకరించిందని అంటున్నారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల్లో రఘునందన్ ఒకరు. కేసీఆర్ కోటరిలో ముఖ్యుడిగా ఉన్నారు. 2001-13 మధ్య టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు రచించండంతో కేసీఆర్ కు రఘునందన్ రావు కీలకంగా ఉన్నారు. 2006, 2008, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ తో కలిసి రఘునందన్ రావు వ్యూహాలు రచించారు. 2013లో కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014లో బీజేపీలో చేరారు రఘునందన్ రావు. ఇక ఈటల రాజేందర్ 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్ కు దగ్గరయ్యారు. పార్టీలో టాప్ ఫైవ్ లీడర్లలో ఒకరిగా నిలిచారు. హుజురాబాద్ నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు ఈటల. 2009లో అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించారు. బీసీ లీడర్ గా ఎదిగిన రాజేందర్.. కేసీఆర్ కు కుడిభుజంగా నిలిచారని చెబుతున్నారు. రాజకీయ ఎత్తుగడలను ఈటల ద్వారానే కేసీఆర్ అమలు చేసే వారంటారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యమ సంఘాలు, కుల సంఘాలను చీల్చడంలోఈటలను కేసీఆర్ పావుగా వాడారని చెబుతారు. మందకృష్ణ, ఆర్ కృష్ణయ్యకు పోటీగా కొత్త సంఘాలు ఏర్పాటైంది అందులో భాగాంగానే. కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయో అతి దగ్గరగా చూసిన వ్యక్తి ఈటల రాజేందర్. సిద్దిపేట నుంచి నాగార్జున సాగర్ వరకు.. అన్ని ఉప ఎన్నికల్లో కీలకంగానే వ్యవరించారు ఈటల రాజేందర్.  కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటం, ఆయన ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టే... దుబ్బాక, హుజురాబాద్ లో వాళ్లిద్దరు అధికార పార్టీని ఎదుర్కొని నిలిచారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా తమ ఎత్తుగడలు అమలు చేయడం, సైలెంటుగా పని కానియడం కలిసివచ్చిందనే చర్చ నడుస్తోంది. తాజా విజయంతో అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ఇకపై సభలో అధికార పార్టీకి చుక్కలు కనిపిస్తాయని, రాజా సింగ్, రఘునందన్ రావు, రాజేందర్ లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయమంటున్నారు. గతంలో ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం రాజేందర్ కు ఉంది. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలను ఎదురించారు రాజేందర్. ఇకపై కేసీఆర్ ను చీల్చి చెండాడుతారని అంటున్నారు. ఇంతకాలం అసెంబ్లీ ఏకపక్షంగా సాగేదని, ఇకపై కేసీఆర్ కు సమస్యలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. 

కేసీఆర్‌పై RRR ఫైట్‌.. అసెంబ్లీలో అబ్ ఆయేగా మ‌జా...

