బెజవాడ టూ జబల్పూర్.. హోంమంత్రి సుచ‌రిత‌కి ర‌ఘురామ ఖ‌త‌ర్నాక్‌ షాక్‌..

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తెలుసుగా. ఆయ‌న టార్గెట్ ఒక్క‌టే. త‌న పార్టీని మాగ్జిమ‌మ్ డ్యామేజ్ చేయ‌డ‌మే. జ‌గ‌న్‌కు నిద్ర లేకుండా చేసేలా కేసుల మీద కేసులు వేయ‌డ‌మే. ప్ర‌భుత్వ లోటుపాట్ల‌ను, ప‌థ‌కాల్లో డొల్ల‌త‌నాన్ని, పాల‌న‌లో త‌ప్పుడు విధానాల‌ను నిత్యం ఎండ‌గ‌ట్ట‌డ‌మే ఆయ‌న ప‌ని. జ‌గ‌న్‌కి, విజ‌య‌సాయికి, వైసీపీకి చుక్క‌లు చూపిస్తూ.. ఎక్క‌డ త‌ప్పు క‌నిపిస్తే చాలు.. ఆ పాయింట్ ప‌ట్టుకొని ఎందాకైనా వెళ‌తారు. చివ‌రి వ‌ర‌కూ పోరాడుతారు. ఓట‌మిని అస్స‌లు ఒప్పుకోరు. గ‌తంలో ఏ1, ఏ2ల బెయిల్ ర‌ద్దు చేసి జైలుకు త‌ర‌లించాలంటూ సీబీఐ కోర్టులో కేసులు వేసి గ‌ట్టిగా ట్రై చేశారు. ఆ త‌ర్వాత‌ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇలా వ‌ద‌ల బొమ్మాళీ అంటూ వైసీపీ వెంటే ప‌డుతున్నారు ర‌ఘురామ‌. తాజాగా, ఏపీ హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రితకు ఖ‌త‌ర్నాక్ షాక్ ఇచ్చారు ర‌ఘురామ కృష్ణ‌రాజు.  ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాకర్ ఇటీవ‌ల విజయవాడ ఐటీ కమిషనర్‌గా వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్ర‌భుత్వం మ‌న‌దే.. ప‌ట్టుకునే ఐటీ అధికారీ మ‌నోడే అంటూ సంబ‌రాలు చేసుకున్నారు. ఈ విష‌యం ర‌ఘురామ‌కు తెలిసింది. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా రంగంలోకి దిగిపోయారు. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఐటి కమీషనర్ గా హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ని విజయవాడలో నియమించటం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అని కంప్లైంట్ చేశారు. ఆయన జాయినింగ్ రోజు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా జత పరిచారు. క‌ట్ చేస్తే.. ఐటీ క‌మిష‌న‌ర్‌ మేక‌తోటి ద‌యాక‌ర్‌ను విజ‌య‌వాడ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్పూర్‌కు బ‌దిలీ చేశారు. ర‌ఘురామ దెబ్బ‌కు వైసీపీ శ్రేణుల ఉత్సాహ‌మంతా నీరుగారిపోయింది.  కేంద్ర హోంశాఖ‌కు రూల్స్ తెలీవ‌ని అనుకోలేం. వైసీపీ పెద్ద‌ల లాబీయింగ్‌తోటే మేక‌తోటి ద‌యాక‌ర్‌ను విజ‌య‌వాడ బ‌దిలీ చేసి ఉంటార‌ని అంటున్నారు. అంత స్ట్రాంగ్ రిఫ‌రెన్స్ ఉన్నా కూడా.. ర‌ఘురామ ఎంట్రీతో అదంతా తుస్సుమందంటే మామూలు విష‌యం కాదు. అంటే, కేంద్రంలో వైసీపీ పెద్ద‌ల‌ కంటే.. ర‌ఘురామ వెయిటే ఎక్కువ అన్న‌ట్టేగా? అంతేగా..! అంతేగా...!!

లిక్కర్ తరహాలోనే పెట్రోల్ స్మగ్లింగ్! జగనన్న పాలన స్పెషల్.. 

