వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా.. ద్రోహి నెంబర్ వన్.. కేసీఆర్‌పై బండి బడబాగ్ని..
posted on Nov 8, 2021 @ 3:41PM
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ముఖ్యమంత్రి చేసిన అవినీతిపై కచ్చితంగా విచారణ జరుపుతామన్నారు. లాలూప్రసాద్ యాదవ్, చిదంబరం మాదిరి అవినీతి చేసిన కేసీఆర్.. వాళ్లలానే జైలుకు పోవడం ఖాయమన్నారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి పరోక్షంగా చైనాకు కేసీఆర్ సహకరిస్తున్నారని.. ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మెడలు నరికించుకోవటానికి తాను సిద్ధమని.. కేసీఆర్ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయనందుకు కేసీఆర్ తన మెడను నరుక్కుంటారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే...
"కేసీఆర్ ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి గంటపాటు అబద్ధాలు చెప్పారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. ఆ మేరకు సాగు చేశారో లేదో తేలుద్దాం. నిపుణులతో కలిసి హెలికాప్టర్‌లో పరిశీలిద్దామా? ప్రతి గింజా నేనే కొంటా.. కేంద్రంతో పనేంటని కేసీఆర్ గతంలో అన్నారు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని కేసీఆర్ చెప్పదలచుకున్నారా? ఇన్నాళ్లూ అబద్ధాలు చెప్పానని ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలి. వానాకాలం పంట కొంటామని కేంద్రం చెప్పలేదని కేసీఆర్ చెబుతున్నారు. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. అక్టోబరు 21 నుంచి జనవరి 20 వరకు కొంటామని కేంద్రం చెప్పింది. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని ఎక్కడైనా లేఖలో ఉందా? కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని అందులో ఎక్కడైనా చెప్పారా? ఎఫ్‌సీఐ లేఖ అందలేదని చెబితే నేను పంపుతా. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానని గతంలోనూ కేసీఆర్ హడావిడి చేశారు".
"తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. 2015లో పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచలేదా? సీఎం స్థాయి వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పొచ్చా. అబద్ధాల కోసమే ఒక శాఖ పెట్టుకున్నారు. దాని బాధ్యతను హరీశ్‌రావుకు అప్పగించారు. లీటర్‌పై కేంద్రానికి రూ.27 వస్తే రాష్ట్రానికి రూ.28 వస్తోంది. కేంద్రానికి వెళ్లే రూ.27లో మళ్లీ రాష్ట్రానికి రూ.12 తిరిగివస్తాయి.. ఇది వాస్తవం. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే ఎందుకు వద్దంటున్నారు? 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పుడు.. తెలంగాణ ఎందుకు తగ్గించదు? కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. అందులో రూ.2.3 లక్షల కోట్లు తిరిగి రాష్ట్రాలకే ఇస్తోంది. హుజూరాబాద్‌లో కర్రు కాల్చి వాత పెట్టారు. రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గూగుల్ ని అడిగితే.. కేసీఆర్ ఫోటోనే వస్తోంది" అని బండి సంజయ్ విమర్శించారు.
"రైతులకు ఎక్కడ రుణమాఫీ చేశారో స్పష్టం చేయాలి. మూడేళ్లవుతున్నా రుణమాఫీ లేదు. రైతులు ఎక్కడ కార్లలో తిరుగుతున్నారో చెప్పాలి. కర్షకుల ఆత్మహత్యలు ఆగట్లేదు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నారు. ఒకసారి వరి.. ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ఆగం చేశారు". అంటూ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.