RRR. రాజ‌మౌళి తీస్తున్న సినిమా గ్లిమ్స్ ఎంత సెన్సేష‌న‌ల్‌గా మారిందో.. హుజురాబాద్‌ పొలిటిక‌ల్ గ్లిమ్స్ కూడా అంతే సంచ‌ల‌నంగా నిలిచింది. RRR. రాజాసింగ్‌. ర‌ఘునంద‌న్‌రావు. ఈట‌ల రాజేంద‌ర్‌. బీజేపీ త‌ర‌ఫున‌ ముగ్గురు మొన‌గాళ్లు. అసెంబ్లీలో కేసీఆర్‌ను కుమ్మేసేందుకు కాలు దువ్వుతున్న పోట్ల‌గిత్తెలు. ప్ర‌భుత్వాన్ని అడుగ‌డుగునా నిల‌దీసేందుకు.. స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను స‌భ‌లో ఎండ‌గ‌ట్టేందుకు.. కేసీఆర్ పాల‌నా రీతిని నిగ్గ‌దీసి అడిగేందుకు.. అవినీతిని నిప్పుల‌తో క‌డిగేసేందుకు.. క‌ద‌నోత్సాహంతో సిద్ధ‌మ‌వుతున్నారు ఆ ముగ్గురు.  మ‌ద‌పుటేనుగు లాంటి కేసీఆర్‌ను.. త‌న విజ‌యంతో బంధించేలా ఈట‌ల రాజేంద‌ర్ అసెంబ్లీకి దూసుకొస్తున్నారు. రాజ్యం త‌న‌ యావ‌త్ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని మోహ‌రించి.. కుట్ర‌లు, కుతంత్రాల‌కు తెగించి.. ప‌థ‌కాలు, పైస‌లు వెద‌జ‌ల్లినా.. హుజురాబాద్ మాత్రం ఈట‌లకు జీహుజూర్ అంది. త‌మ బిడ్డ‌ను క‌డుపులో పెట్టుకుని సాదుకుంటామ‌ని తేల్చిచెప్పేసింది. ఈట‌ల విజ‌యం కేసీఆర్ ప‌త‌నానికి నాంది అంటున్నారు. హుజురాబాద్ గెలుపుతో కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా దెబ్బ‌కొట్టిన రాజేంద‌ర్‌.. ఇక అసెంబ్లీలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని చీల్చిచెండాడేందుకు త‌న మిగ‌తా ఇద్ద‌రు స‌హ‌చ‌రుల‌తో క‌లిసి రెడీ అవుతున్నారు.   RRRలో మొద‌టి R..రాజాసింగ్‌. ఓల్డ్‌సిటీకా రాజా. పాత‌బ‌స్తీ గ‌బ్బ‌ర్‌సింగ్‌. ఏళ్లుగా మ‌జ్లిస్‌పై సింగిల్ హ్యాండ్‌తో పోరాడుతున్న నిఖార్సైన లోట‌స్ వారియ‌ర్‌. గో సంర‌క్ష‌ణ కోసం తీవ్రంగా పాటుబ‌డుతున్న నాయ‌కుడు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. సింహం సింగిల్‌గా అన్న‌ట్టు.. హౌజ్‌లో బీజేపీకి మౌత్‌స్పీక‌ర్‌గా నిలిచారు. మొద‌ట్లో ఒంట‌రి పోరాటం చేసినా.. ఆ త‌ర్వాత ర‌ఘునంద‌న్ తోడ‌య్యారు. ఇప్పుడు గ‌జేంద్రుడిలా రాజేంద్రుడు జ‌త క‌లిశారు. ఆ ముగ్గురి క‌ల‌యిక‌తో అసెంబ్లీలో అబ్ ఆయేగా మ‌జా.. అంటున్నారు.  RRRలో రెండో R.. ర‌ఘునంద‌న్‌రావు. బీజేపీ నేత‌ల్లోకెల్లా బ‌ల‌మైన వాయిస్‌. స్వ‌త‌హాగా లాయ‌ర్ అయిన ర‌ఘునంద‌న్‌.. ప్ర‌భుత్వ లోటుపాట్ల‌ను.. లా పాయింట్‌ల‌ను..  బ‌య‌ట‌కు లాగి కేసీఆర్ స‌ర్కారును గ‌ట్టిగా ప్ర‌శ్నించే స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు. హుజురాబాద్‌లానే దుబ్బాక‌లో జ‌రిగిన హోరాహోరీ ఫైట్‌లో నెగ్గి.. అసెంబ్లీలో కేసీఆర్ నోటితోనే ర‌ఘునంద‌న్‌రావుకు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని పొగిడించుకునేలా ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్నారు. ఇన్నాళ్లూ అసెంబ్లీలో బీజేపీ త‌ర‌ఫున మేజ‌ర్ వాయిస్ వినిపించిన ర‌ఘునంద‌న్‌కు.. కేసీఆర్ అంత‌టిస్థాయి ఉన్న‌ ఈట‌ల రాజేంద‌ర్‌లాంటి ఉద్య‌మ‌నాయ‌కుడు తోడ‌వ‌డం వెయ్యి ఏనుగుల బ‌లం క‌లిసొచ్చిన‌ట్టే. RRRలో మూడో R.. రాజేంద‌ర్‌. ఒక‌ప్పుడు టీఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత కేసీఆర్ అంత‌టివారు. ఉద్య‌మాన్ని ముందుండి ఉర‌క‌లెత్తించిన నాయ‌కుడు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ప్ర‌ధాన భాగ‌స్వామి. కీల‌క శాఖ‌ల‌కు మంత్రులుగా ప‌ని చేసిన అనుభ‌వం. కేసీఆర్‌ను రెండు ద‌శాబ్దాలుగా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించిన‌ రైట్‌హ్యాండ్‌. కేసీఆర్ గుట్టు.. లోటుపాట్లు.. స‌ర్వం తెలిసిన ఆంత‌రంగికుడు. గులాబీ పాల‌నలో సాగుతున్న ధ‌న‌యజ్ఞానికి ప్ర‌త్య‌క్ష సాక్షి. కేసీఆర్ నియంతృత్వం.. మంత్రులను డ‌మ్మీ చేసే గుణం.. అధికారుల బేల‌త‌నం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ అరాచ‌కత్వం.. ఇలా కేసీఆర్ ఆయువుప‌ట్టు తెలిసిన స‌మ‌ర్థ‌మైన నేత‌. అలాంటి ఈట‌ల ఇప్పుడు కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా.. బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడితే.. ఇప్పుడుంటుంది అస‌లైన మ‌జా..అంటున్నారు. గ‌తంలో వైఎస్సార్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుడినే ధిక్క‌రించి.. అసెంబ్లీలో ద‌డ‌ద‌డ‌లాడించిన ఈట‌ల రాజేంద‌ర్‌.. ఇప్పుడిక కేసీఆర్‌ను గ‌డ‌గ‌డ‌లాడించేందుకు కాషాయ‌కండువాతో స‌భ‌లో అడుగుపెడుతున్నారు.  ఇలా ముగ్గురు బీజేపీ మొన‌గాళ్లు.. RRR రూపంలో అసెంబ్లీలో కేసీఆర్‌తో భీక‌ర యుద్ధం చేసేందుకు సై.. అంటే సై సైరా.. అంటూ క‌లిసొస్తున్నారు. ఇక‌, గులాబీ బాస్‌కు ముందుందంతా.. ముస‌ళ్ల పండ‌గే..అంటున్నారు.