ఆంధ్రప్రదేశ్ లో అంతా స్పెషలే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో ఒకలా ఉంటే.. ఏపీలో మరోలా ఉంటోంది. సాగునీటి ప్రాజెక్టులు సహా అన్ని అంశాల్లోనూ అంతే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై జనాలు భగ్గుమంటున్నారు. జనాలకు ఇష్టమైన బ్రాండ్లను పక్కనపెట్టి.. నాసిరకమైన కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ధరలు కూడా భారీగా పెంచేశారు. దీంతో ఏపీకి పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది.  ఏపీలో ధరలు ఎక్కువగా ఉండడం.. ప్రజలకు అలవాటైన సంప్రదాయ బ్రాండ్లు లేకపోవడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని రవాణా చేసుకుని..ఏపీలో విక్రయించే ముఠాలు ఏర్పడ్డాయి. ఏపీతో పోలిస్తే..  తెలంగాణలో మద్యం ధరలు చాలా చౌక. దీంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన మద్యం అలవాటు ఉన్న ప్రజలు.. తెలంగాణలోకి వెళ్లి మద్యం తాగి వస్తున్నారు.  కొందరు కొన్ని బాటిళ్లను కొనుగోలు చేసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తొలుత మూడు బాటిళ్లను తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. అవి ఏసైజు బాటిళ్లయినా.. అనుమతించింది. గత ఏడాది చివరిలో ఈ మూడు బాటిళ్లను కూడా బ్యాన్ చేసింది. అయినా వివిధ మార్గాల్లో ఏపీకి అక్రం మద్యం బాటిళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.  లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు కష్టాలు పడుతుండగా.. తాజాగా జగన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీపావళి సందర్భంగా కేంద్రం పెట్రోల్ పై రూ. 5 డీజిల్ పై రూ.10 వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం బాటలోనే వ్యాట్ తగ్గించుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.12.  డీజిల్ ధర రూ.17 వరకు తగ్గింది.  కానీ ఏపీ సర్కార్ మాత్రం తగ్గించలేదు. దీంతో కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర 12 రూపాయలు, డీజిల్ ధర 17 రూపాయలు ఎక్కువగా ఉంది. దీంతో కర్ణాటక సరహద్దులో ఉన్న బంకులకు ఏపీ జనాలు వెళుతున్నారు.  ఏపీ సరిహద్దుల్లోని రాళ్లబుడుగూరు ప్రాంతంలో కర్ణాటకకు చెందిన కెంపేపుర సరిహద్దు ఉంది. ఇక్కడి బంకు యజమానులు.. ఏపీలోను తమ వద్ధ ఉన్న ధరలను పోలుస్తూ..కరపత్రాలను ముద్రించారు. వీటిని తెలుగులో నే ముద్రించి.. ఏపీలో కంటే తమదగ్గరే పెట్రోల్ ధరలు తక్కువని..తమ వద్ద పెట్రోల్ కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ పెట్రో బిజినెస్ జోరుగా సాగుతోంది. గతంలో రోజుకు 3000-5000 లీటర్లు అమ్మే ఈ బంకులు.. ఇప్పుడు రోజుకు 15000 నుంచి 18000 లీటర్ల చొప్పున విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో  మొబైల్ విక్రయదారులు కూడా పెరిగిపోయారు. కర్ణాటక నుంచి తెస్తున్న పెట్రోల్ , డీజిల్ ను వారు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇది ఏపీ ఖజానాకు గండంగా మారింది.  కర్ణాటకలో ధరలు తగ్గించి.. కొంత మేరకు నష్టపోతున్నా.. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ను విక్రయిస్తూ.. ఆ నష్టాన్ని లాభాల రూపంలో మలుచుకుంటోంది.  జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కర్ణాటక బంకు యజమానులకు వరంగా మారిందని కొందరు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. మద్యంపై నిఘా పెట్టినట్టే.. సరిహద్దుల్లో జగన్ ప్రభుత్వం పెట్రోల్ ట్యాంకులపైనా నిఘా పెడుతుందా?  పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొనేవారిపై చర్యలు తీసుకుంటుందా?అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కర్ణాటక నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలు.. కేవలం 10 లీటర్లకు మించి పెట్రోల్ లేదా డీజిల్ తో రాకూడదని.. జగన్ సర్కారు ఏమైనా నిబంధనలు పెడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. 

రాజన్న రాజ్యంలో బతకలేకే వలసొచ్చాం.. కర్నూల్ కూలీ మాటతో షర్మిలక్క జంప్.. 

తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం తీసుకొచ్చామని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సొదరి షర్మిల.. తనకు అధికారమిస్తే తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇస్తున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో తిరుగుతున్న వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ ఎదురైంది. ఓ కూలి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆమె అక్కడి నుంచి జారుకోవాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. దారి మధ్యలో తనకు ఎదురైన ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు షర్మిలకు ఎదురయ్యారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు షర్మిల. ఎవరూ అధైర్య పడవద్దని, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని, మీ కష్టాలన్ని తీరుస్తానని చెప్పారు. షర్మిల మాటలకు కూలీ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మీ అన్న తెచ్చిన రాజన్న  రాజ్యంలో భతకలేకే కర్నూల్ నుంచి నల్గొండ జిల్లాకు వలస వచ్చాం అని ఆ కూలీ అనడంతో షర్మిల షాకయ్యారు. అతనికి ఏం చెప్పాలో తిెలియక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు కూలీలు కొంత కాలం క్రితం నల్గొండ జిల్లాకు పని కోసం వచ్చారు.పొలం పనులతో పాటు రోడ్డు నిర్మాణ పనులను వెళుతున్నారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు కూలీలు కనిపించడంతో ఆమె వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అయితే కూలీలు కర్నూల్ జిల్లా వాసులని తెలియకపోవడంతోనే షర్మిల రాజన్న రాజ్యం ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. షర్మిలకు ఎదురైన ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

1,246 కోట్ల క్విడ్‌ప్రోకో నిజ‌మే.. జ‌గ‌న్-హెటిరో కేసులో సీబీఐ స్ట్రాంగ్‌ వాద‌న‌లు..

