పిచ్చోడి చేతిలో రాయిలా పీకే వ్యూహాలు!.. తల పగిలేది ఎవరికో?
దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, పదికి పైగా రాష్ట్రల్లో బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందులో మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయినా, కేంద్ర ప్రభుత్వాన్నిముఖ్యంగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా జోడీని ఢీ అంటే ఢీ అని ఢీకొనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే , పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒక్కరే, కనిపిస్తారు. మమతా బెనర్జీ గురించి ఇంకే విషయంలో అయినా ఎవరికైనా అభ్యంతరం లేదా భిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చును కానీ, మోడీ, షా జోడీని ఎదిరించే దమ్మున్న ముఖ్యమంత్రి దీదీ ఒక్కరే అనే విషయంలో మాత్రం ఎఎరికీ భిన్నాబిప్రాయం ఉండదు. నిజానికి ఆమె రాజకీయ జీవితం అంతా అలాగే సాగుతూ వచ్చింది అనుకోండి అది వేరే విషయం.
అదలా ఉంటే, వరసగా మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నమమతా దీదీ దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు మరలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గోవాలో పర్యటించిన ఆమె తమ మనసులో కోరికను నేరుగా బయట పెట్టేందుకు, కొద్దిగా చాలా సిగ్గును అభినయించినా, ప్రధాని పదవిపై ఆమె మనసు పారేసుకున్నారు, అనేది మాత్రం నిజం.అది ఇప్పటికే దేశం అంతటికీ తెలిసిన బహిరంగ రహస్యం.
కాగా, గోవాలో పర్యటనలో మీడియా ముందుకొచ్చిన మమత 2024 ప్రధాని రేసులో ఉన్నారా అని అడిగితే, “అన్నీ ఇప్పుడే చెప్పెస్తే ఎలా ... రేపు చెప్పుకునేందుకు ఏముంటుంది?” అంటూ చిరు నవ్వుతో సమాధానాన్ని దాట వేశారు. నిజానికి దీదీ ప్రధాని ప్రధాని రేసులో ఉన్నారనే వార్త ఇప్పుడు కాదు చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా దీదీ కానీ, చివరకు ఆమెను పీఎం చేసే ‘కాంట్రాక్టు’ పుచ్చుకున్న ‘కిరాయి’ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ కానీ, ఎక్కడా ఆవిషయం చెప్పలేదు.కానీ, 2024 ఎన్నికల్లో ప్రధాని పదవికి దీదీ పోటీలో ఉంటారనే ఊహాగానాలు మాత్రం షికారు చేస్తున్నాయి.
అయితే, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సరికి, తృణమూల్ కాంగ్రెస్’ పేరుకు జాతీయ పార్టీ అయినా, ఆ పార్టీ ప్రభావం, ఈరోజు వరకు అయితే చాలా వరకు బెంగాల్ వరకే పరిమితం. లోక్ సభ మొత్తం స్థానాల సంఖ్య 543 అందులో తృణమూల్ గట్టిగా పోటీ ఇవ్వగల స్థానాలు, బెంగాల్’లోని 42 స్థానాలు మాత్రమే. అక్కడ కూడా తృణమూల్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ 22 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది.
ఒరిస్సా, అస్సాం, జార్ఖండ్, బిహార్, అండమాన్’ లలో కూడా తృణమూల్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ఒక్క సీటులో కూడా దీదీ గెలవలేదు. జాతీయ స్థాయిలో తృణమూల్’కు వచ్చింది 22 సీట్లు (అన్నీ బెంగాల్ నుంచే), అలాగే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు శాతం మాత్రమే. అదే కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే, కేవలం 52 సీట్లు మాత్రమే వచ్చిన 2019 ఎన్నికల్లోనూ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించుగా 20 (19.49) శాతం వరకు ఓట్లు పోలయ్యాయి.(మూడు వందలకు పైగా సీట్లు దక్కించుకున్న బీజేపీకి వచ్చింది, 32శాతం ఓట్లు మాత్రమే)
అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వరసగా మూడవ సారి విజయం సాధించడం, అధికారానికి నిచ్చెనలు వేసిన బీజేపీ, ముఖ్యంగా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న మోడీ, షా జోడీ చతికిల పడడంతో మమతా దీదీ, నేషనల్ ఇమేజ్ హటాత్తుగా పెరిగిపోయింది. మరో వంక, ఆమెను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ కూడా ఫైపైకి పాకింది. దీంతో, బీజేపీ వ్యతిరేక శక్తులకు ఆ ఇద్దరూ ఆశా జ్యోతిగా కనిపించారు.
మరోవంక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కిరాయి వ్యూహాలకు ఇక స్వస్తి అని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, కొత్త అవతారంలో కాంగ్రెస్/రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే ప్రయత్నం చేశారు. అలాగే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, చివరకు బీజేపీ, మోడీని ఓడించడం రాహుల్ గాంధీతో కాంగ్రెస్ తో కాదని, నిర్ణయానికి వచ్చారో, లేక అది కూడా వ్యూహంలో భాగమో ఏమో కానీ, ప్రశాంత్ కిశోర్ మకాం బెంగాల్’కు మార్చారు. మమత పంచన చేరి కాంగ్రెస్’ టార్గెట్’ గా మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.మమతను జాతీయ నేతను చేసి 2024 ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు పార్టీ విస్తరణకు మమత నడుం బిగించారు.వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గోవాలో కాలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో వంక 2024 లోక్ సభ ఎన్నికలు లక్ష్యంగా పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఒక్క గోవాలోనే కాదు, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగి యూపీ సహా ఇతర రాష్టల్లోనూ కాంగ్రెస్ నాయకులను తృణమూల్’లో చేర్చేందుకు, ప్రశాంత్ కిశోర్ బృందం పనిచేస్తోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, లూయిజినో ఫిలేరియో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తృణమూల్’లో చేరారు. అలాగే, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు, యూపీలో ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్ల్యేలు కూడా తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, కాంగ్రెస్ టార్గెట్’గా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ, పరోక్షంగా బీజీపీకి మేలు చేస్తుందే, కానీ, ప్రధాని పీఠం ఎక్కాలనే, దీదీ కలను ఎలా నిజం చేస్తుందనేది,ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న.అయితే ఇది ఒక్క పీకేకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆయన గుప్పిట విప్పితేనే కానీ, అసలు వ్యూహం ఏమిటి? అనేది తేలదు. రాహుల్ పోయి .. మమత వచ్చే .. అన్నట్లుగా మరో బాంబు పేలుస్తారా ... చూడవలసిందే.. పిచ్చోడి చేతిలో రాయి ఏ తలకు అయినా తగలవచ్చును కదా...