అనంతలో లాఠీచార్జ్ రచ్చ.. పట్టాభి ఈజ్ బ్యాక్.. కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ రగడ.. టాప్‌న్యూస్ @1pm
posted on Nov 8, 2021 @ 11:54AM
1. అనంతంలో ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్‌రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వేయాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయమని హెచ్చరించారు.
2. వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడుతున్నందుకు వైసీపీ శ్రేణులు తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి మూడు సార్లు తనపై దాడులు చేశారన్నారు. ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఎండగడుతామని తేల్చి చెప్పారు. నిజాయతీ గల నాయకుడు చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్నామని, పసుపు సైనికులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పట్టాభిరామ్ అన్నారు.
3. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిని మార్చాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కుప్పం ఎన్నికల ప్రత్యేక అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన హైకోర్టు... ప్రభుత్వ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
4. బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాషాయపార్టీ రగిలిపోతోంది. సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టటానికి కమలదళం సిద్ధమవుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక ఓటమితో కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారు. హుజురాబాద్ ఓటమి అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులు కచ్చితంగా వరి పంటనే వేసేలా ప్రోత్సహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ఖజానా దివాలా తీయటంతో సీఎం కేసీఆర్ కేంద్రంపై నెపం వేస్తున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.
5. మేడ్చల్‌లో కోమటిరెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. రేవంత్‌రెడ్డి వర్గం పనేనని కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపించారు. అలాగే రేవంత్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన.. ఫ్లెక్సీలను సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కోమటిరెడ్డి వర్గీయుల పనేనంటూ రేవంత్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. మంగళవారం నుంచి కొంపల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణా తరగతుల సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
6. పొన్నూరు నియోజకవర్గంలో జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందనలో జిల్లా అధికారులకు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. పొన్నూరులో జొన్న, మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి రూ.66కు వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధన ఉందని... కొనుగలు కేంద్రాలలో రూ.200 వసూలు చేస్తున్నారని తెలిపారు. అధికారులు, వైసీపీ నేతలు వాటాలు వేసుకొని దోచుకున్నారని ఆరోపించారు. వెంకటకృష్ణపురంలో ఓ వైసీపీ నేత నుంచి 60 లక్షల పంట కొనుగోలు చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు.
7. నాగుల చవితి, కార్తీక సోమవారం సందర్భంగా ఇవాళ అమరావతి రైతుల మహా పాదయాత్రకు విరామం ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో క్యాంపు ఏర్పాటు చేసుకొని విశ్రమించారు. సమీప గ్రామాల ప్రజలు భారీ ఎత్తున క్యాంపు దగ్గరకు చేరుకుని వారికి సంఘీభావం తెలుపుతున్నారు. రాజధాని మహిళా రైతులకు మద్దతుగా.. స్థానిక మహిళలు కోలాట ప్రదర్శన చేశారు. అమరావతి ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించారు.
8. హుజురాబాద్ నియోజకవర్గం, వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రెడ్డిపల్లి గ్రామం రైతులు మండిపడుతున్నారు. తమ ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అడిగితే.. మీరు బీజేపీకి ఓటు వేశారని..అందుకే మీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, అధికార పార్టీ వ్యక్తులు రైతులపై మండిపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.
9. హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. అత్యాచారమా? లేక గ్యాంగ్ రేపా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన యువతిని డ్యాన్సర్‌గా గుర్తించారు.
10. కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం పాత రేపుడి గ్రామం పంట పొలాల్లో రహస్యంగా సారాయి తయారీ చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 1500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దాదాపు 15 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. సారాయి తయారీకి ఉపయోగించిన సామగ్రిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి.. ఒకరిని అరెస్ట్ చేశారు.