అవును, జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలు ప‌క్కాగా స్కెచ్ వేశారు. అక్ర‌మ మార్గంలో వేల కోట్ల పెట్టుబ‌డులు లాగేశారు. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌లో జ‌గ‌న్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా పెట్ట‌లేదు.. హెటిరో డ్ర‌గ్స్ మాత్రం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. ఇది ప‌క్కా క్విడ్‌ప్రోకో అంటూ సీబీఐ తేల్చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముడుపులను పెట్టుబడుల రూపంలో స్వీకరించారని తెలిపింది. అదే విష‌యం హైకోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా సూటిగా వాదించింది. సీబీఐ వాద‌న‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల మెడ‌కు అక్ర‌మాస్తుల కేసు ఉచ్చు మ‌రింత బిగిసిన‌ట్టే అంటున్నారు.  జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సీబీఐ కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతో పాటు డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. తండ్రి అధికారాన్ని ఉపయోగించి ఇతరులకు ప్రయోజనాలు కల్పించడం ద్వారా జగన్‌ అక్రమ లబ్ధి పొందారని సీబీఐ త‌ర‌ఫు లాయ‌ర్ వాదించారు. ‘పిటిషనర్లు పెట్టుబడులు, భూకేటాయింపులను వేర్వేరుగా చెబుతున్నారు. అది సరికాదు. ఆ రెండింటిలోని అంశాలను కలిపి చూసినపుడే కుట్ర బయటపడుతుంది. ఇందులో హెటిరో కంపెనీ, ఎండీల పాత్రలను వేర్వేరుగా చూడలేం. బలమైన అనుమానాలున్నందునే సీబీఐ ముందుకెళ్లింది అని తెలిపారు.   హెటిరో హెల్త్‌కేర్‌లో కేంద్రం తనిఖీ చేసి ఇచ్చిన నివేదికలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలున్నాయి. జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. వాటాలను విక్రయించుకోలేకుండా, లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్‌ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్‌ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయి. అందులోనూ ఈ కేసు ప్రస్తుతం డిశ్ఛార్జి పిటిషన్‌ల దశలోనే ఉంది. సీబీఐ పూర్తి విచారణ జరిపితేనే.. ఆధారాలతో కేసును రుజువు చేయగలదు. హెటిరో పెట్టిన పెట్టుబడులను సమర్థించుకోవడానికి వీలుగా విజయసాయిరెడ్డి డెల్లాయిట్‌ నుంచి పాత తేదీతో వాల్యుయేషన్‌ నివేదిక తెప్పించారు. వాటాల విక్రయానికి అవకాశం లేదని, లాభాలు లేవని.. అన్నీ తెలిసే ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి’ అని సీబీఐ న్యాయవాది వాదించారు. ‘భూకేటాయింపుల్లో పరిణామాలను బట్టి.. జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయి. 2006 నవంబరులో రూ.2 కోట్లు, 2007 మార్చిలో హెటిరో రూ.3.88 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తదనుగుణంగా ఆ సంస్థకు 50 ఎకరాల భూకేటాయింపు జరిగింది. 2008లోనూ పెట్టుబడులు పెట్టిన తర్వాతే 75 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వంలో ఫైళ్ల కదలికను బట్టి పెట్టుబడులు వెళ్లాయి’ అని వాదించారు. హెటిరో కంపెనీ వ్యవహారాలతో.. డైరెక్టర్‌గా తన బాధ్యత లేదన్న శ్రీనివాసరెడ్డి వాదనను సీబీఐ న్యాయవాది తోసిపుచ్చారు. డైరెక్టర్లందరినీ నిందితులుగా చేర్చలేదని, కీలక పాత్ర పోషించిన వ్యక్తినే చేర్చామన్నారు. నిబంధనల ప్రకారమే సీబీఐ కోర్టు అభియోగ పత్రాన్ని విచారణకు పరిగణించిందని, అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ ఆరోపణలకు సమాధానం ఇస్తామని హెటిరో తరఫు సీనియర్‌ న్యాయవాది హైకోర్టును కోరారు. 

కేసీఆర్ కు సినిమా కనిపిస్తోందా? ఓటమి భయం వెంటాడుతోందా? వరుస ప్రెస్ మీట్ల పరామర్థమేంటీ.. 

తెలంగాణ ముఖ్యమంత్రిలో గతంలో ఎప్పుడు లేనంతగా భయం కనిపిస్తోందా? ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందా? అంటే కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తున్న వారి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ లో గుబులు పెరిగిందని అంటున్నారు. ఈటల రాజేందర్ విజయం తర్వాత మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఇకపై కేసీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని చెప్పారు. సంజయ్ చెప్పినట్లే ఇప్పుడు కేసీఆర్ కు సినిమా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.   కేసీఆర్ కు ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా పేరు పడింది. ఆయన సచివాలయం అసలే వెళ్లరు. ప్రగతి భవన్ లో ఉన్నా పాలన పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ప్రగతి భవన్ కంటే ఫౌంహౌజ్ లోనే ఎక్కువ ఉంటారు. అందుకే విపక్షాలు కేసీఆర్ పై ఫౌంహౌజ్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేస్తుంటారు.  అయితే రెండు రోజులుగా కేసీఆర్ రూట్ మార్చారు. నెలల తరబడి జనంలోకి వెళ్లని గులాబీ బాస్.. రెండు రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. గంటల తరబడి మాట్లాడారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  కేసీఆర్ నెలల తరబడి మీడియా ముందుకే రారు. అలాంటిది వరసుగా రెండు రోజులు... అది కూడా రెండు గంటల పాటు మీడియాతో మాట్లాడటంతో.. ఆయనలో అంత మార్పు ఎందుకు వచ్చిందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ షేకవుతున్నారని, ఆయనలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. హుజురాబాద్ ఓటమి నుంచి బయటపడక ముందే వరి ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కడం గులాబీ బాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. వరి విషయంలో కేసీఆర్ సర్కార్ తీరుపై రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే రిపోర్టులు ప్రగతి భవన్ కు వెళ్లాయంటున్నారు. ఆ నివేదికలు చూసిన కేసీఆర్ అవాక్కయ్యారని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటికే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో వారంతా కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గులాబీ బాస్ ను ఆటాడుకుంటున్నారు. దీంతో నిరుద్యోగుల ఓట్లపై కారు పార్టీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. ఇక ఉద్యోగ వర్గాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ తన ఆశలన్ని రైతులపైనే పెట్టుకున్నారు. నిజానికి రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలు ఇప్పటివరకు కేసీఆర్ కు సానుకూలంగా ఉన్నారు. 2018లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకమే ప్రధానమని అంటారు. అలాంటిది ప్రస్తుతం రైతులు కూడా కేసీఆర్ పై రగిలిపోతుండటం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతులంతా కేసీఆర్ పై తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తమ పంటను మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. వారం రోజులైనా ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వరి ధాన్యం కుప్పలపైనే గుండెలు పగిలి చనిపోతున్నారు. ఇదిలా ఉండగానే యాసంగిలో వరి పంట వేయవద్దంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల్లో మంట రాజేసింది. ఏడాది క్రితం మక్కలు వద్దు వరి పండించాలని పిలుపిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వరి ధాన్యం వద్దని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వరి వద్దంటే మరీ ఏం సాగుచేయాలని నిలదీస్తున్నారు. వరికి ఉరి వేస్తే.. కేసీఆర్ ప్రభుత్వానికి తాము ఉరి వేస్తామంటూ శపథం చేస్తున్నారు అన్నదాతలు. రైతుల ఆందోళనలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్.. ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యారని అంటున్నారు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడూ బాగు పడినట్లు చరిత్రలో లేదు గతంలో చాలా సార్లు చెప్పారు కేసీఆర్. ఇప్పుడే ఆయన అన్నదాతల జీవితాలతో ఆటలాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ ను టెన్షన్ పెట్టిస్తుందని అంటున్నారు. అందుకే  ఆ గండం నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.  ఓటమి భయం వల్లే ఆయనలో అసహనం పెరిగిపోయిందని చెబుతున్నారు. రెండు రోజులుగా కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను బట్టి... వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి ఖాయమని ఆయన క్లారీటికి వచ్చారని అంటున్నారు.