కుట్రదారులు కుట్రలతోనే నాశనం! కేసీఆర్ కు ఈటల శాపం..

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఎన్ని కుట్రలు చేసినా తనను ఓడించలేకపోయారని చెప్పారు. ప్రజలంతా ఏకోన్ముఖంగా కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు ఈటల. ప్రపంచ చరిత్రలో ఈ ఫలితం గొప్ప అధ్యాయమన్నారు. వందల కోట్ల రూపాయలు, మద్యం, పథకాలు పెట్టినా, ప్రతి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం బావుటాను ఎగురవేసి విధంగా ధర్మం వైపు.. హుజరాబాద్ ప్రజలు నిలబడ్డారన్నాపు ఈటల రాజేందర్. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా.. వాళ్ల రుణం తీర్చుకోలేనేంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  తనపై కుట్రలు చేసి కేసీఆర్ బయటికి పంపిస్తే బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు ఈటల రాజేందర్. తనకు అన్ని రకాలుగా అండగా ఉంటానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తనకు బాసటగా నిలిచారని చెప్పారు. 2018లో తనకు లక్షల 4 వేల ఓట్లు వస్తే ఇప్పుడు లక్ష 7 వేల ఓట్లు వచ్చాయన్నారు. తన జెండాతో, తన బొమ్మతో నేను గెలిచానని అహంకారంగా మాట్లాడారో.. దానికి విరుద్ధంగా ప్రజలు పిలుపునిచ్చారని రాజేందర్ వెల్లడించారు. కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయమన్నారు. 10 లక్షలు ఇచ్చినా అమ్ముడుపోబోమని  దళిత బిడ్డలు ఎంతో గొప్పగా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని చెప్పారు.  స్మశాన వాటికలకు పిలిపించుకొని మరీ డబ్బులు పంచారని ఆరోపించారు ఈటల రాజేందర్. ముందుగా 6000, తర్వాత నాలుగు వేల చొప్పున పంచారన్నారు. పోలీసుల అండతో ఎస్కార్ట్ వాహనంలో డబ్బులు తెచ్చి పంచారని చెప్పారు.చివరికి తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి దేవుడు ముందు ప్రమాణం చేయించుకున్నారని తెలిపారు. పెన్షన్ పోతుందని వృద్ధులను బెదిరించారని ఆరోపించారు. దళిత బంధు కూడా ఆపేస్తామని భయపెట్టారని తెలిపారు.  కుట్రదారులు ఎప్పుడు కుట్రలతోనే నాశనం అవుతారన్నారు ఈటల రాజేందర్. తనపై పోటీకి రావాలని కేసీఆర్, హరీష్ రావు కు సవాల్ చేస్తే.. రాకపోగా పొలగాన్ని నిలబెట్టారన్నారు. రెండు గుంటల వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా ఖర్చు చేశాడని ఈటల ప్రశ్నించారు. కుట్రలతో  దొంగ ఉత్తరాలతో తనను ఓడించాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగిందన్నారు. హుజురాబాద్ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు ఈటల రాజేందర్. 

మూడోరోజు జోరుగా అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’..

క‌దం క‌దం క‌దిపారు. అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారు. వారి ల‌క్ష్యం ఒక‌టే. వారి గ‌మ్యం ఒక‌టే. అమ‌రావ‌తినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించ‌డం. ఆంధ్రుల క‌ల‌ల కేపిట‌ల్‌ను మూడు ముక్క‌లు చేసే ప్ర‌య‌త్నాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం విర‌మించుకోవ‌డం. ఇందుకోసం రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. అయినా.. పాల‌కుల తీరు మార‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. దీంతో.. జ‌గ‌న్‌రెడ్డి బండ‌రాయి హృద‌యాన్ని ఆ దేవుడే మార్చాలంటూ.. క‌లియుగ వెంక‌న్న స్వామికి మొక్కుకోవ‌డానికి అమ‌రావ‌తి రైతులు దండుగా క‌దిలారు. త‌మ గోడు మిగ‌తా జిల్లాల వారికీ తెలిసేలా.. మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. ఉరిమే ఉత్సాహంతో.. స‌డ‌ల‌ని సంక‌ల్పంతో.. అడుగులో అడుగు వేస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తిరుమ‌ల బాట ప‌ట్టారు అమ‌రావ‌తి రైతులు. రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. యాత్ర‌ గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమైంది. 10.8 కిలోమీటర్ల మేర చేసే ఈ పాదయాత్ర గుంటూరు నగరంలో కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు గుంటూరు నగరవాసులు సంఘీభావం తెలిపారు. యాత్రలో టీడీపీ నేత ఆలపాటి రాజా, చలసాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర మూడోరోజు పుల్లడిగుంటలో ముగియనుంది. అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది.    

టీఆర్ఎస్ కు నవంబర్ గండం.. ఉద్యమకారుల చేతిలో పరాభవం

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొచ్చినా పని చేయలేదు. కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు హుజురాబాద్ ఓటర్లు. హుజురాబాద్ ఫలితం తర్వాత మరో అంశం అసక్తికరంగా మారింది. నవంబర్ నెల సీఎం కేసీఆర్ కు అచ్చిరావడం లేదనే చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఇప్పటివరకు 8 ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఆరింటిలో టీఆర్ఎస్ గెలవగా.. రెండు చోట్ల మాత్రమే ఓడింది.అవి మెదక్ జిల్లా దుబ్బాక, కరీంనగర్ జిల్లా హుజురాబాద్. అయితే ఈ రెండు ఎన్నికల ఫలితం నవంబర్ లోనే వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు నవంబర్ నెల గండం అనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవడంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీకి 2020 నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికను టీఆర్ఎస్ సవాల్ గా తీసుకుంది. మంత్రి హరీష్ రావే ఇంచార్జీగా ఉన్నారు. హుజురాబాద్ తరహాలోనే పోరాడారు. అయినా ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి సంచలనం స్పష్టించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.  తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ లోనే వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనంత హీట్ పుట్టించిన హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిస్తూ ఘన విజయం సాధించారు ఈటల రాజేందర్. దీంతో నవంబర్ మాసం కేసీఆర్ గండం అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో ముందున్నవారే. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే కావడం మరింత ఆసక్తికరం.    

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రిజైన్! హోరెత్తుతున్న సోషల్ మీడియా.. 

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో సంచనంగా మారింది. రాజకీయ సమీకరణల మార్పునకు నాంది కాబోతోంది. ఈటల రాజేందర్ ఘన విజయంతో బీజేపీ పండుగ చేసుకుంటోంది. తమకు డిపాజిట్ రాకపోయినా కేసీఆర్ ను ఓడించామనే సంతోషంలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఉద్యమ సంఘాలన్ని ఊరట చెందాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం నిస్తేజం అలుముకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోవడంతో గులాబీ లీడర్లంతా సైలెంట్ అయిపోయారు. హుజురాబాద్ ఫలితం తర్వాత కొత్త చర్చ తెరపైకి వచ్చింది. హుజురాబాద్ ఉప సమరం సందర్భంగా జరిగిన టీవీ ఛానల్లో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు నడిచాయి. కొందరు నేతలు రాజీనామా సవాళ్లు చేశారు. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఇలాంటి సవాలే చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు గువ్వల బాలరాదు.  హుజురాబాద్ బై పోల్స్‌ పై  సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు.  హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.అంతేకాదు కొందరు నేరుగా గువ్వలకు ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. దీంతో ఫోన్ కాల్స్ రివీస్ చేసుకోలేక ఎమ్మెల్యే బాలరాజ్ తన ఫోన్ ను స్విచ్చాఫ్ చేసుకున్నారని చెబుతున్నారు. 

