నెల్లూరు ఎన్నిక వాయిదా? .. ఏపీలో పెట్రో మంటలు.. కేసీఆర్ చేపల పులుసు కథ.. టాప్ న్యూస్ @7PM
posted on Nov 8, 2021 @ 6:49PM
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నెల్లూరు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు. గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే తుది జాబితా ప్రకటించడంలేదా? అని ప్రశ్నించారు.
-------
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళవారం 12 గం.ల నుంచి 1 గం. వరకు నిరసన కార్యక్రమం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసారు. హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని ఆయన డిమాండ్ చేసారు
----------
పెట్రో ధరలపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాస్తవాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని సజ్జల పేర్కొన్నారు. పెట్రోల్‌పై ఇప్పటివరకు కేంద్రం రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. దీనిలో ఎక్సైజ్ సుంకం కేవలం రూ.47,500 కోట్లు మాత్రమేనని సజ్జల పేర్కొన్నారు. అందులో అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చింది రూ.19,475 కోట్లు మాత్రమేనన్నారు.
-----------
కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఈనెల 14న జాగరణ యాత్రను విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తెలిపారు. ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈనెల 9 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచనలు మేరకు సంస్థాగత ఎన్నికలు ఉంటాయన్నారు.
--------
సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై లేఖ రాశారు. విద్యార్థులపై జగన్‌రెడ్డి పోలీసులతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎయిడెడ్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను దోచుకునేందుకు పేద విద్యార్థుల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.
-------
పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అఫ్ఘనిస్థాన్ వెళ్లాలని చీప్‌గా మాట్లాడతారా అని బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెంచి దేశ ప్రజల మీద భారం వేయొద్దన్నారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నును కేంద్రం విత్‌డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.కేంద్రం పన్ను విత్‌డ్రా చేసుకుంటే పెట్రోల్ ధర లీటర్ 60కే వస్తుందన్నారు
----------
పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మెడలు ఇరుస్తడా అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. సంజయ్‌పై కేసీఆర్ మాటలను టార్టెట్ చేస్తూ విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. ఈ వింత ప్రచార మాటలు హుజురాబాద్ కొచ్చి ఎందుకు మాట్లాడలె అని కేసీఆర్‌ను ఆమె నిలదీసారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లా మళ్లా గెలుస్తూ ఉందన్నారు
---------
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ప్రజా తీర్పు ఈటలకు అనుకూలంగా వచ్చాకా.. మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తాము సిద్ధమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందనే కక్షతోనే రీసర్వే అని, నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు.
---------
భారత కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసమైన 'ఆంటిలియా' వద్ద ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక టాక్సీ డ్రైవర్ నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ముకేష్ నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముకేష్ ఇంటి చిరునామా కోసం ఇద్దరు వ్యక్తులు వాకబు చేశారంటూ టాక్సీ డ్రైవర్ నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది.
----
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ప్రజా తీర్పు ఈటలకు అనుకూలంగా వచ్చాకా.. మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తాము సిద్ధమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందనే కక్షతోనే రీసర్వే అని, నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు.