ఐటీ, ఈడీల భయం వద్దు.. సోనూసూద్‌కు కేటీఆర్ మద్దతు..
posted on Nov 8, 2021 @ 5:11PM
సోనూసూద్ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలతో ఆయన్ను భయకంపితుడిని చేయాలని చూశారని.. అతడి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. వీటన్నింటికీ సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సోనూ రియల్ హీరో అని.. ఆయన వెంట తామంతా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. మంచి పనులు చేస్తూ ఉండాలని.. సోనూతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదని కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభమని.. బాధ్యతగా సేవ చేయడం గొప్ప అని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా సోనూసూద్ మానవత్వంతో సేవాభావం చాటుకున్నారని కేటీఆర్ అన్నారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని ప్రశంసించారు.
మంత్రి కేటీఆర్ లాంటి నేతలు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదంటూ సోనూసూద్ సైతం కొనియాడారు. కొవిడ్ వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని.. బాధితులకు సహాయ పడటమే మన ముందున్న సవాలని చెప్పారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. తెలంగాణ నుంచే ప్రతి స్పందించే వ్యవస్థ కనిపించిందని సోనూసూద్ చెప్పారు.
హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కొవిడ్ వారియర్స్‌కు జరిగిన సన్మాన కార్యక్రమంలో సోనూసూద్‌తో, కేటీఆర్ పాల్గొన్నారు.