కేసీఆర్ కు సినిమా కనిపిస్తోందా? ఓటమి భయం వెంటాడుతోందా? వరుస ప్రెస్ మీట్ల పరామర్థమేంటీ..
posted on Nov 9, 2021 9:21AM
తెలంగాణ ముఖ్యమంత్రిలో గతంలో ఎప్పుడు లేనంతగా భయం కనిపిస్తోందా? ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందా? అంటే కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తున్న వారి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ లో గుబులు పెరిగిందని అంటున్నారు. ఈటల రాజేందర్ విజయం తర్వాత మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఇకపై కేసీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని చెప్పారు. సంజయ్ చెప్పినట్లే ఇప్పుడు కేసీఆర్ కు సినిమా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.
కేసీఆర్ కు ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా పేరు పడింది. ఆయన సచివాలయం అసలే వెళ్లరు. ప్రగతి భవన్ లో ఉన్నా పాలన పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ప్రగతి భవన్ కంటే ఫౌంహౌజ్ లోనే ఎక్కువ ఉంటారు. అందుకే విపక్షాలు కేసీఆర్ పై ఫౌంహౌజ్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేస్తుంటారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ రూట్ మార్చారు. నెలల తరబడి జనంలోకి వెళ్లని గులాబీ బాస్.. రెండు రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. గంటల తరబడి మాట్లాడారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
కేసీఆర్ నెలల తరబడి మీడియా ముందుకే రారు. అలాంటిది వరసుగా రెండు రోజులు... అది కూడా రెండు గంటల పాటు మీడియాతో మాట్లాడటంతో.. ఆయనలో అంత మార్పు ఎందుకు వచ్చిందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ షేకవుతున్నారని, ఆయనలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. హుజురాబాద్ ఓటమి నుంచి బయటపడక ముందే వరి ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కడం గులాబీ బాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. వరి విషయంలో కేసీఆర్ సర్కార్ తీరుపై రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే రిపోర్టులు ప్రగతి భవన్ కు వెళ్లాయంటున్నారు. ఆ నివేదికలు చూసిన కేసీఆర్ అవాక్కయ్యారని అంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటికే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో వారంతా కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గులాబీ బాస్ ను ఆటాడుకుంటున్నారు. దీంతో నిరుద్యోగుల ఓట్లపై కారు పార్టీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. ఇక ఉద్యోగ వర్గాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ తన ఆశలన్ని రైతులపైనే పెట్టుకున్నారు. నిజానికి రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలు ఇప్పటివరకు కేసీఆర్ కు సానుకూలంగా ఉన్నారు. 2018లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకమే ప్రధానమని అంటారు. అలాంటిది ప్రస్తుతం రైతులు కూడా కేసీఆర్ పై రగిలిపోతుండటం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.
వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతులంతా కేసీఆర్ పై తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తమ పంటను మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. వారం రోజులైనా ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వరి ధాన్యం కుప్పలపైనే గుండెలు పగిలి చనిపోతున్నారు. ఇదిలా ఉండగానే యాసంగిలో వరి పంట వేయవద్దంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల్లో మంట రాజేసింది. ఏడాది క్రితం మక్కలు వద్దు వరి పండించాలని పిలుపిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వరి ధాన్యం వద్దని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వరి వద్దంటే మరీ ఏం సాగుచేయాలని నిలదీస్తున్నారు. వరికి ఉరి వేస్తే.. కేసీఆర్ ప్రభుత్వానికి తాము ఉరి వేస్తామంటూ శపథం చేస్తున్నారు అన్నదాతలు.
రైతుల ఆందోళనలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్.. ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యారని అంటున్నారు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడూ బాగు పడినట్లు చరిత్రలో లేదు గతంలో చాలా సార్లు చెప్పారు కేసీఆర్. ఇప్పుడే ఆయన అన్నదాతల జీవితాలతో ఆటలాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ ను టెన్షన్ పెట్టిస్తుందని అంటున్నారు. అందుకే ఆ గండం నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఓటమి భయం వల్లే ఆయనలో అసహనం పెరిగిపోయిందని చెబుతున్నారు. రెండు రోజులుగా కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను బట్టి... వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి ఖాయమని ఆయన క్లారీటికి వచ్చారని అంటున్నారు.