కరోనా ముప్పు ఇంకా ఉంది.. తస్మాత్ జాగ్రత్త! కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..
కరోనా కథ ముగిసి పోలేదు. వాక్సిన్ తీసుకున్నాం .. టీకా వేసుకున్నాం.. ఇక ఏమి కాదు, అనే భరోసా పనికి రాదు, ఈ మాటలన్నది, ఈ హెచ్చరిక చేసింది మరెవరో కాదు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. నిజం. ప్రపంచం పటం మీద కరోనా కాలు పెట్టి ఇంచు మించుగా రెండు సంవత్సాలు పూర్తవుతోంది. కానీ, ఇంత వరకు ఆ మహమ్మారి, ఆచూకీ కూడా శాస్త్రవేత్తలకు చిక్క లేదు. శాస్త్ర వేత్తలు, వైద్యులు, ప్రభుత్వాల సమిష్టి కృషితో, కరోనాను చాలా వరకు కట్టడి చేయగలిగామే కానీ, కరోనాపై పూర్తి విజయం ఇంకా సాధ్యం కాలేదు. కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడమే లేదు. ఒక విధంగా కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధం, ఎప్పుడు ఎలా ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు, రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా విషయంగా హెచ్చరిస్తోంది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మరోమారు ‘కరోనా మహమ్మారిపై పోరాటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో కలిసి పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. తద్వారా దేశంలో చివరి పౌరుడికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు చేపడుతున్న 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమంపై కేంద్ర మంత్రి.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘మనమంతా కరోనా ముగిసిందని భావించకూడదు. అప్రమత్తత అవసరం. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో 80 శాతానికి పైగా టీకాలు వేసినప్పటికీ.. వైరస్ విజృంభిస్తోంది’ అని గుర్తుచేశారు.
నిజానికి, అనేక ప్రపంచ దేశాలకంటే మన దేశంలో వాక్సినేషన్ కార్యక్రమం చాలా చురుగ్గా,చక్కగా సాగుతోందని, వాక్సినేషన్ అభివృద్ధి మొదలు పంపిణీ వరకు మనదేశం అనేక ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని విదేశీ ప్రముఖులు కితాబు ఇవ్వవచ్చును కానీ, వాస్తవ పరిస్థితి మరీ అంట గొప్పగా ఏమీలేదని, కేంద్ర మంత్రి అందించిన గణాంకాలే చెపుతున్నాయి. ఇంతవరకు, దేశవ్యాప్తంగా 79 శాతం మంది అర్హులకు మొదటి డోసు టీకా వేసినట్లు మంత్రి వెల్లడించారు.అంటే ఇంకా 21 శాతం మందికి మొదటి డోసు కూడా పడలేదు. మరోవంక 18 లోపు పిల్లలకు ఇంతవరకు వాక్సిన్’ లేనే లేదు. అంటే ఇంచుమించుగా దేశ మొత్తం జనాభాలో సగం మందికి టీకా అందలేదు. అలాగే, టీకా వేసుకున్న పూర్తి భారోసాలేదని సింగపూర్, చైనా, బ్రిటన్, జర్మనీ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.
అందుకే కేంద్ర ప్రభుత్వం, ఇంటికే వెళ్లి టీకా వేసేందుకు, ‘హర్ ఘర్ దస్తక్’ పేరిట ఇంటింటికీ టీకా కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అర్హులందరికీ మొదటి డోస్, 12 కోట్లకు పైగా జనాభాకు రెండో డోస్ పూర్తి చేయడమే లక్ష్యంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల సహకారంతో కేంద్ర ఆరోగ్య శాఖ పనిచేస్తోంది. ఈ నెల 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 110.23 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 120.08 కోట్ల డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపింది. వాటి వద్ద ఇంకా 16.74 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయని, డ్రైవ్‌ను వేగవంతం చేయాలని సూచించింది.
మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కొత్త వేరియంట్ల ప్రభావం నామమాత్రమేని.. కేవలం డెల్టా వేరియంట్ ప్రభావమే అధికంగా ఉన్నట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనపడుతోందని తాజా బులిటెన్‌లో పేర్కొంది. అయితే, ఎవరు ఎన్ని చెప్పినా కరోనా కథ ఇంకా ముగియలేదు ... సశేషంగానే ఉంది .. తస్మాత్ జాగ్రత్త.