గంగిరెద్దుకు గూగుల్ పే.. అవాక్కైన కేంద్రమంత్రి.. భలే ఐడియా గురూ..
posted on Nov 5, 2021 @ 1:38PM
టీ తాగితే గూగుల్ పే తో పేమెంట్. పానీపూరీ తింటే ఫోన్‌పే తో నగదు చెల్లింపు. సూపర్ మార్కెట్ కెళితే అమేజాన్ పే. ఆన్‌లైన్లో కొంటే కార్డ్ పే. లక్ష రూపాయల సరుకైనా.. రూపాయ్ చాక్లెట్ అయినా.. ఏది కొన్నా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు చాలామంది. ఆన్‌లైన్ పేమెంట్స్ ఇటీవల కాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. నగారాల్లో 80శాతం డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా.. గ్రామాల్లోనూ గూగుల్ పే, ఫోన్ పేల వాడకం భారీగా జరుగుతోంది. జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేసిన జనాలు.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌తోనే పే చేస్తున్నారు. ఈ మార్పు కొందరికి ఇబ్బందిగా మారింది. దీంతో వారుసైతం డిజిటల్ దారి పట్టారు. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదికాస్తా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను చేరింది. ఆ వీడియో చూసి ఆమె అవాక్కయ్యారు. వెంటనే తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇంతకీ.. ఏంటా వీడియో?
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను ఆమె తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో గంగిరెద్దు తలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను అమర్చగా.. ఓ వ్యక్తి దాన్ని స్కాన్ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి భిక్ష పంపించాడు. ఈ వీడియోను నిర్మలా సీతారామన్ పోస్ట్ చేశారు.
‘‘గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో ఇది. ఇందులో వారు క్యూఆర్ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారు. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరింది’’ అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు ఎద్దులను అలంకరించి పండగల సమయాల్లో ఇంటింటికీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారని వివరించారు నిర్మలా సీతారామన్.