నామినేటెడ్ పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యే రూ. 5.5 కోట్ల డీల్.. జడ్పీటీసీ పేరుతో లేఖ వైరల్ 

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం అవినీతి ,అక్రమాలకు కేరాఫ్ గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఏ పని జరగాలన్న అధికారులకు, స్థానిక వైసీపీ నేతలకు ఎంతో కొంత ఇస్తే కాని పని జరగదనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. మైనింగ్, సాండ్, లిక్కర్.. ఇలా అన్ని అంశాల్లోనూ కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు కూడా వచ్చాయి. తాజాగా తమ పార్టీ కార్యకర్తలను కూడా పదవుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు లంచం అడగడం కలకలం రేపుతోంది.  నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రూ. 5.5 కోట్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లేఖ చక్కర్లు కొడుతోంది. ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి.సుచిత్ర సీఎం జగన్‌కు ఈ లేఖ రాసినట్టుగా ఉంది. తనకు జడ్పీ వైస్ చైర్మన్ పదవిని కానీ, లేదంటే ఆర్టీసీ చైర్మన్ అదీ కుదరకుంటే వైసీపీ కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన నుంచి రూ. 5.5 కోట్లు తీసుకున్నారని సుచిత్ర ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ఉంది.  అయితే ఎమ్మెల్యే హామీలేవీ నెరవేరకపోవడంతో తిరిగి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరానని లేఖలో జడ్పీటీసీ సభ్యురాలు కోరినట్లుగా ఉంది. బెంగళూరు వస్తే ఇస్తానని చెబితే అక్కడికి వెళ్తే బెదిరించారని, అంతేకాక, తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానన్నారని వాపోయారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించారని పేర్కొన్నారు. ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని, కాబట్టి మీరే (జగన్) కాపాడాలని కోరినట్టుగా ఆ లేఖలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్పందించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపడేసిన ఎమ్మెల్యే.. అంతా దేవుడే చూసుకుంటాడని అన్నారు.

బీజేపీలోకి ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు! త్వరలో మరో ఉప ఎన్నిక? 

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ పై ఆత్మగౌరవం గెలిచిందంటూ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. హుజురాబాద్ గెలుపు సంబరంలో ఉన్న దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందన్నారు. ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కమలం పార్దీదే విజయమన్నారు. ఓ టీవీ ఛానెల్ స్టూడియోలో మాట్లాడిన రఘునందన్ రావు మరో సంచలన కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. త్వరలోనే వారంతా కార పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండవా కప్పుకుంటారని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే మరో ఉప ఎన్నిక రాబోతుందన్నారు రఘునందన్ రావు. సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పై త్వరలోనే అనర్హత వేటు పడనుందని తెలిపారు. వేములవాడకు జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీదే విజయమని చెప్పారు రఘునందన్ రావు. రఘునందన్ రావు కామెంట్లతో బీజేపీతో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎవరన్నదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అందులో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు క్లారిటీగానే ఉంది. గతంలో తాను బీజేపీలో చేరబోతున్నాననే సంకేతం ఇచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతే త్వరలో కమలం గూటికి చేరతారని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేసే బీజేపీలో చేరతారని, అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం సాగుతోంది. 

ఓట‌మికి బాధ్య‌త నాదే.. కేడ‌ర్‌కు రేవంత్ భ‌రోసా..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలకు సంపూర్ణ బాధ్యత త‌న‌దే అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిరుత్సాహ ప‌డ‌వ‌ద్ద‌ని.. వారికి అండ‌గా ఉంటాన‌ని రేవంత్ భ‌రోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇంకా నిబద్ధతతో, పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కొట్లాడతా. ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకు ఉన్నాయి. ఇవాళ కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్‌లో వారిని నూటికి నూరుశాతం కాపాడుకుంటాం. ఉప ఎన్నిక ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి.. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ధారించుకుని ముందుకెళ్తాం అని ప్ర‌క‌టించారు రేవంత్‌రెడ్డి. ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కార్యకర్తలను ఎంతో నిరాశకు గురిచేశాయి. అయినా, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్‌ను నిర్ధారించలేవు, నిర్ణయించలేదు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రత్యేక మైన పరిస్థితిల్లో జరిగింది. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బల్మూరి వెంకట్‌ గ్రామ.. గ్రామం తిరిగి ఓటర్లను కలిశారు. భవిష్యత్‌లో వెంకట్‌ మంచి నాయకుడు అవుతారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు.. ఓడిపోతే కుంగిపోయేది లేదని అన్నారు రేవంత్‌రెడ్డి. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపాకు 1673 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఉప ఎన్నికలో ఆ పార్టీ నెగ్గింది. మొన్న జరిగిన నాగార్జున సాగర్‌ ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. అంత మాత్రాన ఆపార్టీ మూసేసింది లేదు.. మిగతా పార్టీలు 10 అంతస్తుల బంగ్లాలు కట్టింది లేదు. కార్యకర్తలకు అండగా నేనుంటా.. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించే వరకు పోరాడుదాం’’ అని రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా పిలుపునిచ్చారు.  