విరాట్ కోహ్లీకి బైబై.. వరల్డ్ కప్ లో భారత్ చెత్త షో 

టీట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఇంటికి చేరింది టీమ్ ఇండియా. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ పేలవమైన ఆట తీరుతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. టాప్ ఫెవరెట్ గా దుబాయ్ లో అడుగు పెట్టిన కోహ్లీ సేన... దాయాది పాకిస్తాన్ చేతిలో తొలి మ్యాచ్ లోనే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తర్వాత కివీస్ తోనూ పరాజయం పాలై సెమీస్ ఆశలు చేజార్చుకుంది. చివరి మూడు మ్యాచ్ ల్లో పసికూనలపై ఘన విజయాలు సాధించింది కోహ్లీసేన. ట్వీటంటీ వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించిన టీమ్ ఇండియా.. ఇద్దరు ప్లేయర్లకు వీడ్కోలు పలికింది.  టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు, బౌలింగ్‌లో ఆధిపత్యం కనబరిచిన భారత్‌ సునాయాస విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించినా సెమీస్‌ బెర్తు సాధించలేకపోయింది. గ్రూప్‌-2 నుంచి పాక్‌, కివీస్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన కోహ్లీకి, హెడ్‌ కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఘన వీడ్కోలు చెప్పినట్టైంది.   నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియాను భారత్‌ బౌలర్లు 132/8 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం టీమ్‌ఇండియా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో 136 పరుగుల చేసి విజయం  గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 56,  కేఎల్‌ రాహుల్ 54 పరుగులు చేశారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు అర్ధశతక (86) భాగస్వామ్యం నిర్మించారు. అయితే రోహిత్ ఔటైనా.. పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. అనంతరం సూర్యకుమార్ తో  కలిసి రాహుల్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. నమీబియా బౌలర్‌ ఫ్రైలింక్‌ ఒక వికెట్ తీశాడు.   నమీబియా బ్యాటర్లలో మైకెల్ 14, క్రెయిగ్‌ డకౌట్, ఎరాస్మస్ 12, జాన్‌ నికోల్‌ 5, స్మిత్ 9, ఫ్రైలింక్‌ 15*, రుబెన్ 13* పరుగులు చేశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్‌ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్‌ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు

తీన్మార్ మల్లన్నను జైలులో చంపాలని చూశారా? 

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పేరు హాట్ టాపిక్. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారు. గులాబీ లీడర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు మల్లన్న. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని వెనుక ఎవరున్నారు..? ఏం చేశారు..? ఎంత నొక్కేశారు..? ఫుల్ డేటేల్స్ తో ప్రజల ముందు పేట్టేవాడు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ టీఆర్ఎస్ నేతలకు కంట్లో నలకలా చుక్కలు చూపించాడు. అంతేకాదు  నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించి.. దాదాపుగా గెలిచినంత పని చేశారు తీన్మార్ మల్లన్న.  తీన్మార్ మల్లన్న తనకు కంట్లో నలుసుగా మారారని భావించిన కారు పార్టీ.. అతన్ని టార్గెట్ చేసింది. అప్పుడే లక్ష్మికాంతశర్మ అనే జ్యోతిష్యుడి కేసు తెరపైకొచ్చింది. డబ్బుల కోసం బెదిరించాడంటూ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టులో మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్న జైలులో ఉండగా ఒకదాని తర్వాత మరో కేసు తెరపైకి వచ్చాయి. ఆయనకు బెయిల్ రావడం కొత్త కేసులో మళ్లీ జైలుకు వెళ్లడం జరుగుతోంది. మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.  తాజాగా మరోసారి మల్లన్నకు బెయిల్ మంజూరైంది. 73 రోజుల జైలు జీవితం తర్వాత బయటకొచ్చారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. జైలులో తనని చంపాలని చూశారని అన్నారు. చంచల్ గూడ జైలులో సీఎం కేసీఆర్ బాధితులు 500 మంది వరకు ఉన్నారని పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. తెలంగాణ యావత్ ప్రజానీకానికి ప్రశ్నించే గొంతుకను 73 రోజులు జైలులో పెట్టారని అన్నారు మల్లన్న. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూశారని ఆరోపించారు. ఆఖరికి బయటకొస్తున్న చివరి నిమిషం వరకు అడ్డుకునే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా.. 73 రోజులు ఉన్నోడికి ఇంకో పది రోజులు లెక్కనా..? 33 కేసులు ఉన్నోడికి ఇంకో మూడు లెక్కనా..? అంటూ దీటైన సమాధానం ఇచ్చారు. తప్పు చేసినోడే భయపడతాడన్న ఆయన.. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకొచ్చానని వివరించారు. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందన్న మల్లన్న.. కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ వ్యవహారంపై డిఫమేషన్ సూట్ వేస్తున్నట్లు తెలిపారు. ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్లు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. తాను బయటకు రావాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారిపక్షాన పోరాడతానని చెప్పారు. ఎప్పటిలాగే క్యూన్యూస్ లో మార్నింగ్ న్యూస్ ప్రోగ్రాం చేస్తానని స్పష్టం చేశారు  తీన్మార్ మల్లన్న.

