కేసీఆర్ కు కేంద్ర మంత్రి దిమ్మతిరిగే కౌంటర్..
వరసగా రెండు రోజులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా ఏకి పారేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వమో, ఎంత చేతకాని సర్కారో చక్కగా ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేల్చి పారేశారు. అంతే కాదు, తమంతటి నీతి వంతుడు, నిజాయతీపరుడు ఇంకెవరూ లేరని, నిటారుగా నిలబడ్డామని, సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చి, పుచ్చుకున్నారు. ఏ విచారణ చేస్తారో చేసుకోవాలని కేంద్రానికి సవాలు విసిరారు. అంతలోనే కేంద్ర ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అదే సమయంలో తమ ఫార్మర్ హౌస్, రైతు భవంతి వైపు కన్నెత్తి చూస్తే ఆరు ముక్కలుగా నరుకుతానని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్’ని, సంస్కార వంతమైన భాషలో హెచ్చరించారు.
అంతేకాదు ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇక రోజూ కేంద్ర ప్రభుత్వ బండారాన్ని బయట పెడతానని అన్నారు. జర్నలిస్టులకు ఇక రోజు ప్రగతి భవన్’లోనే లంచ్ ఉంటుందని నోరూరించే ప్రామిస్ కూడా చేశారు. అయితే, కారణం ఏమిటో కానీ, మూడో రోజు ... నుంచి ప్రగతి భవన్ ఉలుకు పలుకు లేకుండా మూగబోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులు వినిపించిన, ‘పచ్చినిజాలు’ ఒకటొకటిగా పచ్చి అబద్ధాలుగా తెలిపోతున్నాయని, సోషల్ మీడియా కోడై కూస్తోంది. అప్పుడు ఇప్పుడు అంటూ పరువు తీస్తోంది. ఈ నిజాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించడం వల్లనే ముఖ్యమంత్రి, డైలీ సీరియల్’ కి బ్రేక్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
రాష్ట్రం విడిపోయి, ఏడు సంవత్సరాలు అయినా, ఇతవరకు కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణకు,కొంచెం ఆలస్యంగానే అయినా కేంద్ర జలవనరుల శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణ, కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణ రెంటినీ పరిశీలిస్తే, ఇద్దరు చెప్పిందీ ఒకటే. వడ్ల గింజలో బియ్యపు గింజ ఇద్దరి మాటల్లో పెద్దగా తేడాలేదు. అయితే, కేసీఆర్ వడ్ల గింజ చూపితే, షెకావత్ పొట్టుతీసి బియ్యపు గింజను బయట పెట్టారు.
2014జూన్ రెండవ తేదీన రాష్ట్ర విభజన జరిగింది.ఆ తర్వాత కొద్ది నెలలకే,2015లోనే తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నెలరోజుల క్రితం వరకు కేసు’ సుప్రీం కోర్టు విచారణ పరిధిలో ఉంది. ఇది సుప్రీం కోర్టు సాక్షిగా ఎవరూ కాదనలేని నిజం.అయినా, ముఖ్యమంత్రి, ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నీరు అవసరం లేదా? న్యాయం చేయరా? తెలంగాణ భూములను కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఎండ పెట్టాలనుకుంటోందని, సెంటిమెంట్’ను రంగరించి ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఆరోపణపై స్పందించిన కేంద్ర మంత్రి షెకావత్, అదే స్థాయిలో కేసీఆర్’కు కౌంటర్ ఇచ్చారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై, మీరే సుప్రీం కోర్టును ఆశ్రయించారనే విషయాన్ని కేసీఆర్’కు గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం జరగడానికి, ఇది కాదా కారణమని నిలదీశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, అనే విషయం రాష్ట్రాన్ని పాలిస్తున్న మీకు తెలియదా, అంటూ చురకలు అంటించారు. అంతే కాదు, రెండ్రోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని మాటిచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8నెలలు ఎందుకు పట్టిందని, ఈ జాప్యానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. నెల రోజుల క్రితం పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని వివరించారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు ఏడేళ్లు ఆలస్యం కావడానికి నేను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తాం’ అంటూ కేంద్ర మంత్రి బంతిని, కేసీఆర్ కోర్టులోకి నెట్టారు.
పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, నెలరోజుల క్రితం వరకు ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే, కోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం, కేసు ఉప సంహరించుకోమని కేంద్రం సూచించిన తర్వాత ఎనిమిది నెలలు ఏ నిర్ణయం తీసుకోకుండా నానబెట్టింది, కేసీఆర్ ప్రభుత్వం,ఇందులో ఎవరికీ ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. ఇక ఇప్పుడు ఎవరు చెప్పింది పచ్చి అబద్ధం.. ఎవరి మాటలు పచ్చి నిజాలు అనేది ..ఎవరికి వారు తేల్చుకోవలసిందే ... అంటున్నారు విశ్లేషకులు.