హుజూరాబాద్ ఏం తేల్చింది..? జస్ట్, పది నిష్ఠుర నిజాలు..!

తెలంగాణలోనే ఓ మాట ఉంది… కుతికల దాకా కుక్కితే ఇసం అయితది, కక్కేస్తరు హుజురాబాద్ ఉప ఎన్నికలో అదే జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వరాలు ఇచ్చినా, వందల కోట్లు కుమ్మరించినా అక్కడి ఓటర్లు తిరస్కరించారు. తాను అనుకున్నవారికే జై కొట్టారు. సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఓట్లతో ఎన్నికను గెలవలేరని నిరూపించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత... ఆ ఎన్నిక ఏం తేల్చిందన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. 10 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.     1. వోటుకు అడ్డగోలుగా ధర పెంచేసి, జనాన్ని ‘ఆరు వేల’ తో కొనుక్కోవచ్చునన్న ‘ధన‌అహం’ ప్రతిసారీ గెలిపించదు   2. అడిగిన ఫైళ్లన్నీ ఆగమేఘాల మీద శాంక్షన్ చేసేసి, పనులు చేసి, చిన్న నాయకుల్ని కొనే పథకాలూ ఫలించవు   3.  తాత్కాలిక భ్రమాత్మక పథకాలతో, పదిలక్షల చొప్పున సర్కారు ఖజానా నుంచే పంచినా కొన్నిసార్లు పనిచేయదు  4.   ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాసోహమైపోయినా, ప్రభుత్వం చెప్పినట్టు నడిచినా కొన్నిసార్లు ఫలితం లేదు 5.    అనేకానేక సోషల్ ఫేక్ పోస్టులతో దుష్ప్రచారాలు సాగిస్తే, అవి రిజల్ట్ ఇవ్వకపోగా ఎదురుతన్నే ప్రమాదం ఉంది 6.  ప్రజలకు తెలియని ఏవో కారణాలతో ఒకరిని టార్గెట్ చేసి, రాజీనామా చేయించి, ఎన్నిక రుద్దితే జనం మెచ్చరు 7.  కులాల నడుమ చీలిక తెచ్చి, వోట్ల కోసం కొందరికే ‘ప్రభుత్వ నిధులు’ అందేలా చేస్తే మిగతా సమాజం హర్షించదు  8.   చిన్నాచితకా నాయకులను ప్రలోభపెట్టి, బెదిరించి, లోబరుచుకున్నా సరే, వాళ్లు చెబితే సగటు వోటరు వినడు 9. ప్రజలు ఒక్కసారి ఫిక్సయిపోతే, ఇక పాలకుడు భూమ్యాకాశాల్ని ఏకం చేసినా సరే, ఇక వ్యతిరేక ఫలితం మారదు 10. టీఆర్ఎస్ వోడిపోలేదు, బీజేపీ గెలవలేదు. ఈటల పట్ల కేసీఆర్ వ్యవహారధోరణి ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు హుజురాబాద్ లో  పోల్ మేనేజిమెంట్ ఇక ఎవరితోనూ కాదు అన్నట్టుగా చేసింది TRS… ఏదీ విడిచిపెట్టలేదు… కొత్తగా అక్కడి నేతలకు కార్పొరేషన్ పదవులు, MLC ఇచ్చారు… 84 ఊళ్ళల్లో అప్పటికిప్పుడు రోడ్లు వేశారు… రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్, మొత్కుపల్లి తదితరులను పిలిచి కండువాలు కప్పారు… కృష్ణయ్యను పిలిచి నూటాపన్నెండును మించిన బీసీ సంఘాలన్నీ కారుకే మద్దతు అనిపించారు… ఇవేకాదు… అసలు ఈ రేంజ్‌లో ఒక ఎన్నిక మీద సంపూర్ణ సాధనసంపత్తిని వినియోగించడం బహుశా దేశంలోనే మొదటిసారి కావచ్చు… అయితేనేం జనం తూచ్ అనేశారు. హుజురాబాద్ ఫలితం తర్వాత కేసీఆర్ ఎవరూ ఓడించలేనంత బలవంతుడేమీ కాదు అని తేలిపోయింది. సాంకేతికంగా  ఇది బీజేపీ గెలుపు అయినా..  అక్షరాలా ఇది ఈటల వ్యక్తిగత గెలుపు. తనకు బీజేపీ శ్రేణులే కాదు,,బయటపడకుండా ఇతర పార్టీలు బోలెడు సహకరించాయి. అనేక సెక్షన్లు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి. టీఆర్ఎస్‌ శ్రేణుల్లోనే ఎందరు మనస్పూర్తిగా పనిచేశారనేదే పెద్ద సందేహం. పోలింగ్ అయిపోయిక ఒక్కసారిగా టీఆర్ఎస్ క్యాంపు నిశ్శబ్దంలో మునిగిపోయినప్పుడే అర్థమైంది ఫలితం. విజయగర్జన సభను వాయిదా వేస్తున్నప్పుడే అర్థమైంది ఫలితం.హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతోందన్నది కాలమే చెబుతుంది. 