నెల్లూరు ఎన్నిక వాయిదా? .. ఏపీలో పెట్రో మంటలు.. కేసీఆర్ చేపల పులుసు కథ.. టాప్ న్యూస్ @7PM

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నెల్లూరు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు. గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే తుది జాబితా ప్రకటించడంలేదా? అని ప్రశ్నించారు. ------- రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళవారం 12 గం.ల నుంచి 1 గం. వరకు నిరసన కార్యక్రమం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత  నారా చంద్రబాబునాయుడు  పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసారు. హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని ఆయన డిమాండ్ చేసారు ---------- పెట్రో ధరలపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాస్తవాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని సజ్జల పేర్కొన్నారు. పెట్రోల్‌పై ఇప్పటివరకు కేంద్రం రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. దీనిలో ఎక్సైజ్‌ సుంకం కేవలం రూ.47,500 కోట్లు మాత్రమేనని సజ్జల పేర్కొన్నారు. అందులో అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చింది రూ.19,475 కోట్లు మాత్రమేనన్నారు. ----------- కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఈనెల 14న జాగరణ యాత్రను విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తెలిపారు. ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈనెల 9 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచనలు మేరకు సంస్థాగత ఎన్నికలు ఉంటాయన్నారు.  -------- సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై లేఖ రాశారు. విద్యార్థులపై జగన్‌రెడ్డి పోలీసులతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎయిడెడ్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను దోచుకునేందుకు పేద విద్యార్థుల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.  ------- పెట్రోల్‌ ధరలు ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అఫ్ఘనిస్థాన్‌ వెళ్లాలని చీప్‌గా మాట్లాడతారా అని బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్‌ ధరలు పెంచి దేశ ప్రజల మీద భారం వేయొద్దన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ మీద పన్నును కేంద్రం విత్‌డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.కేంద్రం పన్ను విత్‌డ్రా చేసుకుంటే పెట్రోల్ ధర లీటర్‌ 60కే వస్తుందన్నారు ---------- పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మెడలు ఇరుస్తడా అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. సంజయ్‌పై కేసీఆర్ మాటలను టార్టెట్ చేస్తూ విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. ఈ వింత ప్రచార మాటలు హుజురాబాద్ కొచ్చి ఎందుకు మాట్లాడలె అని కేసీఆర్‌ను ఆమె నిలదీసారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లా మళ్లా గెలుస్తూ ఉందన్నారు --------- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ప్రజా తీర్పు ఈటలకు అనుకూలంగా వచ్చాకా.. మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తాము సిద్ధమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందనే కక్షతోనే రీసర్వే అని, నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు. --------- భారత కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసమైన 'ఆంటిలియా' వద్ద ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక టాక్సీ డ్రైవర్ నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ముకేష్ నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముకేష్ ఇంటి చిరునామా కోసం ఇద్దరు వ్యక్తులు వాకబు చేశారంటూ టాక్సీ డ్రైవర్‌ నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. ---- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ప్రజా తీర్పు ఈటలకు అనుకూలంగా వచ్చాకా.. మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తాము సిద్ధమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందనే కక్షతోనే రీసర్వే అని, నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు.

జాబితా ఇవ్వకుండానే ఏకగ్రీవ ప్రకటనా..! నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు వాయిదానేనా? 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నామినేషన్ల నుంచే మొదలైన వైసీపీ అక్రమాలు.. స్క్రూటీనీలో హద్దు మీరాయనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా బెదిరించడం వంటి ఘటనలు జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. నామినేషన్ల పరిశీలనలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.  నామినేషన్ల ఉపసంహరణలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ప్రకటించకుండానే ఏకగ్రీవమైనట్లు నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నెల్లూరు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు. గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే తుది జాబితా ప్రకటించడంలేదా? అని ప్రశ్నించారు. విపక్ష నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 8 డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించారని తెలిపారు. నెల్లూరు ఘటనపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని నిలదీశారు. తప్పుడు చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని, దినేశ్ కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

షోయబ్ అక్తర్‌పై 100 కోట్ల ప‌రువున‌ష్టం దావా.. ముదిరిన‌ పీటీవీ వివాదం..

షోయ‌బ్ అక్త‌ర్ వ‌ర్సెస్ పీటీవీ. వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభంలో జ‌రిగిన వివాదం.. క‌ప్ ముగియ‌కుండానే బాగా ముదిరిపోయింది. పాకిస్తాన్ టెలివిజ‌న్‌లో షోయ‌బ్‌ కామెంట‌రర్‌గా ఉండ‌టం.. పీటీవీ యాంక‌ర్‌తో మాటామాటా పెర‌గ‌డం.. షో మ‌ధ్యలోనుంచే అక్త‌ర్ వెళ్లిపోవ‌డం తెలిసింది. ఆ వివాదం ఇప్పుడు ప‌రువున‌ష్టం దావా వ‌ర‌కూ దారి తీయ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది.  టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై పాక్ విజయం తర్వాత పీటీవీలో మ్యాచ్‌పై విశ్లేషణ కార్యక్రమం జరిగింది. అందులో అక్తర్ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నియాజ్ మాట్లాడుతూ.. ‘‘మీరు కొంచెం మొరటుగా మాట్లాడుతున్నారు. మరీ అంత ఓవర్ స్మార్ట్ పనికిరాదు. మీరిక ఇక్కడి నుంచి వెళ్లొచ్చు’’ అన్నారు.  యాంక‌ర్‌ మాటలకు ఫీల్ అయిన అక్తర్.. లైవ్ నుంచి వెళ్లిపోయారు. పోతూ పోతూ పీటీవీ అనలిస్ట్ ఉద్యోగానికి అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోయారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అక్త‌ర్‌కు 100 కోట్ల ప‌రువున‌ష్టం నోటీసులు పంపించింది పీటీవీ. చర్చ జరుగుతుండగా లైవ్‌లో రాజీనామా చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. అక్త‌ర్‌ రాజీనామా కారణంగా చానల్‌కు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని చెబుతోంది. ముందస్తు సమాచారం లేకుండా టీ20 ప్రపంచకప్ కోసం దుబాయ్ వెళ్లిపోయాడని.. క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ‘ఇండియన్ టీవీ’లో కనిపించాడని, ఇది పీటీవీకి కోలుకోలేని దెబ్బ అంటూ నోటీసులో తెలిపింది. జరిగిన నష్టానికి గాను పీటీవీకి రూ.100 కోట్లు చెల్లించాల‌ని.. దాంతోపాటు మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 కూడా క‌ట్టాలంటూ నోటీసులు ఇచ్చింది. లేదంటే పీటీసీ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పీటీవీ నుంచి నోటీసులు అందుకున్న షోయ‌బ్‌ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన గౌరవ మర్యాదలను కాపాడలేకపోయిన పీటీవీ ఇప్పుడు త‌న‌కు నోటీసులు పంపిందంటూ ట్వీట్ చేశారు. తాను స్వతహాగా ఫైటర్‌నని, తాను కూడా చట్టబద్ధంగా పోరాడతానని తేల్చి చెప్పారు. 

ఐటీ, ఈడీల భ‌యం వ‌ద్దు.. సోనూసూద్‌కు కేటీఆర్ మ‌ద్ద‌తు..

సోనూసూద్‌ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలతో ఆయన్ను భయకంపితుడిని చేయాలని చూశారని.. అతడి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిప‌డ్డారు. వీటన్నింటికీ సోనూసూద్‌ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సోనూ రియల్ హీరో అని.. ఆయన వెంట తామంతా ఉన్నామని కేటీఆర్‌ చెప్పారు. మంచి పనులు చేస్తూ ఉండాలని.. సోనూతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు.   సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదని కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభమని.. బాధ్యతగా సేవ చేయడం గొప్ప అని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా సోనూసూద్‌ మానవత్వంతో సేవాభావం చాటుకున్నారని కేటీఆర్‌ అన్నారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని ప్ర‌శంసించారు.  మంత్రి కేటీఆర్‌ లాంటి నేతలు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదంటూ సోనూసూద్ సైతం కొనియాడారు. కొవిడ్‌ వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని.. బాధితులకు సహాయ పడటమే మన ముందున్న సవాలని చెప్పారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. తెలంగాణ నుంచే ప్రతి స్పందించే వ్యవస్థ కనిపించిందని సోనూసూద్ చెప్పారు.   హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వారియర్స్‌కు జ‌రిగిన‌ సన్మాన కార్యక్రమంలో సోనూసూద్‌తో, కేటీఆర్‌ పాల్గొన్నారు.   

ఈట‌ల‌కు మ‌ళ్లీ నోటీసులు.. భూముల‌ స‌ర్వేతో క‌ల‌క‌లం..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు.  బీజేపీ నేత,  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్‌ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న స‌ర్వేకు హాజ‌రుకావాల‌ని ఈట‌ల రాజేంద‌ర్‌ స‌తీమ‌ణి జ‌మునారెడ్డి, కుమారుడు నితిన్‌రెడ్డిల‌కు తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.  మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్‌పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కొవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 18న స‌ర్వే జ‌రిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు అధికారులు. 

పెట్రోపై వ్యాట్ తగ్గిస్తావా లేదా జగన్! మంగళవారం టీడీపీ నిరసనలు..

ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ ఉద్యమం మరింత ఉధృతం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసనలకు పిలుపిచ్చారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళవారం 12 గం.ల నుంచి 1 గం. వరకు నిరసన కార్యక్రమం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపిచ్చారు.  అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ రెడ్డి హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేసారు. హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని  డిమాండ్ చేసారు. పక్క రాష్ట్రాల్లో తగ్గించినా, మన రాష్ట్రంలో మొండిచేయి చూపారన్నారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు, ఉపాధి రాదన్నారు. అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుందన్నారు. అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారన్నారు చంద్రబాబు. లారీల యజమానులు, కార్మికులు దెబ్బతినడమే కాక రవాణ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయన్నారు. పెట్రో భారాలకు   ప్రభుత్వ దోపిడీ, దుబారాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయన్నారు. దేశంలో అధికంగా పెట్రోల్ ధర రూ.110.98కి పెంచారు. కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందని  చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

దళిత సీఎంపై మాట తప్పింది నిజమే.. ఏడేండ్లకు ఒప్పుకున్న కేసీఆర్

తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి... ఇదీ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటన. ఒక సభలో కాదు వందలాది సభల్లో ఇదే మాట చెప్పారు కేసీఆర్. కాని తెలంగాణ ఏర్పడ్డాకా మాట మార్చారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగా.. దళిత ముఖ్యమంత్రి ప్రకటన పక్కనపెట్టి తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై గత ఏడున్నర ఏండ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దళిత సంఘాలతో పాటు విపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతకాలం ఈ విషయంపై సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు కేసీఆర్. తాజాగా దళిత ముఖ్యమంత్రి విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏడున్నర ఏండ్ల తర్వాత అసలు నిజం ఒప్పుకున్నారు. తెలంగాణకు దళితుడి ముఖ్యమంత్రిని చేస్తానని తాను చెప్పింది నిజమేనని అంగీకరించారు.  దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో  కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అన్నారు.తామే దళితున్ని ముఖ్యమంత్రి చేయనివ్వలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీయే స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.  దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోయినా ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు కేసీఆర్. రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టారని చెప్పారు. తెలంగాణలో తాను ఏ మూలకు వెళ్లినా ప్రజలు గెలిపించారని వెల్లడించారు. ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ లాగా దళితున్ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు, ఆ తర్వాత కూడా ప్రజలు నాకే అధికారం కట్టబెట్టారని గుర్తుచేస్తూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్. 

ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పేంటి! సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకో..  