ఈటలకే జై హుజూర్.. కేసీఆర్ పై ఆత్మగౌరవ విజయం!

సంక్షేమ పథకాలు సాయం కాలేదు.. దళిత బంధు దారి చూప లేదు.. ఓటర్లకు కుమ్మరించిన నోట్ల కట్టలు కనికరించలేదు.. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి ఓటర్లు చుక్కలు చూపించారు. చిత్తుచిత్తుగా ఓడించారు. సీఎం కేసీఆర్ పై ఆత్మ గౌరవ నినాదం ఎత్తిన ఈటల రాజేందర్ కు జై కొట్టారు. బంపర్ మెజార్టీతో గెలిచించి జై హుజూర్ అనిపించారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే మంచి మెజార్టీతో గెలిచారు ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కమలం చతికిలపడినా.. హుజురాబాద్ లో గెలిపించడం ద్వారా హూజురాబాద్ ఓటర్లు తమది చైతన్యగడ్డని మరోసారి నిరూపించారు.  హుజురాబాద్ కౌంటింగ్ లో మొదటి నుంచి ఈటల రాజేందర్ లీడ్ కనబరిచారు. పోస్టల్ బ్యాలెట్ లో కారు కొంత లీడ్ వచ్చినా ఈవీఎమ్ కౌంటింగ్ లో మాత్రం ఫస్ట్ రౌండ్ లో లీడ్ సాధించారు. మొదటి రౌండ్ లో 160 ఓట్లతో మొదలైన ఆధిక్యం రౌండ్ రౌండ్ కు పెరుగుతూ వచ్చింది. మొదటగా లెక్కించిన హుజురాబాద్ మండలంలో రెండు పార్టీల మధ్య కొంత టఫ్ పైట్ నడిచింది. అయినా ఐదు రౌండ్లు ముగిసేసరికి 3 వేల లీడ్ లోకి వచ్చారు రాజేందర్. తర్వాత జరిగిన వీణవంక మండలంలోనూ జైత్రయాత్ర కొనసాగించారు. వీణవంక మండలం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత మండలం కావడంతో.. ఇక్కడ కారుకు లీడ్ వస్తుందని అంతా భావించారు. కాని గెల్లు సొంతూరులోనూ 191 ఓట్లు ఎక్కువ సాధించిన ఈటల.. వీణవంక మండలంలో తిరుగులేని మెజార్టీ సాధించారు. వీణవంకకు సంబంధించి ఒక్క 8 రౌండ్ లో మాత్రమే గెల్లుకు స్వల్ప మెజార్టీ వచ్చింది. జమ్మికుంట మండలంలో వార్ వన్ సైడ్ గా సాగింది. 11 రౌండ్ తప్పించి మిగితా అన్ని రౌండ్లలో కమలం హవా కనిపించింది. మొదటి రౌండ్లలో వందల్లో వచ్చి న మెజార్టీ జమ్మికుంట మండలంలో మాత్రం వేలల్లోకి వెళ్లింది. దీంతో ఈటల లీడ్ అంతకంతుకు పెరుగుతూ వెళ్లింది. టీఆర్ఎస్ తమకు మెజార్టీ వస్తుందని లెక్కులు వేసుకున్న ఇల్లంతకుంట మండలంలోనూ ఈటల రాజేందర్ తిరుగులేని ఓట్లు సాధించారు. ఇల్లంతుకుంట మండలానికి సంబంధించిన నాలుగు రౌండ్లలోనూ ఈటలకు మంచి మెజార్టీ వచ్చింది. ఇక ఈటల సొంత మండలం కమలాపూర్ లో కమలం జెట్ స్పీడులో దూసుకుపోయింది. కమలాపూర్ కు సంబంధించి చివరి నాలుగు రౌండ్లలో ఈటలకు దాదాపు 8 వేల మెజార్టీ వచ్చింది.  మొదట కౌంటింగ్ జరిగిన హుజురాబాద్ మండలం నుంచి కమలాపూర్ మండలం వరకు అన్నిమండలాల్లోనూ ఈటల రాజేందర్ లీడ్ సాధించారు. మొత్తం 22  రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. 8, 11 రౌండ్లలో మాత్రం గెల్లుకు స్వల్ప ఆధిక్యం వచ్చింది.  గెల్లు సొంతూరు హిమ్మత్ నగర్ తో పాటు కౌశిక్ రెడ్డి సొంతూరులో ఈటలే లీడ్ సాధించారు. టీఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు సొంతూరులో కమలానికి 3 వందలకు పైగా మెజార్టీ వచ్చింది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్నిప్రారంభించిన హుజురాబాద్ మండలం శాలపల్లిలోనూ ఈటలకే జైకొట్టారు ఓటర్లు. 

ఈట‌ల గెలుపున‌కు స్ట్రాంగ్ రీజ‌న్‌ ఇదే!.. రాజేంద‌ర్‌నే రారాజు చేసిన హుజురాబాద్‌

హుజురాబాద్ ఈట‌ల‌కే ఈల‌ కొట్టింది. రాజేంద‌ర్‌నే రారాజును చేసింది. క‌న్న‌బిడ్డ‌నే క‌డుపున పెట్టుకుని కాపాడింది. ఈట‌ల రాజేంద‌ర్ చావోరేవో తేల్చుకున్నారు. బ‌ల‌మైన శ‌క్తుల‌తో పోరాడి.. రాజ‌కీయంగా గ‌ట్టిగా నిల‌బ‌డి.. విజ‌యం సాధించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో మంచి మెజార్టీతో గెలిచారు. త‌న గెలుపుతో హుజురాబాద్‌లో తొలిసారి కాషాయ జెండా రెప‌రెప‌లాడించారు. అయితే, ఈ విజ‌యం అంత సునాయాసంగా రాలేదు. చాలా క‌ష్ట‌ప‌డ్డారు. చాలా క‌ష్ట పెట్టారు. అనేక క‌ష్ట న‌ష్టాల‌కు ఓర్చారు. రాజ్యంపై బ‌లంగా పోరాడి.. కసిగా గెలిచి చూపించారు. ఈట‌ల విజ‌యానికి అనేక అంశాలు క‌లిసొచ్చాయి. కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త‌తో పాటు ఈట‌ల‌పై అభిమాన‌మూ ఈ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి.  ఈటల గెలుపున‌కు ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న‌పై వెల్లువెత్తిన సానుభూతి. చంపుకుంటారో.. సాధుకుంటారో మీ ఇష్టం అంటూ ప్ర‌జ‌ల‌ను వేడుకున్నారు ఈట‌ల‌. త‌మ బిడ్డ‌కు ఎంత క‌ష్టం వ‌చ్చిందంటూ.. ఇంత క‌ష్టం తీసుకొచ్చారంటూ.. జ‌నాలు ఈట‌ల‌పై సానుభూతి కురిపించారు. సొంత‌బిడ్డ‌ను క‌డుపులో పెట్టుకొని.. గెలిపించారు. ఈట‌ల‌ను ఒంట‌రి చేసేందుకు అధికార పార్టీ చేసిన‌ ప్ర‌య‌త్నాల‌న్నిటినీ చూసిన హుజురాబాద్ అస‌హ్యించుకుంది. ఈట‌ల సైతం పోక‌డ‌ల‌కు పోకుండా.. సింపుల్‌గా ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్య‌ర్థించారు. తాను మాత్ర‌మే మీవాడిన‌ని.. మీలో ఒక‌డ‌ని.. త‌న‌ను గెలిపించుకునే బాధ్య‌త మీదేనంటూ.. మ‌నం మ‌నం హుజురాబాద్ సెంటిమెంట్ రాజేశారు. అది బాగా ప్ర‌భావం చూపింది అంటున్నారు. ఈట‌ల మ‌నోడు.. కేసీఆర్ కుట్ర‌ల‌కు బ‌లైనోడు అంటూ.. జ‌న‌మంతా రాజేంద‌ర్‌ను అక్కున చేర్చుకున్నారు. ఓట్లేసి గెలిపించుకున్నారు. కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. ఈట‌ల‌కు టీఆర్ఎస్ అంటించిన‌ అవినీతి మ‌కిలి తేలిపోయింది. ఈట‌ల‌ అవినీతి చేసి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానికి టీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. పార్టీలో కొంద‌రి పెత్తనాన్ని సహించలేక ప్రశ్నించడం వల్లనే ఈట‌ల‌ను టార్గెట్ చేశార‌ని భావించారు. టీఆర్ఎస్ నేతలంతా ఈటలపై మూకుమ్మడిగా మాటల దాడి చేయడంతో ఆయన ఒంటరివారయ్యారనే సానుభూతి క‌లిగేలా చేసింది. అందుకే పథకాలు, పైస‌ల‌తో ప్రలోభ పెట్టినా హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంటే నిలిచారు.. గెలిపించుకున్నారు.