బీజేపీ దేశ ద్రోహులను తయార చేసే ఫ్యాక్టరీనా అని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ప్రశ్నించిన వాళ్లను దోశ ద్రోహులకు చిత్రీకరిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దోశ ద్రోహి, అర్భన్ నక్సలైట్ స్టాంప్ వేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెబుతున్నారని మండిపడ్డారు. నేను చైనాలో డబ్బులు దాచుకున్నారా.. సంజయ్ నిరూపిస్తారా అని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. ముందు తన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఆ విషయం తేల్చేవరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్.  కేంద్రం చేస్తున్న దోపిడి దేశ ప్రజలకు తెలియదా అని కేసీఆర్ అన్నారు. తమకు సమస్యలు వచ్చినప్పుడల్లా బీజేపీ కొత్త సమస్యలు స్పష్టిస్తుందన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు అందులో భాగమేనన్నారు. రాయలసీమకు నీళ్లు వద్దని తానెప్పుడు చెప్పలేదన్నారు కేసీఆర్. బేసిన్లు, బేషజాలు లేవన్నారు. ఏపీకి వెళ్లే చేపల పులుసు తింటే తప్పేంటన్నారు. కేంద్ర నిధులపైనా సంజయ్ అసత్యాలు చెబుతున్నారన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ దాడులు చేయడం దేశంలో కామన్ గా మారిందన్నారు.  బీజీపీలా టీఆర్ఎస్ నీచంగా ప్రవర్తించబోదని కేసీఆర్ చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటామని తెలిపారు. ‘‘నేను రాయలసీమకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పిన మాట వాస్తవమే. ఈ రోజు కూడా ఆ మాట చెప్తున్నా. రాయలసీమకు నీళ్లు ఇవ్వొద్దని ఎవరు చెప్తున్నారు? నేను అక్కడికి వెళ్లి చెప్పడం కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, వాళ్ల అధికారులను ఇక్కడికి పిలిపించి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పాను. ‘కృష్ణా నదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్నాయి. మేము గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి.. మీకు మేము సహకరిస్తాం’ అని చెప్పా. రాయలసీమ కరువు ప్రాంతం. వాళ్లకు తప్పకుండా నీళ్లు రావాలి. అది న్యాయం. ఈ నీటి విభేదాలు అంతా కేంద్రం ఆడే డ్రామా. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అంటూ ఎన్నికల కోసం డ్రామాలు ఆడడం పరిపాటి అయిపోయింది.’’ అని కేసీఆర్ అన్నారు.  

వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా.. ద్రోహి నెంబ‌ర్ వ‌న్‌.. కేసీఆర్‌పై బండి బ‌డ‌బాగ్ని..

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ‌య్ ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. ముఖ్య‌మంత్రి చేసిన అవినీతిపై క‌చ్చితంగా విచారణ జరుపుతామన్నారు. లాలూప్రసాద్ యాదవ్, చిదంబరం మాదిరి అవినీతి చేసిన కేసీఆర్.. వాళ్ల‌లానే జైలుకు పోవ‌డం ఖాయ‌మన్నారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి పరోక్షంగా చైనాకు కేసీఆర్‌ సహకరిస్తున్నార‌ని.. ప్రజలకు ఆయ‌న‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజ‌య్‌. మెడలు నరికించుకోవటానికి తాను సిద్ధమ‌ని.. కేసీఆర్ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయనందుకు కేసీఆర్ తన‌ మెడను నరుక్కుంటారా? అని ప్ర‌శ్నించారు. బండి సంజ‌య్ ఇంకా ఏమ‌న్నారంటే... "కేసీఆర్ ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి గంటపాటు అబద్ధాలు చెప్పారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. ఆ మేరకు సాగు చేశారో లేదో తేలుద్దాం. నిపుణులతో కలిసి హెలికాప్టర్‌లో పరిశీలిద్దామా? ప్రతి గింజా నేనే కొంటా.. కేంద్రంతో పనేంటని కేసీఆర్ గతంలో అన్నారు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని కేసీఆర్‌ చెప్పదలచుకున్నారా? ఇన్నాళ్లూ అబద్ధాలు చెప్పానని ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలి. వానాకాలం పంట కొంటామని కేంద్రం చెప్పలేదని కేసీఆర్‌ చెబుతున్నారు. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. అక్టోబరు 21 నుంచి జనవరి 20 వరకు కొంటామని కేంద్రం చెప్పింది. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని ఎక్కడైనా లేఖలో ఉందా? కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని అందులో ఎక్కడైనా చెప్పారా? ఎఫ్‌సీఐ లేఖ అందలేదని చెబితే నేను పంపుతా. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానని గతంలోనూ కేసీఆర్‌ హడావిడి చేశారు".   "తెలంగాణ‌లో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచలేదని కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు. 2015లో పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్‌ పెంచలేదా? సీఎం స్థాయి వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పొచ్చా. అబద్ధాల కోసమే ఒక శాఖ పెట్టుకున్నారు. దాని బాధ్యతను హరీశ్‌రావుకు అప్పగించారు. లీటర్‌పై కేంద్రానికి రూ.27 వస్తే రాష్ట్రానికి రూ.28 వస్తోంది. కేంద్రానికి వెళ్లే రూ.27లో మళ్లీ రాష్ట్రానికి రూ.12 తిరిగివస్తాయి.. ఇది వాస్తవం. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే ఎందుకు వద్దంటున్నారు? 24 రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించినప్పుడు.. తెలంగాణ ఎందుకు తగ్గించదు? కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. అందులో రూ.2.3 లక్షల కోట్లు తిరిగి రాష్ట్రాలకే ఇస్తోంది. హుజూరాబాద్‌లో కర్రు కాల్చి వాత పెట్టారు. రాష్ట్రానికి నెంబర్‌ వన్‌ ద్రోహి కేసీఆర్‌. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గూగుల్ ని అడిగితే.. కేసీఆర్ ఫోటోనే వస్తోంది" అని బండి సంజయ్‌ విమర్శించారు.   "రైతులకు ఎక్కడ రుణమాఫీ చేశారో స్పష్టం చేయాలి. మూడేళ్లవుతున్నా రుణమాఫీ లేదు. రైతులు ఎక్కడ కార్లలో తిరుగుతున్నారో చెప్పాలి. కర్షకుల ఆత్మహత్యలు ఆగట్లేదు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నారు. ఒకసారి వరి.. ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ఆగం చేశారు". అంటూ బండి సంజ‌య్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.    

అనంత‌లో లాఠీచార్జ్ రచ్చ‌.. ప‌ట్టాభి ఈజ్ బ్యాక్‌.. కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ ర‌గ‌డ‌.. టాప్‌న్యూస్ @1pm

1. అనంతంలో ఎయిడెడ్ కళాశాల ద‌గ్గ‌ర‌ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్‌రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వేయాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయమని హెచ్చ‌రించారు.  2. వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడుతున్నందుకు వైసీపీ శ్రేణులు తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి మూడు సార్లు తనపై దాడులు చేశారన్నారు. ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఎండగడుతామని తేల్చి చెప్పారు. నిజాయతీ గల నాయకుడు చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్నామని, పసుపు సైనికులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పట్టాభిరామ్ అన్నారు.  3. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిని మార్చాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కుప్పం ఎన్నికల ప్రత్యేక అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన హైకోర్టు... ప్రభుత్వ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  4. బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాషాయపార్టీ రగిలిపోతోంది. సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టటానికి కమలదళం సిద్ధమవుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక ఓటమితో కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారు. హుజురాబాద్ ఓటమి అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులు కచ్చితంగా వరి పంటనే వేసేలా ప్రోత్సహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ఖజానా దివాలా తీయటంతో సీఎం కేసీఆర్ కేంద్రంపై నెపం వేస్తున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు. 5. మేడ్చల్‌లో కోమటిరెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. రేవంత్‌రెడ్డి వర్గం పనేనని కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపించారు. అలాగే రేవంత్‌రెడ్డి బ‌ర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన.. ఫ్లెక్సీలను సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కోమటిరెడ్డి వర్గీయుల పనేనంటూ రేవంత్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. మంగళవారం నుంచి కొంపల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణా తరగతుల సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 6. పొన్నూరు నియోజకవర్గంలో జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందనలో జిల్లా అధికారులకు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. పొన్నూరులో జొన్న, మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలపై విచారణ చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశారు. రైతుల నుంచి రూ.66కు వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధన ఉందని... కొనుగలు కేంద్రాలలో రూ.200 వసూలు చేస్తున్నారని తెలిపారు. అధికారులు, వైసీపీ నేతలు వాటాలు వేసుకొని దోచుకున్నారని ఆరోపించారు. వెంకటకృష్ణపురంలో ఓ వైసీపీ నేత నుంచి 60 లక్షల పంట కొనుగోలు చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు.   7. నాగుల చ‌వితి, కార్తీక సోమ‌వారం సంద‌ర్భంగా ఇవాళ అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో క్యాంపు ఏర్పాటు చేసుకొని విశ్ర‌మించారు. సమీప గ్రామాల ప్ర‌జ‌లు భారీ ఎత్తున క్యాంపు ద‌గ్గ‌ర‌కు చేరుకుని వారికి సంఘీభావం తెలుపుతున్నారు. రాజధాని మహిళా రైతులకు మ‌ద్ద‌తుగా.. స్థానిక మహిళలు కోలాట ప్రదర్శన చేశారు. అమ‌రావ‌తి ఉద్య‌మానికి అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.  8. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం, వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రెడ్డిపల్లి గ్రామం రైతులు మండిపడుతున్నారు. త‌మ‌ ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అడిగితే.. మీరు బీజేపీకి ఓటు వేశారని..అందుకే మీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, అధికార పార్టీ వ్యక్తులు రైతులపై మండిపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.  9. హైద‌రాబాద్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. అత్యాచారమా? లేక గ్యాంగ్ రేపా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచార‌ణ చేస్తున్నారు. చ‌నిపోయిన‌ యువతిని డ్యాన్సర్‌గా గుర్తించారు.  10. కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం పాత రేపుడి గ్రామం పంట పొలాల్లో ర‌హ‌స్యంగా సారాయి తయారీ చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 1500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.  దాదాపు 15 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. సారాయి తయారీకి ఉపయోగించిన‌ సామగ్రిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి.. ఒకరిని అరెస్ట్ చేశారు.   

ప్రశ్నించిన జర్నలిస్టులపై బండ బూతులా! ఇదేందయా కేసీఆర్.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. హుజురాబాద్ ఓటమి షాక్ లో ఉన్నారో, వరి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో టెన్షన్ లో ఉన్నారో తెలియదు కాని.. ప్రెస్ మీట్ లో తన అక్కసంతా వెళ్లగక్కారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీని సన్నాసి అంటూ మాట్లాడారు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను దారుణంగా టార్గెట్ చేశారు. నాలుక కోస్తానని హెచ్చరించారు. నాలుగు ముక్కలు చేస్తామంటూ భయపెట్టారు. విపక్ష నేతలపై విరుచుకుపడిన కేసీఆర్.. జర్నలిస్టులపైనా తన అక్రోశం వెళ్లగక్కారు. తనను ప్రశ్నించిన వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ ను కొందరు జర్నలిస్టులు కొన్ని సమస్యలపై ప్రశ్నించారు. అందులో భాగంగానే ఓ జర్నలిస్ట్ ప్రశ్న వేశాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశంలో ఊగిపోయారు కేసీఆర్. తనను ఇబ్బందికర ప్రశ్న వేశారనే కోపంతో తీవ్రంగా స్పందించారు. నీ బోడముండ వాదన అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టును వ్యక్తిగతంగా సంభోదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లొట్టపీసు వాదన అంటూ హేళన చేశారు. తలాతోక లేని వాదన, గాడిద అంటూ విరుచుకుపడ్డారు. నీకు జ్ఞానం లేదంటూ నేరుగా జర్నలిస్టును ఉద్దేశించి కామెంట్ చేశారు కేసీఆర్. ప్రెస్ మీట్ లో జర్నలిస్టును టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి అలా చిందులు వేశారనే చర్చ జరుగుతోంది. సీఎం తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు ప్రశ్నలు అడగడం సహజమని, వాటికి హుందాగా సమాధానం చెప్పాలి కాని.. ఇలా బెదిరించేలా మాట్లాడం ఏంటని జర్నలిస్టు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మీట్ ది ప్రెస్ లో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఫర్వా లేదు కాని.. ప్రెస్ మీట్ లో అలా ఉండదని అంటున్నారు. సీఎంవో ఆహ్వానిస్తేనే  ప్రెస్ మీట్ కు జర్నలిస్టులు వచ్చారన్న సంగతి ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకుంటే మంచిదని అంటున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకుని జర్నలిస్టులపై దాడి చేయడం మానుకోవాలని సూచించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.  జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వరుసగా తగలుతున్న షాకులపై మైండ్ బ్లాంక్ అయిన కేసీఆర్... ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మరోసారి జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.